‘నెహ్రూ–ఎల్విన్ ఒప్పందం, క్రైస్తవ ఈశాన్యం’
ABN, First Publish Date - 2023-08-26T03:58:53+05:30
‘క్రైస్తవ ధర్మ ప్రచారకుడు వెరియర్ ఎల్విన్‌తో నెహ్రూ ఒక ఒప్పందానికి వచ్చారు. దాని ప్రకారం హిందూ సాధువులు నాగాలాండ్‌కు వెళ్లడాన్ని నిషేధించారు. పర్యవసానమేమిటి? నాగభూమిలో ...
‘క్రైస్తవ ధర్మ ప్రచారకుడు వెరియర్ ఎల్విన్‌తో నెహ్రూ ఒక ఒప్పందానికి వచ్చారు. దాని ప్రకారం హిందూ సాధువులు నాగాలాండ్‌కు వెళ్లడాన్ని నిషేధించారు. పర్యవసానమేమిటి? నాగభూమిలో క్రైస్తవ జనాభా పెరిగిపోయింది. ఇప్పుడు నాగాలాండ్ జనాభాలో 88 శాతం మంది క్రైస్తవులే. ఇదంతా నెహ్రూ పాలనలోనే సంభవించింది’. ఈ ఏడాది మేలో మణిపూర్‌లో జాతుల ఘర్షణ ప్రజ్వరిల్లిన అనంతరం సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన వ్యాఖ్య అది. అది వాస్తవమేనా అని పలువురు నన్ను ప్రశ్నించారు. వెరియర్ ఎల్విన్ జీవిత చరిత్ర కారుడిగా పై వాదనలోని సత్యాన్ని నిగ్గు తేల్చవలసిన బాధ్యత నాపై ఉన్నది. నిజమేమిటో నిర్ధారించాలని కోరుతూ లేఖలు రాసిన ఎంతో మందికి నేను ఇలా సమాధానమిచ్చాను: ‘స్వాతంత్య్రానంతరం ఇతర రాష్ట్రాల వారు నాగాలాండ్‌కు వెళ్లడాన్ని నిరుత్సాహపరిచారు. మన స్వాతంత్ర్యం తొలినాళ్లలో నాగాలాండ్‌లో వేర్పాటువాద కార్యకలాపాలు ఉధృతమవడం వల్లే ఆ రాష్ట్రాన్ని సందర్శించడంపై ఆంక్షలు విధించడం జరిగింది. అంతేగాని నాగాలాండ్, ఆ మాటకొస్తే ఈశాన్య భారతానికి సంబంధించిన ఏ విషయంపైన అయినా సరే ‘నెహ్రూ – ఎల్విన్ ఒప్పందం’ అంటూ ఏమీ లేదు. నిజానికి నెహ్రూ, ఎల్విన్‌లు పుట్టడానికి చాలా కాలం ముందునుంచీ నాగా కొండ ప్రాంతాలలో క్రైస్తవ ధర్మ ప్రచారకులు క్రియాశీలంగా ఉన్నారు.. ఎల్విన్ అయితే క్రైస్తవ ధర్మప్రచారకుల చిత్త శుద్ధిని సంశయించారు. అలాగే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకలాపాలనూ ఆయన గర్హించారు. గిరిజనులు హిందూ లేదా క్రైస్తవ మతంలోకి మారకుండా, తమ సొంత విశ్వాసాలు, ఆచారాలకు కట్టుబడి ఉండాలని ఎల్విన్ ప్రగాఢంగా ఆకాంక్షించారు’.
సామాజిక మాధ్యమాలలో ప్రచారమవుతున్న అసత్యాలను ఖండించి, సత్య నిర్ధారణ చేసేందుకు నేను సాధారణంగా ఈ కాలమ్‌ను ఉపయోగించుకోను. వెరియర్ ఎల్విన్ విషయంలో మాత్రమే ఆ ఆనవాయితీకి మినహాయింపు నిస్తున్నాను. ఇందుకు మూడు కారణాలు ఉన్నాయి. అవి: పైన ప్రస్తావించిన ఒప్పందాన్ని ఆమోదించేలా నెహ్రూను ఎల్విన్ బలవంతం చేశాడనే కాకుండా ఇంకా అనేకానేక అసత్యాలు ఆన్‌లైన్ జగత్తులో ప్రచారమవుతున్నాయి. అసలు ఈశాన్య భారత రాష్ట్రాలలో క్రైస్తవ మత వ్యాప్తి మరింతగా జరగడానికి ఎల్వినే ప్రధాన కారకుడని, తత్కారణంగా మణిపూర్‌లో హిందూ మెయితీలు, క్రైస్తవ కుకీల మధ్య ప్రస్తుత హింసాత్మక ఘర్షణలకు ఆయనే ఒక విధంగా బాధ్యుడని కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి; రెండు– కీర్తిశేషుడు అయిన ఎల్విన్‌ను అపఖ్యాతిపాలు చేయడానికి హిందూ మితవాద సంస్థల కార్యకర్తలే కాకుండా ఏకంగా అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆయనపై నిరాధార నిందలు మోపడానికి ప్రయత్నించడం కూడా నన్నీ వ్యాసరచనకు పురిగొల్పింది; మూడు– హిందూత్వ మినహా ఏ భావజాలాన్నీ బీజేపీ అంగీకరించదు కదా. ఎల్విన్ అందుకు భిన్నంగా పక్షపాతం లేకుండా అన్ని మతాలను సమదృష్టితో ఆదరించిన విశాల హృదయుడు. నిజానికి గిరిజన సంస్కృతి పట్ల ప్రగాఢ సానుభూతితో తన సొంత క్రైస్తవ ధర్మాన్ని కూడా ఆయన విడనాడారు.
హిమంత శర్మ ఆరోపణలను పరిశీలించే ముందు, ఎల్విన్ గురించి క్లుప్తంగా తెలియజేస్తాను. 1902లో జన్మించిన వెరియర్ ఎల్విన్ ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. భారతదేశంలో క్రైస్తవానికి స్వదేశీ స్వభావాన్ని సంతరింపచేసేందుకై 1927లో మన దేశానికి వచ్చారు. మహాత్మాగాంధీ స్ఫూర్తితో చర్చ్ విధుల నుంచి నిష్క్రమించి మధ్య భారతదేశంలోని ఆదివాసీల సంక్షేమ సాధనకు అంకితమయ్యారు. 1930, 1940 దశకాలలో ఆదివాసుల జీవనవిధానాలు, జానపద గాథలు, కళా సంప్రదాయాలపై ఆయన మౌలిక, పథ నిర్దేశక అధ్యయనాలు నిర్వహించారు. స్వాతంత్ర్యానంతరం ఆయన భారతదేశ పౌరసత్వాన్ని స్వీకరించారు. 1954లో నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ (నేటి అరుణాచల్‌ప్రదేశ్)లో భారత ప్రభుత్వానికి సలహాదారుగా నియమితులయ్యారు. మానవ జాతుల అధ్యయనంలో ఎల్విన్ అపార వైదుష్యం, అనుభవం ఆ సరిహద్దు రాష్ట్రంలోని భిన్న ఆదివాసీ తెగల మధ్య సామరస్యాన్ని నెలకొలిపేందుకు తోడ్పడగలదని భారత ప్రభుత్వం భావించింది. ప్రభుత్వ అభిమతాన్ని ఆయన నెరవేర్చారు. భూమి, అడవులపై ఆదివాసీల హక్కులను కాపాడేందుకు ఎల్విన్, ఆయన సహచరులు చాలా కృషి చేశారు. వివిధ గిరిజన తెగల మధ్య అనుసంధాన భాషగా హిందీని ప్రోత్సహించారు. హిందూ, క్రైస్తవ మత ప్రచారకులను దూరంగా ఉంచారు. అరుణాచల్‌లో శాంతి సామరస్యాలు వర్ధిల్లేందుకు ఎల్విన్ కృషి విశేషంగా తోడ్పడింది.
వెరియర్ ఎల్విన్ 1964 ఫిబ్రవరిలో మరణించారు. ఇంచుమించు ఆరు దశాబ్దాలకు 11 ఆగస్టు 2023న అసోం ముఖ్యమంత్రి హిమంత శర్మ న్యూ ఢిల్లీ నుంచి వెలువడే ఒక ఆంగ్ల దినపత్రికలో ఒక వ్యాసం రాశారు. అందులో ఇలా ఉంది: ‘పండిట్ నెహ్రూ ఒక యూరోపియన్ దేశస్థుడిని ఈశాన్య భారత రాష్ట్రాలలో తన తొలి సలహాదారుగా నియమించుకున్నారు. అసోంలో చమురు నిక్షేపాలను కనుగొన్నప్పటికీ అక్కడ చమురు శుద్ధి కర్మాగారం ఏర్పాటుకు నెహ్రూ అనుమతించకపోవడానికి ఆ యూరోపియన్ దేశస్థుడే కారకుడా? ఆ యూరోపియన్ దేశస్థుడి సలహాపైనే గోపీనాథ్ బోర్డోలాయ్‌కి ‘భారతరత్న’ పురస్కారాన్ని ప్రకటించేందుకు నెహ్రూ ప్రభుత్వం నిరాకరించిందా?’, ఇంతకూ ఆ యూరోపియన్ దేశస్థుడి పేరు ఏమిటో శర్మ వెల్లడించలేదు. ఈ వ్యాసం వెలువడడానికి మూడు రోజుల ముందు ట్విటర్‌లో ఒక వ్యాఖ్యను శర్మ పోస్ట్ చేశారు: ‘ఈశాన్య భారత వ్యవహారాలపై ప్రభుత్వానికి సలహా ఇచ్చేందుకు యూరోప్‌లో జన్మించిన వెరియర్ ఎల్విన్‌ను నెహ్రూ నియమించారు. ఇదుగో, ఆ నియామకం నుంచే ఈశాన్య భారతంలో కాంగ్రెస్ మహాపరాధాలు ప్రారంభమయ్యాయి’. వాస్తవమేమిటి? నార్త్ ఈస్ట్రన్ ఫ్రాంటియర్ ఏజెన్సీ ప్రభుత్వానికి సలహాదారుగామాత్రమే ఎల్విన్ నియమితుడయ్యారు. మరే ఇతర ఈశాన్య రాష్ట్ర పాలనలోనూ ఆయనకు ఎటువంటి బాధ్యతలను అప్పగించలేదు. నాగాలాండ్‌లోగానీ, మణిపూర్‌లోగానీ, మరీ ముఖ్యంగా అసోంలో గానీ ఆదివాసీల వ్యవహారాలతో ఎల్విన్‌కు ఎటువంటి సంబంధం లేదు. అయినా ఎల్విన్ అసోంకు చమురు శుద్ధి కర్మాగారం రాకుండా చేశాడని, గోపీనాథ్ బోర్డోలాయ్‌కి భారతరత్న పురస్కారం దక్కకుండా చేశాడని, అసలు ఈశాన్య భారతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన తప్పులు అన్నిటికీ ఆయనే బాధ్యుడు అన్నట్టుగా ముఖ్యమంత్రి హిమంత శర్మ ఆక్రోశించారు.
సరే, శర్మ ఆరోపణల సందర్భాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవల్సిన అవసరమున్నది. మణిపూర్‌లో గత మూడు నెలలుగా జాతుల ఘర్షణ అడ్డు అదుపు లేకుండా చెలరేగుతోంది. అదొక అంతర్యుద్ధమే అన్నా సత్య దూరంకాదు. అయినా ఆ సంక్షోభానికి కనుచూపు మేరలో పరిష్కారం కనిపించడం లేదు. ఎడతెగని అల్లర్లు, హింసాకాండలో వేలాది కుటుంబాలు ఆస్తులు, ఆప్తులను కోల్పోతున్నాయి. మణిపూర్ పరిణామాల ప్రభావం పొరుగు రాష్ట్రాలు అయిన మిజోరం, నాగాలాండ్, మేఘాలయలపై కూడా తీవ్రంగా ఉన్నది. ఆ రాష్ట్రాలలో కూడా జాతుల ఘర్షణ మహోధృతంగా ప్రజ్వరిల్లే ప్రమాదం ఎంతైనా ఉన్నది. మణిపూర్‌లోనూ, ఇతర ఈశాన్య రాష్ట్రాలలోనూ నెలకొనివున్న, మరింతగా పెచ్చరిల్లుతున్న విషమ పరిస్థితులకు బాధ్యత ఎవరిది? ‘డబుల్ ఇంజిన్ సర్కార్’దేనని నిశ్చితంగా చెప్పి తీరాలి. మణిపూర్‌లో హింసాత్మక ఘర్షణలకు బాధ్యత చాలవరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర హోం శాఖ మంత్రి, ప్రధానమంత్రిదే ననడంలో సందేహం లేదు. ఈ ముగ్గురు వ్యక్తులతో పాటు ఈశాన్య భారత రాష్ట్రాలలో బీజేపీ అగ్రగామినేతగా వెలుగొందుతున్న అసోం ముఖ్యమంత్రి కూడా ఆ విషమ పరిస్థితులకు బాధ్యత వహించాల్సివున్నది. అయినా మణిపూర్ విషాదంలో తన బాధ్యత, తన పార్టీ బాధ్యతను కప్పిపుచ్చేందుకు ఆయన పూనుకున్నారు. అందులో భాగంగానే, ఏనాడో మరణించిన వ్యక్తుల గురించి, సుదూర గతంలో సంభవించిన సంఘటనల గురించి మనం మాట్లాడుకునేలా చేసేందుకు హిమంత శర్మ ప్రయత్నిస్తున్నారు.
వెరియర్ ఎల్విన్ జీవిత కథ రాసిన రచయితగా నేను, ఏనాడో కీర్తిశేషుడు అయిన ఆ వ్యక్తిపై మతవాదుల ఆరోపణల పట్ల మౌనంగా ఉండలేను. ఎల్విన్ తన మత విశ్వాసాలను వదులుకుని, మతపరమైన బహుళతావాదాన్ని సమాదరంతో స్వీకరించిన ఉదాత్తుడు. మరి ఎల్విన్‌పై నిందలు వేస్తున్నవారు ఆయన విశాల దృక్పథాన్ని అర్థం చేసుకోగలరా? సుదూర దేశంలో పుట్టి, పెరిగి ఈ దేశానికి వచ్చి, ఈ దేశ పౌరసత్వాన్ని స్వీకరించి, మన సమాజానికి ఎనలేని సేవలు అందించిన ఆ వ్యక్తి గొప్పదనాన్ని ఎందుకు గౌరవించలేకపోతున్నారు? ఎల్విన్ మహా మనీషి అని నేను చెప్పబోవడం లేదు. అయితే ఆదివాసుల జీవితాలలో వెలుగులు నింపేందుకు ఆయనచేసిన కృషికి శాశ్వత విలువ ఉన్నది. ఆయన మేధో వారసత్వం నేటి తరానికీ స్ఫూర్తిదాయకమైనదే. ఎల్విన్‌పై సమకాలికుల అభిప్రాయాలతో ఈ వ్యాసాన్ని ముగించదలిచాను. ప్రముఖ మానవ శాస్త్రవేత్త ఎస్‌సి దూబే ఇలా అన్నారు: ‘ఎల్విన్ ఒక కవి, ఒక కళాకారుడు, ఒక తాత్వికుడు. ఆదివాసులపై పెద్ద పరిశోధనా సంస్థలు చేయలేని కృషిని ఆయన తానొక్కడే చేయగలిగారు. గిరిజనుల స్థితిగతులను మెరుగుపరిచేందుకు ఆయన కృషి ఇతోధికంగా తోడ్పడింది’. ఎల్విన్ చనిపోయినప్పుడు అమృత బజార్ పత్రిక తన సంపాదకీయంలో ఇలా ప్రస్తుతించింది: ‘ఎల్విన్ మరణంతో భారత్ ఒక ప్రముఖ మానవశాస్త్రవేత్తను కోల్పోయింది. ఈ దేశాన్ని తమ సొంత దేశంగా చేసుకుని, భారతీయులతో పూర్తిగా కలిసిపోయిన ఉదారవాదులు అయిన ఇంగ్లీష్ వారిలో, బహుశా, చివరి వ్యక్తిని కూడా భారత్ కోల్పోయింది’. అదే దినపత్రికలో ‘లిటిల్ థియేటర్ గ్రూప్’ అనే సుప్రసిద్ధ బెంగాలీ నాటక సంస్థ ‘భారతీయులలో ఉత్తముడు డాక్టర్ వెరియర్ ఎల్విన్’ అని శ్రద్ధాంజలి ఘటించింది.
రామచంద్ర గుహ
(వ్యాసకర్త చరిత్రకారుడు)
Updated Date - 2023-08-26T03:59:41+05:30 IST