ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మళ్లీ ఇందుకే రావాలా...!

ABN, First Publish Date - 2023-10-25T02:04:39+05:30

ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి విశాఖపట్నం వస్తున్నారంటే ఈ ప్రాంతంలో వివిధ సమస్యలపై పనిచేస్తున్న రాజకీయ పార్టీలు, వివిధ ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి...

ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి విశాఖపట్నం వస్తున్నారంటే ఈ ప్రాంతంలో వివిధ సమస్యలపై పనిచేస్తున్న రాజకీయ పార్టీలు, వివిధ ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కారణం– జగన్‌ను చూసి వీరు భయపడి కాదు. ఆయనే వీళ్ళను చూసి భయపడటం వల్ల. విశాఖపట్నం పెద్ద పారిశ్రామిక కేంద్రం. కార్మిక వాడ. సహజంగానే ఇక్కడ కార్మికులకు అనేక సమస్యలు ఉంటాయి. పెద్ద నగరం కావడంతో మిగిలిన తరగతుల ప్రజలు వివిధ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సమస్యలు పరిష్కరించాలని నిత్యం ఏదో రూపంలో ఆందోళనలు జరుగుతూనే ఉంటాయి. ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వడం, అధికారులకు అర్జీలు సమర్పించడం సర్వ సాధారణం. ఇవన్నీ ఎప్పుడూ ప్రశాంతంగానే జరుగుతాయి. విశాఖపట్నం, ఉత్తరాంధ్రలోని ప్రజలు స్వభావరీత్యానే ప్రశాంతత కోరుకుంటారు. అనవసరమైన గొడవలకు తావివ్వరు. అదేం విచిత్రమో కాని ముఖ్యమంత్రి ఉత్తరాంధ్రకు, విశాఖపట్నానికి వచ్చినప్పుడల్లా అనేకమందిని ముందస్తు అరెస్టులు చేసి, గృహనిర్బంధం చేయడం, ఎటువంటి ఆందోళనకు అవకాశం ఇవ్వకపోవడం, వివిధ ఉద్యమ నాయకులు కలుస్తామన్నా ఒప్పుకోకపోవడం పరిపాటిగా మారింది. గత ప్రభుత్వాల హయాంలో కూడా ఇలాంటివి కొన్ని సందర్భాల్లో జరిగినా, జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వ కాలంలో ఇది ఒక సాధారణ అంశంగా మారిపోయింది. జగన్మోహన్‌ రెడ్డి వివిధ కార్యక్రమాలపై ఇటీవల విశాఖపట్నం వచ్చారు. ఇక్కడ గత వెయ్యి రోజులుగా స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. ఈ పోరాట కమిటీ నాయకత్వం తమకు ముఖ్యమంత్రిని కలవడానికి అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని కోరినా, ప్రభుత్వం తిరస్కరించింది. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అనుకుంటే స్టీల్‌ ప్లాంట్‌ కాపాడుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి. కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తూ, పోరాటం కొనసాగిస్తున్న కార్మికులకు అండగా నిలబడితే కనీసం ప్లాంట్‌ను కాపాడుకోవడం సాధ్యపడుతుంది. ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాల్సింది పోయి, ఆ నాయకులకు తనను కలవడానికి కూడా అవకాశం ఇవ్వకపోవడం ఏ రకంగా సమంజసమో అర్థం కావడం లేదు. విశాఖపట్నంలో గత రెండు దశాబ్దాలకు పైగా పంచగ్రామాల భూ సమస్య అపరిష్కృతంగా ఉంది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిని పరిష్కరిస్తుందని ఎన్నికలకు ముందు స్వయంగా జగన్‌ హామీ ఇచ్చారు. కానీ దీనికి భిన్నంగా గత నాలుగున్నరేళ్ల కాలంలో ఈ సమస్య పరిష్కారానికి కనీస ప్రయత్నం కూడా చేయలేదు సరికదా, మరింత జటిలం చేసింది. దాదాపు లక్ష మందికి పైగా ప్రజలు బాధితులుగా ఉన్న ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఆ సంఘం అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తోంది. బాధ్యత కలిగిన ప్రభుత్వమయితే, ఆ నాయకులను పిలిచి, చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేసి ఉండేది. కానీ జగన్‌ ప్రభుత్వం ఆ సంఘ నాయకులను గృహనిర్బంధం చేయడానికి పూనుకుంది. జగన్‌ పర్యటన సందర్భంగా ప్రజాసంఘాల నాయకులపై ఇటువంటి నిర్బంధాలకు ప్రభుత్వం అసంబద్ధంగా పూనుకుంటోంది. దీనిని భయం కాక మరేమంటారు? తాను చెబుతున్నట్లు మంచి పాలన అందిస్తుంటే ఈ భయమెందుకు? ఈ నాయకులు ఏమైనా టెర్రరిస్టులా?ఇక్కడ రెండు ప్రశ్నలు సహజంగానే ఉదయిస్తాయి. ఒకటి– సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా అన్నది. రెండోది– ఎన్నికైన ప్రభుత్వం ఇటువంటి నిర్బంధ చర్యలకు పాల్పడడం సబబేనా అన్నది. పాలకుల పట్ల ప్రజలకు, ప్రజల పట్ల పాలకులకు విశ్వాసం, నమ్మకం ఉండాలి. కానీ వాటి స్థానంలో ఒకరికి పట్ల మరొకరికి భయం ఉన్నా ఆ పాలన సక్రమంగా లేదని అర్థం. నేడు రాష్ట్రంలో ఈ పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి అప్పుడప్పుడు విశాఖ వస్తున్నప్పుడే పరిస్థితి ఇలా ఉంటే, పర్మనెంట్‌గా మకాం మార్చేస్తే ఇంకెంత విషమంగా ఉంటుందో అన్నది ఇక్కడ ప్రజల ఆందోళన. మళ్లీ జగనే ఎందుకు రావాలి... జగనన్న ప్రభుత్వమే ఎందుకు కావాలి అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికలవేళ, ఇందుకే రావాలా అన్న ప్రశ్న ప్రజలలో సహజంగానే వస్తోంది. దీనికి సమాధానం రాష్ట్ర ప్రభుత్వం మాటలలో కాక చేతలలో చూపించాలి. అలా కాకపోతే ప్రజలే సరైన సమాధానం చెపుతారు.

ఎ. అజ శర్మ

ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక

Updated Date - 2023-10-25T02:04:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising