జీడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి
ABN, First Publish Date - 2023-10-12T02:07:54+05:30
దేశంలోనే జీడిపప్పు పండించడంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ఎనిమిది జిల్లాల్లో 1.83 లక్షల ఎకరాల్లో జీడిపంట పండిస్తున్నారు. రాష్ట్రంలో పలాస జీడిపప్పు అత్యంత గుర్తింపు పొందింది...
దేశంలోనే జీడిపప్పు పండించడంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ఎనిమిది జిల్లాల్లో 1.83 లక్షల ఎకరాల్లో జీడిపంట పండిస్తున్నారు. రాష్ట్రంలో పలాస జీడిపప్పు అత్యంత గుర్తింపు పొందింది. వ్యాపారస్తులు, దళారులు, రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా దోపిడీ చేస్తున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న జీడిపప్పు ద్వారా స్వదేశీ జీడి రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం జీడి పంటకు గిట్టుబాటు ధర నిర్ణయించేందుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలి. అలాగే దిగుమతులపై సుంకాన్ని విధించాలి. 80 కేజీల బస్తాకు కనీస మద్దతు ధర రూ.16,000 ప్రకటించాలి. జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, జీడి పంటకు బ్యాంకు రుణాలు అందజేయాలి. ఆర్‌బీకేల ద్వారా జీడీ పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.
రైతులతో పాటు శ్రామికుల శ్రమను కూడా వ్యాపారస్తులు దోచుకుంటున్నారు. జీడిపప్పు కాల్చి కొట్టి ప్రాసెస్ చేసే పనిలో కార్మికులకు ఎక్కువ ఉపాధి దొరికేది. ఇప్పుడు అన్ని పనులు యంత్రాలే చేయడం వల్ల కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. వాతావరణ కాలుష్యం పేరుతో బాయిలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. పట్టణ ప్రజలు కాలుష్యం పెరుగుతోందని ఆందోళన చేపట్టడంతో పలాస కేంద్రంగా జరిగే ప్రాసెసింగ్‌ను గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని రైతుల దగ్గరే పంటను నిల్వ ఉంచి, తాత్కాలిక షెడ్లు అద్దెకు తీసుకొని చేస్తున్నారు. తద్వారా ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టడంతో పాటు అతి తక్కువ వేతనాలకు గ్రామాల్లో మహిళా కార్మికుల శ్రమ దోచుకుంటున్నారు. రైతాంగం, ఉపాధి కోల్పోతున్న కార్మికులు.. దళారీ వ్యాపారస్తులకు వ్యతిరేకంగా ఐక్యమై పోరాడాలి. వ్యాపారస్తులు పలాస బ్రాండ్ సొమ్ము చేసుకుంటూ ధరను నియంత్రిస్తున్నారు. ప్రభుత్వం ధృతరాష్ట్రుడిలా వ్యవహరిస్తోంది. ఆరోగ్యానికి హాని కలిగించే పొగాకుతో సహా అనేక పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు బోర్డులుండగా, అత్యంత డిమాండ్ కలిగిన పౌష్ఠికాహారం అందించే, విదేశీ మారకద్రవ్యాన్ని తెచ్చే జీడిపంటకు మాత్రం బోర్డు లేదు. దీనిని ఏర్పాటు చేయాలి. జీడిపంట కొనుగోలుకు మార్క్‌ఫెడ్ సిద్ధం కావాలి. పంటకు గిట్టుబాటు ధర లభించే వరకు నిల్వ చేసుకోవటానికి తగినన్ని గిడ్డంగులు నిర్మాణం చేయాలి.
మద్రాసు రాజధానిగా ఉన్నప్పుడే రైతాంగ సమస్యలపై ఇచ్చాపురం నుంచి తడ వరకు రైతాంగ సమస్యల సాధన కోసం పాదయాత్ర చేసి డిమాండ్స్ సాధించుకున్న ఘనత ఆంధ్ర రైతాంగానికి ఉంది. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు కూడా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమాన్ని ఉధృతం చేసి జీడిపంటకు గిట్టుబాటు ధర పొందాలి.
డి. హరినాథ్
అఖిలభారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి
Updated Date - 2023-10-12T02:07:54+05:30 IST