భాషిణితో భాషల దశ మారుతుందా?
ABN, First Publish Date - 2023-09-08T01:01:48+05:30
మాతృభాషల్లో ఉన్నత విద్యా బోధన గురించి ప్రధానమంత్రి నుంచి కేంద్ర ప్రభుత్వ పెద్దలందరూ ఈ మధ్య తరచూ మాట్లాడుతున్నారు. దీనంతటికీ కారణం..
మాతృభాషల్లో ఉన్నత విద్యా బోధన గురించి ప్రధానమంత్రి నుంచి కేంద్ర ప్రభుత్వ పెద్దలందరూ ఈ మధ్య తరచూ మాట్లాడుతున్నారు. దీనంతటికీ కారణం.. కేంద్రం అమలుపరుస్తోన్న నూతన జాతీయ విద్యావిధానం. సరళీకృత ఆర్థిక విధానాలు మొదలైన 30 ఏళ్ల తర్వాత మాతృభాషల గురించి ఇంత ఎక్కువగా మాట్లాడటం అధికార పక్షం నుంచి ఇప్పుడే జరుగుతోంది. సరళీకృత విధానాలు మొదలుపెట్టినప్పుడు దేశంలో ఇంగ్లిషు మాట్లాడగలిగిన యువత పెద్ద సంఖ్యలో ఉండటం గురించి గొప్పగా చెప్పారు. ఇది తప్పని ఆనాడు అనిపించలేదు. ఇప్పుడు స్వరం మారుతోంది. అవసరం ఏదైనా మాతృ భాషలకు పాధాన్యం ఇవ్వాలనుకోవటం మంచిదే. అన్నింట్లోనూ చైనాతో పోటీపడుతున్న మనం మాతృభాష విషయంలో అక్కడేం జరిగిందో తెలుసుకోవటం అవసరం. దాంతో పాటు అక్కడి ఇంగ్లిషు వ్యవహారాల్ని పరిశీలిస్తే బోలెడు సంగతులూ తెలుస్తాయి. అక్కడ మావో ఉన్నంత వరకూ చైనా భాషకు ఇచ్చిన ప్రాధాన్యం మరో భాషకు ఇవ్వలేదు. సరళీకృత ఆర్థిక విధానాలను చేపట్టి ప్రపంచ మార్కెట్ వైపు చూడటం మొదలుపెట్టాక చైనాలో కూడా ఇంగ్లిష్ భాష ప్రభావం చాలానే పెరిగింది. అమెరికాతో పాటు ఇతర ధనిక దేశాల మార్కెట్లలోకి చొచ్చుకుపోవాలంటే ఇంగ్లిషుపై శ్రద్ధ పెట్టాలి. దాన్ని అనుకున్న రీతిలో పూర్తిచేశారు. అక్కడి జనాభాతో పోల్చితే ఇంగ్లిషుపై పట్టు సాధించిన వాళ్ల సంఖ్య చాలా తక్కువే కావచ్చు. కానీ అది వాసి పరంగా ప్రభావవంతమైంది.
భారత్‌లా సుదీర్ఘకాలం వలసపాలన కింద చైనా ఏనాడూ లేదు. ఓడరేవులను, వ్యాపార కేంద్రాలను, హాంగ్‌కాంగ్ లాంటి భూభాగాలపై పాశ్చాత్య దేశాలు అజమాయిషీ సంపాదించినా పూర్తిగా చైనా ఏ దేశం అదుపులోకి రాలేదు. మావో సారథ్యంలో విప్లవం విజయవంతమైన తర్వాత ఏ భాషలో పరిపాలన సాగాలి? చదువును ఏ భాషలో చెప్పాలి? లాంటి ప్రశ్నలు అక్కడ తలెత్తలేదు. అత్యంత కల్లోల దశాబ్దాల్లోనూ చైనా భాష స్థానంలో మరో భాష అక్కడ వేళ్లూనుకోలేదు. భారత్ పరిస్థితి అందుకు పూర్తి భిన్నం. రెండు వందల ఏళ్ల బ్రిటిషు పాలన ఇంగ్లిషు ఆధిపత్యాన్ని నెలకొల్పింది. పరిపాలన, బోధనా భాషగా ఇంగ్లిషుని కొనసాగించాలా? వద్దా? అని రాజ్యాంగ పరిషత్తులో తీవ్రంగా చర్చలు జరిగాయి. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. ఇంగ్లిషు స్థానంలో హిందీని తీసుకురావాలన్న ప్రయత్నాన్ని దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. మధ్యేమార్గంగా కొంతకాలంపాటు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఇంగ్లిషుని కొనసాగించటానికి అంగీకారం కుదిరింది. ఆ తర్వాత ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. ఉత్తరాదిలో హిందీ వాడకం పెరిగినా ఇంగ్లిషు ఆధిపత్యం తగ్గలేదు. దక్షిణాదిన ప్రాంతీయ భాషల వాడకం పెరిగినా ఇంగ్లిషు ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. ఆర్థికంగా, సామాజికంగా పైమెట్లు ఎక్కటానికి ఇంగ్లిషు అన్నిచోట్లా దోహదం చేసింది. ఇంగ్లిషు సహజ గొప్పతనంగా దీన్ని భావించలేం. ఆ భాష ద్వారా లభించే విజ్ఞానం, మెళకువలు, నేర్పరితనం, కొత్త భావాల సంపర్కం.. ఆధిక్యతకు తోడ్పడ్డాయి. అగ్రకులాలకు అప్పటికే ఉన్న ఆధిక్యతను ఇంగ్లిషు మరింత సుస్థిరం చేసింది. దిగువ, మధ్యతరగతి ప్రజల్లో ఇంగ్లిషుపై పెరుగుతున్న మక్కువను ఈ ఆధిక్యతను అందుకునే ప్రయత్నంగా చూడటం మొదలైంది.
ఈ నేపథ్యంలో ఇంగ్లిషు ఆధిపత్యాన్ని తగ్గించే ప్రయత్నాలు మాటల్లో అయినా మొదలయ్యాయి. కృత్రిమ మేధ సహాయంలో మాతృభాషల్లోకి శాస్త్ర, సాంకేతిక రచనలన్నీ సులభంగా వచ్చేస్తాయనే ఆశాభావం ఇందులో భాగమే. కృత్రిమ మేధ ఆధారంగా భాషాంతరీకరణ కోసం ‘భాషిణి’ అనే వేదికను ఏర్పాటు చేస్తున్నామని మోదీ ప్రకటించటమే దీనికి నిదర్శనం. ఇది ఏ ఫలితాలను ఇస్తుందో ఇప్పుడే చెప్పలేం. కృత్రిమమేధ సాయంతో ఇప్పటికే అందుబాటులో ఉన్న భాషాంతరీకరణ వేదికలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. కృతకమైన వ్యక్తీకరణలతో ప్రస్తుతం అవి అనేక ఇబ్బందులను సృష్టిస్తున్నాయి. కాలక్రమంలో ఈ ఇబ్బందులన్నీ తొలగినా తొలగొచ్చు. భాషాంతరీకరణకు కావాల్సింది పదసృష్టి, పద ఎంపిక, మాతృభాషలో సులభ వ్యక్తీకరణ. ఈ మూడు ఉంటే వ్యవహారం తేలికవుతుంది. ఇది సజావుగా జరగాలంటే మంచి నిఘంటువులు ఉండాలి. వాటిని నిరంతరం నవీకరించాలి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో పుడుతున్న కొత్త భావనలను, పద సృష్టిని ఎప్పటికప్పుడు తనలో ఇముడ్చుకునే విధంగా ఆ నవీకరణ ఉండాలి. అందుకు చైనాలో ఏం జరిగిందో తెలుసుకుంటే కొంతలో కొంత మనముందున్న సవాళ్లు అర్థమవుతాయి. ఇంగ్లిషు నిఘంటువులు సమాజంలో జరిగే అన్ని మార్పులను ఏదో విధంగా ప్రతిబింబిస్తాయి. తరచూ వాటిని నవీకరిస్తారు. అందులో భాగంగా శాస్త్ర, సాంకేతిక, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి అయిన అన్ని భావాలకూ వాటిలో చోటు లభిస్తుంది. ఈ రకమైన మార్పులతో బాగా సమగ్రంగా ఉండేవి ఆక్స్‌ఫడ్ నిఘంటువులు. లాంగ్‌మన్, కాలింజ్, కేంబ్రిడ్జి, వెబ్‌స్టర్ డిక్షనరి కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఆక్స్‌ఫడ్ అడ్వాన్స్‌డ్ లెనర్స్ డిక్షనరినే ఉదాహరణగా తీసుకుందాం. దీన్ని సాధారణంగా అయిదేళ్లకు ఒకసారి నవీకరిస్తారు. దీంట్లో ఉండే ఇంగ్లిషు పదాలకు, ఉదాహరణ వాక్యాలకు తెలుగు సమాన పదాలు, వాక్యాలు ఇస్తే ఉండే ఉపయోగం అంతా ఇంతాకాదు. ఇంతవరకూ ఈ ప్రయత్నం తెలుగులో జరగలేదు. ఇతర భారతీయ భాషల్లో ఎవరైనా చేశారేమో తెలియదు. చైనాలో ఇప్పటికే ఆక్స్‌ఫడ్ అడ్వాన్స్‌డ్ లెనర్స్ డిక్షనరికి చెందిన పలు ఎడిషన్లను తత్సమాన చైనా పదాలతో, వాక్యాలతో తయారు చేసుకున్నారు. మూల నిఘంటువులోని ఇంగ్లిషు పదాలను, వాటికిచ్చిన అర్థవివరణలను యథాతథంగా ఉంచుతూ పక్కనే చైనా పదాల్లో వాటిని వివరించారు. కన్‌సైజ్ ఆక్స్‌ఫడ్ ఇంగ్లిషు డిక్షనరి విషయంలోనూ ఈ పద్ధతినే అనుసరించారు. లాంగ్‌మన్ డిక్షనరినీ అదే ఒరవడిలో మార్చుకున్నారు. ఇట్లా చెప్పుకుంటే పోతే జాబితా చాలా ఉంటుంది.
మన దగ్గర కూడా ఒక ప్రయత్నం జరిగింది. 1970ల్లోనే ఆక్స్‌ఫడ్ కన్‌సైస్ డిక్షనరినీ తెలుగు అర్థవివరణలతో రూపొందించారు. వివరణలన్నీ అర్ధగ్రాంథికంలో, ఏకరూపత లేకుండా కఠినంగా ఉండటంతో అప్పుడే చాలా విమర్శలు వచ్చాయి. రాచమల్లు రామచంద్రారెడ్డి అయితే అందులో వాడిన తెలుగు పదాలను చీల్చిచెండాడారు. 2001లో భాషను సరళీకరించి రెండో ముద్రణగా ప్రచురించారు. కానీ ఇంగ్లిషు పదాలను ఎలా పలకాలో ప్రతి పదానికి పక్కనే ఉండాల్సిన ఉచ్చారణ సూచికలు లేకుండానే రెండో ముద్రణనూ తెచ్చారు. మొదటి రెండో ముద్రణలకు మధ్య 20 ఏళ్లకు పైగా అంతరం ఉంది. ఆ కాలంలో వేల కొత్త పదాలు వాడుకలోకి వచ్చాయి. అవేమీ నిఘంటువులోకి ఎక్కలేదు. ఇంటనెట్ అనే పదమే అందులో లేదు. భాషాంతరీకరణలో చైనాతో పోల్చితే మనం ఎక్కడో ఉన్నామనటానికీ ఇదే నిదర్శనం. స్వంత భాషల్లో ఆధునిక విజ్ఞానానికి అక్షరరూపం ఇచ్చిన, ఇస్తోన్న దేశాలన్నీ చైనా చేసినట్టే చేశాయి.
కొందరు వ్యక్తులు సంస్థలంత స్థాయిలో చేసిన కొన్ని మంచి ప్రయత్నాలు తెలుగునాట జరిగాయి. 170 ఏళ్ల క్రితం సీపీ బ్రౌన్ తయారుచేసిన ఇంగ్లిషు–తెలుగు, తెలుగు–ఇంగ్లిషు నిఘంటువులకు సరితూగ గలిగినవి ఇప్పటికీ ఉన్నాయని చెప్పలేం. ఆ నాటికి ఇంగ్లిషు పదాల ఉచ్చారణ అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రామాణి కతను సంతరించుకోలేదు. ఇంగ్లిషు డిక్షనరి నిర్మాణమే అప్పటికి ఇంకా ప్రాథమిక దశలో ఉంది. ఆ పరిమితి ఉన్నప్పటికీ చాలా పదాలకు బ్రౌన్ సూచించిన ఉచ్చారణలు ఇప్పటికీ ఆమోదనీయంగానే ఉన్నాయి. ఇంగ్లిషు–తెలుగు నిఘంటువులు ప్రస్తుతం మార్కెట్‌లో చాలా ఉన్నాయి. కానీ ఆక్స్‌ఫడ్ డిక్షనరిలకు ఏవీ దరిదాపుల్లో లేవు. ఇంగ్లిషులో పదాలకు కనీసం ప్రామాణిక ఉచ్చారణలను సరిగా ఇచ్చిన నిఘంటువులు ఉన్నాయని చెప్పుకోలేం. ఇంగ్లిషు పదాల ఉచ్చారణలను పర భాషీయులు యథాతథంగా ఉచ్చరించటం అన్ని సందర్భాల్లోనూ జరగదు. కనీసం సరైన ఇంగ్లిషు ఉచ్చారణ ముందుగా ఇచ్చి, వాటిని ఇక్కడ ఎలా పలుకుతున్నామో వివరించటం ఒక పద్ధతి. దీన్ని కూడా మనం చేయలేకపోయాం.
ఆక్స్‌ఫడ్ ఇంగ్లిషు డిక్షనరిలో ఏ పది పేజీలను తిరగేసినా మన ఉచ్చారణ మూల ఉచ్చారణకు ఎంత దూరంగా ఉందో ఇట్టే తెలిసిపోతుంది. మనం బౌల్, బౌలింగ్ అని రాస్తాం. కానీ బోల్, బోలింగ్ అని అనాలి. కరిజ్మా అనాల్సిన దాన్ని కొన్నాళ్లు మనం ఛరిష్మా, ఈ మధ్య కరిష్మా అని పలుకుతున్నాం. యాబ్‌సలూట్లికి ఆబ్‌సొలూట్లీ అనీ అబ్యూస్‌కి అబ్యూజ్ అనీ, అకాడింగ్‌ని ఎకార్డింగ్ అనీ, యాక్యరేట్‌ని యాక్యురేట్ అనీ, విలిజ్‌ని విలేజ్ అనీ, కాలిజ్‌ని కాలేజ్ అనీ అక్యూజ్‌ని ఎక్యూజ్ అనీ అకనాలిజ్‌ని ఎకనాలిడిజ్ అనీ, యాడిక్‌వట్‌ని యాడిక్‌వేట్ అనీ, యాజిక్టివ్‌ని యాడ్‌జెక్టివ్ అనీ అడ్వాన్‌టిజ్‌ని ఎడ్వాంటేజ్ అనీ అగోని ఎగో అనీ, అగ్రిమంట్‌ని ఎగ్రిమెంట్ అనీ ఏమ్‌ని ఎయిమ్ అనీ ఏర్‌ని ఏయిర్ అనీ ఆమండ్‌ని ఆల్మండ్ అనీ ఒ(అ)ల్‌వేజ్‌ని ఆల్‌వేస్ అనీ యామటర్‌ని అమెచ్యూర్ అనీ యాంబ్యలన్స్‌ని అంబ్యూలెన్స్ అనీ ఉచ్చరిస్తున్నాం. బాంబుగా మనం పిలిచేదాన్ని బామ్ అని ఉచ్చరించాలని మాత్రమే నిఘంటువులో ఉంటుంది.
నిరంతరం అభివృద్ధిచెందే విజ్ఞానాన్ని మాతృభాషల్లోకి అనువదించుకోవటం ఏ దేశానికైనా అత్యవసరమే. ఇప్పుడున్న తరహాలోనే మనం వెళితే ఇంగ్లిషు ఆధిపత్యం ఏ మాత్రం తగ్గదు. ఘనంగా వండి వార్చిన ఇంగ్లిషు నిఘంటువుల్లోని పదాలకే సమానార్థకాలను రూపొందించటంలోనే మనం తడబడుతున్నాం. భాషాంతరీకరణ ఒక స్థాయి వరకే ఉంటుంది. సొంత విజ్ఞానాభివృద్ధికి అది ప్రత్యామ్నాయం కాదు. రెండూ ఏకకాలంలో జరగకపోతే ఏదీ సమగ్రంగా ముందుకు వెళ్లదు. చైనా, జపాన్, దక్షిణ కొరియాల్లో రెండూ సమాంతరంగా జరిగాయి.
రాహుల్ కుమార్
(ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్)
Updated Date - 2023-09-09T01:08:43+05:30 IST