ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వేచ్ఛ–సంయమనం

ABN, First Publish Date - 2023-01-05T02:32:30+05:30

ప్రజాప్రతినిధుల భావప్రకటనాస్వేచ్ఛకు ఇక ప్రత్యేక పరిమితులంటూ లేవు. నాయకులకు కూడా సామాన్యపౌరులతో సమానమైన పరిమితులే వర్తిస్తాయి తప్ప, అంతకుమించి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రజాప్రతినిధుల భావప్రకటనాస్వేచ్ఛకు ఇక ప్రత్యేక పరిమితులంటూ లేవు. నాయకులకు కూడా సామాన్యపౌరులతో సమానమైన పరిమితులే వర్తిస్తాయి తప్ప, అంతకుమించి ప్రత్యేకంగా వారిమీద అదనపు ఆంక్షలు విధించలేమని సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. రాజ్యాంగంలోని 19(2)అధికరణ కింద నిర్దేశించినవి మినహా ఎవరినీ అదనంగా కట్టడి చేయడం సాధ్యం కాదన్నది ఈ తీర్పు సారాంశం. ఎదుటిమనిషి వ్యాఖ్యలతో మనసునొచ్చినప్పుడు ఎలాగైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చునో, నాయకుల వ్యాఖ్యలవల్ల సామాజిక శ్రేయస్సు దెబ్బతింటుందని అనుకున్నవారు కోర్టులకు ఎక్కవచ్చును తప్ప, ప్రత్యేకంగా ప్రజాప్రతినిధుల నోళ్ళకు తాళాలువేయడం జరగనిపని అని న్యాయస్థానం అంటున్నది. రాజకీయనాయకులు కూడా ఈ దేశపౌరులే కానీ, సామాన్యులతో పోల్చితే వారి వ్యాఖ్యలకు ఉన్న విలువ, ప్రభావం విస్తృతమైనవి కనుక వారిని కాస్తంత జాగ్రత్తగా నడుచుకొనేట్టు చేసే రీతిలో ఈ తీర్పు ఉంటుందన్న సామాన్యుడి ఆశ పెద్దగా నెరవేరలేదు.

నేతల విద్వేషపూరిత వ్యాఖ్యలను నియంత్రించే విషయంలో తాము చేయగలిగిందేమీ లేదనీ, పార్లమెంటే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని న్యాయస్థానం అంటున్నది. మంత్రుల ద్వేషపూరితవ్యాఖ్యలను నియంత్రించాల్సిన బాధ్యత పార్టీలమీద పెడుతూ, అందుకు వీలుగా పార్టీలే ఓ ప్రవర్తనానియమావళిని తయారుచేసుకోవాలని కేవలం సూచనలకే పరిమితం కావడం వల్ల వర్తమాన రాజకీయ వాతావరణంలో పెద్దగా మార్పువచ్చే అవకాశమైతే లేదు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి భావప్రకటనాస్వేచ్ఛ పునాది అన్న ఉటంకింపు బాగున్నది కానీ, ప్రధానంగా ప్రజాప్రతినిధులే ఆ స్వేచ్ఛను దుర్వినియోగపరుస్తూ, ప్రజాస్వామ్యాన్ని అనారోగ్యపరుస్తున్నందున సర్వోన్నత న్యాయస్థానం వీరివిషయంలో కాస్తంత గట్టిగా వ్యవహరిస్తుందని ప్రజాస్వామ్యప్రియులు ఆశించారు. నిర్దిష్టంగా అటువంటిదేమీ లేకుండా, నేతల విద్వేషపూరితప్రసంగాలవల్ల రాజ్యాంగం ఆశించిన సోదరభావం, సమానత్వం వంటి విలువలు దెబ్బతింటాయని వాపోవడం వల్ల ప్రయోజనం ఉండదు. ఆరేళ్ళక్రితం ఒక అత్యాచారఘటనకు సంబంధించి ఆజాంఖాన్‌ చేసిన వ్యాఖ్యలు ఈ తీర్పుకు పునాది. గత ఆరేళ్ళకాలంలో అంతకుమించిన భయానకమైన, తీవ్రమైన వ్యాఖ్యలను అనేకమంది నాయకుల నోటివెంట సమాజం విన్నది. ప్రజాప్రతినిధులు అప్రియమైన మాటలు మాట్లాడకూడదని, ఇతరులను అవమానించకూడదనీ హితవు చెప్పడం సరైనదే. కానీ, బహురూపాల్లో ఉన్న విద్వేషపు, విచ్ఛిన్నకర ధోరణులను బలోపేతం చేయడానికి ఎప్పటికప్పుడు మాటలు మరింత కఠినమవుతున్న, అధికారంకోసం ఎంతకైనా తెగించే వాతావరణం ఇప్పుడున్నది, మరింత వేగంగా దిగజారుతున్నది.

