ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మృత్యుబీభత్సం లేని ఓ యుద్ధం!

ABN, First Publish Date - 2023-10-06T02:23:15+05:30

నిజమైన యుద్ధమా? కాదు. మూడేళ్లు తక్కువగా మూడు దశాబ్దాల క్రితం (1996) నాటి ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్‌ను ‘కాల్పులు లేని యుద్ధం’ (వార్ మైనస్ ది షూటింగ్)గా అమెరికన్ పాత్రికేయుడు మైక్ మార్ఖ్యూసీ అభివర్ణించారు...

నిజమైన యుద్ధమా? కాదు. మూడేళ్లు తక్కువగా మూడు దశాబ్దాల క్రితం (1996) నాటి ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్‌ను ‘కాల్పులు లేని యుద్ధం’ (వార్ మైనస్ ది షూటింగ్)గా అమెరికన్ పాత్రికేయుడు మైక్ మార్ఖ్యూసీ అభివర్ణించారు. అదే శీర్షికతో ఆయన ఆ టోర్నమెంట్‌పై సవివరమైన ఒక ప్రశస్త పుస్తకాన్ని కూడా వెలువరించారు. ఇరవై ఏడు సంవత్సరాల అనంతరం ఇప్పుడు ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ పోటీ ఆనాటి కంటే కూడా మరింతగా ‘యుద్ధ స్వభావం’ను సంతరించుకుంది. ఈ పరిస్థితిని, మైక్ పుస్తక శీర్షిక ఆనాడే చక్కగా సూచించిందనడంలో సందేహం లేదు. 1996లో అయితే భారత ఉపఖండంలోని మూడు దేశాల– ఇండియా, పాకిస్థాన్, అంతిమ విస్మయకర విజేత శ్రీలంక – సంయుక్తంగా ఆ ప్రపంచ కప్ టోర్నమెంట్‌ను నిర్వహించాయి. మరి ఇప్పుడు? అది అసంభవం. ఏ మాత్రం ఆలోచించలేని విషయం. అంతకంతకూ పెరిగిపోతోన్న స్పర్ధాత్మక, శ్రుతి మించిన జాతీయవాద భావోద్వేగాలు ఇండియా–పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌ను ఆవహించి ఉన్నాయి. వాఘా సరిహద్దుకు ఆవల, ఈవల కూడా పనిగట్టుకుని ఆ భావోద్వేగాల వాతావరణాన్ని కల్పించారు.

సరే, ఇండో –పాక్ క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించడానికి ఆరాటపడని క్రికెట్ అభిమానులు ఎవరు ఉంటారు? అది, అహ్మదాబాద్‌లో జరగడం ఉభయ దేశాల మధ్య ప్రస్తుత సంబంధాల వాస్తవ పరిస్థితిని సంకేతాత్మకంగా సూచిస్తుంది. అహ్మదాబాద్ నగరం గురించి మాట్లాడుకుంటున్నాం కదూ! గత మూడు దశాబ్దాలుగా ఆ నగర రాజకీయాలలో సంఘ్ పరివార్ ప్రాబల్య పాత్ర వహిస్తోంది. 2002లో ఆ నగరంలో చోటుచేసుకున్న హిందూ–ముస్లిం అల్లర్లు నాడే కాదు, నేడూ తీవ్ర భీతిని గొలుపుతున్నాయి. మతపరమైన అస్తిత్వాలు ఆ మహానగరంలో అంతర్గత దృశ్యమాన ‘సరిహద్దుల’ను సృష్టించాయి! ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్‌లో ఉన్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరిట దానికి నామకరణం చేశారు. ప్రభవిస్తోన్న ప్రపంచశక్తిగా భారత్‌కు ఒక విలక్షణ సమున్నత హోదా కల్పించాలన్న ఆశలు, ఆకాంక్షలను దృడ హిందూత్వతో కలగలిపిన శక్తిమంతమైన జాతీయ వాద రాజకీయాలకు ప్రతీకగా వెలుగొందుతున్న నాయకుడు మోదీ. హిందూత్వ జాతీయవాదులలో అత్యధికులు భారతీయ ముస్లింను ఒక ‘అంతర్గత శత్రువు’గా చూస్తారు; పాకిస్థాన్‌ను ఒక ప్రధాన ‘శత్రు దేశం’గా పరిగణిస్తారు. ఆరు నూరైనా సరే, ఆ శత్రు రాజ్యాన్ని ఏకాకిని చేసి, అస్తిత్వాన్ని కోల్పోయేరీతిలో పరాజితను చేసి తీరాలన్నది వారి అభీష్టం. మరి భారతీయ జనతా పార్టీ తన సొంత మెజారిటీతో ఇంచుమించు ఒక దశాబ్దం క్రితం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ, పాకిస్థాన్‌తో క్రీడా పరమైన సంబంధాలను సాధ్యమైనంతగా పరిమితం చేసుకునేందుకు ఇండియా ప్రత్యేక శ్రద్ధ చూపడంలో ఆశ్చర్యమేముంది? న్యూఢిల్లీ వైఖరి స్పష్టమే : సీమాంతర ఉగ్రవాద కార్యకలాపాలు, క్రికెట్ సంబంధాలు పరస్పరం పొసగవు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించి తీరాలి. 2004లో టీమిండియా పాకిస్థాన్‌లో పర్యటించేందుకు పచ్చ జెండా ఊపింది అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వమే. క్రీడా రంగంలోనైనా సంబంధాలు మెరుగుపడి, పటిష్ఠమైతే ఉభయ దేశాల మధ్య అన్ని రంగాలలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అవకాశమున్నదని ఆ రాజనీతిజ్ఞుడు భావించారు.

నరేంద్ర మోదీ ప్రభుత్వానికి అటువంటి భ్రమలు ఏమీ లేవు. 2014లో తన పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌నూ ఆహ్వానించి మోదీ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తరువాత డిసెంబర్ 2015లో ఆహ్వానం లేకుండానే నవాజ్ షరీఫ్‌ ఇంట ఒక వివాహ మహోత్సవానికి మోదీ హాజరయ్యారు. 2016లో పఠాన్ కోట్, యూరీలో ఉగ్రవాద దాడులతో ఈ తరహా దౌత్యాలకు తెరపడింది. యూరీలో ఉగ్రవాద దాడుల అనంతరం వ్యూహాత్మక సంయమన విధానానికి స్వస్తి చెప్పి పాకిస్థాన్ లోతట్టు ప్రాంతాలలో సర్జికల్ దాడులకు ఆదేశించారు. అవి విజయవంతమయ్యాయి. ఆ సందర్భంగా ‘ఘర్ మే ఘస్కర్ మారా’ (వారి సొంతగడ్డ పైనే వారిపై దాడి చేశాము) అని మోదీ ప్రకటించారు. పుల్వామా, బాలాకోట్ ఘటన అనంతర చర్యలు మోదీ ప్రభుత్వ వైఖరిలో ఒక స్పష్టమైన మార్పును ప్రతిబింబించాయి. ‘దోస్తీ’ (స్నేహం) నుంచి ‘దుష్మని’ (శత్రుత్వం)కి మోదీ సర్కార్ పూర్తిగా మొగ్గింది. ఆ తరువాత పరిస్థితులు మరింతగా దిగజారాయి. తత్కారణంగానే ఇప్పుడు న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌ల మధ్య రాజకీయంగా సుహృద్భావ సంబంధాలు లేవు.


న్యూఢిల్లీ వైఖరిలో నిర్ణయాత్మక మార్పునకు పుల్వామా, అంతకు ముందు 26/11 దాడులు కారణమయితే ఆగస్టు 2019లో జమ్మూ కశ్మీర్‌లో అధికరణ 370 రద్దు దౌత్య సంబంధాలను తగ్గించుకునేందుకు ఇస్లామాబాద్‌ను పురిగొల్పింది. వాణిజ్య సంబంధాలు చాల వరకు తగ్గిపోయాయి. ఇక ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాల పునరుద్ధరణ విషయమై ఎలాంటి కబుర్లకు ఆస్కారం లేకుండా పోయింది. భారత ఉపఖండ క్రికెట్ దిగ్గజాలలో నిస్సందేహంగా అగ్రగణ్యుడు అయిన ఇమ్రాన్ ఖాన్ 2018లో పాకిస్థాన్ ప్రధానమంత్రి అయ్యారు. ‘ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణలో భారత్ ఒక అడుగు ముందుకు వేస్తే మేము రెండు అడుగులు ముందుకు వేస్తామని’ ఇమ్రాన్ ప్రకటించారు. అయితే ఇండో–పాక్ సంబంధాలు మరింతగా దిగజారిపోయాయి. దెబ్బకుదెబ్బ తీసుకోవడమే ఇరుదేశాల విధానమైపోయింది. క్రికెట్ చిక్కుల్లో పడింది. ఈ ఏడాది పాకిస్థాన్ ఆసియా కప్ టోర్నమెంట్‌ను నిర్వహించినప్పుడు టీమిండియా పాక్‌లో ఆడదని భారత క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ఇందుకు ప్రతి చర్యగా ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు తమ టీమ్ భారత్‌లో పర్యటించే ప్రసక్తే లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తొలుత బెదిరించింది. ఈ రెండు జట్లు శ్రీలంకలో ఆడేందుకు ఒక అంగీకారం కుదిరింది. తుదకు అహ్మదాబాద్‌లో ప్రత్యక్షంగా తలపడేందుకు భారత్, పాకిస్థాన్‌లు సమ్మతించాయి.

ఈ జగడం విశదం చేసినదేమిటి? రెండు దేశాల మధ్య సంబంధాలు సమస్థాయిలో లేవనే కాదూ? అపార ధనరాశులు ఉన్న భారతీయ క్రికెట్ బోర్డు ప్రపంచ క్రికెట్ వ్యవహారాలను నిర్దేశిస్తోంది, శాసిస్తోంది శ్రీలంక టీమ్ ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదుల దాడి ఫలితంగా పాకిస్థాన్‌లో పర్యటించేందుకు అంతర్జాతీయ క్రికెట్ టీమ్‌లు చాలా సంవత్సరాలుగా తిరస్కరిస్తున్నాయి. తనకు ఎదురవుతున్న ఈ ప్రతికూల పరిస్థితిని సరిచేసుకునేందుకు భారత క్రికెట్ బోర్డు నిర్దేశించిన విధంగా వ్యవహరించడం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు‌కు అనివార్యమయింది.

ఒక విధంగా భారత క్రికెట్‌పై భారతీయ జనతా పార్టీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. భారత ప్రజలు అసాధారణంగా ఆదరించే, అభిమానించే ఆట వ్యవహారాలపై నియంత్రణకు జాతీయ పాలక పక్షం నియంత్రణ కొనసాగింపే భారత క్రికెట్ బోర్డు రాజకీయాలు. అలాగే ఇటీవల అనంతనాగ్‌లో వారం రోజుల పాటు లష్కర్ ఉగ్రవాదులు చెలరేగిపోయిన తీరునూ చూడండి. కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్థానీ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఇప్పటికీ పూర్తి స్థాయిలో అండదండల నందిస్తున్నదని స్పష్టమయింది. లష్కర్ మిలిటెంట్ల దాడిలో భారత సైన్యం ఒక కల్నల్, ఒక మేజర్‌ను కోల్పోయింది. ఇంతా చేస్తూనే భారత్‌ను ఒక ‘దుష్మన్ ముల్క్’ (శత్రు దేశం)గా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ జాకా అష్రఫ్ ప్రస్తావించారు. లౌక్యం కొరవడిన ఇటువంటి వ్యాఖ్యలు ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తతల ఉపశమనానికి ఎలా తోడ్పడుతాయి? అలాగే ఇటీవల మన పార్లమెంటులో పాలక పక్షం నేతలు ముస్లింలపై వేసిన అపవాదులు సైతం సుహృద్భావ సంబంధాలకు ఎలా దోహదం చేస్తాయి?

ఈ నేపథ్యంలో ఇరవై రెండు మంది క్రికెట్ క్రీడాకారులు బరిలోకి దిగబోతున్నారు. కానీ, వాతావరణం యావత్తు ఆ బ్యాట్ వీరులు, బౌలింగ్ మాంత్రికులను క్రికెట్ యోధుల వలే కాకుండా ప్రత్యేక దుస్తులు ధరించిన సైనికుల పాత్ర పోషించేలా చేస్తోంది. అవును, ఆ క్రికెట్ పరాక్రముల బ్యాట్‌లే వారి తుపాకులు, తెల్ల బంతి ఆగ్రహంతో దూసుకొచ్చే ఒక బుల్లెట్. ఆదర్శవంతమైన, శాంతి సామరస్యాలు వర్ధిల్లుతున్న మరింత మర్యాదకరమైన ప్రపంచంలో అయితే ఈ క్రికెట్ మ్యాచ్ బ్యాట్, బాల్ మధ్య; ఒక విరాట్ కోహ్లీ, ఒక బాబర్ అజమ్‌ మధ్య; ఒక జస్ప్రీత్ బుమ్రా, ఒక షహీన్ షా అఫ్రీది మధ్య ప్రామాణిక, స్ఫూర్తిదాయక పోటీ అయివుండేది. ప్చ్.. మనం ఒక విషాద కాలంలో వున్నాం. ఈ మహా క్రీడ (టీవీ వ్యాపార ప్రకటనల శబ్ద ఘోష సూచిస్తున్నట్టు) క్రీడోత్సాహంతో అలరించడానికి బదులు ‘బద్‌లా’ (పగ), ‘జంగ్’ (యుద్ధం) కోసం ఆరాటపడుతున్న వాతావరణంలో చిక్కుకున్న రోజులివి. ప్రాచీన రోమ్‌లో కులీనుల ఆనందానికి ఖడ్గ మల్లులు ప్రదర్శించిన సమరోత్సుకతను నేటి క్రికెటర్ల నుంచీ సంఖ్యానేకులు ఆశిస్తున్నారు. ఇండో –పాక్ మ్యాచ్ చుట్టూ ఆవహించివున్న విషపూరిత చప్పుళ్లు ఆ క్రీడలోని స్వచ్ఛతను అపహరించివేస్తాయని క్రికెట్‌లోని సౌందర్యమేమిటో (ఒక ఆటకు, పరిపూర్ణ నియమబద్ధత నిచ్చే సౌందర్యం మరేదిస్తుంది?) తెలిసిన వారు భావిస్తున్నారు, చింతిస్తున్నారు. అటువంటి వారిలో నేనూ ఒకడిని కనుకనే ఇండో – పాక్ క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించేందుకు అహ్మదాబాద్ వెళ్లడం లేదు.

రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

Updated Date - 2023-10-06T02:23:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising