ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మద్యంపై మహిళా పోరుగా బహుజన బతుకమ్మ

ABN, First Publish Date - 2023-10-15T03:11:04+05:30

‘‘మత్తు సంపదను కోల్పోవడానికి దారితీస్తుంది. అనవసరమైన, ఘర్షణలు, అనారోగ్యం, అపకీర్తిని కూడగట్టి జ్ఞానాన్ని బలహీనపరుస్తుందన్న’’ వేల ఏళ్ళ నాటి గౌతమ బుద్ధుడి బోధనలు...

‘‘మత్తు సంపదను కోల్పోవడానికి దారితీస్తుంది. అనవసరమైన, ఘర్షణలు, అనారోగ్యం, అపకీర్తిని కూడగట్టి జ్ఞానాన్ని బలహీనపరుస్తుందన్న’’ వేల ఏళ్ళ నాటి గౌతమ బుద్ధుడి బోధనలు వర్తమాన సమాజానికి సజీవ హెచ్చరికగానే ఉన్నాయి. మద్యం ఒక సాధారణ దురలవాటుగా ఉన్నప్పుడు బుద్ధుడు చేసిన హెచ్చరికపై, అదొక దోపిడీ వ్యాపారంగా పెరిగి, ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయవనరుగా తయారై ఎన్నికల్లో ఒక రాజకీయ సాధనంగా మారుతున్న పరిస్థితుల్లో తెలంగాణ సమాజం సీరియస్‌గా ఆలోచించాల్సిన అవసరమయితే ఉంది. అందుకే 13 సంవత్సరాల క్రితం బహుజన బతుకమ్మ కేవలం ఉత్సవం మాత్రమే కాదు ఒక ఉద్యమం అంటూ మొదలైన మేము ఈ యేడాది మద్యం రద్దును, మగువల రక్షణను ప్రధాన అంశంగా చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా బహుజన బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మద్యం రహిత గ్రామాల నుంచి మొదలై మద్యం రహిత సమాజం వరకు సాగే సుదీర్ఘ ప్రయాణంలో స్త్రీల కవాతై–పూల కవాతై బహుజన బతుకమ్మ సాగుతుందని ప్రతినబూనుతున్నాం. గడిచిన 13 సంవత్సరాల్లో సుమారు 130 కేంద్రాల్లో బహుజన బతుకమ్మ నిర్వహించిన గ్రామాలతో పాటు, అన్ని గ్రామ పంచాయతీల పెద్దలు, హక్కుల సంఘాలు, అభ్యుదయవాదులు, అంబేడ్కర్‌ వాదులు, భావసారూప్యత కలిగిన సంఘాలు, శక్తులు, వ్యక్తులు అందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని సవినయంగా మనవి చేస్తున్నాం.

రోజురోజుకు ఇంకా మనువాదం సమాజాన్ని గాఢంగా కమ్ముకుంటూ లింగ వివక్ష రాజ్యమేలుతున్న సమయంలో, పితృస్వామ్యపు సవాళ్లను ఎదుర్కొంటూ అచ్చంగా మహిళలే ప్రకృతి పూలను ఆరాధించే బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రత్యేకమనే చెప్పవచ్చును. పండగలు–పబ్బాలు, చావు–పుట్టుకల సందర్భాలన్నీ మద్యంతో నిండిపోతున్న సమయంలో బతుకమ్మ అందుకు అతీతంగా మహిళల సామూహిక ఆట–పాటగా ఉంటుంది. ఈ సమయంలో తమ హక్కుల్ని మద్యం ద్వారా జరుగుతున్న ఆర్థిక దోపిడీ, సామాజిక సమస్యలు, కుటుంబహింస, శాంతిభద్రతలు అనారోగ్యం లాంటి అనేక అంశాలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇంకా కావాల్సిన అవసరం ఉంది.

సస్య విప్లవంతో ఆహార కొరత తీరడమొకటే కాదు, చెరుకు ఉత్పత్తులు పెరిగి విపరీతమైన మొలాసిస్‌ అందుబాటులోకి వచ్చింది. దీంతో మద్యం ఉత్పత్తులను, దాని దోపిడీని విపరీతంగా పెంచడానికి అవకాశాలు అంది వచ్చాయి. 1970లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సారా రెంటల్‌ ద్వారా రూ.38 కోట్ల 80 లక్షల ఆదాయం మొస్తే, 1990–91 కల్లా ప్రభుత్వ ఆదాయం రూ॥.830 కోట్లకు చేరుకుంది. ఇక సారా కాంట్రాక్టర్ల ఆదాయం రూ॥.2000 కోట్లకు చేరింది. 1992లో 12 కోట్ల లీటర్ల సారాయి అమ్ముడైంది. ఇక మత్తుతో కోల్పోయిన శ్రమ గంటలు, నష్టపోయిన ఆరోగ్యం, కుటుంబ కలహాలు, శాంతిభద్రతల సమస్యలు రెట్టింపు కావడంతో దీని పాత్ర మనం నిత్యం గమనిస్తున్నాం. 1970 దశకంలోనే నేడు నెత్తురోడుతున్న మణిపూర్‌ రాష్ట్ర మహిళలు చేసిన మద్య వ్యతిరేక పోరాటం వినూత్నమైనది. దూబగుంట రోశమ్మ ప్రారంభించిన సారా వ్యతిరేక ఉద్యమం వరకట్నం, గృహహింస, స్త్రీలపై అత్యాచారాలు లాంటి అనేక అంశాలను లేవనెత్తాయి. ఇక పిఓడబ్ల్యూ (స్త్రీ విముక్తి) రాయలసీమలో సారా అంగళ్లు – చీట్ల పేకలకు వ్యతిరేకంగా ప్రారంభించిన పోరాటం సాయుధ ముఠాలకు రాజకీయ కాంట్రాక్టర్లకు పాలెగాళ్ల వ్యవస్థకు వ్యతిరేకంగా వర్గ పోరాటంగా పరిణమించింది. అందుకే మద్యం అనేది వ్యవస్థ దోపిడీతో పెనవేసుకుంది కాబట్టే కరోనా కాలపు లెక్కల్లో ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణలు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను ఆక్రమించాయి.

సరిగ్గా ఈసారి తెలంగాణలో బతకమ్మ, మద్యం నూతన పాలసీ, ఎన్నికలు మూడు ఒక్కసారిగా కలిసి వచ్చాయి. నూతన దుకాణాల వేలానికి నవంబర్‌ వరకు అవకాశం ఉన్నా ఆగస్టు 21–22 తేదీల్లో మద్యం వేలం ఫీజుల ద్వారానే ప్రభుత్వం రూ॥.2500 కోట్లు సంపాదించింది. 2025 డిసెంబర్‌ వరకు కొనసాగే ఈ రెండేళ్ల ఫీజులో లాభాల మార్జిన్‌ ప్రీమియంకు 27–20 శాతంగా నిర్ణయించడంతో రూపాయలు 50 లక్షల నుంచి కోటి పది లక్షల వరకు లైసెన్స్‌ ఫీజులు ఉన్నా 1,31,400 మంది వేలం పాటలో పాల్గొన్నారు. 2,620 రిటైల్‌ షాపులకు గాను ప్రభుత్వం 786 దుకాణాలను బీసీలకు, మరికొన్ని ఎస్సీ, ఎస్టీలకు కూడా రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించింది. ప్రజల కష్టార్జితాన్ని మద్యం రూపంలో కొల్లగొట్టి సంక్షేమ పథకాలు నడపాలనుకోవడం ఎంత మాత్రం సరైనది కాదు. అవసరాలు పూర్తి చేసుకోలేని సగటు మానవుల అభివృద్ధికి, వారి పిల్లల విద్యాబుద్ధులకు కేటాయింపులు తగ్గిపోతుండడం కూడా ఆందోళన కలిగించే పరిణామం. నీటి వసతులు పెరిగి మిగులుతున్న అదనపు విలువను కాజేయడానికి బెల్టు షాపులు, గంజాయి రెండూ గ్రామాల్లో పోటీ పడుతున్నాయి. కరీంనగర్‌ జిల్లా జైలులో అత్యధిక కేసులు గంజాయి, పోక్సో కేసులు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది.

అందుకే బతుకమ్మతో ప్రారంభించి ఏడాది పొడుగునా మహిళలు తమ స్వీయ హక్కుల రక్షణ కోసం పోరాడుతూనే మద్యానికి వ్యతిరేకంగా బహుజన బతుకమ్మ ప్రచార ఉద్యమం ప్రారంభిస్తున్నారు. దీనిలో పార్టీలు, సంఘాలు జెండాల కతీతంగా భాగం కావాలని తెలంగాణ సమాజాన్ని కోరుతున్నాం.

విమలక్క, అధ్యక్షురాలు

ప్రొఫెసర్‌ కస్తూరి లక్ష్మి, ప్రధాన కార్యదర్శి

బహుజన బతుకమ్మ

Updated Date - 2023-10-15T03:11:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising