ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

యాభై వసంతాల జనసాహితి

ABN, First Publish Date - 2023-10-11T03:18:43+05:30

శ్రామిక వర్గచైతన్యమే ఊపిరిగా, సరికొత్త కవితారీతికి పాదులు వేసిన సాహితీ యుగకర్త, వ్యక్తి చైతన్యంతో పాటు సంఘ చైతన్యాన్ని సమాన ధిక్కారంతో ప్రవచించిన మహాకవి శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ స్ఫూర్తితో...

శ్రామిక వర్గచైతన్యమే ఊపిరిగా, సరికొత్త కవితారీతికి పాదులు వేసిన సాహితీ యుగకర్త, వ్యక్తి చైతన్యంతో పాటు సంఘ చైతన్యాన్ని సమాన ధిక్కారంతో ప్రవచించిన మహాకవి శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ స్ఫూర్తితో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రాంతానికి చెందిన యువకులు 1973లో ఏర్పాటు చేసుకున్న సంస్థ ‘జనసాహితి’. నేడు ఈ సంస్థ స్వర్ణోత్సవాన్ని జరుపుకుంటోంది.

వరంగల్–కరీంనగర్ జిల్లాల మధ్య వారధిలా వుండే హుజూరాబాద్ ప్రాంతంపై ఈ రెండు జిల్లాల సాంస్కృతిక, సాహిత్య, రాజకీయాల ప్రభావం ఉంది. ఈ నేపథ్యంలో వరంగల్ నుంచి వరవరరావు సంపాదకత్వంలో వెలువడిన ‘సృజన’, కరీంనగర్ నుంచి భాగ్యనగర్ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో వెలువడిన ‘విద్యుల్లత’ మాసపత్రికల ప్రభావం కూడా జనసాహితి ఏర్పడడానికి దోహదపడింది.

1973లో విప్లవ రచయితలు వరవరరావు, చెరబండరాజు, ఎం.టి.ఖాన్‌లను ప్రభుత్వం ఆంతరంగిక భద్రతా చట్టం కింద అరెస్ట్ చేసినప్పుడు, అప్పుడే పుట్టిన జనసాహితి, వాళ్ళ అరెస్ట్‌లను నిరసిస్తూ అనేక సమావేశాలను నిర్వహించింది. 1974లో జనసాహితి నిర్వహించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు షష్ఠిపూర్తి సభలో కాళోజీ చేసిన ప్రసంగం ఈ ప్రాంతంలోని అప్పటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ప్రజాస్వామిక దృక్పథంతో పాటు, అన్యాయాలను, దోపిడీని ప్రశ్నించడం నేర్పించింది. అలాగే 1975 మే 11న హుజూరాబాద్‌లో పదివేల మంది ప్రజలతో నిర్వహించిన భారీ బహిరంగసభలో మహాకవి శ్రీశ్రీ పాల్గొని ప్రసంగించారు. జనసాహితి ప్రచురించిన ‘నిప్పురవ్వలు’ కవితా, కథా సంకలనాన్ని శ్రీశ్రీ ఈ సభలో ఆవిష్కరించి, విప్లవ రచయితల సంఘం అధ్యక్షుని హోదాలో జనసాహితి సంస్థను విరసం ముద్దుబిడ్డగా స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సభలోనే నిప్పురవ్వలు పుస్తకాన్ని విప్లవ రచయిత చెరబండరాజు సమీక్షించారు. సభ అనంతరం శనిగరం వెంకటేశ్వర్లు(సాహు), నల్ల ఆదిరెడ్డిల ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత డా. ఎం.వి. తిరుపతయ్య రాసిన ‘న్యాయం’ కథను నాటకీకరించి ‘భూభాగోతం’ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సభ తర్వాత 45 రోజులకే దేశంలో అప్పటి కేంద్రప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించి ‘నిప్పురవ్వలు’ పుస్తకాన్ని నిషేధించింది. అలాగే సంస్థ సలహాదారులైన రచయితలు తాడిగిరి పోతరాజును, డా. ఎం.వి. తిరుపతయ్యలను అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. సంస్థ సభ్యులను పోలీసులు బైండోవర్ చేశారు. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత ప్రజా ఉద్యమాల ఉధృతి పెరిగి, నిత్యం దోపిడీకి, అణచివేతలకు గురైన ప్రజలు ప్రశ్నించే ధైర్యాన్ని కూడగట్టుకొని సాయుధ పోరాటాలవైపు పరుగులు తీసిన కాలం... ఇలాంటి వాతావరణంలో జనసాహితి కార్యక్రమాలు ఒక దశాబ్ద కాలం పాటు స్తబ్దంగా ఉండిపోయాయి.

ఆ తర్వాత మళ్ళీ సాహితోద్యమంలో జనసాహితి చురుకుగా తన పాత్రను నిర్వహిస్తూ ‘జమ్మి ఆకు’ (కవితా సంకలనం), మరోప్రపంచపు మహాకవి(శ్రీశ్రీ) వ్యాస సంపుటి, ఎమర్జెన్సీ జైలు జీవితాలపై ప్రముఖ రచయిత తాడిగిరి పోతరాజు రాసిన ‘కెటిల్’ కథల సంపుటి, ఆవునూరి సమ్మయ్య రాసిన ‘గవాయి’, ‘గమనం’ వ్యాస సంపుటాలు ప్రచురించింది. ఈ పుస్తకాలన్నింటికీ వరవరరావు ముందు మాటలు రాశారు. గత ఐదేళ్లుగా జనసాహితి ఆధ్వర్యంలో ‘సమాలోచన’ పేరుతో సామాజిక స్పృహ కలిగిన యువ రచయితలను ప్రోత్సహించేందుకు సాహిత్య బులెటిన్‌ను ప్రచురిస్తోంది.

జనసాహితి యాభై వసంతాలు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా ‘ప్రజావాగ్గేయ కారుడు గద్దర్’ పేరుతో ఒక ప్రత్యేక సంచికను వెలువరించింది. ఈ సంచికను నేటి సాయంత్రం 4.30 గంటలకు హుజూరాబాద్‌లోని సిటీ సెంట్రల్‌ కన్వెన్షన్‌లో జరిగే సభలో ప్రముఖ రచయిత అల్లం రాజయ్య ఆవిష్కరిస్తారు. ప్రొఫెసర్‌ చింతకింది కాశీం ప్రసంగిస్తారు.

– ఆవునూరి సమ్మయ్య, కన్వీనర్, జనసాహితి, హుజూరాబాద్

Updated Date - 2023-10-11T03:18:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising