సమైక్యంగా విమోచన వేడుకలు
ABN, First Publish Date - 2023-09-17T01:35:13+05:30
దేశచరిత్రలో తెలంగాణ ఎప్పుడూ ప్రత్యేకమే. నిజాం అరాచక పాలననుంచి విముక్తి కోసం చేసిన పోరాటమైనా.. అస్తిత్వం కోసం చేసిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమమైనా...
దేశచరిత్రలో తెలంగాణ ఎప్పుడూ ప్రత్యేకమే. నిజాం అరాచక పాలననుంచి విముక్తి కోసం చేసిన పోరాటమైనా.. అస్తిత్వం కోసం చేసిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమమైనా.. తెలంగాణ గడ్డ చైతన్యవంతమైన, స్ఫూర్తిమంతమైన పోరాటానికి వేదిక. శాతవాహనులు, రాష్ట్రకూటులు, కాకతీయులు ఆ తర్వాత బహమనీ సుల్తానులు, కుతుబ్ షాహీలు, అసఫ్‌జాహీ (నిజాం)ల పాలన వరకు ఎందరో రాజులు, వివిధ రకాల పాలనను చూసిన ప్రాంతమిది. అయితే తెలంగాణ చరిత్రలో అత్యంత దుర్మార్గమైన, రక్తపు మరకలతో కూడిన చరిత్ర నిజాం పాలన సమయంలోనిదే. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంత పోరాటం చేయాల్సి వచ్చిందో.. నిజాం చెరనుంచి హైదరాబాద్ సంస్థానం ప్రజలను కాపాడేందుకు కూడా దాదాపు అంతే స్థాయిలో కొట్లాడవలసి వచ్చింది.
‘ఓ నిజాము పిశాచమా!/ కానరాడు నినుబోలిన రాజు మా కెన్నడేని
తీగెలను తెంచి అగ్నిలో దించినావు/ నా తెలంగాణ, కోటి రతనాల వీణ!’
అన్న దాశరథి మాటలు.. నాటి తెలంగాణ ప్రజల ఆవేదనను, నిజాం అరాచక, నియంతృత్వ పాలనను ప్రతిబింబిస్తాయి.
నిజాం అరాచక పాలనలో ప్రజలు స్వేదానికి బదులు రక్తం చిందించినా కడుపునిండా తిండి తినే పరిస్థితుల్లేవు. మహిళలపై అత్యాచారాలు, ‘గస్తీ నిషాన్ తిర్‌పన్ (53)’ పేరుతో ప్రజల వాక్ స్వాతంత్ర్యపు హక్కును హరించడం, పత్రికా స్వాతంత్ర్యం, భాషా స్వాతంత్ర్యం గురించి గొంతెత్తితే.. ఆ గొంతులను అందరూ చూస్తుండగానే తెగనరికిన పరిస్థితి. ఉర్దూను బలవంతంగా రుద్దడం, నాగు వడ్డీతో (తీసుకున్న అప్పు సంవత్సరంలో రెట్టింపవడం) ప్రజల నడ్డి విరవడం, రైతులపై గల్లా పన్ను, ఖుషీ పన్ను విధించడం వంటి ఎన్నో చెప్పుకోలేని ఇబ్బందులు ప్రజల దైన్యాన్ని వెల్లడిస్తాయి.
బైరాన్‌పల్లి ఊచకోత, పరకాలలో కాల్చివేత, మాచిరెడ్డిపల్లి సామూహిక హత్యల వ్యధ, గుండ్రాంపల్లిలో మానభంగాలు, నిర్మల్‌లో రాంజీ గోండు, ఆయన వెయ్యిమంది అనుచరులను ఒకే మర్రి చెట్టుకు ఉరేయడం.. వంటి ఎన్నో హృదయవిదారక ఘటనలకు నిజాం రాక్షస పాలన సాక్ష్యంగా నిలిచింది. తెలంగాణలో దాదాపు ప్రతి గ్రామమూ.. రజాకార్ల అరాచకాల ప్రతాపాన్ని చవిచూసింది. అక్కడి పాత ఇండ్ల గోడలు, కూలిన గడీలు.. నాటి రాక్షసకృత్యాలను మనకు అర్థమయ్యేలా చెబుతాయి.
చెప్పేందుకు నోరు, రాసేందుకు చేయి రానటువంటి అరాచక, రాక్షస, దుర్మార్గపు పాలన ద్వారా అనేక కష్టనష్టాలను అనుభవించిన ప్రజలు 1948 సెప్టెంబర్ 17న నాటి హోంమంత్రి, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చొరవతో.. ఇక్కడి పోరాట యోధుల తెగువతో.. స్వాతంత్య్రాన్ని పొందితే అది ఇక్కడి ప్రజలకు నిజాం దుష్టపాలన నుంచి, నియంతృత్వం నుంచి విముక్తి, విమోచన లభించినట్లే కదా.
అలాంటిది తెలంగాణ ప్రాంతం స్వాతంత్ర్యం పొందిన నాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా విమోచన దినాన్ని నిర్వహించకపోవడం.. ఈ గడ్డపై జరిగిన పోరాటాలను అగౌరవపరచడమే. ఒక వర్గాన్ని సంతుష్టి పరిచేందుకు నాటి నుంచి నేటి వరకు అధికారిక ఉత్సవాలు జరపకపోవడం ఒక ఎత్తయితే, దీనికి విలీనం, సమైక్యత వంటి పేర్లు పెడుతూ ఇంకా తెలంగాణ ప్రజల త్యాగాలను అవమానించాలనుకోవడం మరో ఎత్తు. దీనికి కారణం తెరవెనుక వారిమధ్య ఉన్నటువంటి అనైతిక పొత్తు.
అదే హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో సెప్టెంబర్ 17 ఓ అధికారిక ఉత్సవం. మహారాష్ట్రలో ‘మహారాష్ట్ర ముక్తి సంగ్రామ్ దివస్’గా, కర్ణాటకలో ‘హైదరాబాద్ – కర్ణాటక విముక్తి దినం’గా జరుపుకుంటున్నారు.
మరి ఈ ఉద్యమానికి కేంద్రమైన తెలంగాణలో ఏం జరుగుతోంది? పొరుగు రాష్ట్రాల్లో జరిగిన దానికి పూర్తి భిన్నంగా.. అసలు నిజాం అరాచకాలే జరగలేదన్నట్లుగా అధికార పార్టీలు వ్యవహరిస్తుంటే.. రేపటి తరానికి ఈ ప్రాంత పోరాట చరిత్ర ఎలా తెలుస్తుంది? తెలంగాణ విమోచన దినానికి.. జాతీయ సమైక్యతా దినం అని పేరు పెట్టడం ఈ నేలను, ఇక్కడ పుట్టిన వీరులను అవమానించడమే అనడంలో సందేహం లేదు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ పేరుతో దేశ స్వాతంత్ర్య వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. దేశ స్వాతంత్ర్యం కోసం ఆయా ప్రాంతాల్లో పోరాటం చేసి.. సరైన గుర్తింపు పొందని వారిని వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగానే.. గత ఏడాది తెలంగాణ విమోచన దినోత్సవ వజ్రోత్సవాలను.. ఘనంగా జరుపుకున్నాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జెండా ఎగురవేసి.. కార్యక్రమాలకు కొత్త ఉత్సాహాన్నిచ్చారు.
అంతవరకు తెలంగాణ ప్రభుత్వం.. అధికారికంగా తెలంగాణ విమోచన ఉత్సవాల నిర్వహణకు నిరాకరిస్తూ వచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తోందని తెలియగానే.. హడావుడిగా ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’ అని పేరు పెట్టి అధికారిక ఉత్సవాలను ప్రారంభించింది.
రాజకీయ అవసరాలకోసం ప్రాంత చరిత్రను తాకట్టు పెట్టడం.. ఆత్మహత్యాసదృశమే, మన అస్తిత్వాన్ని కాలరాసుకోవడమే! అందుకే రాష్ట్ర బీజేపీ 1998 నుంచి తెలంగాణ విమోచనోత్సవాలను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూనే ఉంది. 1998లో నిజాం కాలేజీలో అద్వానీ సమక్షంలో జరిగిన సభలో.. పలువురు తెలంగాణ విమోచన పోరాట యోధులను ఘనంగా సన్మానించుకున్న సన్నివేశం వివిధ రాజకీయ పార్టీలను కలవరానికి గురిచేసింది. మా పార్టీ మొదట్నుంచీ ఈ విషయంలో స్పష్టమైన దృక్పథంతో ఉంది. రాజకీయ అవసరాలకోసమో.. తాత్కాలిక లబ్ధికోసమో.. భావి తరాలను మోసం చేయడం సరికాదనేది బీజేపీ ఉద్దేశం. రాజకీయాలు వస్తుంటాయి, పోతుంటాయి.. కానీ.. మన అస్తిత్వాన్ని కాపాడుకోవడం అత్యంత అవసరం.
అందుకే, మన పెద్దల త్యాగాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోయినా మనమంతా కలిసి వారిని స్మరించుకోవాల్సిన తరుణమిది. మరీ ముఖ్యంగా విద్యార్థులు, యువత.. మన పెద్దలు చేసిన ఈ త్యాగాల విలువ తెలుసుకోవాలి. ఆ త్యాగాల మహత్తును ఆవాహన చేసుకోవాలి, ఆ శక్తితో వర్తమానంలో చైతన్యశీల అడుగులు వేయాలి. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రజాకవి.. కాళోజీ గారు చెప్పినట్లు ‘నా’ అనే అహాన్ని పక్కనపెట్టి ‘మనం’, ‘మన కుల, మత, రాజకీయాలకు అతీతంగా ‘‘తెలంగాణ కోసం’’ అనే సంకల్పంతో కలిసి పనిచేయాలి.
జి. కిషన్ రెడ్డి
కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు
Updated Date - 2023-09-17T01:35:13+05:30 IST