నష్టాల్లో కొబ్బరి రైతులు
ABN, First Publish Date - 2023-08-30T04:27:36+05:30
ఒకప్పుడు గోదావరి జిల్లాల్లో– కొడుకులు చూసినా చూడకపోయినా ఇంటి వద్ద పది కొబ్బరి చెట్లు ఉంటే బ్రతికేయవచ్చు అనే నమ్మకంతో ప్రజలు ఉండేవారు...
ఒకప్పుడు గోదావరి జిల్లాల్లో– కొడుకులు చూసినా చూడకపోయినా ఇంటి వద్ద పది కొబ్బరి చెట్లు ఉంటే బ్రతికేయవచ్చు అనే నమ్మకంతో ప్రజలు ఉండేవారు. అట్లాంటి వైభవం ఉన్న కొబ్బరి పంటను నమ్ముకున్న రైతులు నేడు నష్టాల్లో ఉన్నారు. ప్రపంచ కొబ్బరి ఉత్పత్తిలో భారతదేశం మూడవ స్థానంలో ఉంది. మనదేశంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ నాలుగవ స్థానంలో ఉంది. రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల 50 వేల ఎకరాల వరకు కొబ్బరి విస్తీర్ణం ఉంది. ప్రధానంగా సముద్ర తీరంలో ఉన్న కోనసీమ, ఉద్దానం ప్రాంతాలలో ఉన్న మెట్ట భూములలో కొబ్బరి పంట ఉంది. జాతీయ కోకోనట్ బోర్డు లెక్కల ప్రకారం రాష్ట్రం విస్తీర్ణంలో నాలుగో స్థానంలో ఉన్నా, ఉత్పాదకతలో మొదటి స్థానంలో ఉంది.
ఈ పంటకు అనేక సంవత్సరాలుగా ఎర్ర నల్లి, తెల్ల దోమ వంటి తెగుళ్లు ఆశించడంతో దిగుబడి బాగా తగ్గింది. మరోవైపు మార్కెట్లో ధరలు హెచ్చుతగ్గులుగా ఉండడం వల్ల కూడా కొబ్బరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కరోనాకాలం నుంచి కొబ్బరి రైతులు నష్టాలనే చవిచూస్తున్నారు. ఎకరా సాగుకు సంవత్సరానికి రూ.40 వేలకు పైగా పెట్టుబడి ఖర్చులు అవుతున్నాయి. ఎరువులు, పురుగుమందుల ధరలు పెరిగిపోవడంతో ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోయాయి. చెట్టు నుంచి కొబ్బరికాయలు కోసి గుట్టలుగా వేయడానికి ఒక్కో కాయకు మూడు రూపాయలు ఖర్చవుతోంది. అయితే వ్యాపారులు ఎండు కొబ్బరికాయకు ఆరు రూపాయలకు మించి ధర ఇవ్వడం లేదు. 100 కొబ్బరికాయలు కొనుగోలు చేస్తే రైతు నుంచి అదనంగా 10 కాయలు వ్యాపారులు తీసుకుంటున్నారు. రైతుకు కోత ఖర్చులు కూడా రాని పరిస్థితి ఉంది. వ్యాపారులు పంట కొనుగోలు సందర్భంగా ఒక్కో కొబ్బరి చెట్టుకు గతంలో వెయ్యి రూపాయలు వరకు ధర ఇచ్చేవారు. ఈ సంవత్సరం ఒక్కో చెట్టుకు రూ.550 నుంచి రూ.700 వరకు మాత్రమే ఇస్తున్నారు. గతంలో ఎకరాకు రూ.60వేలు ఆదాయం వచ్చేది. కొబ్బరి తోటలో అంతర పంటగా కోకో, ఇతర పంటలు సాగు చేయడంతో మరో రూ.30 నుంచి 40 వేలు ఆదాయం వచ్చేది. నేడు ఆ పరిస్థితి లేదు. కష్టపడి రైతు నాణ్యమైన పంట పండించినా, కొనుగోలు చేసే స్థితి లేదు. నష్టాలకు కొబ్బరికాయలు అమ్ముకోలేక తోటలో నిల్వ చేస్తే వర్షాలకు తడిసి మొలకలు వచ్చేస్తున్నాయి.
కొబ్బరి రైతుల గోడును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. మార్కెట్లో వినియోగదారులు ఒక్కో కొబ్బరికాయను రూ.20 నుంచి రూ.25కు కొనుగోలు చేస్తున్నారు. కొబ్బరి మార్కెట్ ప్రైవేటు వ్యాపారుల ఇష్టారాజ్యంగా తయారైంది. మార్కెట్ మాయాజాలంతో కొబ్బరి రైతులు నలిగిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు కొబ్బరికాయలు ఎగుమతి అవుతున్నాయి. వేసవికాలంలో కొబ్బరి బోండాలకు డిమాండ్ ఉంటుంది. పండుగల సమయంలో కొబ్బరికాయలు వినియోగం అధికంగా ఉంటుంది. ప్రస్తుతం ఎండు కొబ్బరికి కూడా డిమాండ్ ఉంది. మార్కెట్లో ధర ఎగుడు దిగుడుల సందర్భంగా అవసరమైతే నిల్వ చేసుకుని, ధర పెరిగిన తర్వాత అమ్ముకునే అవకాశం రైతుకు లేదు. అందుకు తగిన గిడ్డంగులు గానీ, కోల్డ్ స్టోరేజ్‌లు గానీ అందుబాటులో లేవు. అనేక ఉత్పత్తుల్లో కొబ్బరి పంటను వినియోగిస్తున్నారు. కొబ్బరి పంట ప్రాంతాలలో కొన్నిచోట్ల కొబ్బరిపీచు పరిశ్రమలు ఏర్పాటు చేశారు. కొబ్బరి ద్వారా తయారయ్యే మిగిలిన ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలు మాత్రం లేవు. కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టినా కొబ్బరి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు తగిన చర్యలు చేపట్టలేదు. ఈ పరిశ్రమలు ఏర్పాటు చేయడంవల్ల రైతులకు ఆదాయం, యువతకు ఉపాధి దొరుకుతుంది. ఆ విధంగా ప్రభుత్వాలు ఆలోచనలు చేయడంలేదు. కొబ్బరి వలుపు, దింపుడు పనులలో కార్మికులు వేల సంఖ్యలో ఉపాధి పొందుతున్నారు. కొబ్బరి రైతు నష్టాల ప్రభావం వీరి వేతనాలపై ఉంటుంది.
పెట్టిన పెట్టుబడికి కనీసం మార్కెట్లో ఒక్కో కాయకు 15 రూపాయలు ధర ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. అయితే వ్యాపారులు ఆ ధర ఇవ్వడం లేదు. ఈ పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.మూడు వేల కోట్లను ధరల స్థిరీకరణ నిధికి కేటాయిస్తున్నది. బడ్జెట్ ప్రసంగాల్లో చాలా గొప్పగా చెబుతున్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతు భరోసా కేంద్రాలు పనిచేస్తున్నాయని ప్రచారంతో ఊదరగొడుతున్నారు. కానీ ఆచరణలో అమలు కావడంలేదు. నాఫెడ్, ఆయిల్ ఫెడ్ రంగంలోకి దిగి రైతుల నుంచి కొబ్బరికాయలు కొనుగోలు చేయాలని కోరుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. 2020–21 సంవత్సరాన్ని కొబ్బరి సంవత్సరంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆ రైతుల సమస్యల పరిష్కారానికి మాత్రం చర్యలు లేవు. ఉద్యాన శాఖ ద్వారా వీరికి సబ్సిడీ పథకాలు అమలుకావడం లేదు.
ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి నాఫెడ్, ఆయిల్ ఫెడ్ ద్వారా కొబ్బరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. కొబ్బరికాయకు కనీస ధర రూ.15లు ఇవ్వాలి. కొబ్బరి అధికంగా పండించే ప్రాంతాలలో సంబంధిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. ఈ సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలో ఉన్న కొబ్బరి రైతులు ఐక్యంగా పోరాడాలి.
కె. శ్రీనివాస్
రాష్ట్ర సహాయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం
Updated Date - 2023-08-30T04:27:36+05:30 IST