ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆనాడే అదానీ హవాలా!

ABN, First Publish Date - 2023-02-08T02:04:05+05:30

జాతిశ్రేయస్సు, దేశ ప్రయోజనాల పరిరక్షణకై ప్రపంచవ్యాప్తంగా సకల దేశాలలో భారతీయ దౌత్య కార్యాలయాలు ఉన్నాయి. వాటిలో భాగంగా, వివిధ రంగాలకు సంబంధించిన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జాతిశ్రేయస్సు, దేశ ప్రయోజనాల పరిరక్షణకై ప్రపంచవ్యాప్తంగా సకల దేశాలలో భారతీయ దౌత్య కార్యాలయాలు ఉన్నాయి. వాటిలో భాగంగా, వివిధ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే సంస్థలు కూడా పని చేస్తుంటాయి. వాటిలో ఒకటి రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం. ఎగుమతులు, దిగుమతులు, విదేశీ పెట్టుబడుల పేరిట ఎవరైనా నల్లధనాన్ని మళ్లిస్తున్నారా అనే విషయమై నిఘా ఉంచడం దాని బాధ్యత. పన్ను ఎగవేస్తూ భారత ఖజానాకు నష్టం కల్గిస్తున్నారా అనే విషయమై అది ఆరా తీస్తుంది.

దేశంలో ఏర్పడ్డ విద్యుత్ కొరతను అధిగమించేందుకు భారత ప్రభుత్వం అనేక వెసులుబాట్లు కల్పించింది, ప్రోత్సాహకాలు ప్రకటించింది. విద్యుత్ ఉత్పత్తి పరికరాలు, సరఫరా సామగ్రి దిగుమతులపై సుంకాల మినహాయింపు వాటిలో ఒకటి. విద్యుదుత్పత్తి పరికరాలపై ఎలాంటి దిగుమతి సుంకాన్ని వసూలు చేయరు. అయితే విద్యుత్ సరఫరా, పంపిణీకి సంబంధించిన సామగ్రి దిగుమతులపై విధిగా 0.5 శాతం సుంకం చెల్లించాలి. ఈ వెసులుబాటును మన రాజకీయ నాయకులు, వాణిజ్యవేత్తలు తమకు వీలయినంతగా దుర్వినియోగం చేసారు.

దుబాయిలోని ఒక భారతీయ వ్యాపారి సంస్థ కూడా ఈ ప్రయోజనాన్ని దుర్వినియోగం చేసింది. విద్యుదుత్పత్తి పరికరాలు, సరఫరా సామగ్రిని స్థానికంగా కొనుగోలు చేయకున్నా వాస్తవ ధరలకు అనేక రేట్లు మించి ఎక్కువ ధరకు కొనుగోలు చేసి దిగుమతి చేసినట్లుగా బిల్లులు సమర్పిస్తూ వచ్చింది. తద్వారా భారతదేశం నుంచి పెద్ద మొత్తంలో నగదును దిగుమతుల పేర మళ్ళిస్తూ మనీ లాండరింగ్‌కు పాల్పడింది. ఈ వాస్తవాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని భారత రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం దశాబ్దం క్రితమే గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి ఆ అక్రమ వ్యవహారాల భోగట్టాను నివేదించింది. యుఏఇ యేతర దేశాలలో ఉత్పత్తి కాబడి, అక్కడ నుంచి నేరుగా భారతదేశానికి ఎగుమతి అయిన సామగ్రికి సైతం దుబాయి నుంచి బిల్లులు జారీ కావడంలో ఔచిత్యాన్ని కూడ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం ప్రశ్నించింది.

ప్రభుత్వం కల్పించిన వెసులుబాటును ఇలా దుర్వినియోగం చేసింది ఎవరో ఊహించగలరా? గౌతం అదానీ! దుబాయిలోని జబల్ అలీ సరళీకృత ఆర్ధిక మండలం (సెజ్)లో అదానీ కుటుంబానికి చెందిన ఒక సంస్థ ఈ రకంగా భారతదేశానికి దిగుమతి అయ్యే వివిధ సామగ్రిని ఆలంబనగా చేసుకొని మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నదని రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం నివేదించింది. విశాఖపట్నంలో అదానీ సోదరులకు ఉన్న మరికొన్ని సంస్థలు కూడా హవాలా మార్గంలో నల్లధనాన్ని దేశం ఎల్లలు దాటిస్తున్నాయని ప్రభుత్వ దర్యాప్తు సంస్ధలూ ఎత్తిచూపాయి. అదానీ సంస్థలు ఈ విధంగా ఓవర్ ఇన్వాయిసింగ్ పేర రూ.2322 కోట్లను విదేశాలకు మళ్ళించి మనీ లాండరింగ్‌కు పాల్పడ్డాయి. ఒక దశాబ్దం క్రితమే రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఈ అక్రమాలను పసిగట్టి న్యూ ఢిల్లీకి సమాచారమందించారు. పాలకవర్గాలు పెద్దగా పట్టించుకోలేదు!

2014 సార్వత్రక ఎన్నికలలో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీ ఎంపికయ్యారు. గౌతం అదానీ ఇక నేరుగా మోదీకి అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం ప్రారంభించారు. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు, గౌతం అదానీ సోదరుడు విశాల్‌ను, మరో ఇద్దరు కీలక ఉద్యోగులను ప్రశ్నించి చర్యలు చేపట్టేందుకు పూనుకున్నది. ఇంతలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా న్యూ ఢిల్లీకి రానే వచ్చారు. ఇది దుబాయిలో అదానీకి ఉన్న అనేక సంస్థలలో కేవలం ఒక సంస్థకు సంబంధించిన కేసు మాత్రమే. అవి కూడా అక్రమంగా నిధుల మళ్ళింపునకు పాల్పడి ఉండవచ్చు. వాటిని సైతం వెలికి తీసి విచారించడం లేదా వేధించడం అనేది పాలకుల వైఖరికి అనుగుణంగా ఆధారపడి ఉంటుంది.

కేరళ పాత్రికేయుడు ఒకరు మనీ లాండరింగ్‌కు పాల్పడ్డాడు. అతడు అక్రమంగా మళ్లించిన మొత్తం కేవలం రూ.5000 మాత్రమే. ఆ మనీ లాండరింగ్ కేసులో అతడు రెండు సంవత్సరాలు జైలులో గడిపాడు. అతి కష్టం మీద ఎలాగో హై కోర్టు ప్రసాదించిన బెయిల్‌పై విడుదలయ్యాడు. మరి ఎగుమతులు, దిగుమతుల పేరిట వేల కోట్ల రూపాయల మనీ లాండరింగ్ చేసే బడాబాబుల విషయానికి వచ్చే సరికి విచారణ సంస్థలు నిస్సహాయంగా ఉండిపోతున్నాయి! ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 2013–14లో 221 కేసులు నమోదు చేసింది. ఆ తరువాత ప్రారంభమైన మోదీ పాలనలో 2022 మార్చి వరకు 5422 కేసులు నమోదు చేసింది. ఈ కేసుల నెదుర్కొంటున్న వారిలో అత్యధికులు ప్రతిపక్షాలకు సంబంధించిన వారేనని ప్రత్యేకంగా చెప్పవల్సిన అవసరం లేదు.

సువిశాల అదానీ వ్యాపార సామ్రాజ్యంలో ఈ మనీ ల్యాండరింగ్ ఒక సాధారణ, చిన్న ఉదంతం మాత్రమే. పాలకుల ప్రోత్సాహంతో అనతికాలంలో శరవేగంగా విస్తరించే ఏ వ్యాపారవేత్తకయినా పెట్టుబడుల ప్రవాహానికి పరోక్షంగా హవాలా అనేది అవసరంగా మారిపోయింది. కాంగ్రెస్ ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు మోదీ హయాంలో ఊపందుకున్నాయి. అదానీ అనూహ్యంగా ప్రపంచ కుబేరుల జాబితాలో చేరారు. ఈ నేపథ్యంలో అదానీ విదేశీ నిధుల విషయమై ఆసక్తి కలుగుతుంది. బ్రిటిష్ వర్జీన్ ఐలాండ్, మారిషస్ మొదలైన ‘ట్యాక్స్ హేవన్స్’ (తక్కువ పన్నులు ఉండే దేశాలు) నుంచి కష్టపడడం లేదా ప్రతిభ కారణాన శీఘ్ర పురోగతి సాధించినట్టుగా చెప్పుకొనే వ్యక్తులు లేదా సంస్థలకు నిధుల మళ్ళింపు ఎందుకు జరుగుతుందో ఒక్కసారి ఆలోచించాలి.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Updated Date - 2023-02-08T02:04:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising