ఆకలిపై యుద్ధం ప్రకటించిన దార్శనికుడు!
ABN, First Publish Date - 2023-10-20T03:40:14+05:30
భారతదేశ వ్యవసాయ చరిత్రలో పురోగతికి సమానార్థకంగా ఎం.ఎస్. స్వామినాథన్ పేరు చిరకాలం నిలుస్తుంది. ఆ మహానుభావుడి కృషి ఫలితంగా ఒకప్పుడు ఆహార పదార్థాలను...
భారతదేశ వ్యవసాయ చరిత్రలో పురోగతికి సమానార్థకంగా ఎం.ఎస్. స్వామినాథన్ పేరు చిరకాలం నిలుస్తుంది. ఆ మహానుభావుడి కృషి ఫలితంగా ఒకప్పుడు ఆహార పదార్థాలను దిగుమతి చేసుకున్న మన దేశం ఈ రోజు ఎగుమతి చేసే దేశంగా ఎదిగింది. భారతదేశ చరిత్రలో ఎన్నో కరువులు కోట్లాది మందిని పొట్టనపెట్టుకున్నాయి. అతివృష్టి, అనావృష్టుల వలన వేలాది ఎకరాల పంటలు నాశనం అయ్యేవి. 1943లోని బెంగాల్ కరువుకు స్వామినాథన్ ప్రత్యక్ష సాక్షి. అప్పట్లో తల్లిదండ్రుల అభీష్టం మేరకు మెడిసిన్ చేయాలనుకున్న స్వామినాథన్ బెంగాల్ కరువును చూసి నిర్ణయం మార్చుకున్నారు. ఆ కరువులో 30 లక్షల మంది ఆకలిచావులు చూసి, వ్యవసాయ శాస్త్రం చదవాలని, ఆకలి లేని భారతదేశాన్ని చూడాలని అభిలషించారు. 1947లో న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో పీజీ చేసి, కేంబ్రిడ్జి యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. 1954లో ఇండియాకు తిరిగి వచ్చారు. 1950–55లో భారతదేశం కేవలం 50మెట్రిక్ టన్నుల ఆహారాన్ని మాత్రమే ఉత్పతి చేసింది. అప్పటి దేశ జనాభా 36 కోట్ల మందికి ఇది ఏ మాత్రం సరిపోయే ఉత్పత్తి కాదు. అందువల్ల దేశం 4.8 మెట్రిక్ టన్నుల ఆహారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకునేది. ఈ పరిస్థితుల్లో, మెక్సికోకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త నార్మన్ బార్లాంగ్, డాక్టర్ స్వామినాథన్‌లు కలిసి వ్యవసాయ రంగంలో చేసిన కృషి భారతదేశ వ్యవసాయ ముఖచిత్రాన్నే మార్చివేసింది.
1960వ దశకంలో పెరుగుతున్న జనాభాతో, ముంచుకొస్తున్న కరువుతో దేశం సంక్షోభం అంచున ఉంది. ఈ తరుణంలోనే డాక్టర్ స్వామినాథన్ ఆధునిక వ్యవసాయ పద్ధతులతో పాటు అధిక దిగుబడినిచ్చే పంట వంగడాలను దేశంలో ప్రవేశపెట్టారు. గోధుమలు, వరి, ఇంకా ఇతర ప్రధాన పంటలకు అధిక దిగుబడినిచ్చే వంగడాలను వృద్ధి చేశారు. స్వామినాథన్ అవిశ్రాంత ప్రయత్నాలు భారతీయ వ్యవసాయంలో గొప్ప మార్పును తీసుకువచ్చాయి. పరిశోధన, క్షేత్రస్థాయి పరీక్షల ద్వారా స్వామినాథన్, ఆయన బృందం ఎక్కువ దిగుబడి ఇచ్చే వంగడాలను తెచ్చారు. తక్కువ నీటి వినియోగంతోపాటు, రోగనిరోధకశక్తి సామర్థ్యాలను ప్రదర్శించే పంటల జాతులను అభివృద్ధి చేసారు. ఈ వంగడాలను రైతులకు పంపిణీ చేయడంతో పాటు వారికి తగిన శిక్షణను, మద్దతును అందించి ఉత్పాదకతలో నూతన శకానికి నాంది పలికారు. స్వామినాథన్ కృషితో ప్రేరేపితమైన ఈ హరిత విప్లవం భారతదేశ ఆహార ఉత్పత్తి సామర్థ్యాలపై పరివర్తనాత్మక ప్రభావాన్ని చూపింది. ఒకప్పుడు ఆహార సహాయం కోసం విదేశాలపై ఆధారపడిన భారతదేశం, పెరుగుతున్న జనాభాకు ఆహారం అందించగల స్వయం సమృద్ధ దేశంగా ఆవిర్భవించింది. 2022లో మనదేశం 330.5 మెట్రిక్ టన్నుల ఆహారాన్ని ఉత్పతి చేసిందంటే అది డా. స్వామినాథన్‌తో పాటు, ఆయన బృంద సభ్యులైన నార్మన్ బార్లాంగ్, ఎ.కె. శర్మ వంటి వారి కృషి ఫలితమే! 135 కోట్ల మందికి సరిపడా ఆహారంతో పాటు, 40శాతం అదనపు స్టాకు దగ్గర ఉంచుకోగలుగుతున్నామంటే అందుకు కారకుడు వారే! అదేవిధంగా డాక్టర్ స్వామినాథన్ రచనల వలన, చాలామంది వ్యవసాయ రంగలో పరిశోధనలతో కొత్త రకపు వంగడాలను వృద్ధి చేశారు. స్వామినాథన్ ఫౌండేషన్ ద్వారా ఆయన కూడా రైతుల సాధికారత కోసం నిరంతరం పనిచేశారు. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఉండాలని అప్పటి భారత ప్రభుత్వానికి రికమెండ్ చేశారు. అదే విధంగా పెరుగుతున్న భూతాపాన్ని ఎదుర్కోవడానికి మనం ఎన్విరాన్మెంటల్ సస్టెయినబిలిటీ మీద దృష్టిపెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. దీర్ఘకాలిక వ్యవసాయ విజయాన్ని నిర్ధారించడంలో, తక్షణ ఆహారోత్పత్తికి మించి, పర్యావరణ సుస్థిరతకు ఉన్న ప్రాముఖ్యతను ఆయన అర్థం చేసుకున్నారు. సుస్థిర వ్యవసాయం కోసం స్వామినాథన్ ఇచ్చిన పిలుపు భారతదేశంలో సేంద్రియ వ్యవసాయ ఉద్యమాలకు పునాది వేసింది. స్వామినాథన్ హరిత విప్లవ బ్లూప్రింట్ ప్రపంచవ్యాప్తంగా స్వీకరించబడింది. ఆయన వారసత్వాన్ని తలుచుకుంటూ, ఆయన విప్లవాత్మక వ్యవసాయ దార్శనికత రైతులు, విధాన నిర్ణేతల హృదయాల్లో సజీవంగా ఉండేలా ఆయన రచనల నుంచి మన యువత ప్రేరణ పొందడం అవసరం.
డా. చారు మజుందార్
సామాజిక శాస్త్రవేత్త
Updated Date - 2023-10-20T03:40:14+05:30 IST