లద్దాఖ్‌లో వేడి!
ABN, First Publish Date - 2023-02-17T00:56:15+05:30
‘ఆల్‌ఈజ్ నాట్ వెల్’ అంటున్నారు లద్దాఖ్‌కు చెందిన పర్యావరణవేత్త, మెగసెసే అవార్డు గ్రహీత సోనమ్ వాంగ్‌చుక్. బాలీవుడ్ చిత్రం ‘త్రీ ఇడియట్స్’లో హీరోపాత్రకు ప్రేరణగా...
‘ఆల్‌ఈజ్ నాట్ వెల్’ అంటున్నారు లద్దాఖ్‌కు చెందిన పర్యావరణవేత్త, మెగసెసే అవార్డు గ్రహీత సోనమ్ వాంగ్‌చుక్. బాలీవుడ్ చిత్రం ‘త్రీ ఇడియట్స్’లో హీరోపాత్రకు ప్రేరణగా నిలిచిన ఈయన, ఆ చిత్రంలో హీరో పదేపదే వాడే ‘ఆల్ ఈజ్ వెల్’ను ఇప్పుడు లద్దాఖ్ పరిస్థితి ఏ(మాత్రం బాగాలేదని దేశానికి ఈ రూపంలో చెబుతున్నారు. లద్దాఖ్ హక్కుల పరిరక్షణకోసం ఖర్దుంగా లా పాస్‌లో 18వేల అడుగుల ఎత్తున, మైనస్ నలభైడిగ్రీల చలిలో ఐదురోజులపాటు నిరసనదీక్షకు ఈయన సంకల్పించడం దేశం దృష్టిని ఆకర్షించింది. దానిని పాలకులు వమ్ముచేసినప్పటికీ, కనీసం తమ డిమాండ్లు కేంద్రం పెద్దల దృష్టికిపోతాయన్న ఆయన ఆశకూడా నెరవేరలేదు. ఇప్పుడు వేలాదిమంది ఆ ప్రాంతవాసులతో కలిసి ఆయన దేశరాజధానికి తరలివచ్చి నిరసనదీక్షలు ఆరంభించారు. ఆర్టికల్ 370 ద్వారా దశాబ్దాలుగా అనుభవించిన ప్రత్యేక అధికారాలు, రక్షణలు పోగొట్టుకున్న మూడేళ్ళకు, ఆ చర్యతో తమకు ఏదో మరింత ఒరుగుతుందన్న భ్రమలన్నీ వీడిపోయిన తరువాత, లద్దాఖ్ వాసులు ఇప్పుడు మళ్ళీ తాము కశ్మీర్‌లో కలిసిపోతేనే బాగుపడతామని అనుకుంటున్నారట.
జమ్మూకశ్మీర్‌నుంచి వేరుపడి మరో కేంద్రపాలిత ప్రాంతంగా అవతరించినందుకు ఆదిలో వీరంతా సంతోషించారు. కానీ, పాలనపూర్తిగా లెఫ్ట్‌నెంట్ గవర్నర్ చేతుల్లోకి పోయి, అధికార వ్యవస్థ ఏ మాత్రం ప్రజాసమస్యలు పట్టని రీతిలో వ్యవహరిస్తూ, నిర్ణయాలన్నీ ఉన్నతస్థాయిలో, ఏకపక్షంగా జరిగిపోతూండటం అనతికాలంలోనే సహించలేకపోయారు. సమస్యలు చెప్పుకోవడానికి తమ ప్రతినిధులన్నవారు లేక, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించే అవకాశం లేక వారు ఉక్కపోతను భరించలేకపోతున్నారు. రక్షణలన్నీ తొలగిపోవడంతో ప్రజలకే కాక, పర్యావరణానికీ ప్రమాదం ఏర్పడుతున్నదని వారి వాదన. కార్గిల్–లేహ్ హిల్ కౌన్సిల్ ప్రతినిధుల మాటకు విలువేలేని స్థితిలో, అధికారగణానికీ వారికీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పరిస్థితులు వేడెక్కి, లేహ్‌లోని రాజకీయ, బౌద్ధ మత సంస్థలూ సంఘాలన్నీ కలిసికట్టుగా లేహ్ ఎపెక్స్ బాడీ అనే ఛత్రం కిందకు వచ్చాయి. షియాముస్లింలు అధికంగా ఉన్న కార్గిల్‌లో డెమోక్రాటిక్ అలయెన్స్ ఏర్పడి, ఈ రెండు సంఘాలు కలసికట్టుగా నాలుగు ప్రధాన లక్ష్యాల సాధనకోసం పోరాటం ఆరంభించాయి. లద్దాఖ్‌కు రాష్ట్రహోదా కల్పించడం, ఆరవషెడ్యూల్‌లో ఆదివాసీ ప్రాంతంగా చేర్చి స్థానికులకు, పర్యావరణానికి రక్షణలు ఇవ్వడం, లెహ్, కార్గిల్‌కు లోక్‌సభ సీట్లు వేర్వేరుగా ఉండటం, ఉద్యోగాల్లో స్థానిక రిజర్వేషన్ వర్తింపచేయడం వీరి డిమాండ్లు.
ప్రత్యేక ప్రతిపత్తి రద్దుచేసిన పదినెలల్లోనే చైనా చొరబాటుతో లద్దాఖ్ వేడెక్కి ఉన్న నేపథ్యంలో, స్థానికుల ఉద్యమాన్ని కేంద్రం పూర్తిగా బేఖాతరు చేస్తూ కమిటీల పేరిట కాలాన్ని నెట్టుకుంటూ వస్తున్నది. ఇటీవల కేంద్రమంత్రి నిత్యానందరాయ్ నాయకత్వంలో ఏర్పడిన రెండో కమిటీ కూడా కాలయాపనకు తప్ప, తమ డిమాండ్లు పరిష్కరించే ఉద్దేశంతో ఏర్పడింది కాదని ఈ రెండు సంఘాల నాయకుల వాదన. దానిముందుకు వెళ్ళేందుకు కూడా వీరు నిరాకరించారు. రెండున్నరలక్షల జనాభా ఉన్న సిక్కిం ఒక రాష్ట్రంగా ఉన్నప్పుడు, మూడులక్షలమంది ఉన్న లద్దాఖ్ ఎందుకు రాష్ట్రం కాకూడదని బుధవారం దేశరాజధానిలో నిరసనదీక్షలు ఆరంభించిన సందర్భంలో నాయకులు వేసిన ప్రశ్న సముచితమైంది. అసెంబ్లీలేని కేంద్రపాలిత ప్రాంతంగా మిగిలిపోయినప్పుడు లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌ని మార్చినంత మాత్రాన ప్రజాగ్రహం చల్లారదు. ఉద్యమాన్ని నిర్వీర్యపరిచేందుకు లేహ్, కార్గిల్ ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే, ఎంతో ప్రశాంతంగా ఉండే లద్దాఖ్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే కుట్రలు జరుగుతున్నాయని నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నేళ్ళయినా ఉద్యమాన్ని కొనసాగించేందుకు లద్దాఖ్ వాసులు సిద్ధపడిన స్థితిలో, వారి డిమాండ్లు నెరవేరనప్పుడు పరిస్థితులు మరింత వేడెక్కుతాయి. రక్షణపరంగా అత్యంత కీలకమైన ఈ ప్రాంతంలో స్థానికుల మనోభావాలకు భిన్నంగా వ్యహరించడం ప్రమాదకరం. నాయకులు కోరుతున్నట్టుగా అమిత్ షా నేరుగా రంగంలోకి దిగి, పరిష్కారాన్ని సాధిస్తే తప్ప ఈ ప్రాంత ప్రజలు స్థిమితపడరు.
Updated Date - 2023-02-17T00:56:17+05:30 IST