ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికల బడ్జెట్‌

ABN, First Publish Date - 2023-02-02T00:46:27+05:30

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్‌ సరికొత్త వడ్డింపులేవీ లేకుండా, ఒకింత జనరంజకంగా ఉంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్‌ సరికొత్త వడ్డింపులేవీ లేకుండా, ఒకింత జనరంజకంగా ఉంది. ఆయా రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది సార్వత్రక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌ రూపొందిన విషయం స్పష్టంగా తెలుస్తోంది. సార్వత్రక ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం ప్రతిపాదించే చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ ఇదే కావడం వల్ల, పన్నుల రూపంలో ఏ వర్గంపైనా అదనపు భారం మోపే ప్రయత్నం చేయలేదు. మధ్యతరగతికి బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం దక్కింది. వేతన జీవులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, వయోవృద్ధులు, మహిళలకు ప్రయోజనం చేకూర్చే పలు చర్యలున్నాయి. వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయిపు పరిమితిని రూ.3 లక్షలకు పెంచడం వీటిలో ప్రధానమైనది. గత కొన్నేళ్లుగా ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగి, మధ్యతరగతి ప్రజల నడ్డి విరిగింది. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని కనీసం రూ.5 లక్షలకు పెంచాలని వేతనజీవులు ఎంతోకాలంగా కోరుతున్నారు. గత నాలుగు బడ్జెట్లలోనూ దాని జోలికి పోని నిర్మలా సీతారామన్‌ ఈ సారి కాస్తంత కరుణ చూపించారు. పెరిగిన ద్రవ్యోల్బణంతో పోల్చితే ఇప్పుడు ఇచ్చిన మినహాయింపు నిజానికి తక్కువే. ఇక, పన్ను శ్లాబ్‌లను ఆరు నుంచి ఐదుకి కుదించడం వల్ల ఆయా శ్లాబ్‌లలో ఉన్న వారికి కొంత ప్రయోజనం చేకూరుతుంది. కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి కూడా ఆర్థికమంత్రి కాస్తంత ఉపశమనం కల్పించారు.

ప్రభుత్వేతర సంస్థల్లో పనిచేసి రిటైరవుతున్న వారు పొందే లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ ప్రయోజనంపై పన్ను మినహాయింపు పరిమితిని రూ.25 లక్షలకు పెంచడం రిటైర్డ్‌ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే చర్య. దీనివల్ల మధ్యతరగతి జీవుల చేతికి అదనపు నిధులు అందుబాటులోకి వస్తాయి. బడ్జెట్‌లో వయోవృద్ధులు, మహిళలపై కూడా ఆర్థికమంత్రి దృష్టి సారించారు. సీనియర్‌ సిటిజెన్స్‌ సేవింగ్‌ స్కీమ్‌లో డిపాజిట్‌ చేయదగిన సొమ్ము గరిష్ఠ పరిమితిని రెట్టింపు చేయడం వల్ల వారికి వడ్డీ రూపంలో అదనపు ఆదాయం దక్కుతుంది. వారిలో ఎక్కువ మంది నెలవారీ పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెడుతూంటారు కనుక, డిపాజిట్‌ పరిమితిని గతంతో పోల్చితే రెట్టింపు చేయడం ద్వారా డిపాజిటర్లకు అదనపు వడ్డీ ఆదాయం లభించేట్టు చేశారు. మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ ద్వారా వయోజనులైన మహిళలు రూ.2 లక్షల గరిష్ఠ పరిమితికి లోబడి డిపాజిట్‌ చేసి 7.5 శాతం స్థిర వార్షిక వడ్డీ పొందవచ్చు. పాక్షిక ఉపసంహరణ సదుపాయం వారికి అవసరంలో ఉపకరిస్తుంది.

అధికారంలోకి వచ్చినప్పటినుంచి మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టిన మోదీ ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ‘సప్తర్షుల’ పేరిట ఏడు ప్రాధాన్యతాంశాలను ప్రకటించింది. అందులో వ్యవసాయం, మౌలిక వసతులు, హరిత రవాణా వసతులు, డిజిటల్‌ మౌలిక వసతులకు పెద్ద పీట వేశారు. వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని రూ.20 లక్షల కోట్లకు పెంచడంతో పాటు, ఆ రంగంలో స్టార్టప్‌లకు ప్రయోజనం చేకూర్చే యాక్సిలరేటెడ్‌ ఫండ్‌ ఏర్పాటు, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే పీఎం ప్రణామ్‌ వంటి పథకాలు బడ్జెట్‌లో ఉన్నాయి. స్టార్టప్‌లకు అందిస్తున్న పన్ను రాయితీల గడువు మరో ఏడాది పొడిగించడం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగానికి రూ.9,000 కోట్లతో నవీకరించిన రుణ హామీ పథకాన్ని ప్రకటించడం ఉపాధి రంగానికి ఊతాన్నిచ్చే చర్యలు. అదనంగా రూ.2 లక్షల కోట్ల వరకు హామీ రహిత రుణాలు ఒక శాతం తక్కువ వడ్డీకే అందుబాటులోకి రావడం ఎంఎస్‌ఎంఈలకు ఉపకరిస్తుంది. మౌలిక వసతుల రంగంపై పెట్టుబడులు రూ.10 లక్షల కోట్లకు, రైల్వే కేటాయింపులు రూ.2.4 లక్షల కోట్లకు పెంచడం ఆయా రంగాలను ఉత్తేజితం చేయడంతోపాటు, అదనపు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. ఇక, ఈ ఏడాదికి విత్తలోటు లక్ష్యాన్ని సవరించిన అంచనాల కింద జీడీపీలో 6.4 శాతంగా కొనసాగిస్తూ వచ్చే ఏడాదికి దాన్ని 5.9 శాతానికి, 2025–-26 నాటికి 4.5 శాతానికి కుదించనున్నట్టు ఆర్థికమంత్రి చెబుతున్నారు. ఆర్థిక క్రమశిక్షణ కట్టు తప్పకుండానే మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు తీర్చేందుకు నిర్మల ఈ బడ్జెట్‌ ద్వారా ఎంతోకొంత ప్రయత్నించారు.

Updated Date - 2023-02-02T00:49:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising