ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

దశాబ్ది వైఫల్యం ‘టీ–జాక్‌’

ABN, First Publish Date - 2023-06-21T02:33:44+05:30

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న తరుణంలో, రాష్ట్ర ప్రభుత్వ పాలనావిధానం ప్రజలు కేంద్రంగా, ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా కాక ప్రజలను సంక్షేమ పథకాల లబ్ధిదారులుగానో, కేవలం ఓటర్లుగానో పరిగణించే తీరులో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న తరుణంలో, రాష్ట్ర ప్రభుత్వ పాలనావిధానం ప్రజలు కేంద్రంగా, ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా కాక ప్రజలను సంక్షేమ పథకాల లబ్ధిదారులుగానో, కేవలం ఓటర్లుగానో పరిగణించే తీరులో ఉన్నదని గుర్తుచేసుకోక తప్పదు. సకల జనుల ఉద్యమ చైతన్యంతో అధికారంలోకి వచ్చినట్లు కాకుండా, తెలంగాణ రాష్ట్ర సమితి వల్లనే రాష్ట్రం ఏర్పాటు జరిగినట్టుగా, తానే స్వరాష్ట్ర సృష్టికర్తగా కేసీఆర్‌ వ్యవహరించడం చూస్తున్నదే. సమిష్టి ఫలమైన రాష్ట్రంలో సర్వమూ తానే అన్నట్టుగా వ్యవహరిస్తున్న బిఆర్ఎస్ అధినేతపై ఒత్తిడి తేగల శక్తి ఏదీ వెలుపల లేకుండా పోవడం ఈ దశాబ్ది వైఫల్యమే.

ఇందుకు కారణం, కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) స్వరాష్ట్రం ఏర్పాటయ్యాక క్రమేణా బలహీనపడటం. అంతకన్నా ముఖ్యం, ఈ జాయింట్ యాక్షన్ కమిటీ, పేరు పెట్టుకున్నది గానీ నిజంగానే ‘రాజకీయ జేఏసీ’గా ఎన్నికల సమయానికి మారకపోవడం, రాష్ట్ర ఏర్పాటు తరుణంలో ‘రాజకీయ అరంగేట్రం’ చేయడానికి తగిన వ్యూహం ఏర్పాటు చేసుకోకపోవడం. ఇది వైఫల్యంగానే కాక, ‘చారిత్రక తప్పిదం’గా కూడా చెప్పక తప్పదు.

ఎంతసేపూ కెసిఆర్‌ని విమర్శించడం కాక, పరిపాలనా తీరు తెన్నులు ప్రజానుకూలంగా లేని స్థితికి దిగజారడంలో ఉద్యమకారుల తప్పిదం ఏమిటన్నది కూడా సమీక్షించుకుంటే, స్వరాష్ట్రంలో పునర్నిర్మాణం అన్నది ఉద్యమ సోయితో జరగకపోవడానికి గల కారణాలను విశ్లేషించుకుంటే, అందులో ‘జేఏసీ’ వైఫల్యాన్నే మొదటగా చెప్పుకోవాలి.

చిదంబరం ప్రకటన వెనక్కిపోయేసరికి కెసిఆర్ చొరవతో- కోదండరాం చైర్మన్‌గా ఏర్పాటైన జేఏసీ ఉద్యమకార్యాచరణకు మహత్తర కృషి చేసింది. సకల జనులనూ ఒక్క త్రాటి మీదికి తెస్తూ అజేయ శక్తిగా ఎదిగింది. అలాంటి నేపథ్యంలో, జేఏసీ అప్పుడున్న బలంతో కెసిఆర్ ముందు ఒక ప్రతిపాదన పెట్టవలసింది. మేం కనీసం నలభై సీట్లకు పోటీ చేస్తామని కోరితే కొన్ని సీట్లు అయినా కెసిఆర్ ఇవ్వక తప్పని పరిస్థితి ఉండింది. ఆయన ఇవ్వని పక్షంలో కొన్ని ముఖ్యమైన స్థానాల్లో జేఏసీ అభ్యర్థులుగా ఉద్యమకారులు పోటీ చేయవలసింది. కానీ అప్పుడు తమది ‘రాజకీయ లక్ష్యం’ కాదని వెనుకాడిన పర్యవసానంగా స్వరాష్ట్రం ఏర్పాటయ్యాక దాని పాత్ర నశించింది. అందులో కీలకంగా ఉండిన నాయకులు కోదండరాం నుంచి వేరుపడి కెసిఆర్ శిబిరంలో కలవడానికి వీలైంది. దాంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులన్నీ మూగబోయాయి. వీటన్నిటినీ సమీక్షించుకుంటే, జేఏసీ ఒక రాజకీయ నిర్మాణంగా ఏర్పడే అవకాశాన్ని జారవిడుచుకోవడంతో తెలంగాణ సమాజం ఒక చారిత్రక అవకాశాన్ని చేజార్చుకున్నట్టే అయింది.

నాడు రాజకీయ జేఏసీ పార్టీగా ఏర్పడి పోటీ చేయాలన్న ప్రతిపాదన చాలామంది తెచ్చినప్పటికీ కోదండరాం ఆ దశలో ముందుకు రాకపోవడంలోని పరిమితి ఏమిటో ఇప్పటికైనా తెలంగాణ సమాజానికి తెలియాలి. విద్యార్థి ఉద్యమాల నుంచి ఎదిగిన అసోం గణపరిషత్ వంటి అనుభవాలను కొందరు ఉదాహరణగా చూపినప్పటికీ జేఏసీది రాజకీయ లక్ష్యం కాదంటూ కోదండరాం ఆ ప్రతిపాదనను తోసిపుచ్చడం తప్పుడు నిర్ణయమా కాదా అన్నది ఇప్పటికైనా సమీక్షించుకోవాలి.

కెసిఆర్ ఆధ్వర్యంలో ఏర్పడిన టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎట్లా ఉద్యమ ఆకాంక్షలకు దూరమైందో, తానే చొరవ తీసుకొని ఏర్పాటు చేసిన జేఏసీ కూడా ఒక రాజకీయ శక్తిగా ఎదగకుండా ఆయన చేయగలిగారు. కన్వీనర్లు, కో కన్వీనర్ల నుంచి అందులో భాగమైన ప్రముఖ కవులు, రచయితలు, గాయకులనూ ఆయన తన వైపు తిప్పుకున్నారు. తన వద్ద చేరని వారిని మౌనంగా ఉండేలా చేసుకోగలిగారు. కోదండరాంని పూర్తిగా ఒంటరి చేసి, ఆ తర్వాత ఇంటి తలుపులను బద్దలు కొట్టి, ఆయనను అనివార్యంగా రాజకీయాల్లోకి నెట్టి, పార్టీ పెట్టేలా చేశారు. కానీ, చాలా ఆలస్యంగా రాజకీయ పార్టీ పెట్టేటప్పటికి ఆయనకు మిగిలింది బలం కాదు, బలహీనతే. వాస్తవానికి కోదండరాం బలంగా ఉన్నప్పుడు ఉద్యమకారులంతా రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశాన్ని కెసిఆర్ ఇవ్వలేదు, తానూ అందుకు పూనుకోలేదు. కేవలం తన ఉనికి సందిగ్ధంలో పడినప్పుడు మాత్రమే కోదండరాం రాజకీయాల్లోకి వచ్చారనే ‘అపప్రధ’ ఆయన్ని ఒక ప్రధాన ఉద్యమ ప్రతినిధిగా కాక ఒక పేలవమైన రాజకీయ నేతగా ప్రజల ముందు మిగిల్చింది. ఇదంతా కెసిఆర్ ‘ఎత్తుగడ’గా చూడాలా లేక ‘ఎత్తుగడ’ లేకుండా జేఏసీ వ్యవహరించి కెసిఆర్‌కి పరోక్షంగా సహకరించిందా అన్న సందేహం సకల జనుల మనసులను తొలుస్తున్నది.

ఇక్కడ ఇద్దరు ఉద్యమ కారుల గురించి చెప్పుకోవాలి. కేశవరావు జాదవ్ సాబ్, కొత్తపల్లి జయశంకర్ సార్. వీరిద్దరూ మలిదశ ఉద్యమంలో అందరి గౌరవం అందుకున్న ఆచార్యులు. ఒక దశలో వీరి నాయకత్వంలో విడివిడిగా పనిచేస్తున్న అనేక సంఘాలు తెలంగాణా ఐక్య వేదికగా ఏర్పడి రాష్ట్రసాధనకు కావాల్సిన భావ వ్యాప్తిని ప్రజల్లో పటిష్ఠం చేశాయి. వీరిద్దరిలో జాదవ్ సాబ్‌కి మొదటినుంచీ కెసిఆర్ పట్ల ఒక అంచనా ఉన్నది. అందుకే ఆయన తెలంగాణ కోసం ఏర్పాటైన పార్టీపై పౌర సమాజం లేదా ఉద్యమ శక్తులది పై చేయిగా ఉండాలని భావించారు. కానీ జయశంకర్ సార్‌కి తెలంగాణ రాష్ట్రం సాకారం కావడం ఒక్కటే ముఖ్యంగా ఉండింది. కెసిఆర్ వంటి చతురుడైన రాజకీయ నేత రాష్ట్ర సాధనకు అవసరం అని బలంగా నమ్మి వెన్నంటి ఉన్నారు. 2004 సార్వత్రిక ఎన్నికల సమయంలో వారు విద్యావంతుల వేదిక ఏర్పాటు చేయడం, దానికి కోదండరాంని అధ్యక్షులుగా చేయడంతో అప్పటి నుంచి మరింత విస్తృతంగా భావవ్యాప్తి విస్తరించింది. ఆ గొప్ప చేతన, ఎక్కడికక్కడి అభివృద్ధి అయిన నూతన నాయకత్వం, పాత నాయకులు, వారూ వీరూ కలవడం, అనంతరం 2009లో జేఏసీ ఏర్పాటు కావడం, అది ఒక బలీయమైన రాజకీయ శక్తిగా మారడం తెలిసిందే. కానీ, రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ సమయంలో కోదండరాం జేఏసీని రాజకీయ శక్తిగా మలవడంలో విఫలమవడంతో, ఆ దిశగా వ్యూహం లేకుండా పనిచేయడంతో అప్పటిదాకా జరిగిన పోరాటం రాష్ట్ర సాధనకు ఉపకరించిందే తప్ప, స్వరాష్ట్రం అనంతర పునర్నిర్మాణానికి దోహదపడలేదు.

ఇదెలా ఉందంటే, రాష్ట్రం విడిపోతుందన్న నమ్మకం లేకపోవడంతో ఆంధ్రామేధావులు, నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడం తప్పా మరో ఆలోచన ఎలాగైతే చేయలేదో, సరిగ్గా అట్లే స్వరాష్ట్రం ఏర్పాటవుతుందని నమ్మిన తెలంగాణ మేధావులు, ఉద్యమకారులు పునర్నిర్మాణం గురించి, అందులో తమ పాత్ర గురించి ఆలోచించలేదు. ఫలితంగా కెసిఆర్ ఆధిపత్యం స్థిరపడింది.

ఇట్లా జేఏసీ నీరు గారిపోయినందునే, తాము అధికారంలోకి రాగానే ఇకపై టిఆర్ఎస్ ఫక్తు రాజకీయ పార్టీగానే వ్యవహరిస్తుందని కేసిఆర్ నిర్భయంగా ప్రకటించగలిగారు. రాష్ట్రం ఏర్పడగానే సాధారణ రాజకీయనేతగా మారిపోయి, ఉద్యమ వ్యతిరేకులుగా ముద్రపడిన వారిని సైతం చేరదీసి మంత్రి పదవులు ఇచ్చారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులను కూడా పార్టీలో కలుపుకుని తన ఆధిపత్యాన్ని బలోపేతం చేసుకున్నారు. నీళ్ళు నిధులు నియామకాలు సరే, అంతకన్నా ముఖ్యమైన తెలంగాణ ఆత్మగౌరవం వెనక పట్టు పట్టేలా చేశారు. రూపుగట్టిన సాంస్కృతిక చైతన్యాన్ని నీరు గార్చారు. అమరుల కుటుంబాలను అర్సుకునే స్థితి లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే, సకలజనులంటే కెసిఆర్‌కు కనీస గౌరవం లేకుండా పోయింది. ఉద్యమ లక్ష్యాలన్నిటికీ దూరం జరిగేలా చేసింది. చిట్టచివరకు, ఉద్యమపార్టీ అని చెప్పుకున్న టిఆర్ఎస్‌ను బిఆర్ఎస్‌గా మార్చగలిగింది. ప్రస్తుత సందర్భమైన ‘దశాబ్ది ఉత్సవం’ సైతం కేవలం ‘ప్రభుత్వ ఉత్సవం’గా మిగిలిపోయేలా చేసింది. అందుకే అడగడం, జేఏసీ ఎందుకని ‘రాజకీయ జేఏసీ’గా మారలేదని! కీలకమైన సమయంలో ఎందుకు ‘రాజకీయంగా’ మొఖం చాటేసిందీ అని! ఇది చారిత్రక తప్పిదం కాదా?

కందుకూరి రమేష్ బాబు

ఇండిపెండెంట్ జర్నలిస్ట్

Updated Date - 2023-06-21T02:33:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising