సానుకూల సందేశం
ABN, First Publish Date - 2023-01-27T03:29:52+05:30
భారతదేశంతో మూడుయుద్ధాలు చేసి గుణపాఠాలు నేర్చుకున్నాం, ఇప్పుడు శాంతిని కోరుకుంటున్నాం అంటూ పాకిస్థాన్ ప్రధాని...
భారతదేశంతో మూడుయుద్ధాలు చేసి గుణపాఠాలు నేర్చుకున్నాం, ఇప్పుడు శాంతిని కోరుకుంటున్నాం అంటూ పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించిన కొద్దిరోజుల్లోనే, భారతదేశం ఆ దేశానికి ఒక సానుకూల సందేశం పంపింది. మే నెలలో గోవాలో జరగబోతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) విదేశాంగమంత్రుల సమావేశానికి పాక్ విదేశాంగమంత్రి బిలావల్ భుట్టోను భారత్ ఆహ్వానించింది. ఆహ్వానం అందిందనీ, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని పాకిస్థాన్ ప్రకటించింది. దీనిని ఆమోదించినపక్షంలో పన్నెండు సంవత్సరాల తరువాత పాకిస్థాన్ నుంచి ఒక ఉన్నతస్థాయి రాజకీయ పర్యటన జరిగినట్టు అవుతుంది.
న్యూయార్క్‌లో డిసెంబరులో జరిగిన ఒక సదస్సులో బిలావల్ భుట్టో జర్దారీ 2002 గుజరాత్ ఊచకోతలను ఉటంకిస్తూ భారత ప్రధానిని ‘కసాయి’గా అభివర్ణించిన విషయం తెలిసిందే. అయితే, వారం క్రితం పాక్ ప్రధాని షరీఫ్ తన దుబాయ్ పర్యటనలో ఒక అరబ్ చానెల్‌తో మాట్లాడుతూ కొన్ని సానుకూల వ్యాఖ్యలు చేశారు. భారతదేశంతో శాంతియుత సహజీవనాన్ని కోరుకుంటున్నామనీ, ఇరుదేశాల మధ్య నిజాయితీగా చర్చలు జరగాలని అభిలషించారు. యుద్ధాలనుంచి పాఠాలు నేర్చుకున్న పాకిస్థాన్ తన ప్రజలకోసం, ఆర్థికాభివృద్ధికోసం పొరుగుదేశంతో సత్సంబంధాలు కోరుకుంటున్నదన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన మర్నాడు పాకిస్థాన్ విదేశాంగశాఖ, కశ్మీర్ స్వయంప్రతిపత్తిని కాలరాసిన ఆర్టికల్ 370ని ఉపసంహరించుకుంటేనే ఈ చర్చలు జరుగుతాయంటూ ఓ మెలికపెట్టింది. ఎప్పటిలాగానే కశ్మీర్‌ను చర్చలతో లంకెపెట్టినందున పాకిస్థాన్ వైఖరిలో మార్పేమీరానట్టేనని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. భారతదేశం కూడా సత్సంబంధాలే కోరుకుంటున్నదనీ, ఉగ్రవాదానికీ, హింసకూ చోటులేనప్పుడే చర్చలకు సానుకూలవాతావరణం ఏర్పడుతుందని, ఆ బాధ్యత పాకిస్థాన్‌దేనని భారత విదేశాంగశాఖ ప్రతినిధి జవాబిచ్చారు. ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్న ఈ పరిణామాల నేపథ్యంలో, ఇప్పుడు భారతదేశం ఎస్సీవో ఆధ్వర్యంలో జరిగే విదేశాంగమంత్రుల, ప్రధానన్యాయమూర్తుల సదస్సులకు పాకిస్థాన్‌ను పిలవడం చాలామంది ఊహించనిది. చీఫ్ జస్టిస్ ఉమర్ బండియాల్, బిలావల్‌భుట్టోలు భారత్ వస్తారా లేదా అన్నది అటుంచితే, ఈ ఆహ్వానం పాకిస్థాన్ ఎంపీలను బాగా ఆశ్చర్యపరిచింది. రెండుదేశాల మధ్యా తెరవెనుక చర్చలు ఏమైనా జరుగుతున్నాయా? అన్న అనుమానం వారికి కలగడంతో ప్రభుత్వం మీద ప్రశ్నల వర్షం కురిపించారు. రహస్యచర్చలేమీ జరగడం లేదని విదేశాంగశాఖ సహాయమంత్రి హీనా రబ్బాని ఖర్ పాక్ రాజ్యసభకు భరోసా ఇవ్వాల్సి వచ్చింది. గతంలో కంటే పొరుగుదేశం వైఖరిలో కొత్తమార్పు వచ్చిందనీ, అణ్వాయుధాలున్నది దీపావళి చేసుకోవడానికి అని వ్యాఖ్యానిస్తున్న ప్రధాని అటువైపు ఉన్నప్పుడు మనం ఏమిచేయగలం? అన్నారామె. ఇటువంటి వ్యాఖ్యలు మాత్రమే ఉభయదేశాల దౌత్యసంబంధాల పునరుద్ధరణ నిర్ణయాలను ప్రభావితం చేయకపోవచ్చును కానీ, భారతదేశం పంపిన ఆహ్వానాన్ని తిరస్కరించినపక్షంలో పాకిస్థాన్ ఆత్మరక్షణలో పడకతప్పదు. శాంతిని కోరుకుంటున్నామని ఒకపక్క అంతర్జాతీయ సమాజం ముందు గొప్పకు పోతూ, ద్వైపాక్షిక చర్చల మాట అటుంచి, అరడజను దేశాలు పాల్గొనే సదస్సును కూడా బాయ్‌కాట్ చేస్తే అది ఆత్మరక్షణలో పడకతప్పదు. భారత్‌తో మైత్రికి పాక్ ప్రధానులు ప్రయత్నించినప్పుడల్లా అక్కడి సైన్యం అడ్డుతగులుతుందనీ, నేతల రాకపోకలు ముగిసినవెంటనే భారత్‌మీద ఉగ్రవాద దాడులు జరుగుతాయని తెలిసిందే. అధికారంలోకి రాగానే భారత ప్రధాని నరేంద్రమోదీ ఎంతో ఉత్సాహంగా పాకిస్థాన్‌తో సన్నిహిత సంబంధాలకోసం పలు ప్రయత్నాలు చేశారు. కానీ, 2016యురి దాడి, 2019పుల్వామా దాడి, ప్రతీకారంగా భారత్ చేపట్టిన బాలాకోట్ దాడులతో వాతావరణం మరింత వేడెక్కింది. కశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు ఉభయదేశాల మధ్యా మరింత దూరం పెంచింది. ఇటీవలి షరీఫ్ వ్యాఖ్యలు కొత్త సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్ అనుమతితో చేసినవా కాదా అన్నది భారత్ ఆహ్వానంపై పాకిస్థాన్ ప్రతిస్పందనతో స్పష్టమైపోతుంది. జి20 అధ్యక్షస్థానంలో ఉన్న భారతదేశం కనబరిచిన ఈ సానుకూలవైఖరిని అందిపుచ్చుకొని, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమ ప్రజల దృష్టిలో బలమైన మార్పుసాధించిన నేతలుగా నిలబడాలో లేదో పాక్ పాలకులు తేల్చుకోవాల్సి ఉంది.
Updated Date - 2023-01-27T03:29:56+05:30 IST