సమిష్టి బాధ్యత సూత్రాన్ని వర్తింపచేసినప్పటికీ కూడా, ఒక మంత్రిచేసిన వ్యాఖ్యలు తన ప్రభుత్వాన్ని సమర్థించుకోవడానికో, రక్షించుకోవడానికో ఉద్దేశించినవే అయినా, ప్రభుత్వానికి నేరుగా బాధ్యత ఉన్నట్టుగా భావించలేమని మెజారిటీ సభ్యులు తేల్చిచెప్పినందున పాలకపక్షాలు ఇక నిశ్చింతగా ఉండవచ్చు. ఈ విషయంలోనే కాదు, దాదాపు అన్ని అంశాలతోనూ విభేదిస్తూ జస్టిస్‌ నాగరత్న చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా విలువైనవే. కొత్త సంవత్సరంలో ఆమె రెండో అసమ్మతి తీర్పు ఇది. పెద్దనోట్ల రద్దు తీర్పులో మాదిరిగానే, ఇప్పటి తీర్పులోనూ ఆమె తన ప్రత్యేకత నిలబెట్టుకున్నారు. ప్రజాప్రతినిధుల వాక్‌స్వేచ్ఛపై అధికపరిమితులు విధించలేమని అంగీకరిస్తూనే, ఏయే సందర్భాల్లో వారిని జవాబుదారీ చేయవచ్చునో ఆమె చెప్పారు. ప్రజాప్రతినిధులు అధికారికహోదాల్లో టెలివిజన్‌ చానెళ్ళలోనూ, బహిరంగ సమావేశాల్లోనూ హద్దుల్లేని వ్యాఖ్యలు చేస్తూ, నినాదాలు ఇస్తూ సమాజంలో ఒకరిపై ఒకరిని రెచ్చగొడుతున్న నేపథ్యంలో ఇది పెద్ద ఉపశమనం.

ఈ తీర్పు ప్రజాప్రతినిధులకు అవధుల్లేని స్వేచ్ఛ ఇచ్చినట్టుగా భావించనక్కరలేదు. వాక్‌స్వేచ్ఛ విస్తృతిని నిర్దిష్టంగా తెలియచెప్పినందున, నాయకుల వ్యక్తిగత వ్యాఖ్యలపై సామాన్యులు న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం మిగిలేవుంది. విద్వేషవ్యాఖ్యలకు నిర్దిష్టమైన నిర్వచనం లేకపోవడం, నివారించాలన్న సంకల్పం పార్టీలకు లేకపోవడం వల్ల సమస్య నానాటికీ జటిలమవుతున్న తరుణంలో ఈ తీర్పు పరిస్థితిని మార్చడానికి దోహదకారి కావచ్చు. న్యాయస్థానం తన పరిధిలో చేయగలిగిందేదో చేసి, అధికభారం చట్టసభలమీద మోపినందున ఇప్పుడు కావాల్సింది రాజకీయ సంకల్పమే.

Updated Date - 2023-01-05T02:32:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising