వైద్య విప్లవంపై విమర్శలా!
ABN, First Publish Date - 2023-08-01T03:45:41+05:30
‘ఎందుకిన్ని మెడికల్ కాలేజీలు?’ పేరిట ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో గురువారం డా. ఎస్. తిరుపతయ్య రాసిన వ్యాసం (27.07.2023) తెలంగాణ ప్రజలను అత్యంత బాధించేదిగా ఉన్నది...
‘ఎందుకిన్ని మెడికల్ కాలేజీలు?’ పేరిట ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో గురువారం డా. ఎస్. తిరుపతయ్య రాసిన వ్యాసం (27.07.2023) తెలంగాణ ప్రజలను అత్యంత బాధించేదిగా ఉన్నది. తెలంగాణ బిడ్డలకు డాక్టర్ చదువు ఎందుకు? తెలంగాణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు ఎందుకు? అని ప్రశ్నించినట్లు ఉంది. రాజకీయ అవసరాల కోసమే మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారంటూ తన కడుపులోని కుళ్లును రచయిత బయటపెట్టుకున్నారు. ఇది అత్యంత బాధాకరం.
రాష్ట్రం ఏర్పాటు తర్వాత రెండుసార్లు సాధారణ ఎన్నికలు జరిగాయి. ఏ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని ప్రకటించలేదు. పోనీ ఏ రాజకీయ పార్టీ కూడా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే డిమాండును తెరపైకి తేలేదు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రజలకు కనీసం వైద్య సదుపాయాలు అందని దారుణ పరిస్థితులు ఉండేవి. వైద్య విద్య అందని ద్రాక్షలా మారిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించాలని నిర్ణయించి, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే చారిత్రక నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రకటించడమే కాదు, కేంద్రం నుంచి ఎలాంటి మద్దతు లేకున్నా రాష్ట్ర సొంత నిధులతో కాలేజీలను ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం అమలు చేసిన తర్వాత జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ నినాదాన్ని ఒక విధానంగా తీసుకున్న కేంద్రం, దేశ వ్యాప్తం చేస్తామని ప్రకటించింది. నిజంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు రాజకీయ కోణంతో చేసిన అంశమే అయితే తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఉండేది. మేనిఫెస్టోలో చెప్పి, అమలు చేశామని ఎన్నికల సమయంలో ప్రచారం చేసుకుంటూ ఉండేది. ఎలాంటి రాజకీయ కోణం లేకుండా, ఎలాంటి స్వప్రయోజనాలు ఆశించకుండా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామనే లక్ష్యాన్ని ప్రకటించి, విజయవంతంగా అమలు చేసింది. దీంతో తెలంగాణ బిడ్డలు వైద్య విద్య కోసం చైనా, ఉక్రెయిన్, రష్యా వంటి దేశాలకు వెళ్లి ఇబ్బంది పడకుండా, స్థానికంగా ఉంటూనే డాక్టర్ కావాలనే కలను సాకారం చేసుకునే అవకాశం కలిగింది. తెలంగాణలో మెడికల్ కాలేజీల ఏర్పాటు వల్ల, ఏడాదికి పది వేల మంది డాక్టర్లు పట్టాలు తీసుకొని బయటికి వస్తారు. ఇది నిజం. అయితే వీరంతా తెలంగాణలోనే ఉండి వైద్య సేవలు అందిస్తారని, దీని వల్ల రాష్ట్రంలో డాక్టర్ల సంఖ్య పెరిగిపోతుందని అంటున్నారు తిరుపతయ్య. తెలంగాణలో చదివిన వైద్యులు ప్రపంచంలో అనేక దేశాల్లో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్నారు. దేశ ఖ్యాతిని చాటుతున్నారు. తెలంగాణ నుంచి ఏటా పది వేల మంది వైద్యులు బయటికి అడుగుపెడితే తెలంగాణ పేరు, దేశం పేరు మరింత పెరుగుతంది తప్పా మరొకటి కాదు.
మెడికల్ కాలేజీలు రావడం వల్ల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ అవుతాయన్న విషయాన్ని రచయిత విస్మరించారు. ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు కావడం వల్ల, టీచింగ్ ఆసుపత్రి ద్వారా 500 పడకల ఆసుపత్రి వస్తుంది. 35 పైగా స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, భూపాలపల్లి, నాగర్ కర్నూల్ వంటి మారుమూల జిల్లాల్లో కూడా మెడికల్ కాలేజీలు వస్తాయని, టీచింగ్ ఆసుపత్రులు వస్తాయని ఎవ్వరూ ఏనాడూ కూడా అనుకోలేదు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఆయా ప్రాంతాల్లో వైద్య విద్య అందుబాటులోకి రాగా, టీచింగ్ ఆసుపత్రుల ద్వారా స్పెషాలిటీ వైద్యం చేరువైంది. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా టీచింగ్ ఆసుపత్రులను అభివృద్ధి చేయలేదని రచయిత రాయడం సరికాదు. మెడికల్ కాలేజీలను తెచ్చుకోవడంతో పాటు, నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల మేరకు అన్ని అభివృద్ధి పనులను ప్రభుత్వం చేస్తున్నది. అందుకే ఏటా ఎన్ఎంసీ నుంచి మెడికల్ కాలేజీలకు అనుమతి లభిస్తున్నది. ఈ విషయంలో రచయిత తన అవగాహనా రాహిత్యాన్ని బయటపెట్టుకున్నారు. మహబూబ్‌నగర్ ప్రభుత్వ వైద్య కళాశాల గుర్తింపును ఎన్ఎంసీ రద్దు చేసిన విషయాన్ని ప్రస్తావించారు కానీ, నిబంధనల మేరకు సంతృప్తి చెందిన అదే ఎన్ఎంసీ వెంటనే అనుమతి ఇచ్చిన విషయాన్ని రచయిత మరిచిపోయారు.
జిల్లాల ఏర్పాటు, మెడికల్ కాలేజీల ఏర్పాటు వల్ల భూముల రేట్లు పెరగటం, రియల్ ఎస్టేట్ పుంజుకోవడం తప్ప మరేం ప్రయోజనం లేదని చెప్పడం దారుణమైన విషయం. ప్రజారోగ్యం దృష్ట్యా ఏర్పాటు చేసిన వైద్యాలయాలను రియల్ ఎస్టేట్ కోణంలో చూడటం ఒక వైద్యుడిగా రచయితకు తగదు. మెడికల్ కాలేజీలు రావడం వల్ల ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. కానీ ప్రత్యక్షంగా లభించే ప్రయోజనాలకు, ఆరోగ్యపరంగా ప్రజలకు అందే సేవలకు ఎలా విలువ కడుతారో రచయిత చెప్పగలరా?
తెలంగాణ ఏర్పడినప్పుడు కేవలం 5 ప్రభుత్వ, 15 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉండేవి. వీటిలో కేవలం 2850 ఎంబీబీస్ సీట్లు ఉండేవి. జనాభాకు, విద్యార్థుల అవసరాలకు తగ్గట్లుగా సీట్లు లేకపోవడం వల్ల విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వెళ్లాల్సి వచ్చేది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి గారి దార్శనికత వల్ల ప్రభుత్వ రంగంలో 34, ప్రైవేట్ రంగంలో 30 మెడికల్ కాలేజీలు ప్రస్తుతం ఉన్నాయి. దేశంలో లక్ష జనాభాకు 25 ఎంబీబీస్ సీట్లతో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. దీనివల్ల తెలంగాణ రాష్ట్ర వైద్య, వైద్య విద్య అవసరాలనే కాకుండా దేశ అవసరాలను కూడా తీర్చగలుగుతుంది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఒక రాజకీయ అంశంగా చూడటం కురచబుద్ధిని చాటుకోవడమే. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు కోణంలో, దేశ వైద్య అవసరాలను తీర్చే కోణంలో దీనిని చూడాలి. అప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత అర్థం అవుతుంది.
పుట్టా శ్రీనివాస్
మాజీ వైద్య విద్య సంచాలకులు
Updated Date - 2023-08-01T03:45:41+05:30 IST