ఆకాశ విజయాలు, అశుద్ధ వాస్తవాలు !
ABN, First Publish Date - 2023-09-03T01:03:42+05:30
చంద్రమండలం మీద, దక్షిణ ధృవం దగ్గిర, భారతదేశపు అంతరిక్ష నౌక దిగిన క్షణం నించీ ‘జయహో భారత్! జయహో చంద్రయాన్! మేరా భారత్ మహాన్! వందే మాతరం!’...
చంద్రమండలం మీద, దక్షిణ ధృవం దగ్గిర, భారతదేశపు అంతరిక్ష నౌక దిగిన క్షణం నించీ ‘జయహో భారత్! జయహో చంద్రయాన్! మేరా భారత్ మహాన్! వందే మాతరం!’ అనే నినాదాలతో, నగరాల్లో దేశభక్తి పొంగి ఏరులై ప్రవహించింది. అంతరిక్ష నౌకని రాకెట్ ద్వారా వదిలే ముందు, దాని నమూనాని ఒకదాన్ని తిరుపతిలో వెంకటేశ్వరుడి ముందూ, సూళ్ళూరు పేటలో చెంగాలమ్మ ముందూ పెట్టి, పూజలు చేసి, ఆ నౌక చంద్రమండలం మీద అవాంతరాలు లేకుండా, అనుకున్నట్టు దిగాలని మొక్కుకున్నారు అంతరిక్ష శాస్త్రవేత్తలు! వాళ్ళకి వాళ్ళ శాస్త్రం మీద వున్న నమ్మకం అంత గట్టిది! జయహో భారత శాస్త్రవేత్తలారా! ఒకసారి, అంతరిక్ష కేంద్రం నించీ ఆ నౌక ఎగిరాక, దేశమంతటా పూజలూ, యాగాలూ! టీవీల్లో చర్చోప చర్చలు! పత్రికల నిండా కధనాలు! సంపాదకీయాలు!
చంద్రమండలం మీదకెళ్ళడం ఒక ‘వ్యాపారం’ అనీ, దాన్ని ‘అంతరిక్ష వ్యాపారం’ అనీ, ‘అంతరిక్ష పరిశ్రమ’ అనీ, కొన్ని కంపెనీలు, ఏమాత్రం దాపరికం లేకుండా చెప్పుకుంటాయనే విషయం గురించి ఎవరూ మాట్లాడడం లేదు. భారతదేశం అనే కాదు, దానికన్నా ముందు చంద్రమండలం మీదకి వెళ్ళిన అమెరికా, రష్యా, చైనా, జపాన్ వంటి దేశాలు, అంతరిక్షంలోకి రాకెట్లనీ, నౌకల్నీ, ఉపగ్రహాల్నీ పంపడం వల్ల, ఆ చంద్రమండలం మీద దాదాపు 2 లక్షల కిలోల చెత్త పేరుకుపోయి వుందని, గతంలోనే బైటపడ్డ మాట ఇప్పుడు ఎత్తరు! ఆ చెత్త, వాతావరణాన్ని ఎంత దుర్భరం చేస్తుందో, ఆ ఊసు ఎత్తరు! పర్యావరణ ప్రేమికులైన వారు మాత్రమే కొన్ని నిజాల్ని, అక్కడక్కడా ప్రస్తావిస్తూంటారు. ఆ నిజాల్ని చెప్పే సమాచారం ప్రకారం, దాదాపు 70 అంతరిక్ష నౌకలు బద్దలై, చెల్లాచెదురుగా చంద్రమండలం మీద పడి ఉన్నాయట! 14 వేల పాత రాకెట్ భాగాల ముక్కలు అక్కడ వున్నాయట! కోట్లాది శకలాలు భూమికి దగ్గిరగా తేలుతూ వున్నాయట! ఆ చెత్తలో ఎక్కువ భాగం అమెరికాదీ, తర్వాత రష్యాదీ, ఆ తర్వాత చైనాదీనూ అట! ఆ చెత్తాచెదారాలు, గంటకి 36 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయట! ఇవి, కొత్తగా వచ్చే అంతరిక్ష నౌకలకు తగిలి చాలా నష్టం కలిగిస్తున్నాయట! ఆ నౌకల్లో కొన్నిసార్లు మనుషుల్ని (‘వ్యోమగాముల్ని’), తక్కువ రోజుల పాటే అయినా, పంపిన కారణంగా, చంద్రమండలం మీద కొన్ని ఉచ్చల సంచులూ, 96 దొడ్డి సంచులూ కూడా ఉన్నాయని ఒక అంచనా. అంటే, ఈ అంతరిక్ష సైంటిస్టులు, తమ మల మూత్రాల్ని సంచుల్లో విడిచి చందమామ మీద పడేసి వచ్చారన్నమాట! ఇవి, అమెరికా వాళ్ళు ‘అపోలో’ పేరుతో పంపిన నౌకల్లో వెళ్ళిన వారివని తేల్చారు. ఆ సంచుల్లో వున్న ‘దొడ్డి’ని భూమి మీదకి తీసుకువచ్చి, అంతరిక్ష వాతావరణంలో ఆ దొడ్డి ఎలాంటి మార్పులకు లోనైందో, ఇక్కడి లాబరేటరీల్లో, పరిశోధనలు చేసి, తెలుసుకోవాలని, చాలా ఆసక్తితో వున్నారట అమెరికా శాస్త్రవేత్తలు.
ఇంతకీ, అమెరికా, రష్యా, చైనా, జపాన్, ఇండియా వంటి దేశాలు చంద్రమండలం మీదకి ఎందుకు వెళ్తున్నారూ? అంటే: అక్కడ నీళ్ళు వున్నాయా? గాలి? ఖనిజాలు ఏమున్నాయో- ఆ విషయాల్ని కనుక్కుని, ఇక ‘వ్యాపారాలు’ మొదలెడతారు. ఇప్పటికే అంతరిక్ష వ్యాపారం ‘ఉపగ్రహాల రూపం’లో జరుగుతోనే వుంది. ఉదాహరణకి, భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం, 34 దేశాలతో వ్యాపార ఒప్పందాలు చేసుకుని, వాటి కోసం 342 ఉపగ్రహాలను తయారు చేసి, అంతరిక్షం లోకి వదిలింది! ఈ మధ్య కొత్తగా 4 దేశాలతో, 6 వ్యాపార ఒప్పందాలు చేసుకుంది. ఈ 6 ఒప్పందాల వల్ల, భారతదేశానికి 132 మిలియన్ల యూరోల (1188 కోట్ల రూపాయలు) ఆదాయం వస్తుందని కేంద్రమంత్రి రాజ్యసభలో చెప్పాడు. 1999 నించీ, ఈ మధ్య దాకా చేసుకున్న పాత వ్యాపార ఒప్పందాల వల్ల ఎంత వచ్చిందో, అది వేరే లెక్క.
ఇవాల్టి రోజున, అంతరిక్షంలో దాదాపు 9 వేల ఉపగ్రహాలు, వేరు వేరు దేశాలకు చెందినవి, తిరుగుతున్నాయట! ఆ ఉపగ్రహాల ద్వారా శతృ కూటమికి చెందిన దేశాల సైనిక స్థావరాల్నీ, శిబిరాల్నీ, కనుక్కోవచ్చునట! విలువైన ఖనిజాలు దొరికే చోట్లని కూడా కనిపెట్టవచ్చును. భూమి మీద ఇప్పుడు కేబుళ్ళ ద్వారా అందే ఇంటర్నెట్ కంటే విపరీతమైన వేగంగా ఇంటర్నెట్ కనెక్షన్ అందుతుంది. ఇలా ఎన్నో ఇంజినీరింగు ప్రయోజనాలున్నాయట మరి! ఈ వ్యాపార ప్రయోజనాల కోసం, 2008లో ఒకసారీ, 2019లో ఇంకోసారీ, మళ్ళీ ఇప్పుడు 2023లో మూడోసారీ, ఇప్పటికి 15 ఏళ్ళలో, మొత్తం 3 సార్లు, చంద్రమండలానికి వెళ్ళడానికి దాదాపు 2 వేల కోట్లు ఖర్చు పెట్టింది భారత ప్రభుత్వం. ఆ పనులు చేసే సైంటిస్టులకి ఇన్నేళ్ళూ ఇచ్చిన లక్షల లక్షల రూపాయల జీతాలు కాకుండానే ఈ ఖర్చు!
మరి, ఒట్టి చేతులతో మలం ఎత్తడమే బ్రతుకు తెరువుగా వున్న పాకీ పని వారు, పాకీ పని చేస్తున్న సమయంలో ప్రాణాలు పోతే ‘నష్టపరిహారం’గానో, వేరే వృత్తులలోకి వెళ్ళడానికో (‘పునరావాసానికి’) ప్రభుత్వం కేటాయిస్తున్నది ఎంత? తెలుసా? 2006 నించీ 2023 వరకూ ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం, 17 ఏళ్ళలో 550 కోట్లు. ఇవన్నీ ఇస్తామని చెప్పే కేటాయింపులే గానీ, నిజంగా విడుదల చేసిన డబ్బులు మాత్రం అతి తక్కువ. ‘అంతరిక్ష భారత్’ వ్యాపారం ఆశలకు 2 వేలకోట్లూ! ‘అశుద్ధ భారత్’ని శుద్ధం చేయడానికి 5 వందల కోట్లూనా!
సెప్టిక్ ట్యాంకుల్నించీ మలాన్ని ఉత్త చేతుల్తో తీసేటప్పుడూ, మలంతో పూడుకుపోయిన మాన్ హోల్స్‌ని ఉత్త చేతుల్తో శుభ్రం చేసేటప్పుడూ, పాకీ పనివారు తరచుగా చనిపోవడం జరుగుతోంది. ప్రభుత్వపు లెక్కల ప్రకారమే, 2017 నించీ 2022 వరకూ, 5 ఏళ్ళలో 400 మంది పాకీ పనివారు చనిపోయినట్టు సామాజిక న్యాయశాఖా మంత్రి రాజ్యసభలో ప్రకటించాడు. అవి తప్పు లెక్కలనీ, ఇంకెంతో మంది చనిపోయారనీ, పాకీ పనివారి కోసం 30 ఏళ్ళగా పనిచేస్తున్న ‘సఫాయి కర్మచారీ ఆందోళన్’ అనే సంస్థ వారి వాదన. ఈ సంస్థ వారు ప్రభుత్వాన్ని పెద్ద పెద్ద కోరికలేమీ అడగడం లేదు. సెప్టిక్ ట్యాంకుల్నీ, మాన్‌హోల్స్‌నీ శుభ్రం చేయడానికి అవసరమైన యంత్రాలను సమకూర్చమనడం మాత్రమే వారు అడిగేది. విషాదం ఏమిటంటే, యంత్రాల్ని సమకూర్చినా, వాటితో మురికిని శుభ్రం చేసే పని చేసేది ఎప్పుడూ ఆ పాకీ కులాల వారిదే! ఎప్పుడో 2 వేల 4 వందల సంవత్సరాల కిందట రాసిన ఒక మత గ్రంధంలో, ‘ఈ మలం ఎత్తే పనులు అస్పృశ్యులే చెయ్యాలి’ అని రాసి వున్నదట! ఈ నాడు అస్పృశ్యుల్లో కూడా అట్టడుగు కులం వాళ్ళే ఆ పని చేస్తున్నారు! ఈ పనులు చేసే కుటుంబం వాళ్ళతో, దళిత కుటుంబాల్లో కూడా కొంచెం పై స్థాయి వాళ్ళు, వివాహ సంబంధాలు పెట్టుకోరు! అదొక విషాదం. నిచ్చెన మెట్ల కుల విధానం అంటే ఇదే!
ఇప్పుడు చందమామ వేపు చూడండి! మలమూత్రాల సంచుల్ని చూడండి!
రంగనాయకమ్మ
Updated Date - 2023-09-03T01:03:42+05:30 IST