గిరిజన ఉద్యోగాలపై రాజ్యాంగ సవరణ కీలకం
ABN, First Publish Date - 2023-10-26T01:18:01+05:30
షెడ్యూల్డ్ ప్రాంత స్థానిక గిరిజన అభ్యర్థులతోనే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ జేసేందుకు ఉద్దేశించిన ప్రభుత్వ జీవో 3ను సుప్రీంకోర్టు రద్దు చేసి మూడేళ్ళకు పైనే అయ్యింది...
షెడ్యూల్డ్ ప్రాంత స్థానిక గిరిజన అభ్యర్థులతోనే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ జేసేందుకు ఉద్దేశించిన ప్రభుత్వ జీవో 3ను సుప్రీంకోర్టు రద్దు చేసి మూడేళ్ళకు పైనే అయ్యింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఉపాధ్యాయ పోస్టులతో పాటు షెడ్యూల్డ్ ప్రాంత ఇతర ఉద్యోగ పోస్టులను భర్తీ జేసే ప్రక్రియకు కూడా తెర పడింది.
భారత రాజ్యాంగం ఐదవ పెడ్యూలు కింద రాష్ట్ర గవర్నర్ జనవరి 2000లో జారీ చేసిన జీవో 3 నోటిఫికేషన్‌ను చేబ్రోలు లీలా ప్రసాద్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై దాఖలు చేసిన కేసులో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏప్రిల్ 2020లో రద్దు చేసింది. దాంతో ఆదివాసీ జీవనోపాధి తెలుగు రాష్ట్రాలలో ప్రశ్నార్థకంగా మారింది. సుప్రీంకోర్టు తన తీర్పులో రాజ్యాంగ మౌలిక సమాన హక్కులకు విరుద్ధంగా జీవో3 ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని, నూరు శాతం షెడ్యూల్డ్ ప్రాంత స్థానిక గిరిజన అభ్యర్థులతో పోస్టులు భర్తీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని, అందువల్ల చెల్లనేరవని అన్నది. అలాగే ఆర్టికల్ 309 కింద జారీ అయిన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ నియామకాల నియమాలను సవరించే అధికారం ఐదవ షెడ్యూల్ పేరా 5(1) కింద గవర్నరుకు లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పుకు భిన్నంగా జీవో 3 స్థానే మరొక ఉత్తర్వు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే, 1986 నుంచి ఇప్పటివరకూ జీవో 3 కింద ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగ ఉత్తర్వులు కూడా రద్దవుతాయని సుప్రీంకోర్టు హెచ్చరించింది. అందువల్ల ఈ విషయంలో ప్రభుత్వాలు ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజమే! కానీ రాజ్యాంగ శాసనాల ద్వారానే పరిష్కారం వెతకాల్సి ఉంది.
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ, పునః సమీక్ష చేయాలని కోరుతూ 2020 లోనే ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. కానీ ఇప్పటివరకూ ఆదివాసీ అనుకూల ఉత్తర్వులు కోర్టు నుంచి వెలువడ లేదు. కాగా జీవో 3లో గల మౌలిక హక్కులు కొనసాగే విధంగా, రాజ్యాంగం ఐదవ పెడ్యూల్ పేరాగ్రాఫ్ 5(2) కింద రూపొందించిన నూతన రెగ్యులేషన్ ముసాయిదాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గిరిజన సలహా మండలి 2021లో ఆమోదించింది. అలాగే 371(డి) కింద రాష్ట్రపతి ఉత్తర్వు కోసం మరొక సవరణ ముసాయిదా రూపొందించింది. సుప్రీంకోర్టు తీర్పు రీత్యా ఉన్న న్యాయపర అడ్డంకులు విషయంలో రూపొందిన ముసాయిదాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి.
ఇతర రాష్ట్రాలపైన సుప్రీంకోర్టు తీర్పు పలు విధాలుగా ప్రభావాన్ని చూపించింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బస్తర్, సరగుజా డివిజన్ షెడ్యూల్డ్ ప్రాంతాల స్థానిక అభ్యర్థులు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు క్లాస్ (3), (4) జిల్లా కేడర్ పోస్టులకు అర్హులని రాజ్యాంగం ఐదవ షెడ్యూల్ పేరాగ్రాఫ్ 5(1) కింద గవర్నర్ 2012లో ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ నోటిఫికేషన్ 2021 వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవో 3పై ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగానే నందకుమార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం మధ్య నడిచిన కేసులో గవర్నర్ నోటిఫికేషన్ చెల్లదని ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర హైకోర్టు మే 2022లో తీర్పు ఇచ్చింది. అందువల్ల ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోనూ ఆదివాసీ ఉపాధి హక్కులు ప్రశ్నార్థకంగా మారాయి.
జార్ఖండ్ రాష్ట్రంలోనూ ఒక పదేళ్ళపాటు జిల్లా కేడర్ క్లాస్ (3), (4) పోస్టుల నియామకాలకు షెడ్యూల్డ్ ప్రాంత 13 జిల్లాల స్థానిక అభ్యర్థులు మాత్రమే అర్హులని రాజ్యాంగం ఐదవ పెడ్యూల్ పేరాగ్రాఫ్ 5(1) కింద గవర్నర్ 2016లో నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఈ నోటిఫికేషన్ రాజ్యాంగపరంగా చెల్లుబాటుతో పాటు వాటి ఆధారంగా నియమించిన ఉద్యోగాలను ప్రశ్నిస్తూ నాన్ షెడ్యూల్డ్ ప్రాంత అభ్యర్థులు జార్ఖండ్ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. కేసు విచారణలో ఆంధ్రప్రదేశ్ జీవో 3 కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఈ రిజర్వేషన్, దీని ద్వారా భర్తీ చేసిన పోస్టులు చెల్లవని హైకోర్టు తీర్పు ఇచ్చింది.
ఆ తీర్పును ప్రశ్నిస్తూ, ఉద్యోగాలకు అర్హత పొందిన షెడ్యూల్డ్ జిల్లాల అభ్యర్థులు కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సత్యజిత్ కుమార్ – జార్ఖండ్ రాష్ట్రం మధ్య నడిచిన కేసులో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఇప్పటికే ఉద్యోగాలు పొందిన వారి విషయంలో సానుకూలంగా, వాటిని రద్దు చేయకుండా సుప్రీంకోర్టు ఆగస్టు 2022లో ఉత్తర్వులు ఇచ్చింది. అందువల్ల ప్రస్తుతం నూరు శాతం షెడ్యూల్డ్ ప్రాంతాలలో రిజర్వేషన్ అమలు చేయడానికి కోర్టు తీర్పులు ఆటంకం కలిగిస్తున్నాయన్నది గమనించాలి.
మహారాష్ట్రలో కూడా గవర్నర్ 2019లో రాజ్యాంగం ఐదవ షెడ్యూల్ పేర 5(1) కింద షెడ్యూల్డ్ ప్రాంతాల్లో పేర్కొన్న సుమారు 17 రకాల ఉద్యోగాల (ఉపాధ్యాయ పోస్టులతో సహా) నియామకం అర్హత కలిగిన స్థానిక గిరిజన అభ్యర్థులతో భర్తీ చేయాలని నోటిఫికేషన్ జారీ చేశారు. షెడ్యూల్డ్ గ్రామంలో మొత్తం జనాభాలో 50శాతాన్ని మించి గిరిజన జనాభా ఉంటే నూరు శాతం పోస్టులు స్థానిక గిరిజన అభ్యర్థులతో భర్తీ చేయాలి. ఒక వేళ షెడ్యూల్డ్ గ్రామంలో మొత్తం జనాభాలో 25 నుంచి 50 శాతం మధ్య గిరిజన జనాభా ఉంటే 50 శాతం పోస్టులు స్థానిక గిరిజన అభ్యర్థులతో భర్తీ చేయాలి. షెడ్యూల్డ్ గ్రామంలో మొత్తం జనాభాలో 25 శాతం కంటే తక్కువగా గిరిజన జనాభా ఉంటే 25 శాతం పోస్టులు (కొత్వాల్, పోలీస్ పటేల్ మినహా) స్థానిక గిరిజన అభ్యర్థులతో భర్తీ చేయాలి. కొత్వాల్, పోలీస్ పటేల్ పోస్టులు జిల్లాలో ఉన్న రిజర్వేషన్ విధానం ప్రకారం మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలి. భర్తీ చేయబోయే పోస్టులలో 1/3 వంతు స్థానిక గిరిజన మహిళా అభ్యర్థులతో భర్తీ చేయాలి.
వాస్తవానికి ఐదవ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో స్థానిక ఆదివాసీ అభ్యర్థుల ప్రభుత్వ ఉద్యోగ కల్పన, నియామకాల విషయంలో సాధారణ నియమాలకు భిన్నంగా ప్రత్యేక రాజ్యాంగ సవరణలను తీసుకు రావాల్సి ఉంది. సుప్రీంకోర్టులో పెండింగులో ఉన్న తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల గిరిజన సంఘాల పిటిషన్‌పై తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియని విషయం. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ప్రధాన బాధ్యత తీసుకోవాలి. సమస్య పరిష్కారానికి చొరవ చూపాలి. కాగా షెడ్యూల్డ్ ప్రాంతాలలో నూరుశాతం స్థానిక ఆదివాసీ అభ్యర్థులకే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల కల్పన అంశంపై జాతీయ, ప్రాంతీయ పార్టీలు వాటి వైఖరిని వెల్లడించాలి.
డా. పల్లా త్రినాధరావు
Updated Date - 2023-10-26T01:18:01+05:30 IST