ఆప్తబంధువు, ప్రాణమిత్రుడు గురువు
ABN, First Publish Date - 2023-09-05T02:42:54+05:30
చీకట్లో దారీతెన్ను తెలియకుండా నడుస్తున్నవారి సమయం వృధా. అలాగే, అర్ధం, పరమార్థం తెలియని జీవితం వృధా. అందుకే మొక్కలు సాగుచేస్తే ఎదుగుతాయి, మనిషి విద్యావ్యాసంగం, అధ్యయనా...
"Plants are developed by cultivation and man by Education!” John Locke
చీకట్లో దారీతెన్ను తెలియకుండా నడుస్తున్నవారి సమయం వృధా. అలాగే, అర్ధం, పరమార్థం తెలియని జీవితం వృధా. అందుకే మొక్కలు సాగుచేస్తే ఎదుగుతాయి, మనిషి విద్యావ్యాసంగం, అధ్యయనా పరిజ్ఞానంతో వర్ధిల్లుతాడు. ఎటూ పాలుపోని మనస్సంకటంలో ఉన్న అర్జునునికి శ్రీకృష్ణుడు గీతను బోధించి, అతనిలో చైతన్యాన్ని ప్రసరింపజేసి యుద్ధోన్ముఖుణ్ణి చేసాడు. అది గురుసందేశమే. ఈ గురుపూజోత్సవ శుభదినాన, వెయ్యిమందికి పైన ఉచితముగా విద్యగరిపిన రఘుపతి వెంకటరత్నం లాంటి వారిని సంస్మరించుకుంటూ గురువులందరికీ శుభాకాంక్షలు.
Education is complete living అన్నారు హెర్బర్ట్ స్పెన్సర్. నేటి దేశకాల పరిస్థితుల్లో మానవతా విలువలు నశించిన సమాజంలో విద్యార్థులను తీర్చిదిద్దడం అంత సులభమేమీ కాదు. విద్యార్థిలో విజ్ఞానంతోబాటు, శీలవ్యక్తిత్వనిర్మాణం, సృజనాత్మక, క్రమశిక్షణ, మంచి ఆలోచనలు, సరైన అవగాహన, నిజాయితీగల జీవనశైలిని పెంపొందించే గురువులు కావాలి. అడాలసెంట్ దశలో తమలో వస్తున్న మార్పులతో కళాశాలలో విద్యార్థి గాభరాతో అడుగుపెట్టినప్పుడు అధ్యాపకులు మేధోపరంగానే కాదు, భావప్రేరితంగా వారిని తీర్చవలసివున్నది. అందుకే ఆదర్శ గురువుగా సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను ఆయన శిష్యులు గుర్రపు బగ్గీలో కూర్చుండబెట్టి, గుర్రాలకు బదులు తామే రైల్వే స్టేషనువరకూ తీసుకువెళ్లి అశ్రుతప్త నయనాలతో వీడ్కోలు గావించారు. ఆయన బోధనవారినెంతగా ఆకట్టుకున్నదో అర్ధమవుతున్నది. ‘నాగరికత’ అన్నది ఇటుకలు, రోలు, రోకళ్ళతోనో, యంత్రాలతోనో నిర్మించేది కాదు, అది ఉదాత్తమైన గుణశీలురైన మానవాళిచేత నిర్మితమవుతుంది అన్నారు సర్వేపల్లి. అంకితభావం, అకుంఠిత దీక్ష గురువుకు అవసరం. చందమామను చేరుకున్న చంద్రయాన్ సంకల్పబలం ఒకప్పటి గురువుల శిష్యబృందానిదే. ఉష్ణ కాణాచి భానుణ్ణి చూడబోయే ఇస్రోయోధులను తయారు చేసింది కూడా వారి గురువులే.
శిష్యులకు గురువు ఆప్తబంధువు, ప్రాణమిత్రుడు. మట్టి ముద్దలను ఎలాగైతే అవలీలగా మలచగలమో, అలాగే చిన్నారుల మనస్సులను మలచగల, పండించగలవాడు గురువు. ఆటపాటలతో హాస్యోక్తులతో పిల్లలను ఆకట్టుకుని వారి హృదయాల్లో చెరగని ముద్రవేసుకోగలగాలి. విద్యార్థుల మానసికస్థితిని గమనిస్తూ, వారిలో చురుకుతనం లోపించడానికి దారితీసిన కారణాలు తెలుసుకుని, ఓర్పు, సానుభూతి, దయతో వారిని తీర్చదిద్దడం బాధ్యతగల ఉపాధ్యాయులు చేయవలసిన పని.
పరిమి శ్యామల రాధాకృష్ణ
విశ్రాంత ఉపాధ్యాయిని, మదనపల్లె
Updated Date - 2023-09-05T02:42:54+05:30 IST