పాలస్తీనా దుష్మన్లకీ.. ఇజ్రాయిల్ దోస్తులకీ!
ABN, First Publish Date - 2023-10-15T03:02:23+05:30
మీకు తియ్యటి మోహపు మాటలెన్నో చెప్పాను కానీ, వాటిని మీరు పెడచెవిన పెట్టారు మీకు మధుమేహమని నాకు తెలీదు...
మీకు తియ్యటి మోహపు మాటలెన్నో చెప్పాను
కానీ, వాటిని మీరు పెడచెవిన పెట్టారు
మీకు మధుమేహమని నాకు తెలీదు
మీ హృదయంపై షడ్రుచులు అద్దాను
కానీ, అవి మీకు రుచించలేదు
మీ నాలుక మడతడిందని నాకు తెలీదు
నా వాసన పట్టిస్తుందని మీ దగ్గరగా వచ్చా
కానీ, మీరు అసహ్యంగా ముక్కు మూసుకున్నారు
మీ నాసికకు సువాసనలు పడవని నాకు తెలీదు
మీరు నమ్మదగిన సాక్ష్యాలెన్నో ముందుంచా
కానీ, మీరు వాటిని చూడనిరాకరించారు
మీకు అరికాల్లోనే కన్ను వుందని నాకు తెలీదు
అలసిపోయా, విశ్వసించమని వగరుస్తూ చూశా
కానీ, మీరు చెప్పిచ్చుకు కొట్టారు
మీ నాలుక్కి చెరుకు రుచించదని నాకు తెలీదు
చివరి యత్నంగా చర్మం ఒలిచి చెప్పులు కుట్టిచ్చాను
కానీ, వాటిని తొడుక్కుని కూడా విసవిసా వెళ్లిపోయారు
అవి కరుస్తాయని నెత్తురోడే మీ కాళ్లకి చెప్పక్కర్లేదని నాకు తెలుసు.
దేశరాజు
Updated Date - 2023-10-15T03:02:23+05:30 IST