ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెద్ద విజయం

ABN, First Publish Date - 2023-02-14T02:00:36+05:30

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శుక్రవారం నిర్వహించిన ప్రయోగం విజయవంతం కావడంతో ‘స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌’ విషయంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శుక్రవారం నిర్వహించిన ప్రయోగం విజయవంతం కావడంతో ‘స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌’ విషయంలో అది రెండు దశాబ్దాలుగా కంటున్న కలలు సార్థకమైనాయి. గత ఏడాది ఆగస్టులో ఎస్‌ఎస్‌ఎల్‌వి–డి1 ప్రయోగం విఫలమైన తరువాత, రెండవ ప్రయత్నంలోనే ఇస్రో విజయవంతమైనందుకు మిగతా ప్రపంచం కూడా మెచ్చుకుంటున్నది. గడచిన మూడేళ్ళకాలంలో అనేకసార్లు ప్రయోగం వాయిదాపడి, ఆ తరువాత తన తొలిప్రయాణంలో వైఫల్యాన్ని మూటగట్టుకున్న ఈ చిన్నరాకెట్టు ఈ మారు తనకు అప్పగించిన బాధ్యతను నూరుశాతం పూర్తిచేసింది. రాబోయే దశాబ్దకాలంలో, చిన్న ఉపగ్రహాల మార్కెట్‌ ద్విగుళం బహుళం అవుతుందన్న అంచనాల నేపథ్యంలో, ఈ ప్రయోగంతో ఇస్రో ఆ మార్కెట్‌లోకి సగర్వంగా ప్రవేశించగలిగింది.

గత ఏడాది జరిగిన తొలి ప్రయోగంలో, ముప్పైనాలుగు మీటర్ల డి1రాకెట్‌ మూడు దశలనూ చక్కగా దాటి తన వినువీధి ప్రయాణాన్ని విజయవంతంగా సాగించినప్పటికీ, ఉపగ్రహాలను క్రమబద్ధంగా జారవిడిచే ప్రక్రియ ఎదురుదెబ్బ తిన్నది. ఈ మిషన్ తీపి, చేదు అనుభవాల మేలుకలయిక అంటూ ఇస్రో శాస్త్రవేత్తలు వైఫల్యానికి దారితీసిన కారణాలను, ఇతరత్రా సాంకేతికాంశాలను ప్రజలకు వివరించారు. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఈ రాకెట్ వైఫల్యంలో జరిగిన తప్పొప్పులను పరిశీలించుకుని, నైపుణ్యాన్ని మెరుగుపరుచుకొని వారు తిరిగి సమధికోత్సాహంతో రంగంలోకి దిగినందున ఆర్నెల్లలోనే ఇప్పటి డి2 రాకెట్‌ ప్రయోగం, మూడు ఉపగ్రహాల అంతరిక్షప్రవేశం విజయవంతంగా ముగిసింది. విద్య, రక్షణ, డేటా, కమ్యూనికేషన్స్‌, భూపరిశోధన తదితరరంగాల్లో చోటుచేసుకుంటున్న మార్పులు, అవసరాల కారణంగా చిన్న ఉపగ్రహాల వినియోగం వేగంగా హెచ్చుతున్నది. ఉపగ్రహ ప్రయోగానికి ఇంతవరకూ వినియోగిస్తున్న పిఎస్‌ఎల్‌వి తన బాధ్యతను చక్కగా నిర్వరిస్తున్నప్పటికీ, ఏటా ఐదుసార్లకంటే ఇస్రో దీనిద్వారా ప్రయోగాలు చేపట్టలేకపోతున్నది. మరీముఖ్యంగా, చిన్న ఉపగ్రహాల ప్రయోగానికి పీఎస్‌ఎల్వీవంటి భారీ రాకెట్‌ వాడటం ఖర్చుతో కూడుకున్నది. ఐదుకేజీల ఉపగ్రహానికి కూడా అనేక టన్నుల బరువున్న రాకెట్‌ వాడటం అనవసరం. ఈ కారణంగానే ద్రవీకృత ఇంధనాన్ని ఉపయోగించే ఈ భారీ రాకెట్‌ కంటే, ఘన ఇంధనంతో నడిచే స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ స్వదేశీ తయారీపై ఇస్రో శ్రద్ధపెట్టింది. పీఎస్ఎల్వీతో పోల్చితే పదోవంతు తక్కువ ఖర్చుతో, కొద్దిరోజుల్లోనే సిద్ధం చేసుకొని, తక్కువ మౌలిక సదుపాయాల మధ్య ప్రయోగించగలగడం ఈ చిన్నరాకెట్‌తో సాధ్యపడుతుంది. డేటా, కమ్యూనికేషన్ అవసరాలు పెరుగుతున్నందున వందలకొద్దీ చిన్నచిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి త్వరత్వరగా పంపించాల్సిన అవసరం హెచ్చుతున్నది. చైనా, అమెరికా సహా చాలా దేశాలు ఈ విషయంలో ఇప్పటికే ముందంజలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా డజనుకుపైగా ప్రైవేటు సంస్థలు కూడా ఈ రంగంలో ఉన్నాయి. చిన్నరాకెట్ల తయారీ మార్కెట్‌ ఏటా పదమూడుశాతం వృద్ధిచెందుతున్నదట. అందువల్ల, ఐదువందల కేజీలలోపు ఉపగ్రహ ప్రయోగాలకు మనకంటూ ఒక చిన్నరాకెట్‌ ఉండాలన్న ఇస్రో ప్రయత్నం నాలుగేళ్లుగా కరోనా సహా అనేక కారణాలవల్ల కాస్తంత వెనుకబాట పట్టినా, గత ఏడాది తొలి ప్రయోగంతో గాడినపడింది. గతంలో కంటే మరింత అధునాతనమైన, సులభంగా నియంత్రించగలిగే, విశ్వసనీయమైన చిన్న రాకెట్‌ ఇప్పుడు మనచేతిలో ఉందని ఇస్రో అధినేత సగర్వంగా ప్రకటించారు.

ఎస్‌ఎస్‌ఎల్‌వి పరిజ్ఞానాన్ని ప్రైవేటు వ్యక్తులు, సంస్థలతో పంచుకొనే ఆలోచనలో ఇస్రో ఉన్నదన్న వార్తలు కూడా వస్తున్నాయి. గత ఏడాది ప్రైవేటురంగంలో తయారైన రాకెట్‌ ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే. ప్రభుత్వ పెట్టుబడులతో ఇస్రో అభివృద్ధి చేసిన పరిజ్ఞానాన్ని ప్రైవేటువ్యక్తులకు, సంస్థలకు బదిలీచేసేందుకు ఇన్‌–స్పేస్‌ వంటి ప్రత్యేక వ్యవస్థలు, విధానాలు కూడా పుట్టుకొస్తున్నాయి. అంతరిక్ష రంగంలో దూసుకుపోయేందుకు వందస్టార్టప్‌లు ఉరకలేస్తున్న తరుణంలో, పరిజ్ఞానంతో పాటు ఇస్రో సమస్తవ్యవస్థలూ ప్రైవేటుకు ఉపకరిస్తాయనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఈ దారిలో నడిస్తేనే అంతరిక్షరంగంలో మిగతా ప్రపంచంతో పోటీపడగలుగుతామన్న వాదనను అటుంచితే, కనీసం ఇస్రో కష్టానికి తగినంత ప్రతిఫలం దక్కేట్టు చేయడం ప్రభుత్వం బాధ్యత.

Updated Date - 2023-02-14T02:00:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising