బూతుల నేతలకు పోలింగ్ బూత్‌లలోనే బదులివ్వాలి
ABN, First Publish Date - 2023-05-26T03:28:04+05:30
రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయి. ఇటీవల కాలంలో కొందరు ప్రజాప్రతినిధులు చట్టసభల్లోనే బూతులు మాట్లాడుతున్న దుస్థితి.
విచక్షణ మరిచిపోతున్న వారిని ప్రోత్సహించవద్దు
తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన ఎన్టీఆర్
ఎన్టీఆర్ శత జయంత్యుత్సవ సభలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
హైదరాబాద్ సిటీ, మే 25(ఆంధ్రజ్యోతి): ‘రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయి. ఇటీవల కాలంలో కొందరు ప్రజాప్రతినిధులు చట్టసభల్లోనే బూతులు మాట్లాడుతున్న దుస్థితి. అలాంటి బూతుల నేతలకు పోలింగ్ బూత్‌లలోనే ప్రజలు సమాధానం చెప్పాల’ని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్న నేతలను ప్రోత్సహించవద్దని ప్రజలకు హితవు పలికారు. కిన్నెర ఆర్ట్ థియేటర్, నృత్య కిన్నెర సంయుక్త నిర్వహణలో గురువారం నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం వేదికగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల ముగింపు సభ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ అసెంబ్లీ మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌కు ఎన్టీఆర్ భాషా సేవా పురస్కారాన్ని వెంకయ్య ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగువారికి వేల సంవత్సరాల చరిత్ర ఉందని సాధికారికంగా ప్రకటించి, వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం నలుదిశలా చాటిన చెప్పిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగు భాషను సుసంపన్నం చేసిన మహనీయుల స్ఫూర్తి గుర్తుండిపోయేలా ట్యాంక్‌బండ్‌పై వారి విగ్రహాలు ఏర్పాటు చేశారన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఊరిలో పంచాయతీ వరకు పాలనా వ్యవహారాలు తెలుగులోనే జరగాలని, అదే ఎన్టీఆర్‌కు అసలైన నివాళి అన్నారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్... విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా, దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన మేటి నేతగా ఎదగడం సామాన్యం కాదని, క్రమశిక్షణ, అకుంఠిత దీక్ష, ప్రజల పట్ల ఎంతో నిబద్ధత ఉంటే తప్ప సాధ్యం కాదన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని ప్రజాస్వామ్యానికి తిరుగులేని నిర్వచనం చెప్పిన ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందు నుంచి ప్రజల మనిషిగా మసిలారని చెప్పారు. నియంతృత్వాన్ని ఎదిరించిన ధీరోదాత్తుడు ఎన్టీఆర్ అని కొనియాడుతూ 1984లో ఆయనను పదవీచ్యుతుడినిచేసి, ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటు పొడవడాన్ని తాను సహించలేకపోయానన్నారు. అందుకే నాటి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నానని చెప్పారు. ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాలు ప్రతి ఊర్లో జరగాలని, ఆయన బహుముఖ ప్రజ్ఞ, పరిపాలనా దక్షత గురించి భావితరాలకు తెలియాలన్నారు. సభకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అధ్యక్షత వహించారు. ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ భవానీ ప్రసాద్, ఏపీ ప్రభుత్వ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, రచయిత ఓలేటి పార్వతీశం, కిన్నెర రఘురాం తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-05-26T03:28:04+05:30 IST