భారత్ కీర్తిపతాక : న్యూ ఢిల్లీ డిక్లరేషన్
ABN, First Publish Date - 2023-09-12T02:48:13+05:30
ఒకదేశంలో అత్యంత కీలకమైన అంతర్జాతీయ సమావేశం జరిగినప్పుడు డిక్లరేషన్‌ను రూపొందించి, ఆయా దేశాలను ఒప్పించడం ఆ దేశం బాధ్యత. దీనివల్ల ప్రపంచ దేశాల్లో...
ఒకదేశంలో అత్యంత కీలకమైన అంతర్జాతీయ సమావేశం జరిగినప్పుడు డిక్లరేషన్‌ను రూపొందించి, ఆయా దేశాలను ఒప్పించడం ఆ దేశం బాధ్యత. దీనివల్ల ప్రపంచ దేశాల్లో ఆ దేశం అంతర్జాతీయ స్థాయి పెరుగుతుంది. ఈ నెల 8, 9, 10 తేదీల్లో నిర్వహించిన జీ20 దేశాధినేతల సమావేశాల్లో భారత్ కనబరిచిన దౌత్యనీతి, అన్ని దేశాలను కలుపుకుపోయి, చివరకు నూటికి నూరు శాతం ఎలాంటి రణ గొణ ధ్వనులు లేకుండా న్యూఢిల్లీ డిక్లరేషన్‌ను అన్ని దేశాలతో ఆమోదింపచేసిన తీరు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వ ప్రతిభకు అద్దం పట్టిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
జీ20 శిఖరాగ్రాలు సభ్య దేశాల రాజధాని నగరాలలో నిర్వహించడం పరిపాటిగా ఉండేది. అయితే మోదీ జీ20 అధ్యక్ష పదవి స్వీకరించిన ఏడాది కాలంగా దేశ వ్యాప్తంగా 58 నగరాల్లో పలు దేశాల ప్రతినిధులతో 200కు పైగా సమావేశాలు నిర్వహించి జీ20 సందేశాన్ని గ్రామీణ ప్రజల్లోకి కూడా చేరేలా చూశారు. అసలు ఒకే భూమి, ఒకే కుటుంబం, అందరిదీ ఒకే భవిష్యత్తు నినాదంతో వసుధైవ కుటుంబకం స్ఫూర్తితో జీ20 సమావేశాలు నిర్వహించేందుకు భారత్ ఉద్యుక్తమవడమే మోదీ సాహసానికి నిదర్శనం. జీ20 న్యూఢిల్లీ డిక్లరేషన్ శాంతిని ఆకాంక్షించే భారతీయ సంస్కృతి చిరంతన విలువలు ఎంత మహోన్నతమైనవో జీ20 న్యూఢిల్లీ డిక్లరేషన్ అన్ని దేశాలకూ చాటిచెప్పింది.
ఒక దేశాన్ని మరో దేశం దూషించడం దౌత్యనీతిలో సరైన పని కాదు. ఉక్రెయిన్‌పై దాడి చేసిన రష్యాను అతి తీవ్రమైన భాషలో అమెరికా, యూరోపియన్ యూనియన్, జీ7 దేశాలు దూషిస్తున్న నేపథ్యంలో భారత్ వాటి వైఖరికి, ముఖ్యంగా గత ఏడాది ఇండోనేసియా రాజధాని బాలిలో చేసిన సంయుక్త ప్రకటనకు భిన్నంగా న్యూఢిల్లీ డిక్లరేషన్‌ను రూపొందించింది. అదే సమయంలో ఉక్రెయిన్‌పై రష్యాదాడిని ఈ డిక్లరేషన్‌లో తప్పుపట్టకుండా ఉండలేదు. ఒక దేశ రాజకీయ స్వాతంత్ర్యం, సార్వభౌమికత, సరిహద్దుల సమగ్రతను ఉల్లంఘించి బల ప్రయోగం చేయడం, ఆ దేశ భూభాగాన్ని స్వాధీనపరచుకోవడం ఏ దేశానికీ సరైనది కాదని న్యూఢిల్లీ డిక్లరేషన్ స్పష్టం చేసింది. తనను తీవ్రంగా మందలించారని తెలిసినప్పటికీ, రష్యా ఈ డిక్లరేషన్ స్ఫూర్తిని అంగీకరించింది. ఇది ఎంతో సమతుల్యంగా ఉన్నదని రష్యాతోసహా అన్ని దేశాలూ మనస్ఫూర్తిగా భారత దేశాన్ని అభినందించాయి.
పలు కీలక అంశాలపై పూర్తిగా ఏకాభిప్రాయాన్ని సాధించిడం న్యూఢిల్లీ డిక్లరేషన్ విశిష్టత. ప్రపంచ దేశాల ప్రజల భవిష్యత్ సుస్థిరంగా, సురక్షితంగా ఉండాలంటే ఆ దేశాలన్నీ ఒక హరిత అభివృద్ధి ఒడంబడికను కుదుర్చుకోవాలన్న భారత్ ప్రతిపాదనను అన్ని దేశాలూ అంగీకరించాయి. దీనివల్ల స్వచ్చమైన ఇంధన టెక్నాలజీలను అవలంబించేందుకు వర్ధమాన దేశాలకు భారీ ఎత్తున ఆర్థికసహాయం లభిస్తుంది; ఐక్యరాజ్యసమితి నిర్ధారించిన సహస్రాబ్ది లక్ష్యాలను వేగవంతంగా అమలు చేసి, ప్రజలందరూ సమానంగా, సమతుల్యంగా అభివృద్ధి చెందేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అన్ని దేశాలు అంగీకరించాయి; పెచ్చరిల్లుతున్న అవినీతిని ఏ మాత్రం సహించకుండా తుదముట్టించాలనే నరేంద్రమోదీ ఆశయాన్నీ ప్రపంచ నేతలు అంగీకరించారు; ప్రజలకు అవసరమైన డిజిటల్ మౌలికసదుపాయాలకోసం పటిష్ఠమైన టెక్నాలజీని పెంపొందించాలని కూడా ఆయా దేశాలు నిర్ణయించాయి; వివిధ దేశాల దీర్ఘకాల ఆర్థిక సుస్థిరతను పరిరక్షించేందుకు బహుళ అభివృద్ధి బ్యాంకులను ఏర్పర్చేందుకు జీ20 దేశాలు రోడ్ మ్యాప్‌ను రూపొందించాలని నిర్ణయించాయి. దీనివల్ల క్రిప్టో కరెన్సీలను నియంత్రించడం సాధ్యపడడమే కాక, అణగారిన దేశాల్లో ఆర్థిక సంక్షోభాన్ని వేగంగా అరికట్టేందుకు సాధ్యపడుతుంది; ఆఫ్రికా దేశాల యూనియన్‌ను జీ20లో చేర్చుకోవాలన్న భారత్ ప్రతిపాదనను న్యూఢిల్లీ డిక్లరేషన్ స్వాగతించింది. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్య సిబ్బంది, మెరుగైన అత్యవసర ఆరోగ్య సేవలను వచ్చే రెండు మూడేళ్లలో పెద్ద ఎత్తున పటిష్టం చేయాలని ఈ డిక్లరేషన్ సంకల్పించింది. ప్రపంచ దేశాలన్నిటికీ ఆరోగ్యం విషయంలో ఒకే విధానం ఉండాలని భారత్ కోరింది. ఆరోగ్య రంగంలో వివిధ దేశాలు తమ పరిజ్ఞానాన్ని పంచుకునేందుకు, మేధో సంపత్తి హక్కులను కాపాడుకునేందుకు, వాక్సిన్లు, చికిత్స, ఔషధాలను అభివృద్ధి చేసేందుకు వీలుగా వనరులను సమీకరించేందుకు డిజిటల్ ఆరోగ్య కార్యక్రమాన్ని రూపొందించాలన్న భారత్ ప్రతిపాదననూ అన్నిదేశాలు ఆమోదించాయి.
అంతర్జాతీయ జీడీపీలో 85 శాతం, అంతర్జాతీయ వర్తకంలో 75 శాతం ప్రాతినిధ్యం ఉన్న జీ20 దేశాల సమావేశాలను ఆయా దేశాలతో ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాలను పటిష్ఠం చేసుకునేందుకు ప్రధాని మోదీ ఉపయోగించుకున్న తీరు కూడా అనన్య సామాన్యం. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్‌తో పాటు అనేక దేశాలతో రక్షణ, టెక్నాలజీ బదిలీ రంగాల్లో భారత్ ఒప్పందాలు కుదుర్చుకుంది. మూడు రోజుల్లో మోదీ పలువురు దేశాధినేతలతో 15 ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. భారత్, అమెరికా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయిల్ యూరోపియన్ యూనియన్ తదితర దేశాల మధ్య నౌకాయాన, రైల్వే రవాణా కారిడార్‌కు జీ20 శ్రీకారం చుట్టింది. దీనివల్ల జీ20 దేశాల మధ్య వర్తక భాగస్వామ్యం, ఇంధన వనరులు, డిజిటల్ కమ్యూనికేషన్ల సరఫరా పెరుగుతుంది. చైనా రూపొందించిన బెల్ట్ అండ్ రోడ్ పథకానికి ఇది గట్టి జవాబు. చైనా ఆర్థిక వ్యవస్థతోసంబంధం ఉన్న అనేక దేశాలు ఈ భారత్ –పశ్చిమాసియా– యూరప్ ఆర్థిక కారిడార్ (ఐఎంఇసి) పరిధిలోకి వస్తాయి. అర్జెంటీనా, బంగ్లాదేశ్, బ్రెజిల్, ఇటలీ, మారిషస్, సింగపూర్, అమెరికాలతో కలిసి జీవ ఇంధనాలను అభివృద్ధి పరిచేందుకు భారత్ గ్లోబల్ –బయోఫ్యుయల్ అలయన్స్‌ను ప్రారంభించింది. బహుళ అభివృద్ధి బ్యాంకుల సంస్కరణలపై భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాలు అమెరికాతోకలిసి మరో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. భారత్ ఈ ఒప్పందాల్లో చైనాను దూరంగా ఉంచడంలో ఆదేశానికి తగిన గుణపాఠం చెప్పినట్లయింది. ఈ ఒప్పందాల వల్ల పేద, మధ్య తరహా దేశాల్లో మౌలికసదుపాయాలు మెరుగుపడతాయని, బహుళ అభివృద్ధి బ్యాంకు వంటి నిర్ణయాలు పేద దేశాలకే ఉపయోగపడతాయని, మొత్తం కారిడార్‌లో ఆర్థిక పెట్టుబడులకు లెక్కలేనన్ని అవకాశాలు ఏర్పడతాయని, ఇది మోదీ నాయకత్వ ప్రతిభకు నిదర్శనమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం అభినందించారు. ఆశ్చర్యకరంగా కాంగ్రెస్ పార్టీ కూడా జీ20 విజయాలను ప్రశంసించింది. జీ20 డిక్లరేషన్ ఏకాభిప్రాయంతో ఆమోదం పొందడం భారతదేశానికి గర్వకారణమని కాంగ్రెస్ నేత శశిథరూర్ అన్నారు. జీ20 సమావేశాల విజయం అంతర్జాతీయ రంగంలో మోదీ ప్రతిష్ఠను రుజువు చేసినప్పుడు, భారత్‌లో ఆయన నాయకత్వం మరింత పటిష్ఠమైందని గ్రహించినప్పుడు ప్రతిపక్షాలు ఆ విషయం ఒప్పుకోవడం మినహా చేయగలిగింది ఏమీ లేదు.
వై. సత్యకుమార్
(బీజేపీ జాతీయ కార్యదర్శి)
Updated Date - 2023-09-12T02:48:13+05:30 IST