ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఫాసిజం అంటే నియంతృత్వానికి మించి!

ABN, First Publish Date - 2023-10-25T02:18:57+05:30

ఈమధ్య కాలంలో ఫాసిజంపై జరుగుతున్న చర్చల్లో నియంతృత్వాన్నీ ఫాసిజాన్నీ ఒక్కటిగా చూసే గందరగోళం కనిపిస్తుంది. ఫాసిజం నియంతృత్వమే కాని, ప్రతి నియంతృత్వం ఫాసిజం కాదు....

ఈమధ్య కాలంలో ఫాసిజంపై జరుగుతున్న చర్చల్లో నియంతృత్వాన్నీ ఫాసిజాన్నీ ఒక్కటిగా చూసే గందరగోళం కనిపిస్తుంది. ఫాసిజం నియంతృత్వమే కాని, ప్రతి నియంతృత్వం ఫాసిజం కాదు. ఫాసిజం సమాజంలో ఒక లేక కొన్ని విభాగాలను (మైనారిటీ విభాగాలను) ఇతరులుగా (others) చూపిస్తుంది. మైనారిటీలను మెజారిటీ ప్రజానీకానికి శత్రువులుగా చూపిస్తుంది. దేశ అభివృద్ధికి ఆటంకమైనవారిగా, దేశ రక్షణకు ప్రమాదకరమైనవారిగా చూపిస్తుంది. మైనారిటీలకు వ్యతిరేకంగా మెజారిటీ ప్రజానీకాన్ని సమీకరిస్తుంది, ఇది జాతి హననం దాకా వెళ్తుంది. జర్మనీలో ఇది తొంభై లక్షల యూదుల్లో అరవై లక్షల యూదుల ప్రాణం తీసింది. నిజానికి ఈవిధంగా మైనారిటీ, మెజారిటీ అనే భావజాలాన్ని రూపొందించడంలోనే కుట్ర ఉంది. భారతదేశంలో ఒక్క ఆరెస్సెస్ మాత్రమే మైనారిటీలను ఇతరులుగా చూస్తుంది. వారిని అభివృద్ధిని అడ్డుకునేవారిగా, దేశ రక్షణకు ప్రమాదకారులుగా, శత్రువులుగా చూపిస్తుంది. వారికి వ్యతిరేకంగా గత వందేళ్లుగా భావజాలాన్ని నిర్మించింది. అటువంటి సిద్ధాంతాన్ని రూపొందించుకుని, అందుకు తగిన నిర్మాణాన్ని తయారుచేసుకున్న ఆరెస్సెస్‌ను మాత్రమే మనం ఫాసిస్టు సంస్థ అనగలం.

కాంగ్రెస్‌ విషయం వేరు. ఇందిరాగాంధీ చనిపోయిన సందర్భంలో పెద్ద ఎత్తున సిక్కు వ్యతిరేక అల్లర్లు చెలరేగిన మాట వాస్తవమే. వాటిని ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుమతించిన, ప్రోత్సహించిన మాటా వాస్తవమే. కాని అది మహా అయితే ఎన్నికల ఎత్తుగడ మాత్రమే. సిక్కు వ్యతిరేకత కాంగ్రెస్‌ సిద్ధాంతంలో భాగమని రుజువు చేయలేం. హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఒకసారి, చెన్నారెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మరొకసారి కాంగ్రెస్‌ హైదరాబాద్‌లో మత కలహాలు సృష్టించిన అనుభవం మనకుంది. ఆ కలహాలు కూడా తక్షణ రాజకీయ అవసరాల కొరకు సృష్టించబడినవేగాని మతోన్మాదరాజ్య స్థాపన కొరకు జరిగినవి కావు. ఫాసిజం ప్రధాన లక్షణమైన మెజారిటీ ఉన్మాదం కాంగ్రెస్‌ సిద్ధాంతం కాదు. కాంగ్రెస్‌ పార్టీ 1975లో ఎమర్జన్సీ విధించి నియంతృత్వ పాలన సాగించింది. అయితే మెజారిటీ ప్రజలను మైనారిటీ ప్రజల మీదకు ఉసిగొల్పలేదు. అది ప్రజలందరిపైన జరిగిన రాజ్య హింస. నేడు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక అనేక బీజేపీయేతర ప్రభుత్వాలు ప్రజల, ప్రతిపక్షాల హక్కులను కాలరాస్తున్నాయి. అయినా ఈ పార్టీలు ఒక మతాన్ని మరొక మత ప్రజల మీదకి ఉసిగొల్పటం లేదు. సమాజంలో ఒక విభాగాన్ని బయటవారిగా చూపించడం లేదు. కావున ఆ పార్టీలను ఫాసిస్టు పార్టీలుగా చెప్పలేం.

ఇక హక్కుల విషయానికి వస్తే, "పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రజలకు హక్కులు ప్రయత్నరహితంగా లభించవు, ప్రజలు తమ పోరాటాల ద్వారానే వాటిని సాధించుకోవాలి, నిలబెట్టుకోవాలి" అని ప్రముఖ మార్క్సిస్టు రచయిత డేవిడ్‌ హార్వే చెప్పాడు. నేడు వివిధ రాష్ట్రాల్లో వివిధ పార్టీల నియంతృత్వాన్ని అందరూ గమనిస్తున్నారు. అయితే ఆ పార్టీలను ఫాసిస్టు పార్టీలని చెప్పలేం. నియంతృత్వ పాలన దీర్ఘకాలంగా ప్రజలకు స్వానుభవం. కాగా ఫాసిజం ఇప్పుడు సంఘ్ పరివార్‌ నాయకత్వంలో మతోన్మాదంగా, మనువాదంగా విజృంభిస్తున్నది. నియంతృత్వానికి ఆధిపత్య ఉన్మాదం కలసినప్పుడే అది ఫాసిస్టు రూపాన్ని తీసుకుంటుంది.

‘కార్పోరేటు పెట్టుబడి లూటీ’ ని ముందుకు తీసుకువెళ్ళడం ద్వారా మాత్రమే సంఘ్ పరివార్‌ శక్తులు హిందూరాష్ట్ర ఏర్పాటుకు అవసరమయిన ప్రయత్నాలు చేయగలవు. అందుకే వారు తమ హిందూత్వ ఎజెండాను ముందుకు తీసుకువెళ్ళడానికి కార్పోరేటు ప్రయోజనాలను కాపాడుతూ, ఇంకా ప్రధానంగా ఎంపిక చేసుకొన్న కొన్ని కార్పోరేటు సంస్థల ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళ్తున్నారు. వారు ఎంపిక చేసుకొన్న కార్పోరేటు సంస్థల ప్రయోజనాలకు అనుకూలంగా వారు చూపిస్తున్న పక్షపాత ధోరణి అన్ని అవధులను దాటుతూ ఉంది. వారు చేపడుతున్న మతోన్మాద చర్యలు వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఉపయోగపడుతున్నాయన్నది వాస్తవమే. అయితే, అంతకంటే ఆ చర్యలు దేశాన్ని 'హిందూరాష్ట్ర' వైపు నడిపిస్తున్నాయి. వారు తక్షణ, దీర్ఘకాలిక ప్రయోజనాలను కూడా పొందుతున్నారు. బీజేపీ చర్యల్లో పాలక కార్పోరేటు శక్తుల తక్షణ ప్రయోజనాన్ని మాత్రమే చూడగలుగుతున్నవారు ఆరెస్సెస్ యొక్క దీర్ఘకాలిక, విస్తృత లక్ష్యమైన ‘హిందూరాష్ట్ర’ ను చూడలేకపోతున్నారు. సంఘ్ పరివార్‌ చర్యలను ‘అసలు సమస్యల నుంచి దృష్టి మరల్చే విషయాలు’ గా తీసిపారేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి.


ఆరెస్సెస్ ఒక ఉన్మాద సిద్ధాంతానికి బద్ధులైన కార్యకర్తలున్న సంస్థ; విస్తృత సమాజంలోకాని, తన సొంత నిర్మాణంలో కాని ప్రజాస్వామిక సూత్రాలకు తావుండకూడదని నమ్మే సంస్థ. ఆరెస్సెస్‌కు ఈ సిద్ధాంత భావజాలంపై సమీకరించబడిన, శిక్షణ పొందిన బలగం ఉంది. వారి ప్రతి చర్య ‘హిందూ రాష్ట్ర’ స్థాపన కొరకే. ‘హిందూ రాష్ట్ర’ వారికి ఒక ఎన్నికల ఎత్తుగడ లేదా ప్రజల అసంతృప్తులను పక్కదారి పట్టించే మార్గం మాత్రమే కాదు. అదే వారి లక్ష్యం. అటువంటి లక్ష్యాన్ని సాధించడం సాధ్యం కాకపోవచ్చు, సాధించినా జర్మనీలో రద్దుచేయబడిట్లు రద్దుచేయబడుతుంది. కాని ఆ క్రమాన్ని అడ్డుకోకపోతే, రెండు మూడు దశాబ్దాల పాటు కనీవినీ ఎరుగని రక్తపాతాన్ని చూస్తాం.

