ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

భావితరాలకు చైతన్య దివిటీ

ABN, First Publish Date - 2023-09-28T00:56:28+05:30

లౌకికవాదం, సోషలిజం, సార్వభౌమాధికారం కోసం పోరాడుతున్న వారికి గొప్ప స్ఫూర్తి చిహ్నం సర్దార్ షాహిద్ భగత్ సింగ్. పాఠశాలలో చదివే సమయంలోనే మొదటి లాహోర్ కుట్ర కేసులో పంజాబ్‌కు...

లౌకికవాదం, సోషలిజం, సార్వభౌమాధికారం కోసం పోరాడుతున్న వారికి గొప్ప స్ఫూర్తి చిహ్నం సర్దార్ షాహిద్ భగత్ సింగ్. పాఠశాలలో చదివే సమయంలోనే మొదటి లాహోర్ కుట్ర కేసులో పంజాబ్‌కు చెందిన కర్తార్ సింగ్ శరభ కేవలం 20 సంవత్సరాల వయసులోనే ఉరికంబాన్ని ముద్దాడి ప్రాణత్యాగం చేయడాన్ని ఆదర్శంగా తీసుకొని నిరంతరం ఆ స్ఫూర్తితో ఉండడానికి కర్తార్ సింగ్ ఫోటో జేబులో పెట్టుకుని విప్లవ బాటను అనుసరించి ఉరి తీయబడిన గొప్ప విప్లవకారుడు.

1907 సెప్టెంబర్ 28న పంజాబ్ రాష్ట్రంలోని లాయల్ పూల్ జిల్లా కత్కార్ కలాన గ్రామంలో విద్యావతి, కిషన్ సింగ్ దంపతులకు జన్మించిన ముద్దుబిడ్డ భగత్ సింగ్. గదర్ వీరుల అమరత్వం, జలియన్‌ వాలాబాగ్ దురంతం భగత్ సింగ్ హృదయాన్ని కలిచివేశాయి. జలియన్‌ వాలాబాగ్ మారణకాండ నేపథ్యంలో 1920లో గాంధీజీ ప్రకటించిన సహాయ నిరాకరణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడి ఉధృతం అవుతున్న తరుణంలో చౌరీచౌరా సంఘటన చోటుచేసుకోవడంతో ఉద్యమం హింసాత్మకంగా మారింది. దాంతో 1922 ఫిబ్రవరిలో గాంధీ అకస్మాత్తుగా, ఏకపక్షంగా జాతీయస్థాయి ఉద్యమాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. దీనిని సహించని భగత్ సింగ్ హిందుస్థాన్ రిపబ్లిక్‌ అసోసియేషన్ సభ్యుడిగా కొనసాగి విప్లవ పంథాలో స్వాతంత్ర్యం కోసం కృషి చేశాడు. రష్యాలో సోషలిస్టు విప్లవం విజయవంతం కావడంతో ఆ దిశగానే తన సహచరులను చైతన్యపరుస్తూ తుది శ్వాస వరకు దేశ విముక్తి కోసం పాటుపడిన భగత్ సింగ్ జీవితం ఎప్పటికీ ఆదర్శప్రాయమే. 23 ఏళ్ల జీవితంలో, ఆరేళ్లు రాజకీయ జీవితం, ఆ సమయంలోనే ప్రపంచ విప్లవాల విజయవంతానికి సంబంధించిన పుస్తకాల అధ్యయనం, సిద్ధాంతాలపై పరిశోధన, ఆచరణ వంటి వాటిపై నిరంతరం శ్రద్ధ చూపడం, ప్రజలను చైతన్యపరుస్తూ విద్యార్థులకు ప్రేరణ కలిగిస్తూ పలు శాస్త్రీయ అంశాలపై వ్యాసాలు, లేఖలు రాయడం సమసమాజ స్థాపనపై ఆయనకున్న మక్కువకు నిదర్శనం. బ్రిటిష్ వారు అక్రమంగా, అన్యాయంగా తీసుకువచ్చిన ప్రజాభద్రత చట్టాన్ని వ్యతిరేకిస్తూ సెంట్రల్ అసెంబ్లీలో బాంబు విసిరి కరపత్రాలు పంచి స్వచ్ఛందంగా అరెస్టయ్యారు. అదే కేసులో అరెస్టయిన సుఖ్‌దేవ్, రాజ్‌గురులతో జైలులో రాజకీయ ఖైదీల సౌకర్యాల పెంపుదల కోసం 64 రోజులు నిరాహారదీక్ష చేసి సాధించడం వారి పట్టుదలకు నిదర్శనం. బ్రిటిష్ ప్రభుత్వంపై యుద్ధం చేసినందుకు కోర్టు మరణశిక్ష విధించింది. అయితే కుట్రపూరితంగా, జైలు నిబంధనలకు వ్యతిరేకంగా బ్రిటిష్ వారు ఒక రోజు ముందుగానే మార్చి 23, 1931న రాత్రి ఏడు గంటలకు భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఉరి తీశారు.

భగత్ సింగ్ వారసులం, భరతమాత బిడ్డలం అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తూ ఆచరణలో మాత్రం ఆయన ఆలోచన విధానానికి వ్యతిరేకంగా వ్యవహరించడం ద్వందనీతికి నిదర్శనం. వేదికల మీద మహనీయుల గురించి మాట్లాడటం, వారి విగ్రహాలకు గజమాలలు వేసి కార్యక్రమాలు నిర్వహించడం కన్నా, వారి ఆశయాల సాధనకు కృషి చేయడమే వారికి మనమిచ్చే నిజమైన నివాళి.

తండ సదానందం

(నేడు భగత్ సింగ్ జయంతి)

Updated Date - 2023-09-28T00:56:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising