Bank Employees: బ్యాంకు ఉద్యోగులు పండగ చేసుకునే వార్త.. త్వరలో వారానికి..
ABN, First Publish Date - 2023-05-04T16:07:28+05:30
బ్యాంకు ఉద్యోగులకు (Bank Employees) త్వరలో కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్లు బ్యాంకింగ్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మన దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో..
బ్యాంకు ఉద్యోగులకు (Bank Employees) త్వరలో కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్లు బ్యాంకింగ్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మన దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (Government Banks) పనిచేసే ఉద్యోగులకు వారంలో ఐదు రోజులు మాత్రమే పనిచేసే వెసులుబాటు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో.. ఈ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేయనున్నట్లు సమాచారం. వారానికి ఐదు రోజుల పని దినాల ప్రతిపాదనను ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (IBA) కేంద్ర ప్రభుత్వానికి పంపడం గమనార్హం.
యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయిస్ (UFBEs) కూడా ఈ ప్రతిపాదన పట్ల హర్షం వ్యక్తం చేసింది. అయితే.. బ్యాంకు ఉద్యోగులు పని దినాలైన ఆ ఐదు రోజులు 40 నిమిషాల పాటు అదనంగా పనిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులకు నెలలో రెండు శనివారాలు, నాలుగు ఆదివారాలు సెలవు దినాలుగా ఉండటం గమనార్హం. వీటికి తోడు.. పబ్లిక్ హాలిడేస్ ఉండనే ఉంటాయి. తాజాగా.. వారానికి రెండు రోజులు సెలవు ప్రతిపాదన కూడా కేంద్రం ముందుకు రావడం, కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే బ్యాంకు ఉద్యోగులు పండగ చేసుకోనున్నారు.
ఐటీ ఉద్యోగుల మాదిరిగా బ్యాంకు ఉద్యోగులు కూడా వారంలో రెండు రోజులు అధికారిక సెలవు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా.. మే నెలలో దేశంలోని పలు ప్రాంతాల్లో బ్యాంకులు 11 రోజుల పాటు మూతపడనున్నాయి. బుద్ధ పూర్ణిమ, మహారాణా ప్రతాప్ జయంతి వంటి రోజులతో పాటు ప్రతి నెల ఉండే ఆదివారాలు, రెండు శనివారాల సెలవుల వల్ల మే నెలలో 11 రోజుల పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. అయితే.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు సెలవులు ఒకే విధంగా ఉండవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మే నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్న రోజులను ఒక్కసారి పరిశీలిస్తే..
మే 7: ఆదివారం
మే 13: రెండో శనివారం
మే 14: ఆదివారం
మే 21: ఆదివారం
మే 27: నాలుగో శనివారం
మే 28: ఆదివారం
Updated Date - 2023-05-04T16:07:58+05:30 IST