ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహా విషాదం

ABN, First Publish Date - 2023-02-09T01:00:06+05:30

అతిభారీ భూకంపంతో అల్లాడుతున్న టర్కీ (తుర్కియా), సిరియాల్లో మృతుల సంఖ్య అధికారికంగానే పన్నెండువేలు దాటింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతిభారీ భూకంపంతో అల్లాడుతున్న టర్కీ (తుర్కియా), సిరియాల్లో మృతుల సంఖ్య అధికారికంగానే పన్నెండువేలు దాటింది. కాలంతో పోటీపడుతూ సహాయకచర్యలు సాగిస్తున్నట్టు ఆయా ప్రభుత్వాలు చెప్పుకుంటున్నప్పటికీ, శిథిలాల్లో చిక్కుకున్నవారిని వెలికితీయడంలో జాప్యం జరుగుతున్నకొద్దీ ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య పెరిగిపోవడం ఖాయం. ఆగ్నేయ టర్కీ, వాయవ్య సిరియాను భస్మీపటలం చేసిన ఈ భూకంపం తీవ్రత ఏ స్థాయిలో ఉన్నదో యావత్‌ ప్రపంచమూ చూస్తున్నది. పేకమేడల్లా కూలిపోతున్న భవనాలు, పరుగులు పెడుతున్న జనాలు, ఆసుపత్రులతో సహా ధ్వంసమైన మౌలికవ్యవస్థలు, శిథిలాల్లో చిక్కుకున్నవారి ఆక్రందనలు, వారిని వెలికితీయడానికి ప్రజలు పడుతున్నపాట్లు చూసి గుండెతరుక్కుపోతున్నది. ఆపదలోనే కావచ్చు కానీ, భారతదేశాన్ని మిత్రదేశంగా ప్రకటించిన టర్కీకి మన నుంచి కూడా మంచిసాయమే అందుతున్నది.

ఇంకా వందలాది భవనాలు కుప్పకూలడానికి సిద్ధంగా ఉన్నాయన్న వార్తలు, వెలికితీయాల్సిన వారి సంఖ్య వేలల్లోనే ఉంటుందన్న అంచనాలు కలగలిసి ఈ విషాదం ఇప్పట్లో లెక్కకు అందేది కాదని స్పష్టం చేస్తున్నాయి. పదిహేడు గంటలపాటు తనకంటే చిన్నవాడైన సోదరుడితో కలిసి శిథిలాల్లో చిక్కుకుపోయిన ఓ ఏడేళ్ళచిన్నారి మనుషులు కనిపించగానే కన్నీటిపర్యంతమై ‘నన్ను బయటకు లాగండి, మీకు ఊడిగం చేస్తాను’ అంటూ వేడుకున్నదట. అప్పుడే బిడ్డకు జన్మనిచ్చిన తల్లిని ఈ విధ్వంసం పొట్టనబెట్టుకుంటే, పుట్టిన బిడ్డ ఆస్పత్రిలో కోలుకుంటోంది. సరిగ్గా మేనెల ఎన్నికలలోపు ముగిసేట్టుగా మూడునెలల ఎమర్జెన్సీ విధించి, సహాయకచర్యలు జోరుగా సాగిస్తున్నట్టు టర్కీ అధ్యక్షుడు ఎర్డొగాన్‌ చెబుతున్నారు. కానీ, ఎన్నిగంటలు ఎదురుచూసినా సహాయక బృందాలు రాలేదనీ, శిథిలాల్లో చిక్కుకుపోయిన తమ కుటుంబీకులు తమకంటి ముందే కన్నుమూయడం చూడాల్సి వస్తున్నదని జనం ఆగ్రహిస్తున్నారు.

ఈ మహా విషాదానికి పూర్తిబాధ్యత అధ్యక్షుడిదేనని విపక్షనాయకుడి ఆరోపణ. 1999లో టర్కీని భారీ భూకంపం ధ్వసం చేసి, ఇరవైవేలమందిని పొట్టనబెట్టుకున్న తరువాత ప్రభుత్వం భూకంపం పన్ను విధించి, ప్రజలనుంచి ఐదుబిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. తీవ్రభూకంపాలు సృష్టించే ఫలకాలమీద టర్కీ, సిరియా వంటి దేశాలున్నాయి కనుక ప్రభుత్వాలు ప్రణాళికాబద్ధంగా, సర్వసన్నద్ధంగా ఉండటం తప్పనిసరి. కానీ, వసూలు చేసిన ఈ సొమ్మంతా ప్రభుత్వం ఇతరత్రా అవసరాలకు వాడేసినందున రెండుదశాబ్దాల తరువాత కూడా నష్టనివారణ, సహాయకచర్యల విషయంలో తడుముకోవాల్సివస్తున్నదని ప్రజల ఆరోపణ. మొదట ప్రధానిగా, ఆ తరువాత దేశాధ్యక్షుడిగా రెండుదశాబ్దాలుగా అధికారంలో కొనసాగుతున్న ఎర్డగాన్‌ ఈ విషయంలో ప్రజలకు జవాబు చెప్పుకోక తప్పదు. భూకంపాలు ఎదుర్కొనే జపాన్‌ వంటిదేశాలు నిర్మాణాల్లోనే కాదు, తమ జీవనవిధానంలో కూడా మౌలికమైన మార్పులు చేసుకున్నాయి. అత్యాధునిక హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడమే కాక, ఎంతటి విలయంలోనూ ఆస్తినష్టం, ప్రాణనష్టం పరిమితంగా ఉండే జాగ్రత్తలు తీసుకున్నాయి. కానీ, ఆర్థికం, ఆధునికం బాగానే ఉన్న టర్కీలో ఈ మార్పు జరగకపోవడం ఆశ్చర్యకరం. అతి ఎత్తయిన పురాతన భవనాలకు పేరుగాంచిన టర్కీలో ఉన్నవాటిని మార్చలేకున్నా, రక్షణ మార్గాలు ఏర్పాటు చేసుకోవచ్చు, ఆధునిక హెచ్చరిక వ్యవస్థలను నెలకొల్పుకోవచ్చు. అన్నింటికీ మించి, సత్వర సహాయచర్యలకు వీలుగా సమస్తవ్యవస్థలనూ ఆధునికీకరించవచ్చు.

టర్కీతో పోల్చితే సిరియాలో పరిస్థితి మరింత విషాదం. దశాబ్దాల అంతర్యుద్ధంలో బాంబులు, బుల్లెట్లతో గాయపడిన ప్రాంతాలను ఇప్పుడు భూకంపం తేరుకోలేని దెబ్బతీసింది. అసద్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న శక్తుల అధీనంలోని ఈ ప్రాంతాల్లో స్వయంసాయం తప్ప ప్రజలకు మరోమార్గం లేకపోయింది. సిరియాలో మరణాలు అధికారికంగా మూడువేలవరకూ ఉన్నా, అసలు లెక్కలు ఎప్పటికీ వెలుగుచూసే అవకాశం లేదు. ఈ భూకంపాన్ని డచ్‌ శాస్త్రవేత్త ఒకరు మూడురోజులముందే పసిగట్టి ట్విటర్‌లో హెచ్చరించారనీ, భారత ఉపఖండాన్ని కూడా భూకంపం కుదిపేస్తుందని ఆయన చెప్పారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. నిజానిజాలను అటుంచితే, ప్రకృతి విపత్తులను నివారించలేకున్నా, కనీసం విపత్తుసంసిద్ధతలో లోటుపాట్లులేకుండా జాగ్రత్తపడటం ముఖ్యం.

Updated Date - 2023-02-09T01:00:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising