ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెలూన్‌ దెబ్బ!

ABN, First Publish Date - 2023-02-08T01:56:39+05:30

నిఘాఉపగ్రహాలు అంతరిక్షంనుంచి మరోదేశం మీద కన్నేసి ఉంచుతున్నకాలంలో, కంటికి ఎదురుగా కనిపించే ఈ నిఘా బెలూన్లు ఎందుకన్న ప్రశ్న...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిఘాఉపగ్రహాలు అంతరిక్షంనుంచి మరోదేశం మీద కన్నేసి ఉంచుతున్నకాలంలో, కంటికి ఎదురుగా కనిపించే ఈ నిఘా బెలూన్లు ఎందుకన్న ప్రశ్న అటుంచితే, ఇటీవల చైనాకు చెందిన ఓ భారీ బెలూన్‌ను అమెరికా కూల్చివేయడంతో రెండుదేశాల మధ్యా అగ్గిరాజుకుంది. మూడు అమెరికా యుద్ధవిమానాలు తమ గగనతలంలోకి ప్రవేశించిన ఆ బెలూన్‌ను చుట్టుముడితే, ఒక మిలటరీ జెట్‌ నుంచి ప్రయోగించిన అధునాతన క్షిపణి దానిని తుత్తునియలు చేసింది. పెద్దశబ్దంతో పేలిన తరువాత పదకొండుకిలోమీటర్ల విస్తీర్ణంలో దాని శకలాలు సముద్రంలో పడ్డాయి. భారీ క్రేన్లతో యుద్ధనౌకలతో నడుస్తున్న ఈ గాలింపు ప్రక్రియ వాతావరణం అనుకూలించకపోవడంతో జోరుగా సాగడం లేదనీ, త్వరలోనే శకలాలను పూర్తిగా వెలికితీసి, విశ్లేషిస్తామని అమెరికా అంటోంది. రెండువందల అడుగుల పొడవు, వేలాది పౌండ్ల బరువున్న ఈ బెలూన్‌ కచ్చితంగా చైనా నిఘా బుడగేనని అమెరికా ఆరోపిస్తుంటే, వాతావరణ అధ్యయనంలో భాగంగా ప్రపంచసంచారం చేస్తున్న దీనిని పేల్చివేసి అమెరికా పెద్దతప్పుచేసిందనీ, ఇంతకింతా అనుభవిస్తుందని చైనా శపించింది. బెలూన్‌ శకలాలను చైనాకు అప్పగించేది లేదని అమెరికా తేల్చేయడంతో దీని బొజ్జలో దాగిన అసలు నిజం ఎప్పటికీ వెలుగుచూడకపోవచ్చు.

నాలుగేళ్ళ తరువాత, అమెరికా చైనా మధ్య కాస్తంత సయోధ్యకు ఓ మార్గం తెరుచుకున్న తరుణంలో బెలూన్‌ దానిని నాశనం చేసింది. అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ చైనా పర్యటనకు సిద్ధపడుతున్న తరుణంలో బెలూన్‌ దర్శనమివ్వడంతో ఆయన ఆ పర్యటన రద్దుచేసుకున్నారు. ఈ బెలూన్‌ అమెరికా గగనతలంలోకి ప్రవేశించిన తరువాత కూడా బైడెన్‌ ప్రభుత్వం కొద్దిరోజులు దాని పేల్చివేత విషయంలో ఊగిసలాడింది. కానీ, దాని ప్రయాణం కీలకమైన రక్షణకేంద్రాలు, క్షిపణిస్థావరాల మీదుగా సాగుతూండటంతో సముద్రం ఉపరితలంమీదకు వచ్చేవరకూ నిరీక్షించి పేల్చివేయక తప్పలేదు. తమ రక్షణస్థావరాలమీద సంచరిస్తున్నప్పుడు కీలకమైన విషయాలు దీని కంటపడకుండా చాలా జాగ్రత్తతీసుకున్నట్టు పెంటగాన్‌ చెప్పుకుంది. ఈ బెలూన్‌ కెనడా–అమెరికా మధ్య గగనతలంలోకి తిరుగాడుతున్నప్పుడే తాము పలుమార్లు అమెరికాకు విషయాన్ని తెలియచేశామనీ, ఇప్పుడు ఓ తప్పుడు ఆరోపణతో ఎంతో ఆర్భాటంగా దానిని పేల్చివేసి, వీడియో ప్రచారాలు చేసుకుంటోందని చైనా ఆరోపణ. మీకే కనుక ఇలాగే జరిగితే మీరు మాత్రం ఇలా చేసేవారు కాదా అన్నది అమెరికా ప్రశ్న. మొత్తానికి, గత ఏడాది నవంబరులో జీ20 సదస్సులో అమెరికా చైనా అధ్యక్షులు భేటీ అయి, రెండుదేశాల మధ్యా దిగజారిపోతున్న సంబంధాలను ఎంతోకొంత మెరుగుపరుచుకోవాలని నిర్ణయించుకున్న తరువాత, అనేక నెలల చర్చోపచర్చల అనంతరం ఫిబ్రవరి ఆరునుంచి చైనాలో అమెరికా విదేశాంగమంత్రి పర్యటన ఆరంభం కావాల్సి ఉండగా, బెలూన్ లాగానే అది కూడా కూలిపోయింది.

నిఘా బెలూన్ల పేరిట రాద్ధాంతం కొత్తదేమీ కాదు. ఇప్పుడు కూడా మరో చైనా బెలూన్‌ దక్షిణ అమెరికా దేశాల మీదుగా ప్రయాణిస్తుంటే చైనాతో సత్సంబంధాలున్న ఆ దేశాలు తేలికగానే తీసుకున్నాయి. వాతావరణ ప్రభావం వల్ల అది కూడా దిశమారిపోయిందని చైనా ప్రకటించింది. ట్రంప్‌ హయాంలోనూ అమెరికా గగనతలంమీద నిఘా బెలూన్లు చక్కెర్లు కొట్టిన సందర్భాలున్నాయి. గత ఏడాది అండమాన్‌ మీద కూడా ఇటువంటిది కనిపించింది. అటువంటి సందర్భాల్లో భారత్‌ సహా చాలా దేశాలు చూసీచూడనట్టు ఊరుకున్నాయి తప్ప, పేల్చివేతవంటి దూకుడు ప్రదర్శించలేదు. కానీ, ట్రంప్‌తో పోల్చితే ఎంతో సౌమ్యంగా వ్యవహరించే బైడెన్‌, అంతర్గత రాజకీయ ఒత్తిడి కారణంగా పేల్చివేతకు సిద్ధపడక తప్పలేదు. మిగతాదేశాలు కూడా ఇకపై ఇదేదారిలో నడిస్తే దేశాల మధ్య వైరాలు పెరుగుతాయి. చైనా వాదిస్తున్నట్టుగా ఈ బెలూన్‌కు నిఘానేత్రాలు లేకపోవచ్చుకానీ, ఇటువంటి చేష్టల్లో దానిది అందెవేసిన చెయ్యి. ఎంతో ఎత్తునుంచి అత్యాధునిక నిఘా ఉపగ్రహాలు పంపే దృశ్యాలకంటే అతితక్కువ ఎత్తులో ఉండే ఈ స్పై బెలూన్లు అందించే సమాచారం మరింత మెరుగ్గా ఉంటుందని అంటారు. అమెరికా కూడా ఇటువంటి బెలూన్లను ప్రయోగిస్తున్నది, నాసా తయారుచేస్తున్నది. కానీ, ఇటువంటి దుశ్చర్యలు దేశాల మధ్య పూడ్చలేని అగాథాన్ని సృష్టిస్తాయి. సయోధ్య యత్నాలను ఒక బెలూన్‌ ఇంత సులభంగా కూల్చగలిగిందంటే ఈ రెండు అగ్రరాజ్యాల మధ్య అవిశ్వాసం ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.

Updated Date - 2023-02-08T01:56:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising