ఇదంతా వ్యూహమా, భయమా?
ABN, First Publish Date - 2023-10-03T03:06:55+05:30
సంఘటనలే సత్యాలు కావు. సత్యాలు అగోచరంగా ఉంటాయి. కనుకనే ఆ హవా ఎటు వీస్తోంది? అన్న ప్రశ్నకు ఆస్కారమేర్పడింది. 2024 సార్వత్రక ఎన్నికలను పురస్కరించుకుని...
సంఘటనలే సత్యాలు కావు. సత్యాలు అగోచరంగా ఉంటాయి. కనుకనే ఆ హవా ఎటు వీస్తోంది? అన్న ప్రశ్నకు ఆస్కారమేర్పడింది. 2024 సార్వత్రక ఎన్నికలను పురస్కరించుకుని తలెత్తిన ప్రశ్న ఇది. తమ పట్ల ప్రజాభిప్రాయం జనవరి 2023లో ఉన్నంత అనుకూలంగా ఇప్పుడు లేదేమోనని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ భావిస్తున్నట్టు ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికలలో గెలుపు ఎవరిది అన్న విషయమై తొమ్మిది నెలల క్రితం ఒక ఏకీభావం ఉన్నది. ఇది కల్పించిన ఆత్మ విశ్వాసంతో మోదీ ప్రభుత్వ పాలన నల్లేరు మీద బండిలా సాగిపోతుండేది. అయితే గత కొద్దివారాలుగా ఆ పరిస్థితి కానరావడం లేదు. వివిధ నిర్ణయాలు అనాలోచితమైనవిగా అనిపిస్తున్నాయి. హడావిడి చర్యలు చేపట్టడం కనిపిస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లును శీఘ్రగతిన ఒక హిందీ పేరుతో రూపొందించి, ఆమోదం పొందడంలో మోదీ సర్కార్ పాలన తొట్రుపాటు పరాకాష్ఠకు చేరింది. మోదీ ప్రభుత్వం పట్ల దేశ ప్రజల మనస్థితిలో ఏమైనా మార్పు చోటు చేసుకుందా?
ఆగస్టు 31న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల గురించి హఠాత్తుగా ప్రకటించారు. వర్షాకాల సమావేశాలు ముగిసి ఇరవై రోజులు కాకముందే ప్రత్యేక సమావేశాలు ఎందుకు? అనేక ఊహాగానాలు జరిగాయి. నాటకీయత సంపూర్ణంగా ప్రతిబింబించిన ‘ప్రత్యేక సమావేశాల’ ప్రకటన తక్షణ లక్ష్యం కూడా అదే కదా! ప్రస్తుత (17వ) లోక్‌సభ గడువు ముగియక ముందే 18వ లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించాలని మోదీ సంకల్పించారా అన్నది అందరి మనసులను తొలిచివేసిన ప్రశ్న. ప్రత్యేక సమావేశాల ఎజెండా ఏమిటో ప్రభుత్వం ప్రకటించలేదు. సమావేశాల ప్రారంభ, ముగింపు తేదీలు మినహా మరెలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు. అయితే, కేంద్రమంత్రులతో సహా బీజేపీ అగ్రనాయకులలో చాలామందికి ప్రత్యేక సమావేశాల ఎజెండా ఏమిటో నిజంగా తెలియదని వెల్లడవడంతో చర్చించాల్సిన అంశాలపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదనే వాస్తవం స్పష్టమయింది. బహుశా, ప్రత్యేక సమావేశాలకు నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ, వాటి ప్రారంభ దినానికి మధ్య అనేక రోజులపాటు చర్చకు చేపట్టాల్సిన అంశాల విషయమై అనేక తర్జన భర్జనలు జరిగివుంటాయి. ఈ వ్యవహారం ఒక వాస్తవాన్ని స్పష్టంగా సూచించింది. రాబోయే సార్వత్రక ఎన్నికలలో విజయం సాధించాలంటే మోదీ ప్రజాకర్షణ శక్తి, సంక్షేమ కార్యక్రమాలపై నింగీ నేలను ఏకం చేసే ప్రచార ఘోష మాత్రమే సరిపోవన్న అంచనాకు బీజేపీ నాయకత్వం మరింత గట్టిగా వచ్చిందన్నదే ఆ వాస్తవం. మోదీ ప్రజాదరణతో పాటు హిందూత్వపై ఆధారపడినా అంతిమ ఫలితం తమకు అనుకూలంగా ఉండకపోవచ్చనే అభిప్రాయానికి బీజేపీ నాయకత్వం వచ్చినట్టుంది.
ఎట్టకేలకు రెండు విస్మృత అంశాలతో ముందుకు సాగేందుకు బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. వాటిలో మొదటిది మహిళా రిజర్వేషన్ బిల్లు. గత తొమ్మిదేళ్లుగా ఈ అంశాన్ని 2014, 2019 సార్వత్రక ఎన్నికల ప్రణాళికలకే పరిమితం చేసిన బీజేపీ మహిళా బిల్లుకు పార్లమెంటు ఆమోదం పొందిన తరువాత దానిని తన ఘనవిజయంగా చాటుకొంటోంది. అయితే ఇదొక నిరర్ధక విజయమనే చెప్పాలి. ఎందుకంటే మహిళలకు ఆ రిజర్వేషన్ల ఫలాలు అందడం సుదూర కాలంలో మాత్రమే సాధ్యం. పైగా ప్రతిపక్షాలు, ముఖ్యంగా ‘ఇండియా’ భాగస్వామ్యపక్షాలు బిల్లుకు సంపూర్ణ మద్దతునిచ్చాయి.
ఇక రెండో అంశం లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం. ఈ ఏకకాల ఎన్నికల గురించి బీజేపీ చాలాకాలంగా మాట్లాడుతున్నది. ప్రత్యేక సమావేశాల నోటిఫికేషన్ జారీ చేసిన మరుసటి రోజునే ఏకకాల ఎన్నికల నిర్వహణకు దోహదం చేసే విధి విధానాలను సూచించేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు మోదీ సర్కార్ ప్రకటించింది. ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ మన లక్ష్యం కావాలని బీజేపీ పిలుపునిచ్చింది. జూన్ 2019లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ విషయం గురించి చివరిసారి వినిపించింది. ఆ తరువాత ప్రత్యేక సమావేశాలను ప్రకటించిన మరుసటి రోజు మాత్రమే ప్రస్తావనకు వచ్చింది. ఆ తరువాత ఒకటిన్నర రోజుల పాటు ప్రతిపాదిత కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వం వహిస్తారన్నది మినహా కమిటీలోని ఇతర సభ్యులు, పరిశీలనాంశాల గురించి ఎటువంటి సమాచారం లేదు.
ప్రత్యేక సమావేశాల ఎజెండాపై చర్చలు ఒక సంభావ్యత నుంచి మరో సంభావ్యతకు ఊగులాడాయి. చివరకు ప్రభుత్వం ఒక ‘తాత్కాలిక’ ఎజెండాను వెల్లడించింది. దీనిపై కూడా అనేక ఊహాగానాలు సాగాయి. ఈ ఎజెండాలోని అంశాల జాబితాలో ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమినర్‌ల నియామక ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి ఉద్దేశించిన బిల్లు కూడా ఉన్నది. ఎన్నికల కమిషన్‌ను బలహీనపరిచేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును ప్రత్యేక సమావేశాలలో ప్రవేశపెట్టనే లేదు. చివరకు గడువుకు ఒక రోజు ముందే పార్లమెంటు ఉభయ సభలను నిరవధిక వాయిదా వేశారు. ప్రత్యేక సమావేశాల నిర్వహణ విషయమై ప్రభుత్వానికి ఒక పటిష్ఠ ఆలోచన లేదన్న విషయాన్ని ఈ నిర్ణయాలు స్పష్టం చేశాయి. రాజకీయ పరిణామాలతో కలవరపడుతున్న ప్రభుత్వ పెద్దల ఒక గందరగోళ చర్యే ప్రత్యేక సమావేశాలు అని రుజువయింది. ‘ఇండియా’ అనే సంక్షిప్త నామంతో మరింతగా సంఘటితమైన ప్రతిపక్షాల కూటమి ముంబైలో మూడో సమావేశానికి సంసిద్ధమవుతున్న సందర్భంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నోటిఫికేషన్ జారీ అయింది. అంతిమంగా బహుళ లక్ష్యాలు నెరవేరాయి– ‘ఇండియా’ ముంబై సమావేశానికి మీడియా కవరేజి సరైన విధంగా లభించలేదు; మోదీ ఉద్దేశపూర్వకంగా చేపట్టిన ఈ చర్యలు, నిర్ణయాల గురించి మాత్రమే పత్రికలు రాయడం, టీవీలలో చర్చించడం జరిగింది. ఇక ప్రజల పిచ్చాపాటీలో దొర్లే అంశాలేవో మరి చెప్పాలా? ప్రతిపక్షాల బెంగళూరు సమావేశం తరువాత, వాటి సమష్టి కార్యక్రమానికి పోటీగా టీమ్ మోదీ మరో ‘సంఘటన’ను సృష్టించడం ఇది రెండవసారి. ‘ముంబై’ నుంచి దృష్టిని మళ్లించడానికే ఎన్డీఏను పునరుద్ధరించారు. 2019 అనంతరం అది సమావేశమవడం ఇదే మొదటిసారి. ఇదే తరహా సందర్భం మరొకటి కూడా ఉన్నది. ‘ఇండియా’ సమన్వయ సంఘం తొలిసారి సమావేశమవనున్న తరుణమది. అదే సమయాన, జీ20 శిఖరాగ్రాన్ని జయప్రదంగా నిర్వహించిన నేపథ్యంలో సహచరుల నుంచి సత్కారాలను అందుకోవడానికి బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని మోదీ సందర్శించారు. ఆ ప్రశంసల హోరులో ‘ఇండియా’ సమన్వయ కమిటీ సమాలోచనలు మీకేమైనా వినిపించాయా?
జీ20 శిఖరాగ్రానికి కొద్ది రోజుల ముందు శతాధిక కోట్ల భారతీయులు ఒక శుభోదయాన ‘భారత్’లో మేల్కొన్నారు! మన దేశం పేరును ఇక ఇండియా అని కాకుండా భారత్‌గా పిలవాలని మోదీ సర్కార్ నిర్ణయించింది. ఈ అధికారిక నిర్ణయం జీ20 ప్రభుత్వాధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పంపిన విందు ఆహ్వానంలో ప్రతిబింబించింది. ఆ తరువాత 20వ ఆసియాన్ –ఇండియా శిఖరాగ్రానికి నరేంద్ర మోదీ భారత్ ప్రధానమంత్రిగా హాజరయ్యారు. జీ 20 న్యూఢిల్లీ శిఖరాగ్ర సమావేశాలలో నరేంద్ర మోదీ ముందున్న నేమ్ ప్లేట్‌లో భారత్ ప్రధానమంత్రి అని ఉండడాన్ని చాలా మంది గమనించారు. గమనార్హమైన విషయమేమిటంటే 2014–15లో ఇండియాకు ‘భారత్’గా పునర్నామకరణం చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఒక వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఆ అభ్యర్థనను మోదీ ప్రభుత్వం తిరస్కరించింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్లినప్పుడు కూడా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోలేదు. కానీ, ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ అనే సంక్షిప్త నామంతో ప్రజల ముందుకు వెళ్లడం మోదీని బాగా కలవరపరిచింది. ప్రత్యర్థిని వాక్బాణాలతో చీల్చి చెండాడాలి కదా. మరి ఆ కూటమిని ‘ఇండియా’ అని ప్రస్తావించడమెలా? మోదీ మేధ పదునెక్కింది. ఫలితంగా రాజకీయపరిభాషకు రెండు కొత్త పదాలు చేరాయి. అవి: ‘ఇండి అలయెన్స్‘; ‘ఘమండియా’. ‘పేరులో ఏముంది’ అని ప్రశ్నించడంలో షేక్‌స్పియర్ కచ్చితంగా పొరపడ్డాడు. ‘మన పేర్లలోనే మన ఆత్మలు ఉన్నాయి’ అని జార్జి మెరిడిత్ చక్కగా చెప్పాడు. ‘ఇండియా’ ఆత్మ మోదీని భయపెట్టింది, సందేహం లేదు.
కలవరపెడుతున్న కొత్త పరిస్థితులను ఎదుర్కొనేందుకు మోదీ నిరాలోచనగా దుస్సాహసాలకు పాల్పడుతున్నారు. ఆయన వ్యాకులతలు భ్రాంతిజనకమైనవని, తాత్కాలికమైనవని అంతిమంగా రుజువవుతాయేమో?! ఆ సవాళ్లనన్నిటినీ సమర్థంగా అధిగమించి సార్వత్రక ఎన్నికల సమరంలో ఆయన మరోసారి జయకేతనం ఎగురవేయనూవచ్చు. అయితే మోదీ వరుసగా ఒకదాని తరువాత మరొకటి అమలుపరుస్తున్న ఈ ఎత్తుగడల వెనుక ఉన్న మూల కారణమేమిటి? దీన్ని కనుగొనడం చాలా ముఖ్యం. మోదీని ఓడించేందుకై ‘ఇండియా’కు అదొక అవకాశాన్ని కల్పిస్తుందా అన్నది కూడా చూడాలి. అంతేకాదు మరికొన్ని ప్రశ్నలు కూడా అడిగి తీరాలి. నిర్ణయించిన గడువు కంటే ఒక రోజు ముందుగానే నిరవధికంగా వాయిదా పడిన పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ‘ప్రత్యేకత’ ఏమిటి? ఇంతకూ వచ్చే డిసెంబర్‌లో పార్లమెంటు శీతాకాల సమావేశాలు అసలు జరుగుతాయా?
నీలాంజన్ ముఖోపాధ్యాయ
పాత్రికేయుడు, రాజకీయ చరిత్రకారుడు
(ది వైర్)
Updated Date - 2023-10-03T03:06:55+05:30 IST