ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆదరణ, అన్వేషణ, కరుణ ఇదే హిందూమార్గం

ABN, First Publish Date - 2023-10-01T00:53:29+05:30

జీవితం ఏమిటి? ఆనందం, అనురాగం, భయం కలగలిసిన ఒక మహాసాగరం గుండా ఈదుతూండడాన్నే జీవితంగా ఊహించుకోండి. మనం ఆ జలధిలో అందమైన, అయితే భీతిగొలిపే లోతుల్లో కలసి జీవిస్తున్నాం. అంతేనా? ఈ జీవనకడలి లోని...

జీవితం ఏమిటి? ఆనందం, అనురాగం, భయం కలగలిసిన ఒక మహాసాగరం గుండా ఈదుతూండడాన్నే జీవితంగా ఊహించుకోండి. మనం ఆ జలధిలో అందమైన, అయితే భీతిగొలిపే లోతుల్లో కలసి జీవిస్తున్నాం. అంతేనా? ఈ జీవనకడలి లోని అనేక శక్తిమంతమైన, నిరంతరమూ మారుతూ ఉండే ప్రవాహాల తాకిడిని తట్టుకుని బతికి ఉండేందుకు ప్రయత్నిస్తుంటాము. ఆ జీవ ప్రజ్వలిత ఉదధిలో ఆపేక్ష, బాంధవ్యం, అమితమైన సంతృప్తి ఉన్నాయి. అయితే అక్కడ భీతి కూడా ఉన్నది. మరణ భీతి, ఆకలి భయం, బతికిన క్షణాలను కోల్పోయినప్పుడు ఆవహించే ఆందోళన తో పాటు, ఆపద విరుచుకుపడుతుందనే చింత, ప్రాముఖ్యం, ప్రయోజకత్వం లేని మనుగడ కొనసాగించవలసివస్తుందనే వేదన, వైఫల్య వ్యాకులత ఈ జీవన సాగరంలో ఉన్నాయి. భువనమోహనమైన ఆ జీవన సంద్రం ద్వారా మన సమష్టి యాత్రే జీవితం. మనమందరమూ కలసికట్టుగా ఈ భవసాగరాన్ని దాటుతున్నాం. అది ఎంత రమణీయమైనదో అంత భయంకరమైనది. జీవితం అని మనం పిలిచే ఈ మహాసాగరాన్ని అధిగమించి నిలిచిన వారు ఎవరూ లేరు. ఇక ముందు ఎప్పటికీ ఎవరు ఉండబోరు.

తన సొంత భయాన్ని జయించేందుకు ఒక మనిషి సాహసిస్తారు. ఆ కారణంగా ఆ మనిషి జీవన మహాసాగరాన్ని సత్యసంధతతో అవలోకించవచ్చు. ఇదిగో, ఇటువంటి సత్యనిరతిని పాటించే వ్యక్తే హిందువు. హిందూధర్మాన్ని ఒక సాంస్కృతిక ప్రమాణాల సముదాయంగా పిలవడం ఆ ధార్మికతను అపార్థం చేసుకోవడమే. ఒక ధర్మాన్ని తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు జరిగేదేమిటి? నిర్దిష్ట దేశప్రజలతో లేదా భౌగోళిక ప్రదేశంతో మాత్రమే కలిపివేయడం కాదూ? హిందూధర్మాన్ని అలా చేయడమంటే ‍ దాని విశాలత్వాన్ని పరిమితం చేయడమే అవుతుంది. మన భయాలతో మన సంబంధాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నామో, వాటి నుంచి ఎలా ఉపశమనం పొందుతున్నామో అనేదే హిందూ ధర్మం. సత్యాన్ని సమగ్రంగా గ్రహించే దిశగా అదొక మార్గం. ఆ సత్యాన్వేషణా పథం ఏ ఒక్కరి సొంతం కాదు. అదొక తెరిచి ఉన్న విశాల మార్గం. అందరూ ప్రవేశించదగినది. ఆ బాటలో నడవాలని అభిలషించే ఎవరినైనా అది అరమరికలు లేకుండా స్వాగతిస్తుంది. ఆ మార్గాన్ని ఎవరైనా ఎంపిక చేసుకోవచ్చు. ఎవరైనా ఆ సత్యాన్వేషణ రీతిని అనుసరించవచ్చు.

ఆత్మావలోకనం ఒక హిందువు స్వతస్సిద్ధ స్వభావం. జీవన మహాసాగరంలోని ప్రతీ ఒక్కరికీ మమకారం పంచుతారు. తోటి జీవిని కరుణ, గౌరవంతో చూస్తారు. ఎందుకంటే మనమందరమూ సరిగ్గా ఒకే జలధిలో ఈదుతున్నామని, అందులోనే మునకలు వేస్తున్నామనే సత్యాన్ని హిందువులు బాగా అర్థం చేసుకున్నారు. తన చుట్టూ ఉన్న, ఈదేందుకు సతమతమవుతున్న సకల జీవులనూ సమాదరిస్తారు. ఈదేందుకు సతమతమవుతున్న వారికి తోడ్పడుతారు. స్నేహహస్తాన్ని చాచుతారు. విపత్కర ఘడియల్లో ఆదుకునేందుకు ఆపన్న హస్తం అందిస్తారు. అత్యంత ప్రశాంత వ్యాకులత, అత్యంత నిశ్శబ్ద ఆర్తనాదం పట్ల కూడా హిందువు అప్రమత్తతతో ఉంటారు. ఇతరులను, ముఖ్యంగా బలహీనులను రక్షించేందుకు సంకల్పించడం, కార్యాచరణకు పూనుకోవడాన్నే తన ధర్మంగా చెబుతారు. సత్యం, అహింస అనే ఆదర్శాల ద్వారా ప్రపంచపు అగోచర బాధలు, వ్యధలను సహానుభూతితో పట్టించుకుని, వాటిని రూపు మాపేందుకు సంకల్పం వహించడమే హిందూ ధర్మ అనుష్ఠానం.


తన సొంత భయాలను లోతుగా దర్శించే ధైర్యం, వాటిని అంగీకరించి, ఆదరంతో స్వీకరించగల తెగువ ఒక హిందువుకు ఉంటాయి. తన భయాన్ని ఒక శత్రువుగా అతను/ఆమె చూడరు. పైగా జీవిత పర్యంతం తనకు దారి చూపుతూ తోడు వచ్చే ఆత్మీయ మిత్రుడుగా తన భయాన్ని మార్చుకోగలుగుతారు. హిందువులు భయపీడితులు కాదు. భయం తనను వశపరచుకోవడాన్ని ఒక హిందువు ఎప్పటికీ అనుమతించరు. ఆగ్రహావేశాలను వెల్లువెత్తించేందుకు, పగ ప్రతీకారాలను ప్రజ్వలింపచేసేందుకు, హింసాత్మకంగా చెలరేగేందుకు తనను ఒక సాధనంగా వాడుకునేలా తనలోని భయాన్ని రెచ్చగొట్టేందుకు ఏ హిందువూ సంకల్పించరు.

ఏ జ్ఞానమైనా జీవన మహాసాగరం నుంచే అంకురిస్తుందని ఒక హిందువుకు బాగా తెలుసు. ఆ ఎరుక కేవలం తన ఒక్కరి సంపత్తి మాత్రమే కాదు. జీవన ప్రవాహాల్లో అన్నీ నిరంతరం మారుతూ ఉంటాయని, ఏదీ స్థిరంగా ఉండదని, మార్పే జీవనసత్యమని హిందూధర్మ అనుయాయి ఎవరైనా ప్రగాఢంగా విశ్వసిస్తారు. బహురూపాలుగా ఉన్న సత్యాన్ని సమగ్రంగా దర్శించాలన్న, వాటి విశిష్టతను అవగతం చేసుకోవాలన్న ఆసక్తి హిందువుకు జన్మతహ సిద్ధించిన గుణ విశేషం. ఈ విశిష్టతే, స్వేచ్ఛాయుత అన్వేషణ, అవగాహనలకు విముఖం కాకుండా మనసును సదా చింతనా శీలంగా ఉంచుతుంది. ఒక హిందువు వినయశీలి. ఇతరులు చెప్పేదాన్ని శ్రద్ధగా ఆలకించేందుకు ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటారు. జీవన మహాసాగరంలో ఈదుతున్న ఏ జీవి నుంచి అయినా నేర్చుకునేందుకు అతను/ఆమె సంకోచించరు.

సమస్త జీవులనూ హిందువు ప్రేమిస్తారు. ఆ జీవులలో ప్రతీ ఒక్కటీ జీవనమహాసాగరంలో ప్రయాణించేందుకు, పరిణామాలను అర్థం చేసుకునేందుకు తమ సొంతమార్గాన్ని ఎంపిక చేసుకోవడాన్ని అంగీకరిస్తారు. సకల సత్యాన్వేషణ మార్గాలనూ తమ సొంత బాటగా అభిమానిస్తారు, గౌరవిస్తారు, అంగీకరిస్తారు.

రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్లమెంట్‌ సభ్యులు

(‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేకం)

Updated Date - 2023-10-01T00:57:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising