అసైన్డ్ భూమిని అమ్ముకుంటే ఉపాధి ఎలా?
ABN, First Publish Date - 2023-09-01T03:14:30+05:30
గత ప్రభుత్వాలు ప్రభుత్వ భూములను సాగు నిమిత్తం అణగారిన వర్గాలకు పంచినా ప్రభుత్వాల పర్యవేక్షణ కొరవడినందువల్లనే నయానా, భయానా ఆయా భూములు అగ్రవర్ణాల స్వాధీనంలోకి పోయినాయి...
గత ప్రభుత్వాలు ప్రభుత్వ భూములను సాగు నిమిత్తం అణగారిన వర్గాలకు పంచినా ప్రభుత్వాల పర్యవేక్షణ కొరవడినందువల్లనే నయానా, భయానా ఆయా భూములు అగ్రవర్ణాల స్వాధీనంలోకి పోయినాయి. తెలిసో తెలియకో తన తండ్రి వైఎస్ రాజారెడ్డి 300 ఎకరాల అసైన్డ్ భూములు పేదల నుండి స్వాధీనం చేసుకున్నారని, వాటిని తిరిగి ఇచ్చేస్తామని 2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శాసనసభలో ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అణగారిన వర్గాలకు ప్రభుత్వాలు ఇచ్చిన సాగుభూములు ఆ విధంగానే అగ్రవర్ణాల స్వాధీనంలోకి పోయివుంటాయి. అలా వారి అధీనంలోకి పోయిన ఆ భూములను ఆంధ్రప్రదేశ్ 9/77 చట్టం ప్రకారం స్వాధీనం చేసుకుని గతంలో పొందిన వారికి గాని, మరొక పేదవారికి గాని ఇవ్వవచ్చు. అలా చేయకుండా జూలై 12, 2023న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల మార్పిడి నిషేధం 1977 చట్టాన్ని సవరించి, ప్రభుత్వ భూములను పొందినవారు 20 సంవత్సరాల తర్వాత అమ్ముకునే హక్కుని కల్పించినట్టుగా వార్తలు వచ్చాయి. గతంలో భూములు పొందినవారు నయానా, భయానా ఎక్కువశాతం భూములు అగ్రవర్ణాలకే స్వాధీనం చేశారు. అలాగే, గతంలో భూములు పొందినవారు అమ్ముకోవటానికి హక్కులు కల్పించమని ఎప్పుడూ ఉద్యమాలు చేసినట్లు కనబడలేదు. ప్రభుత్వ భూములలో ఎన్నో సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న పేదలకు పట్టాలు ఇవ్వమని నెత్తి నోరు కొట్టుకున్నా అతీగతీ లేదు. సాగు భూములు పొందినవారు అడగకుండానే వాటిని అమ్ముకునే హక్కులు కల్పించే మర్మం ఏమిటో ఈ ప్రభుత్వానికే తెలియాలి. నేటికీ గ్రామాల్లో అగ్రవర్ణ ఆధిపత్య పాలనే సాగుతోంది. కనుక భూములు స్వాధీనం చేసుకున్నవారు గతంలోనే బెదిరించి ఈ భూములు అమ్మినవారికి ఎంతోకొంత ముట్టచెప్పి సంతకాలు చేయించుకునే ఉంటారు. అవసరమైతే మరలా కాస్తంత ఇచ్చి సంతకాలు చేయించుకుంటారు. ఏ విధంగా చూసినా ఆ భూములు అగ్రవర్ణాలవారి ఆధీనంలోకే పోతాయి. భూములు కోల్పోయినవారు మాత్రం జీవనోపాధి కోల్పోతారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి రాజీనామా చేసినా, రిటైర్ అయినా ఆ ఉద్యోగాన్ని అదే అర్హత కలిగిన మరొకరికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ భూముల విషయంలో కూడా అలానే చేస్తే సరిపోతుంది. అసలు 9/77 చట్టం ఉద్దేశం కూడా అదే. సాగుభూమి అనేది శాశ్వత ఉపాధి. అమ్మకం దానిని దెబ్బతీస్తుంది.
గ్రామీణ ప్రాంతంలో సాగు భూమిలో ఎండనకా, వాననకా కష్టపడి పంటలు పండించి దేశానికి తిండి పెడుతున్నవారు వ్యవసాయ కూలీలైన అణగారిన వర్గాలే. వీరే అసలైన అన్నదాతలు. అగ్రవర్ణ భూ యాజమాన్యం తమకున్న వారసత్వపు సాగుభూమితో సంబంధం తెంచుకొని ఎక్కడో దూరాన ఉద్యోగ, వ్యాపార పరిశ్రమలతో మెరుగైన జీవనం చేస్తున్నారు. తమ స్వగ్రామంలో ఉన్న వారి వృద్ధ సంబంధీకులది పంటలు పండించలేని స్థితి. కనుకనే వీరు వీరికున్న సాగు భూమిని వ్యవసాయ కూలీలైన అణగారిన వర్గాలకు కౌలుకు ఇస్తున్నారు. కౌలు భారం మోయలేక రసాయన పురుగు మందుల, ఎరువుల ధరలు భరించలేక, రైతు భరోసా అందుకోవడానికి అర్హత లేక, పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక, ప్రకృతి విపత్తుల వలన తగిన పంట దిగుబడి లేక ఈ కౌలుదార్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
అసలు పంటలు పండించని వారికి, పండించలేని వారికి భూములెందుకు? ఎంతో కొంత నష్టపరిహారం చెల్లించి ఆయా భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, కష్టపడి పంటలు పండించే వ్యవసాయ కూలీలైన అణగారిన వర్గాలకే 9/77 ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ చట్టం ప్రకారం ఆ భూములను పంచేసి, వారికి సాగు నిమిత్తం తగిన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించవచ్చు. తద్వారా వారికి మంచి ఆదాయాన్ని ప్రభుత్వం చూపించగలిగితే వారు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు, వలసలు ఎందుకు పోతారు? దానికి తోడు త్రాగు, సాగు నీటిని సరిపోయినంత ఇవ్వగలిగితే అద్భుతమైన వ్యవసాయ ఉత్పత్తి జరుగుతుంది. అన్నదాతలకు మంచి ఆదాయం చూపించలేకపోతే అసలు వ్యసాయమే కుంటుబడి దేశానికి తిండి దొరకని పరిస్థితి ఏర్పడుతుంది.
దొడ్డా నాగమల్లిరాజు
రాష్ట్ర ఉపాధ్యక్షులు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేడ్కర్)
Updated Date - 2023-09-01T03:14:30+05:30 IST