ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మందుల మాయ!

ABN, First Publish Date - 2023-03-03T00:45:01+05:30

గాంబియాలో డెబ్బైమంది పిల్లల మరణాలకు కారణమైన హర్యానాకు చెందిన మెయిడెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ కంపెనీ డైరక్టర్లు ఇద్దరికి స్థానిక న్యాయస్థానం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

గాంబియాలో డెబ్బైమంది పిల్లల మరణాలకు కారణమైన హర్యానాకు చెందిన మెయిడెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ కంపెనీ డైరక్టర్లు ఇద్దరికి స్థానిక న్యాయస్థానం పదేళ్ళక్రితం నాటి మరో కేసులో ఇటీవల జైలు శిక్షవిధించింది. వియత్నాంకు నాణ్యతలేని మందులు ఎగుమతిచేసిన నేరం ఇది. 2013లో నలభైకి పైగా భారతీయ మందుల కంపెనీలను వియత్నాం ఈ కారణంతో బ్లాక్‌లిస్టులో పెట్టింది. మిగతా ప్రపంచం ముందు మనకు తలవొంపులు తెచ్చిన ఈ కంపెనీలను తీవ్రంగా శిక్షించండి అంటూ అప్పట్లో ఆ దేశంలోని భారతరాయబారి ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో, ఈ కంపెనీ మందుల్ని పరీక్షిస్తే అవి నాణ్యతలేనివిగా తేలాయి. కేసు పదేళ్ళపాటు నత్తనడకనడిచి ఇప్పుడు న్యాయస్థానం డైరక్టర్లు ఇద్దరికీ రెండున్నరేళ్ళ జైలుశిక్ష, ఓ లక్షరూపాయల నష్టపరిహారం విధించింది. అంతటిపాపానికి ఈ శిక్ష సరిపోతుందా, ఉన్నతన్యాయస్థానాల్లో ఈ కేసు నిలబడుతుందా అన్న ప్రశ్నలు అటుంచితే, ఐదునెలలక్రితం గాంబియా ఘటన వెలుగుచూసినప్పుడు ఈ కంపెనీని మన అధికారులు, పాలకులు ఎంత కాపాడుకొచ్చారో తెలిసిందే.

ఈ కంపెనీ తయారుచేసిన నాలుగు దగ్గుమందులు గాంబియాలో పిల్లల ప్రాణాలు తీసినప్పుడు ప్రపంచ ఆరోగ్యసంస్థ ఈ భారతీయ కంపెనీ మందులతో జాగ్రత్త అంటూ యావత్‌ ప్రపంచాన్ని హెచ్చరించింది. ఆ పిల్లల మరణాలకు ఈ కంపెనీ దగ్గు మందులకు సంబంధం లేదనీ, ప్రభుత్వ ల్యాబరేటరీల్లో వీటిని పరీక్షిస్తే అవి ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నట్టు తేలిందని ప్రపంచ ఆరోగ్యసంస్థకు మన డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ (డీసీజిఐ) అప్పట్లో లేఖ రాశారు. ఈ మందుల్లో విషపూరిత ఇథలైన్‌ గ్లైకాల్‌, డై ఇథలైన్‌ గ్లైకాల్‌ లేవని మన నియంత్రణ సంస్థలు సదరు కంపెనీకి క్లీన్‌ చిట్‌ ఇచ్చినా, ఆరోగ్యసంస్థ జెనీవాలో నమూనాలను పరీక్షింపచేస్తే సదరు రసాయనాలు అధికమోతాదుల్లో ఉన్నట్టు తేలింది. మందులే కాదు, పరీక్షలూ ప్రమాణాలూ కూడా నకిలీయేనన్నమాట. గాంబియా అత్యున్నతస్థాయి నివేదిక కూడా మేడిన్‌ ఇండియా మందులే ఈ దారుణానికి కారణమని నిర్థారించింది. ఈ దారుణం జరిగిన కొద్దినెలల్లోనే ఉజ్బెకిస్థాన్‌లో ఇరవైమంది పిల్లల మరణాలకు మరో భారతీయ కంపెనీ మేరియన్‌ బయోటెక్‌ దగ్గుమందులు కారణమైనాయి. ఉజ్బెకిస్థాన్‌తోపాటు ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకొని ఈ మేడిన్‌ ఇండియా మందుల జోలికి పోవద్దంటూ ఘాటైన వ్యాఖ్యలతో ప్రపంచదేశాలన్నింటినీ హెచ్చరించింది.

మేడిన్‌ ఇండియా దగ్గుమందుల్లో డై ఇథలైన్‌ గ్లైకాల్‌ (డీఈజీ) దుర్వినియోగం పతాకస్థాయిలో ఉన్నదని 1998లో గుర్గావ్‌లో ముప్పైఆరుమంది మరణం నుంచి 2020లో పన్నెండుమంది చిన్నపిల్లల మరణం వరకూ దేశవ్యాప్తంగా కనీసం అరడజను ఘటనలు రుజువుచేశాయి. ఇక్కడిపిల్లల చావులు కానీ, వియత్నాంలో పోయిన పరువుకానీ, గాంబియా ఘటనకానీ మనను దారినపెట్టకపోవడంతో ఉజ్బెకిస్థాన్‌ ఉదంతం జరిగింది. నలభై ఆరుకంపెనీలమీద వియత్నాంలోని మన రాయబారి ఫిర్యాదు చేస్తే, ఇప్పుడు మెయిడెన్‌ ఫార్మా అధిపతులకు స్థానిక కోర్టు వేసిన ఓ చిన్న శిక్ష తప్ప, ఎన్ని కంపెనీలమీద ప్రభుత్వం చర్యలు చేపట్టిందో తెలియదు. మెయిడెన్‌ ఫార్మా కనీసం నలభైదేశాలకు మందులు ఎగుమతి చేస్తున్నది. మేరియన్‌ బయోటెక్‌ కూడా చాలా ఆఫ్రికన్‌, లాటిన్‌ అమెరికన్‌ దేశాలకు ఎగుమతులు చేస్తున్నది. ఇటువంటి కంపెనీలు చేస్తున్న పాపానికి దేశం అంతర్జాతీయ సమాజం ముందు తలదించుకోవలసి వస్తున్నది.

భారతదేశాన్ని మన పాలకులు ‘ప్రపంచ ఫార్మసీ’గా అభివర్ణిస్తారు. తక్కువ రేటుకు గ్లోబల్‌స్థాయి మందులు ఉత్పత్తిచేస్తున్నదని ఘోషిస్తుంటారు. కొవిడ్‌ కాలంలో కోట్లాది వాక్సిన్‌ డోసులు డెబ్బైదేశాలకు అందించినందుకు మనందరినీ గర్వపడమంటారు. కానీ, నకిలీ, నాణ్యతలేని మందుల తయారీ కారణంగా భారతఫార్మారంగం పరువుపోతున్నదని ఎవరైనా హెచ్చరిస్తే వారిని దేశద్రోహులుగానో, భారత వ్యతిరేక చైనాకుట్రలో భాగస్వాములుగానో ముద్రవేస్తారు. మెయిడెన్‌ వంటి సంస్థలను నియంత్రించి మేడిన్‌ ఇండియా మందుల గౌరవాన్ని పెంచాలన్న మాటలు వారికి రుచించడం లేదు. ఉన్న చట్టాలన్నీ రద్దయిపోతూ, తనిఖీలూ నిఘాలూ నియంత్రణలకు నూకలు చెల్లుతున్న కాలం ఇది. లక్షలకోట్ల రూపాయల ఎగుమతులు చేస్తున్న ‘ప్రపంచ ఫార్మసీ’ పరువు నిలబెట్టాల్సిన బాధ్యత పాలకులమీద ఉంది.

Updated Date - 2023-03-03T00:45:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!