సమానత్వం సమాధి కాలేదా?
ABN, First Publish Date - 2023-01-20T00:29:19+05:30
స్వాతంత్య్రం.. సమభావం.. సౌభ్రాత్రం.. సౌహార్దం.. పునాదులై ఇళ్లులేచి... గొప్ప కవితా పాదాలు కదూ! ఆనాటి సోవియట్ రష్యా శ్రీశ్రీ లాంటి కవులతో గొప్ప కవితాగానాన్ని చేయించింది...
స్వాతంత్య్రం.. సమభావం.. సౌభ్రాత్రం.. సౌహార్దం.. పునాదులై ఇళ్లులేచి...
గొప్ప కవితా పాదాలు కదూ! ఆనాటి సోవియట్ రష్యా శ్రీశ్రీ లాంటి కవులతో గొప్ప కవితాగానాన్ని చేయించింది. స్వాతంత్య్రం, సమభావం, సౌభ్రాతృత్వం పునాదులై రష్యాలో ఒక నూతన సమాజం వికసిస్తోందని ఎందరో నమ్మారు. అలాంటి సమాజాల కోసం తమ శక్తియుక్తులు ధారపోశారు. నిజానికి స్వాతంత్య్రం, సమభావం, సౌభ్రాతృత్వం.. అన్నవి ఫ్రెంచ్ విప్లవ ఆకాంక్షలు. ఫ్రెంచ్ విప్లవం ఎప్పుడో 1789లో జరిగింది. అప్పటి నుంచి ఎన్నో ఉద్యమాలు. ఎన్నో ఆందోళనలు. ఎన్నో హింసాత్మక పోరాటాలు. ఎన్నో అహింసాత్మక నిరసనలు! ఆ ఆకాంక్షలు సమపాళ్లలో కలసిన సమాజం ఇప్పటికీ ఏర్పడలేదు. స్వేచ్ఛ ఉన్న చోట సమానత్వం అంతంత మాత్రమైంది. సమసమాజం పేరుతో ఏర్పడిన రాజ్యాల్లో స్వేచ్ఛ కనుమరుగైంది. ఎన్నో ఆశలురేపిన రష్యా, తూర్పు యూరపు దేశాల్లోని సోషలిస్టు ప్రభుత్వాలు 1989 తర్వాత పేకమేడల్లా కూలిపోయాయి. అంతకు ముందు దాదాపు పదేళ్ల కిందట అమెరికాలో రోనాల్డ్ రీగన్, బ్రిటన్‌లో మార్గరెట్ థాచర్‌లు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన సంక్షేమ రాజ్య పునాదులను కూల్చటం మొదలుపెట్టారు. వ్యాపారాన్నీ, పరిశ్రమలనూ ప్రభుత్వాలు నియంత్రించటం వల్లే ఆర్థికాభివృద్ధి మందగించిందన్న ప్రచారం మొదలైంది. వ్యాపార అనుకూల విధానాల రూపకల్పనకే ప్రభుత్వం పరిమితం అవ్వాలని ఆర్థికవేత్తలు వాదించారు. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థల ప్రోద్బలంతో సరళీకృత ఆర్థిక విధానాలు అన్ని దేశాలను చుట్టుముట్టాయి.
రీగన్, థాచర్ల నిర్ణయాలపై చాలా విశ్లేషణలు వచ్చాయి. పాశ్చాత్య దేశాలు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పాతికేళ్లపాటు అద్భుత ప్రగతిని సాధించాయి. దాన్నొక స్వర్ణయుగంగా భావించారు. ఆనాటి వృద్ధి రేటును ఇప్పటికీ ఆ సమాజాలు అందుకోలేదు. ప్రజల జీవితాల్లో ఎన్నో సౌకర్యాలు వచ్చాయి. ప్రమాణాలు పెరిగాయి. ఉద్యోగ కల్పన విస్తృతంగా జరిగింది. నిరుద్యోగం కనిష్ఠ స్థాయికి చేరుకుంది. విద్యావకాశాలు విస్తరించాయి. సామాజిక భద్రతా పథకాలు ఎన్నో వచ్చాయి. 1970ల్లో పరిస్థితి మారటం మొదలైంది. ఆర్థిక పురోగతి మందగించింది. 1973–74 నాటి చమురు సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపివేసింది. చమురు ధరలు 300 శాతం పెరిగాయి. ఈ పరిణామాలతో 1980 నాటికి స్వర్ణయుగం కాస్తా సంక్షోభయుగంగా మారింది. నిరుద్యోగం, ధరలు పెరిగాయి. వస్తువులకు డిమాండ్ తగ్గింది. సంక్షేమ పథకాల ఖర్చు తగ్గాలన్న వాదన కార్పొరేట్ వర్గాల నుంచి మొదలైంది. పన్నుల తగ్గింపు కోసం డిమాండ్లు తలెత్తాయి. రీగన్, థాచర్ల దాడికి నేపథ్యం ఆ సంక్షోభమే. సోవియట్ రష్యా పతనం.. చైనాలో ఆర్థిక సంస్కరణలు ఊపందుకున్న తర్వాత సమానత్వం గురించి ఎవరు మాట్లాడినా కాలం పోకడలు తెలియని అమాయకులుగా భావించటం పరిపాటైంది.
ఎంతో ప్రభావం కల్గించిన ఈ భావ వెల్లువలో పడిపోయిన మనకు ఫ్రెంచ్ విప్లవ ఆకాంక్షల దిశగా ప్రపంచం ప్రయాణం ఆగలేదని ఎవరైనా చెబితే ఆశ్చర్యపోతాం. ఎందుకంటే ప్రపంచీకరణ, క్యాపిటలిజం పరిధులను దాటి మానవజాతి ముందుకు వెళ్లలేదని చెప్పే సిద్ధాంతాలు ఇప్పటికే బోలెడు వచ్చాయి. ఫ్రాన్సిస్ ఫుకుయామా అనే రాజకీయ శాస్త్రవేత్త 1992లో ‘ది ఎండ్ అఫ్ హిస్టరీ అండ్ ద లాస్ట్ మ్యాన్’ అన్న పేరుతో రాసిన పుస్తకం సృష్టించిన సంచలనం అంతా ఇంతాకాదు. బహుళ పార్టీ ప్రజాస్వామ్యం, స్వేచ్ఛా మార్కెట్ ఆర్థిక వ్యవస్థలకు తిరుగులేదని ఫుకుయామా బలంగా వాదించారు. సోషలిస్టు రాజ్యాలు కుప్పకూలటంతో ఇది రుజువైందని చెప్పారు. దాన్నే ది ఎండ్ ఆఫ్ హిస్టరీగా వర్ణించాడు. ఈ నేపథ్యంలో కొత్త ఒరవడితో ఈ మధ్య తాజాగా ఒక పుస్తకం వచ్చింది. థామస్ పికెటీ అనే ఫ్రెంచ్ ఆర్థికవేత్త దీని రచయిత. ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఈక్వాలిటీ దాని పేరు. దేశదేశాల్లో అసమానత్వ లెక్కల గురించి తెలుసుకోవాలంటే టక్కున గుర్తుకు వచ్చే మొదటి పేరు పికెటీది. 2007–08 ఆర్థిక సంక్షోభం తర్వాత ఆర్థిక సరళీకృత విధానాల సమర్థతపై చాలా మందికి సందేహాలు మొదలయ్యాయి. ఆ తర్వాత పికెటీ రాసిన పుస్తకాలకు చాలా ప్రాచుర్యం వచ్చింది.
పికెటీ వాదనలో సంక్లిష్టత ఏమీ లేదు. సమానత్వం కోసం యుద్ధం చాలా కాలం క్రితమే ప్రారంభమైందనీ, 21వ శతాబ్దంలోనూ దాన్ని కొనసాగిస్తే ఇప్పుడు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలనుంచి ప్రపంచం గట్టెక్కనున్నదని పికెటీ వాదన. అందుకోసం గణాంకాల గనిని మనముందు పెట్టారు. కాస్త తొంగిచూస్తే అందులో ఎన్నో విశేషాలు కనపడతాయి. చరిత్ర కొత్తగా కనిపిస్తుంది. ఆశ్చర్యంగా అనిపించినా 18వ శతాబ్దం చివరి నుంచి మొదలైన ఉద్యమాల వల్ల 2020ల నాటికి సమానత్వం వైపుగా ప్రపంచం బాగానే పురోగమించింది. మధ్యలో అడ్డంకులు, వెనుకంజలు, ఎదురు దెబ్బలు ఉన్నాయి. 200 ఏళ్లను స్థూల దృష్టితో చూస్తే చరిత్ర ఆశావహంగానే కనపడుతుంది. ఫ్రాన్స్‌నే ఉదాహరణగా తీసుకుంటే 1810లో జనాభాలో ఒక శాతం ఉన్న మహా శ్రీమంతుల చేతుల్లో 45 శాతం ఆస్తులు ఉండేవి. 1910 నాటికి అవి 55 శాతానికి చేరుకున్నాయి. ఈ తేడాని చూస్తే పికెటీ అంచనాలు తప్పాయని మనకు తడుతుంది. కానీ అది నిజం కాదు. ఇందుకు కారణముంది. ఈ వందేళ్ల కాలంలో ఆసియా, ఆఫ్రికా ఖండాలను తమ ప్రత్యక్ష, పరోక్ష పాలన కిందకు యూరపు దేశాలు తెచ్చుకున్నాయి. అక్కడి వనరులను, శ్రమశక్తిని దోచుకోవటంతో యూరపులోని ధనికుల సంపద బాగా పెరిగింది. ఫ్రాన్స్ కూడా అందులో భాగమే. 1914 తర్వాత దీనికి అడ్డుకట్ట మొదలైంది. 1914 నుంచి 1980 వరకూ జరిగిన సామాజిక, రాజకీయ పోరాటాలు అనేక దేశాలను కుదిపేశాయి. వలస పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు మొదలయ్యాయి. రష్యా విప్లవంతో సోషలిస్టు సిద్ధాంతం విస్తరించింది. పౌర హక్కులు, జీతభత్యాల పెంపు కోసం అన్ని రంగాల్లో యూనియన్లు, అసోసియేషన్లు వెలిశాయి. రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కాలంలో ఫాసిజం, నాజీయిజం.. ఆర్థిక మాంద్యం... కమ్ముకొస్తున్న కమ్యూనిస్టు భూతం.. ఇలా వ్యవస్థలను కిందామీద చేసే ఎన్నో పరిణామాలు జరిగాయి. పాత పద్ధతులు సాగవని ప్రభుత్వాలకు, పాలక వర్గాలకు అర్థమైంది. సంపదలను, ఆదాయాలను వివిధ వర్గాలకు ఎంతోకొంత పంచే కొత్త విధానాలను అమలుపరచాయి. అందుకే 1980 నాటికి ఒక శాతం మహాశ్రీమంతుల ఆస్తులు 20శాతానికి పడిపోయాయి. ఆ తర్వాత ప్రపంచీకరణ వల్ల అసమానతలు పెరిగి 2020 నాటికి అవి 25 శాతానికి చేరినా పూర్వస్థాయికి వెళ్లలేదు. ఇక్కడ ఒక సంగతి చెప్పుకోవాలి. పికెటీ ఇచ్చిన ఉదాహరణలు చాలా వరకూ ఫ్రాన్స్, యూరపు, అమెరికాకు చెందినవి. అంతమాత్రాన అతని నిర్ధారణలు ఇతర దేశాలకు వర్తించనివిగా భావించలేం. అంకెల్లో తేడాలు ఉండొచ్చు. పరిణామం మాత్రం ఒకే దిశగా సాగింది. మహాశ్రీమంతులకు తోడు ఇతర ధనవంతులను కలుపుకొంటే జనాభాలో వారి సంఖ్య 10 శాతం ఉంటుంది. మొదటి ప్రపంచ యుద్ధం (1914) ఆరంభం నాటికి వీరి చేతుల్లో 85 శాతం ఆస్తులు ఉన్నాయి. 2020 నాటికి అవి 55 శాతానికి పరిమితం అయ్యాయి. మరి తగ్గిన ధనిక వర్గం ఆస్తులు ఎవరి చేతుల్లోకి వెళ్లాయి? మధ్యతరగతికి చేరాయి. 40 శాతం మధ్యతరగతి చేతుల్లో ప్రస్తుతం అంతే శాతం ఆస్తులు ఉన్నాయి. మిగతా 50శాతం ప్రజల దగ్గరున్న ఆస్తులు అయిదు శాతం మాత్రమే. భారత్‌లో ఇది ఇంకా ఘోరంగా ఉంది. ఆక్స్‌ఫాం నివేదిక ప్రకారం 50 శాతం మంది చేతుల్లో ఉన్న సంపద 3 శాతం మాత్రమే. 10 శాతం మంది చేతుల్లో 72 శాతం సంపద పోగుపడింది. యూరప్‌తో పోల్చితే భారత్‌లో అసమానత్వం చాలా దారుణం ఉంది. అమెరికాతో పోల్చినా అంతే. అసమానత్వం ఒకస్థాయికి దాటితే అమెరికా, యూరప్ సమాజాల్లో గగ్గోలు మొదలవుతుంది. ఇక్కడ ఆ తీవ్రత లేదు. 2014 నుంచి అధికారంలో ఉన్న బీజేపీలో దీనిపై మథనం జరుగుతున్నట్టు ఎక్కడా కనపడదు. పికెటీ ఉద్దేశంలో దిగువ స్థాయిలో ఉన్న 50 శాతం ప్రజల చేతుల్లో సంపదను పెంచటమే ప్రపంచం ముందున్న పెద్ద సవాల్. అందుకోసం అతను సూచించే మార్గం ఒక్కటే. ఇప్పటివరకూ అసమానతలు తగ్గటానికి దోహదం చేసిన ప్రధాన కారణాలు రెండే. సంక్షేమ రాజ్యం పేరుతో అల్పాదాయ వర్గాలకు ప్రభుత్వాలు చేసే ఖర్చు అందులో మొదటిది. రెండోది అధికాదాయ, అధిక సంపద కలిగిన వర్గాలపై అంచెల వారీగా పెరిగే పన్నుల వ్యవస్థ (ప్రొగ్రెసివ్ టాక్సేషన్). ఈ రెండు మార్గాల వల్లే ప్రపంచంలో అసమానతలు ప్రధానంగా తగ్గాయి. ఇక ముందూ అదే మార్గంలో వెళితేనే అసమానతలు మరింత తగ్గుతాయి. వీటికి తోడు పర్యావరణానికి హాని కల్గించని ఆర్థిక విధానాలు, బహుళ సంస్కృతులను అంగీకరించే సామాజిక విధానం, మైనారిటీలకు సమాన హక్కులు కల్పించటం, పాలనలో, విద్య ఉద్యోగాల్లో తగినంత ప్రాతినిధ్యం లేని వారికి రిజర్వేషన్లు (అఫమటివ్ యాక్షన్స్), పరిశ్రమలు–కార్పొరేట్ సంస్థల నిర్వాహక బోర్డుల్లో ఉద్యోగ ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించటం, ధనిక దేశాలకు అనుకూలంగా ఉన్న అంతర్జాతీయ ఒప్పందాలను మార్చటం వంటివి పెద్ద ఎత్తున చేపట్టాలి.
అసమానతలను తగ్గించటంలో రష్యా, చైనాల్లో జరిగిన సోషలిస్టు ప్రయత్నాలు ఫలితం ఇవ్వలేదా? అంటే ఇవ్వలేదనే పికెటీ అభిప్రాయం. ఆ రెండు దేశాల అభివృద్ధి నమూనా గురించి గొప్పగా చెప్పుకొనేది ఏదీ పికెటీ వర్ణనల్లో కనపడదు. శ్రామికవర్గ నియంతృత్వం పేరిట ఆర్థిక వ్యవస్థ మొత్తం ప్రభుత్వం చెప్పుచేతల్లో ఉండటం, బహుళపార్టీ ప్రజాస్వామ్యం లోపించటం, నూతన ఆవిష్కరణలకు, వ్యక్తిగత చొరవకు ప్రోత్సాహం లేకపోవటం, భిన్నగొంతుకలతో కూడిన పౌరసమాజం కనుమరుగు కావటం, భావ సంఘర్షణను అణచివేయటం వంటి కారణాలతో సోవియట్ తరహా సమాజాలు పతనం దిశగా పయనించాయి. పికెటీ భావాలతో ఎంతైనా విభేదించొచ్చు. అసలు విభేదాలకు తావివ్వని తుది నిర్ధారణ అంటూ సామాజిక విషయాల్లో ఉండదు. మానవుడిలోని యుగయుగాల ఆర్తికి, ఆకాంక్షకు స్వాతంత్య్రం.. సమభావం.. సౌభ్రాత్రం ప్రతీకలైతే పికెటీ లెక్కలు ప్రీతిపాత్రంగానే ఉంటాయి. అణగారిపోతున్న ఆశలు మళ్లీ రెక్కలు విచ్చుకోటానికి దోహదం చేస్తాయి.
రాహుల్ కుమార్
(ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్)
Updated Date - 2023-01-20T00:29:22+05:30 IST