పని హక్కుకు కొత్త ఊపిరి పోస్తారా?
ABN, First Publish Date - 2023-01-31T00:59:28+05:30
పనిహక్కును మరింతగా పటిష్ఠం చేయవలసిన అవసరం లేదూ? జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (నరెగా) లబ్ధిదారులు దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది ఉన్నారు...
పనిహక్కును మరింతగా పటిష్ఠం చేయవలసిన అవసరం లేదూ? జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (నరెగా) లబ్ధిదారులు దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది ఉన్నారు. 2023–24 ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్ వారికి ఒక జీవన్మరణ సమస్య అయ్యే అవకాశమున్నది. పని ప్రదేశంలో కార్మికుల హాజరు కోసం కేంద్రం తీసుకువచ్చిన ‘నేషనల్ మానిటరింగ్ మొబైల్ అప్లికేషన్’ (ఎన్‌ఎంఎంఎస్) పద్ధతి, కార్మికుల ఆధార్ అథెంటికేషన్ లాంటి మార్పులు ఇప్పటికే గ్రామీణ పేదలను పెద్ద ఎత్తున ఉపాధి హామీకి దూరం చేస్తున్నాయి. కొత్త బడ్జెట్‌లో ఈ పథకానికి కేటాయింపులు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం భవిష్యత్తుపై కేంద్ర ప్రభుత్వ ధోరణిని సూచించబోతున్నాయి. అసలు విషయంలోకి వెళ్లే ముందు మన దేశంలో ‘పని హక్కు’ అనే భావన, పని హక్కు కల్పిస్తామన్న వాగ్దానంతో ముందుకొచ్చిన ఉపాధి హామీ చట్టం గురించి కొన్ని మౌలిక అంశాలను గుర్తుచేసుకుందాం.
పనికి సంబంధించిన అన్ని వ్యవహారాలలో వివక్ష లేకుండా ఉండడం, బలవంతపు పని నిషేధం, న్యాయమైన, అనుకూలమైన పని పరిస్థితులు, ట్రేడ్ యూనియన్ సంబంధిత హక్కులు, న్యాయమైన వేతనాలు, సమాన పనికి సమాన వేతనం, సమాన విలువ కలిగిన పనికి సమాన వేతనం తదితర అంశాలు పని హక్కులో నిబిడీకృతంగా ఉన్నాయి. భారత రాజ్యాంగం ‘పని హక్కు’ని ప్రాథమిక హక్కుగా గుర్తించలేదు. అయితే ఓల్గా టెల్లిస్ & ఓర్స్ వర్సెస్ బాంబే మునిసిపల్ కార్పొరేషన్ & అదర్స్ కేసులో పని హక్కును జీవించే హక్కులో అంతర్భాగమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
పని హక్కుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆమోదం తెలుపటంతో ఆ హక్కును సంపూర్ణంగా సాకారం చేయాలనే డిమాండ్ వామపక్ష పార్టీలు, పౌరసమాజం నుంచి ఊపందుకున్నది. తాను అధికారంలోకి వస్తే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకువస్తానని కాంగ్రెస్ పార్టీ 2004 ప్రారంభంలో వాగ్దానం చేసింది. 2004 సార్వత్రక ఎన్నికల అనంతరం కాంగ్రెస్ సారథ్యంలో ఏర్పడిన నేతృత్వంలోని యూపీఏ కూటమి అధికారంలోకి వచ్చింది.
డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి విధాన నిర్ణయాలలో తోడ్పడేందుకై సోనియా గాంధీ చైర్ పర్సన్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారిణి అరుణా రాయ్, ప్రజా ఆర్ధికవేత్తగా పేరుపడిన ‘జీన్‌ద్రేజ్’ తదితరులతో ‘జాతీయ సలహా మండలి’ ఏర్పడింది. 2004 ఆగస్టులో ఈ సలహామండలి కేంద్ర ప్రభుత్వానికి ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం’ ముసాయిదాను నివేదించింది. అయితే మన్మోహన్ ప్రభుత్వం ఆ ముసాయిదాను యథాతథంగా కాకుండా అనేక మార్పులు చేర్పులతో ఆమోదించింది. దానికనుగుణంగా యూపీఏ ప్రభుత్వం ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ బిల్లు– 2004’ను 2004 డిసెంబర్ 21న పార్లమెంటులో ప్రవేశపెట్టింది. భాగస్వామ్య వామపక్ష పార్టీల ఒత్తిడితో ఆ బిల్లును గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘానికి నివేదించారు. కొన్ని సానుకూల మార్పులతో అంతిమంగా ఆ బిల్లును 2005 ఆగస్టు 23న లోక్‌సభలో ఆమోదించారు. దేశ వ్యాప్తంగా, బాగా వెనుకబడిన 300 జిల్లాలలో గ్రామీణ ఉపాధి హామీ పనులు 2006లో ప్రారంభమయ్యాయి. 2008 నాటికి ఆ చట్టం అమలు దేశంలోని అన్ని గ్రామీణ జిల్లాలకూ విస్తరించింది. 2009లో చట్టం పేరు మార్చి ‘మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం’గా పునఃనామకరణం చేశారు.
‘జాతీయగ్రామీణ ఉపాధి హామీ చట్టం–2005’ ప్రకారం నమోదు చేసుకున్న గ్రామీణ కుటుంబాలకు సాలీనా కనీసం 100 రోజులు పని కల్పించాలి. వ్రాతపూర్వకంగా పని కోరుకున్న కార్మికులకు, దరఖాస్తు చేసుకున్న 15 రోజులలోగా పని కల్పించాలి. ఒకవేళ పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి చెల్లించాలి. ఈ విధంగా ఉపాధి కల్పిస్తామనే హామీ భారతదేశ దేశ పౌరులకు ప్రప్రథమంగా పరిమితంగానైనా లభించింది. అలానే పని పూర్తి చేసిన 15 రోజుల లోపు వేతనాలు చెల్లించాలి. లేని పక్షంలో ఆలస్యపు పరిహారం ఇవ్వాలి. స్త్రీ పురుషులకు సమాన వేతనాలు చెల్లించాలి పథకం క్రింద పనుల ఎంపిక నిర్ణయం స్థానికంగా గ్రామ సభలు తీసుకుంటాయి. ఇవన్నీ గ్రామణ ఉపాధి హామీ చట్టంలోని ప్రశంసనీయమైన సుగుణాలు. అయితే ఆ చట్టంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితుల వల్ల ఆ చట్టం పనిహక్కుకు ఐక్యరాజ్యసమితి ఇచ్చిన సమగ్ర నిర్వచన స్ఫూర్తిని అందుకోలేకపోయిందని అర్థమవుతుంది. చట్టాన్ని కేవలం గ్రామీణ ప్రాంత కుటుంబాలకే పరిమితం చేయడమే అందుకొక ఉదాహరణ. మరో ముఖ్యమైన విషయమేమిటంటే ఒక ఏడాదిలో కేవలం 100 రోజుల పనికి మాత్రమే హామీ ఇవ్వడం వలన పని హక్కు కల్పన పాక్షికమే అయింది. వేతనాలను నిర్ణయించడంలో కూడా ఉపాధి హామీ చట్టం ఐక్యరాజ్యసమితి ‘పని హక్కు’ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది. దేశంలో ఉపాధి హామీ వేతనాలు దేశ స్వాతంత్ర్యం అనంతరం సామాజిక మార్పు లక్ష్యంగా వచ్చిన ‘కనీస వేతనాల చట్టం– 1948’ కింద నోటిఫై అయిన వేతనాల కంటే కనీసం 30 నుంచి 40 శాతం తక్కువగా ఉన్నాయి. కనీస వేతనాల చట్ట ఉల్లంఘన భారత రాజ్యాంగం పౌరులకు వాగ్దానం చేసిన ‘జీవించే హక్కును’ నిరాకరించడమే కాదూ? పలు సందర్భాలలో కోర్టులు ఈ విషయాన్ని తప్పుపట్టినా కార్మికులకు న్యాయం జరగడం లేదు.
ఇన్ని పరిమితుల మధ్య కూడా వ్యవసాయ వేతనాలు పెంపు, కులాల అంతరాల తగ్గింపు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం, గ్రామాల్లో సుస్థిర వనరుల కల్పనలో ఉపాధి హామీ చట్టం కీలకపాత్ర పోషించింది. దళితుల, ఆదివాసీల భూముల అభివృద్ధి పనులు ఈ చట్టం అమలు వల్ల సాధ్యమయ్యాయని పలు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఉపాధి హామీ పథకం దుర్భర దారిద్య్రంలోకి జారిపోకుండా 32 శాతం మంది పేదలను ఆదుకున్నదని, 45 శాతం మహిళలు పేదరికం నుంచి బయట పడ్డారని ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎకనామిక్ రీసెర్చ్’ సంస్థ నిర్ధారించింది. ప్రస్తుతం ‘ఉపాధి హామీ చట్టం’ ప్రపంచంలో అతి పెద్ద ఉపాధి కల్పన కార్యక్రమం అని ప్రపంచ బ్యాంకు అభివర్ణించింది. గ్రామీణ ఉపాధి హామీ చట్టంలోని లోపాలూ, పరిమితులు పక్కన పెడితే నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పథకం ప్రకారం చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి పలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పథకం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతుంది. దాదాపు 90శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే 10శాతం నిధులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుతుంది. సమస్యేమిటంటే కేంద్రం ఈ ఉపాధి కల్పన కార్యక్రమానికి అవసరమైన నిధులు కేటాయించడం లేదు. 2022–23 సంవత్సరానికి 2.4 లక్షల కోట్లు అవసరమయితే కేంద్రం కనీసం లక్ష కోట్లు కూడా కేటాయించలేదు. ఇలా అవసరమైన బడ్జెట్ కేటాయింపులు చేయకపోవడంతో గ్రామీణ పేదలకు పని దొరకకుండా పోతున్నది. పని నిరాకరించిన పక్షంలో చెల్లించాల్సిన నిరుద్యోగ భృతి ఊసే లేదు. ఇక కేటాయించిన నిధులలో కూడా మునుపటి సంవత్సరపు బకాయిలు చెల్లింపులకోసం పెద్ద మొత్తం ఖర్చు చేయాల్సివస్తుంది. గత ఐదేళ్లలో సగటున 20 శాతం నిధులు ఈ బకాయిలు తీర్చడానికి ఖర్చయిపోయాయి! అలాగే సామాజిక తనిఖీలకు కావాల్సిన బడ్జెట్ కేటాయింపులు జరగడంలేదు. వేతనాలు సకాలంలో చెల్లించకపోవడం, డిమాండ్ మేరకు ప్రభుత్వం పని కల్పించకపోవడం, వేతనాలు బాగా తక్కువగా ఉండడం వలన ఉపాధి హామీ పనిదినాలు సగటున 60కి మించడం లేదు. ఈ స్థితిలో 2023–24 కేంద్ర బడ్జెట్‌లో ఉపాధి హామీ అమలుకు మాత్రమే కాకుండా పని హక్కు స్ఫూర్తిగా నిధుల కేటాయింపు ఉండాలి. వేతనాలు, పని దినాలు పెంపునకు, నిరుద్యోగ భృతి, ఆలస్యపు పరిహారం చెల్లింపులకు అవసరమైన మొత్తంలో నిధులు కేటాయించాలి. గ్రామీణ ఉపాధి హామీ సక్రమంగా అమలు కావాలంటే బడ్జెట్ కేటాయింపు కనీసం 3 లక్షల కోట్లకు పెంచితీరాలి. అలా కాని పక్షంలో చట్టపరమైన హామీలు సక్రమంగా అమలుకు నోచుకునే అవకాశం లేదు. రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల స్ఫూర్తితో పట్టణ ఉపాధి హామీ చట్టం రూపకల్పనకు, అమలుకు కూడా అదనపు నిధులు కేటాయించాలి. ఇందుకు ప్రాథమికంగా 10 వేల కోట్ల రూపాయలు కేటాయించాలి. గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి తగినన్ని నిధులు కేటాయించని పక్షంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిత్యం ప్రవచించే ‘డబల్ ఇంజిన్ గ్రోత్’ కేవలం ‘నామ్‌కె వాస్తే’ మాటలుగా ప్రజలు పరిగణించాల్సి వస్తుంది. వింటున్నారా నిర్మలమ్మగారూ?
చక్రధర్ బుద్ధ
పరిశోధకులు, లిబ్ టెక్ ఇండియా
Updated Date - 2023-01-31T00:59:31+05:30 IST