జమిలిపై కాంగ్రెస్ బాధ్యతారాహిత్యం
ABN, First Publish Date - 2023-09-05T02:56:45+05:30
మార్పును నిరోధించే శక్తులు ఎప్పుడూ ఉంటాయి. ఐదు దశాబ్దాలకు పైగా దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ హయాంలో, ముఖ్యంగా గాంధీ పేరు వాడుకునే కుటుంబ పాలనలో ప్రగతి నిరోధక...
మార్పును నిరోధించే శక్తులు ఎప్పుడూ ఉంటాయి. ఐదు దశాబ్దాలకు పైగా దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ హయాంలో, ముఖ్యంగా గాంధీ పేరు వాడుకునే కుటుంబ పాలనలో ప్రగతి నిరోధక శక్తులు అత్యధికంగా ఉండడం వల్ల ఎలాంటి మార్పులు లేక దేశం యథాతథ స్థితిలో కొనసాగింది. సూపర్ కంప్యూటర్ గురించి మాట్లాడిన రాజీవ్ గాంధీ కూడా ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టకుండా దేశాన్ని దివాళా మార్గంలో నడిపించారు. అంతటా అస్థిరత, అభద్రత, అశాంతి నెలకొనడం మూలంగా కూడా దేశంలో ఎలాంటి సంస్కరణలు ప్రవేశపెట్టడం కాంగ్రెస్ నేతలకు సాధ్యం కాలేదు. గాంధీ కుటుంబానికి చెందని పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెడితే ఆ కుటుంబ సభ్యులు సహించలేకపోయారు. ఆయనను బిజెపి ప్రధానమంత్రిగా ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక కుటుంబ విధేయుడే తీర్మానించారు. నవ భారత్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన పీవీని కాంగ్రెస్ స్వయంగా తన చరిత్రలోంచి తొలగించి బిజెపికి అప్పగించింది. బిజెపికి అంతకంటే ఏమి కావాలి?
మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బ్రిటిష్ పాలనా కాలం నాటి వందలాది నిరర్ధక చట్టాలను రద్దు చేసింది. సులభతర వ్యాపారానికి వీలు కల్పించే (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) మొదటి 50 దేశాల్లో ఒకటిగా భారత్ మారడమే మోదీ నేతృత్వంలో ఆర్థిక సంస్కరణలు మరింత వేగవంతంగా కొనసాగుతున్నాయనడానికి ఒక తిరుగులేని నిదర్శనం. మోదీ అధికారంలోకి రాకముందు ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో భారత్ 143వ స్థానంలో ఉండేది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అమలుచేయడం వల్ల మధ్య దళారులకు ఆస్కారం లేకుండా పోయింది. దీనివల్ల 27 బిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని ప్రభుత్వం ఆదా చేయగలిగింది. తొమ్మిదేళ్ల క్రితం తమ నిర్ణయాత్మక తీర్పు ద్వారా ప్రజలు సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందించినందువల్లే ఈ కాలంలో మోదీ సర్కార్ అనేక రంగాల్లో సంస్కరణలను ప్రవేశపెట్టగలిగింది. ‘సుస్థిరమైన ప్రభుత్వం మూలంగానే అనేక సంస్కరణలు ప్రవేశపెట్టగలిగాం. ఆర్థిక, బ్యాంకింగ్, విద్యా, సంక్షేమ రంగాల్లోనూ, డిజిటలైజేషన్ రూపంలోనూ అనేక సంస్కరణలు అమలు అయ్యాయి. దీని వల్ల సహజంగా అభివృద్ధికి బలమైన పునాదిపడింది. దేశంలో అత్యంత వేగంగా జరుగుతున్న అభివృద్ధి వల్ల మన దేశం పట్ల ప్రపంచ దేశాల్లో ఆసక్తి పెరిగింది. అనేక దేశాలు భారత దేశ అభివృద్ధి గాథను సన్నిహితంగా గమనిస్తున్నాయి. ఈ అభివృద్ధి అనేది యాదృచ్ఛికంగా జరిగింది కాదని, సంస్కరణలు, పనితీరు, పరివర్తనం అనే స్పష్టమైన కార్యాచరణతో కూడిన రోడ్ మ్యాప్ వల్లే ఇది సాధ్యపడిందని ఆ దేశాలు తెలుసుకున్నాయి’ అని ప్రధాని మోదీ తెపారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో క్రిమినల్ న్యాయవ్యవస్థలో కీలక సంస్కరణలను మోదీ ప్రభుత్వం ప్రతిపాదించింది. వలస కాలం నాటి భారతీయ శిక్షా స్మృతిని, సిఆర్‌పిసిని, భారతీయ సాక్ష్యాధారాల చట్టాన్ని సమూలంగా మార్చి క్రిమినల్ న్యాయవ్యవస్థను పటిష్ఠం చేయడం ఈ సంస్కరణల ప్రధాన ఉద్దేశం. కాంగ్రెస్ హయాంలో లా కమిషన్‌తో పాటు అనేక మంది న్యాయ నిపుణులు సూచించిన సంస్కరణలను బుట్టదాఖలు చేశారు. స్వాతంత్ర్య పోరాట కాలంలో దేశభక్తులను జైలు పాలు చేసేందుకు ఉద్దేశించిన రాజద్రోహ చట్టాన్ని కూడా కాంగ్రెస్ కొనసాగించింది. విచారణ లేకుండా లక్షలాది అమాయకులు జైళ్లలో మగ్గుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వాలు న్యాయవ్యవస్థలో ఎటువంటి సంస్కరణలు ప్రవేశపెట్టలేదు. అయితే శిక్షించడం కన్నా న్యాయం అందించడం ముఖ్యమన్న లక్ష్యంతో మోదీ సర్కార్ అనేక సంస్కరణలు ప్రతిపాదించింది. మహిళలు, పిల్లల పట్ల నేరాలు, దేశ సమగ్రతకు భంగం కలిగించే చర్యలు, వేర్పాటువాద ధోరణులను ఏ మాత్రం సహించని విధంగా చట్టాల్లో మార్పు చేసింది. పార్లమెంట్ స్థాయీ సంఘం పరిశీలనలో ఉన్న ఈ సంస్కరణలు చట్ట రూపం దాలిస్తే దేశ న్యాయవ్యవస్థలో కీలక మార్పులు జరిగి, ప్రజలకు సకాలంలో న్యాయం సమకూరుతుందనడంలో సందేహం లేదు.
ఇదే విధంగా దేశంలో ఎన్నికల సంస్కరణలను ప్రవేశపెట్టాలని, అందులో భాగంగా జమిలి ఎన్నికల గురించి యోచించాలని కూడా మోదీ ప్రభుత్వం భావిస్తోంది. నిజానికి జమిలి ఎన్నికల ప్రస్తావన కొత్తగా, అకస్మాత్తుగా ప్రభుత్వం తేవడం లేదు. 2014 బిజెపి ఎన్నికల మానిఫెస్టోలోనే జమిలి ఎన్నికల ప్రస్తావన ఉన్నది. మోదీ 2014లో అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే జమిలి ఎన్నికల గురించి పరిశీలించాల్సిందిగా ప్రధానమంత్రి కార్యాలయం ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది. ఎన్నికల కమిషన్ ఈ లేఖ ఆధారంగా ఒక నోట్ తయారు చేసి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి పంపింది. జమిలి ఎన్నికలు సమర్థనీయమేనని ఆ కమిటీ కూడా నివేదికను సమర్పించింది. రాష్ట్రపతి ప్రసంగాల్లోనూ జమిలి ఎన్నికల ప్రస్తావన వచ్చింది. ప్రధానమంత్రి ఎన్నోసార్లు తన ప్రసంగాల్లో జమిలి ఎన్నికల గురించి ప్రస్తావించారు. జాతీయ లా డే సందర్భంగా కూడా అయిదు సంవత్సరాల క్రితం ఈ విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2018 జనవరిలో బిజెపి కూడా జాతీయ స్థాయిలో ముంబైలో ఒకే దేశం – ఒకేసారి ఎన్నికలపై రెండు రోజుల సెమినార్‌ను నిర్వహించింది. 2017లో నీతీ ఆయోగ్ కూడా జమిలి ఎన్నికలపై చర్చా పత్రాన్ని రూపొందించింది. 2024 నాటికి జమిలి ఎన్నికలకు రంగం సిద్ధం చేయాలని ఈ చర్చాపత్రంలో సూచించారు. నరేంద్రమోదీ రెండవసారి ప్రధాని అయిన తర్వాత 2019 జూన్‌లో జమిలి ఎన్నికలపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. 40 పార్టీలను ఆయన ఈ సమావేశానికి ఆహ్వానిస్తే కేవలం 24 పార్టీలే హాజరయ్యాయి. కాంగ్రెస్, తృణమూల్‌తో పాటు పలు పార్టీలు ఈ సమావేశానికి హాజరు కాలేదు. వామపక్షాలతో సహా హాజరైన పార్టీలన్నీ జమిలి ఎన్నికల ప్రతిపాదనను వ్యతిరేకించలేదు. ఇన్నాళ్లకు మోదీ ప్రభుత్వం తాజాగా జమిలి ఎన్నికలను నిర్వహించే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని నియమించింది. అయితే ఈ కమిటీ ఏర్పాటు వెనుక ఉద్దేశాలను ప్రతిపక్షాలు ప్రశ్నించడం మొదలు పెట్టాయి. మోదీ సర్కార్‌కు ఉద్దేశాలను అంటగడుతూ కాంగ్రెస్ ఈ కమిటీ నుంచి తప్పుకుంది. అసలు కమిటీ సమావేశాలకు హాజరై చర్చల్లో పాల్గొనకుండానే ఈ దేశాన్ని కొన్ని దశాబ్దాల పాటు ఏలిన పార్టీ అలా చేయడమేమిటి? అంతకంటే బాధ్యతారాహిత్యం ఏమైనా ఉంటుందా? పైగా జమిలి ఎన్నికలు రాష్ట్రాలపై దాడిగా రాహుల్ గాంధీ అభివర్ణించారు. కాంగ్రెస్ హయాంలో మొదటి నాలుగు ఎన్నికలు జమిలిగా జరిగినప్పుడు రాష్ట్రాలపై దాడి జరిగినట్లా? దేశంలో మార్పును వ్యతిరేకించే అభివృద్ధి నిరోధకుల జాబితాలో కాంగ్రెస్ చేరిపోయిందనడంలో సందేహం లేదు. అందుకే ప్రజలు ఆ పార్టీని మాటిమాటికీ తిరస్కరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌కు మళ్లీ పరాభవం తప్పదు.
వై. సత్యకుమార్
(బీజేపీ జాతీయ కార్యదర్శి)
Updated Date - 2023-09-05T02:56:45+05:30 IST