రాజ్యాంగ స్వరూపాన్ని మార్చే చర్య!
ABN, First Publish Date - 2023-09-26T02:27:39+05:30
నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో కొత్తగా ముద్రించి పార్లమెంటు సభ్యులకు పంచిపెట్టిన భారత రాజ్యాంగం ప్రతులలో ఒక పెద్ద తప్పు జరిగిందని, ఆ తప్పు ఉద్దేశపూర్వకంగా..
నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో కొత్తగా ముద్రించి పార్లమెంటు సభ్యులకు పంచిపెట్టిన భారత రాజ్యాంగం ప్రతులలో ఒక పెద్ద తప్పు జరిగిందని, ఆ తప్పు ఉద్దేశపూర్వకంగా చేసినట్లుగా ఉందని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌధురీ ఇటీవల ప్రకటించారు. భారత రాజ్యాంగం ప్రతులలోని పీఠికలో భారతదేశాన్ని ఒక సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య రిపబ్లిక్ (Sovereign, Socialist, Secular, Democratic Republic) అని పేర్కొన్న వాక్యం నుంచి Socialist, Secular అన్న పదాలను తొలగించారని ఆయన ప్రకటించారు. భారత రాజ్యాంగానికి పీఠిక ఒక ఆత్మ లాంటిది. 1973లో కేశవానందభారతి కేసులోనూ, 1995లో తిరిగి ఎల్ఐసి కేసులోనూ భారత సుప్రీంకోర్టు రాజ్యాంగం యొక్క పీఠిక భారత సంవిధానంలోని ఒక విడదీయరాని అంతర్భాగమని విస్పష్టంగా తీర్పునిచ్చింది. ప్రజలు, ప్రభుత్వం రాజ్యాంగంలోని ప్రతి మాటకూ విలువ, పవిత్రత, గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు రాజ్యాంగం పట్ల అలక్ష్యంతో, లెక్కలేనితనంతో ఉద్దేశపూర్వకమే అనిపిస్తున్న ఇంత పెద్ద తప్పు చేసిన కేంద్ర ప్రభుత్వం దీనికి బాధ్యత వహిస్తుందా? ఇందుకు నైతిక బాధ్యత వహించి ప్రధాని మోదీ తన పదవికి తక్షణం రాజీనామా చేయాలి.
మారుతున్న భారత సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులకు, అవసరాలకు అనుగుణంగా భారత రాజ్యాంగంలో సవరణలు చేసే వీలుంది. అలా 1950 జనవరి 26న అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగానికి 1951 జూన్ 18న మొదటి సవరణ జరిగింది. ఇక అప్పటినుంచీ, ఇప్పటిదాకా రాజ్యాంగానికి 105 సవరణలు జరిగాయి. భారత రాజ్యాంగం శిలాశాసనం కాదు, అవసరమైతే సవరణలు ఎన్నైనా చేసుకోవచ్చు. రాజ్యసభ లేక లోక్‌సభలో సవరణ బిల్లు ప్రవేశపెడితే, అది ఉభయసభల ఆమోదం పొందాలి. ప్రతి సభలో హాజరైన సభ్యులలో మూడింట రెండు వంతుల సభ్యుల ఆమోదం పొందాలి. రాజ్యాంగ సవరణ చేసే విధానం భారత రాజ్యాంగంలోని 368వ అధికరణంలో వివరంగా ఉంది. దానికొక ప్రత్యేకమైన విధానం ఉంది. ఇప్పటి కేంద్ర ప్రభుత్వానికి, భాజపా భావజాలానికి ‘సోషలిస్ట్’, ‘సెక్యులర్’ అనే పదాలు రుచించకపోవచ్చు. అంతమాత్రాన రాజ్యాంగానికి ఆత్మవంటిదని భావించే, రాజ్యాంగంలోని అంతర్భాగమని సుప్రీంకోర్టు స్పష్టంగా నిర్ధారించిన రాజ్యాంగ పీఠిక జోలికి వెళ్ళటం పెద్ద సాహసమే. పీఠికలోని ‘సోషలిస్ట్’, ‘సెక్యులర్’ పదాలను ఎలాంటి రాజ్యాంగ సవరణ చేయకుండానే తొలగించటం తీవ్రమైన విషయం. ఇది నిస్సందేహంగా రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే దుస్సాహసిక చర్యే. ఇది పొరపాటు కానేకాదు. ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య. ఇది భారత ప్రజలను అవమానించటమే. దీనిపై సుప్రీంకోర్టు స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
ముత్తేవి రవీంద్రనాథ్
Updated Date - 2023-09-26T02:27:39+05:30 IST