ఆర్థిక విధానాల్లో కాంగ్రెస్‌, బీజేపీలు రెండూ కార్పోరేట్‌ ఎజెండానే అమలు చేస్తాయి. అయితే రాజకీయ రంగంలో ఒక ముఖ్య వ్యత్యాసం ఉంది. పాలక వర్గ రాజకీయాలు ప్రధానంగా ప్రజా ఉద్యమాలకు వ్యతిరేకంగా ఉంటాయి. ప్రజా ఉద్యమాలను బలహీనపరచడానికి కాంగ్రెస్‌ ఒక మార్గాన్ని అనుసరిస్తే బీజేపీ మరొక మార్గాన్ని అనుసరిస్తున్నది, అదే వ్యత్యాసం. 2004–2014 కాలంలో కేంద్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం నయా సరళీకరణ విధానాలను నెమ్మదిగా అమలు చేస్తూ, కొన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా చేపట్టి పెద్ద తిరుగుబాట్లు రాకుండా చూసుకుంది. బీజేపీయేతర పార్టీలన్నీ ప్రధానంగా కాంగ్రెస్‌ పద్ధతినే అనుసరిస్తాయి. అది కీన్స్‌ ‘సంక్షేమ రాజ్యం’ తో కొంత పోలిక కలిగి ఉంటుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే ఆ పార్టీ నయాసరళీకరణ విధానాలను తీవ్రస్థాయికి తీసుకుపోతూ, అదే సందర్భంలో సంక్షేమ కార్యక్రమాలను నీరుగారుస్తూ, ఫలితంగా ప్రజలనుంచి వస్తున్న అసంతృప్తిని పక్క మార్గం పట్టించడానికి మతోన్మాదాన్ని ఉపయోగిస్తున్నది. ఆ క్రమంలో తన సొంత ఎజెండా అయిన ‘హిందూరాష్ట్ర’ నిర్మాణానికి పునాదులు వేసుకుంటున్నది.

ఆరెస్సెస్ వారు తమ సిద్ధాంతానికి ‘హిందుత్వ’ అని ముద్దు పేరు పెట్టకున్నారు. ఈ సిద్ధాంతాన్ని ప్రజాస్వామిక వాదులు కూడా అదే పేరుతో పిలవటం ఆత్మహత్యా సదృశం. సంఘ్ సిద్ధాంతం మతతత్వం, మనువాదంపై ఆధారపడి ఉంది. వారు భారత రాజ్యాంగాన్ని బహిరంగంగా తూలనాడుతున్నారు. మనువాదంపై ఆధారపడిన రాజ్యాంగాన్ని రాయాలని 1950లోనే వారు చెప్పారు. వర్ణవ్యవస్థను పునరుద్ధరించటం ద్వారానే హిందూజాతి బలమైన జాతిగా అభివృద్ధి చెందగలదని గట్టిగా నమ్ముతారు. మతతత్వాన్ని వారు ప్రజలను పక్కదారి పట్టించడానికి మాత్రమే తీసుకురావటం లేదు. అధిపత్య వ్యవస్థను, నిచ్చెనమెట్ల వ్యవస్థను స్థాపించడానికి వివిధ రకాల ఉన్మాదాలను పెంచిపోషిస్తున్నారు. మైనారిటీలపైన మెజారిటీ ఆధిపత్యం, అగ్రవర్ణాధిపత్యం, సాంస్కృతికాధిపత్యం, పురుషాధిపత్యం వారి సిద్ధాంతం. ఫాసిజం ఒక ఆధిపత్యాల సిద్ధాంతం.

పార్లమెంటు ద్వారా సోషలిజం రాదు, కాని ఫాసిజం రాగలదు. అందుకే ఫాసిజాన్ని అడ్డుకోదలచిన వారు పార్లమెంటును నిర్లక్ష్యం చేయలేరు. ఎన్నికలను సొంత పార్టీ ప్రయోజనాలకు పరిమితం చేయలేరు. ప్రస్తుత పరిస్థితుల్లో సంతోషించాల్సిన విషయమేమంటే ప్రజలింకా మతోన్మాదులుగా మారిపోలేదు. బీజేపీ దుష్పరిపాలనను గ్రహిస్తూనే ఉన్నారు. అందుకే అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయింది. రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ, దాని బహిరంగ, లోపాయికారీ మిత్రపక్షాలు అధికారంలోకి రాకుండా వామపక్ష, ప్రజాస్వామిక, లౌకిక, ప్రతిపక్ష శక్తులు కలసి ప్రయత్నాలు చేయాలి. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే రాజ్య వ్యవస్థ (కార్యనిర్వాహక వర్గం, న్యాయాంగం, సైన్యం, పోలీసు) మొత్తం పరివార్‌ శక్తులతో నిండిపోగలదు. అప్పుడు పార్లమెంటు రద్దు కావచ్చు లేదా పూర్తిగా విలువలేనిదిగా మారిపోవచ్చు.

డి. రమేష్‌ పట్నాయక్‌

అఖిలభారత విద్యాహక్కు వేదిక అధ్యక్షవర్గ సభ్యులు

Updated Date - 2023-10-25T02:18:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising