తుర్కియే నరేంద్రుడు ఎర్డోగాన్
ABN, First Publish Date - 2023-05-31T01:50:18+05:30
ప్రగతిశీల చరిత్ర నిర్మాణ నేపథ్యం ఉన్న దేశాలు, కొన్నిసార్లు వివిధ రాజకీయ రూపాలలో ఆవిర్భవించే నియంతృత్వ నాయకుల కారణాన గాడి తప్పుతుంటాయి...
ప్రగతిశీల చరిత్ర నిర్మాణ నేపథ్యం ఉన్న దేశాలు, కొన్నిసార్లు వివిధ రాజకీయ రూపాలలో ఆవిర్భవించే నియంతృత్వ నాయకుల కారణాన గాడి తప్పుతుంటాయి. తమ రాజకీయ అధికారాన్ని పటిష్ఠపరచుకోవడానికి ఒకవైపు వివిధ జాతీయ, ధార్మిక విధానాలను ప్రచారం చేస్తూ మరో వైపు తమ లక్ష్యానికి అనుగుణంగా పాలన, రాజకీయ వ్యవస్థలను సంస్కరణల పేరిట ప్రక్షాళన చేస్తూ ప్రత్యర్ధులను క్రమేణా అణగదొక్కుతారు. కేంద్రీకృతమైన అధికార వ్యవస్థను నెలకొల్పడం ద్వారా అప్పటి వరకు ఉన్న భిన్న స్వరాలు, విభిన్న అధికార కేంద్రాలను బలహీనపర్చడమే వారి లక్ష్యం. మధ్యప్రాచ్యంతో పాటు కొన్ని ఇతర దేశాలలో అమలులో ఉన్న ఈ రకమైన నియంతృత్వ జాడ్యం ఇప్పుడు అమిత అధికార దాహం కలిగిన నాయకులు ఉన్న ఇతర దేశాలకు కూడ విస్తరిస్తోంది.
వర్తమాన ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలలో తుర్కియే (ఇటీవలి వరకు ఈ దేశాన్ని టర్కీగా వ్యవహరించేవారు) ఒకటి. ఒకప్పుడు ధార్మిక ఖిలాఫత్ వ్యవస్థ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలకు తుర్కియే కేంద్రబిందువుగా ఉండేది. మొదటి ప్రపంచ సంగ్రామమనంతరం ఖిలాఫత్ వ్యవస్థ రద్దయింది. ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు ముఖ్యంగా భారతీయ ముస్లింలు ఖిలాఫత్ వ్యవస్థ పునరుద్ధరణకు ఆందోళన చేశారు. ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు నివ్వడం ద్వారా భారత స్వాతంత్ర్య సమరానికి ముస్లింల మద్దతును సమీకరించడంలో గాంధీజీ సఫలమయ్యారు. మొదటి ప్రపంచ యుద్ధంలో పరాజయం పాలయిన తుర్కియే ముస్తాఫ కమాల్ నాయకత్వంలో ఒక బలీయమైన శక్తిగా ఎదిగింది. తుర్కియేను ఒక లౌకిక దేశంగా ఆయన తీర్చిదిద్దారు. అయితే గత రెండు దశాబ్దాలుగా పరిస్థితి మారిపోయింది. తన అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకై తుర్కియేను దేశాధినేత రెసెప్ తయీప్ ఎర్డోగాన్ మళ్లీ ఇస్లామీకరణ వైపు తీసుకెళ్తున్నారు. ఈ దిశగా ఆయన దేశంలోని పలువురు రాజకీయ ప్రత్యర్ధులను అణచివేశారు. మీడియా ప్రతినిధులు, చివరకు సైనికాధికారులను కూడా నిర్బంధించారు. పార్లమెంటు సమావేశాలు కుదించడం, సభ్యులకు సమయం తగ్గించడం, హైకోర్టు, సుప్రీంకోర్టు, రాజ్యాంగ ధర్మాసనం న్యాయమూర్తుల నియామక విధానాన్ని మార్చి తనకు అనుకూలురు అయిన వారికే ప్రాధాన్యమివ్వడం, మంత్రులను ఉత్సవ విగ్రహాలుగా చేయడం, సోషల్ మీడియా నియంత్రణ చట్టం, ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలను సివిల్ కేసులుగా కాకుండా క్రిమినల్ కేసులుగా విచారించడం మొదలైనవి ఆయన అణచివేత చర్యలలో భాగంగా ఉన్నాయి. తొలుత పదకొండు సంవత్సరాలు ప్రధానమంత్రిగా, ఆ తరువాత అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న ఎర్డోగాన్ దేశంలోని అన్ని వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకోవడంలో క్రమంగా విజయం సాధిస్తున్నారు. ఇస్తాంబుల్ వీధులలో ఒకప్పుడు రొట్టెలు అమ్మిన ఎర్డోగాన్ ఒక ప్రజాస్వామ్య దేశాధినేతగా కాకుండ గతంలో తుర్కియే సామ్రాజ్యాన్ని ఏలిన సుల్తాన్ తరహాలో పరిపాలించడానికి మొగ్గు చూపుతున్నారు.
ఇస్తాంబుల్‌లోని 1500 సంవత్సరాల వివాదస్పద కట్టడం హాజియా సోఫియా చర్చి–మస్జీదు తుట్టి లేపిన ఘనత ఎర్డోగాన్‌దే. ఆయన నిర్ణయం మేరకే గత వంద సంవత్సరాలుగా మ్యూజియంగా ఉన్న ఆ కట్టడాన్ని మళ్లీ మస్జీదుగా మార్చివేశారు. మెజారిటీ ప్రజల అకాంక్షను నెరవేర్చినట్లుగా చెప్పడం ద్వారా ఆయన తన స్ధానాన్ని పదిలపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తుర్కియే సుప్రీంకోర్టులో తన అనుకూల న్యాయమూర్తుల సహాయంతో ఆ వివాదాస్పద కట్టడాన్ని మస్జీదుగా మార్చివేశారు.
కుర్దీ వేర్పాటువాదులను నియంత్రించడానికి సిరియా సరిహద్దులోని అఫ్రీన్ భాగాన్ని అక్రమించడం, మరో పొరుగు దేశం గ్రీసుతో తరుచుగా కయ్యానికి దిగి గతంలో ఎవరు చేయనిది తానే చేస్తున్నానని ప్రచారం చేసుకోవడం ద్వారా ఎర్డోగాన్ రాజకీయ లబ్ధి పొందుతున్నారు. వాస్తవానికి ఆయనకు ముందున్న పాలకులు కూడా సరిహద్దు ప్రాంతాల్లోని కుర్దీ వేర్పాటువాదులపై గట్టి సైనిక చర్యలు తీసుకున్నారు. అయితే రాజకీయ లబ్ధికి ప్రచారం చేసుకోలేదు.
నాటోలో కీలక సభ్య దేశమైన తుర్కియేకు అనాదిగా దౌత్య నీతి మెళకువలు బాగా తెలుసు. తరచుగా విదేశీ పర్యటనలు చేసే ఎర్డోగాన్, ఆ పర్యటనల నుంచి స్వదేశంలో రాజకీయ ప్రయోజనం సాధించడానికి ఆసక్తి చూపుతారనే ఆరోపణలు ఉన్నాయి. ఖతర్– గల్ఫ్ వివాదంలో కాలు దూర్చడం మొదలు బర్మాలోని రొహింగ్యా ముస్లిం శరణార్థులను సందర్శించడం వరకు ప్రతిదీ ఆయన స్వదేశంలోని రాజకీయ కోణంతో చేస్తారు. వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను పెంపొందించుకోవడమే కాకుండా ఆయన తుర్కియే దేశ ప్రతిష్ఠను కూడ ఇనుమడింపచేశారనడంలో ఎలాంటి సందేహాం లేదు. నూరిపోస్తున్న ఇస్లామిక్ వాదానికి తోడుగా అదే ప్రాతిపదికన పెరిగిపోతున్న జాతీయవాదంతో ఎర్డోగాన్ తనను ప్రశ్నించిన ప్రతీ ఒక్కరి నోరు మూయిస్తున్నారు. ఆయన దెబ్బకు దేశంలో ప్రతిపక్షాలన్నీ బలహీనపడ్డాయి.
తుర్కియేను అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్ళడంలో ఎర్డోగాన్ విఫలమవుతున్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థ దిగజారిపోతోంది. ద్రవ్యోల్బణం 37శాతానికి పెరిగింది. దేశ కరెన్సీ అయిన లీరా అమెరికన్ డాలర్ విలువలో 44 శాతానికి క్షీణించింది. నిరుద్యోగం విలయతాండవం చేస్తోంది. భూకంప బాధితుల పునరావాస, సహాయక చర్యలను ఆశించిన స్ధాయిలో చేపట్టలేదనే విమర్శలు ఉన్నా ఎర్డోగాన్ మళ్లీ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు.
విచిత్రమేమిటంటే, కరుడుగట్టిన ఇస్లాంవాదిగా ప్రాచుర్యం పొందిన ఎర్డోగాన్‌తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యక్తిగతంగా సత్సంబంధాలు ఉన్నాయి. కశ్మీర్ ఆంశంపై ఎర్డోగాన్ తీవ్ర వ్యాఖ్యలు చేసినా ఆయనతో మోదీ స్నేహం యథావిధిగా కొనసాగుతుంది. మతాలు, ప్రాంతాలు, భాషలు వేరైతేనేమి మోదీ, ఎర్డోగాన్ పాలనా శైలుల మధ్య సారూప్యత బాగానే ఉన్నది.
మొహమ్మద్ ఇర్ఫాన్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
Updated Date - 2023-05-31T01:50:18+05:30 IST