గగన గ్రంథం
ABN, First Publish Date - 2023-08-29T03:52:01+05:30
వందే భారత్ రైలు బండి ఇప్పుడు నింగి దారి పట్టింది మబ్బుల చెక్కిళ్ళు నిమిరి ఆకాశపు అంచులు ముట్టింది యోజనాల అంతరాన్ని ఇట్టే చెరిపేసింది ఊహకి వాస్తవాలకు మధ్య దూరాన్ని...
వందే భారత్ రైలు బండి ఇప్పుడు నింగి దారి పట్టింది
మబ్బుల చెక్కిళ్ళు నిమిరి ఆకాశపు అంచులు ముట్టింది
యోజనాల అంతరాన్ని ఇట్టే చెరిపేసింది
ఊహకి వాస్తవాలకు మధ్య దూరాన్ని
శూన్యంలోనే కొలతలు పట్టి
మన ముందు నిలబెట్టేసింది
చతుశ్శతి కోటి వసంతాలకుముందెప్పుడో
సౌర చక్రంలో మహా ఘాతానికి
చెదరిపడ్డ ఒక ధరా శకలం
రసజ్ఞుడి ఇందువదన
శాస్త్రజ్ఞుడి పరిశోధనా సదనమయ్యింది
భావ సంఘర్షణ
మాటలను ఏర్పరిచిన చోట వ్యాకరణం
గ్రహతతుల ఘర్షణ తీర్చిన తునకకు
రజనీకాంతుడని నామకరణం
యుగాల పర్యంతం స్రవించిన జీవకోటి కన్నీటిని
ఆమె కడుపులో దాచుకుంది
పుడమి తల్లి కదా!
భాగ్యమో! సౌభాగ్యమో!
భాగం పంచుకోవడానికి,
స్వార్థం కారణం కాలేదు
సృష్టిలోని అనర్థమే
అఖండమైన భూమండలి
ఊహకందని కాలానికి
చంద్రఖండమయ్యింది
అమ్మ పుట్టిల్లు మేనమామకు నట్టిల్లు కదా!
అయినవాడు, అమ్మ తమ్ముడూనూ, కనుక
వావివరస కట్టిన మేనరికం చుట్టరికం కలిపింది
చందమామను చేసింది
ధరా గర్భాన దాగిన ధన్యత కాబోలు!
స్తన్యమైన నీటి చెలమలు అమృత భాండాలయ్యాయి
భువన భవనంలో భాగం పంచుకున్న తమ్ముడి ఇంట
ఈ సుధా స్రవంతి ఉన్నదా?
శోధకుడి సందేహం!
భరత మేదిని మేధలో అంకురం మొలిచింది
ఊపిరి పోసుకుంటోంది సమాధానాల ప్రకరణం
నాగరికతా సౌధంలో గగన గ్రంథం
మీరు ఆ రైలెక్కి
తప్పక దయ చేస్తారు కదూ!
రేపే ఈ సరికొత్త కావ్యావిష్కరణం.
– వోలేటి పార్వతీశం
(భారత్ సాధించిన చంద్రయాన్
ఘనతకు స్పందనగా)
Updated Date - 2023-08-29T03:52:01+05:30 IST