జగన్‌ను వద్దనడానికి జనానికి వంద కారణాలు...
ABN, First Publish Date - 2023-10-05T02:57:56+05:30
పచ్చి అబద్ధాన్ని సైతం నిజమని నమ్మించి జనాలను మోసం చేయడంలో జగన్‌రెడ్డిని మించినవారు లేరు. ప్రతిపక్షంలో ఉండగా అబద్ధాలతో, తన అనుకూల మీడియాతో హోరెత్తించి ప్రజల్ని...
పచ్చి అబద్ధాన్ని సైతం నిజమని నమ్మించి జనాలను మోసం చేయడంలో జగన్‌రెడ్డిని మించినవారు లేరు. ప్రతిపక్షంలో ఉండగా అబద్ధాలతో, తన అనుకూల మీడియాతో హోరెత్తించి ప్రజల్ని నమ్మేలా చేశారు. అధికారంలోకి వచ్చాక కూడా అదే స్థాయిలో అబద్ధ ప్రచారాలను నమ్ముకున్నారు. అబద్ధాలు ఏ స్థాయికి చేరాయంటే తన తండ్రి ఫోటో వేసుకుని, తన భార్య చైర్మన్ కుర్చీలో కూర్చుని నడిపిస్తున్న మీడియా తనది కాదంటూ, తనకి మీడియా లేదంటూ ప్రతిసభలోనూ ప్రజల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. తాను ప్రతి రోజూ సభలు సమావేశాలు నిర్వహించే తాడేపల్లి రాజప్రాసాదమూ తనది కాదంటారు. తాజాగా ‘వై ఏపీ నీడ్స్ జగన్’ నినాదంతో ప్రజల్లోకి వెళ్ళనున్నట్లు ప్రకటించడం అత్యంత హాస్యాస్పదం!
అసలు రాష్ట్రానికి జగన్ ఎందుకు కావాలి? కేవలం 5 రూపాయలకే పేదల కడుపు నిండా అన్నం పెడుతూ చంద్రబాబు ప్రారంభించిన ‘అన్న’ క్యాంటీన్లపై నిందలు వేసి, మూసి, త్వరలోనే తెరుస్తామని చెప్పి ఆ భవనాలన్నింటినీ పాడుబెడుతూ ఆ వ్యవస్థను సర్వనాశనం చేసినందుకా? అధికారంలోకి వచ్చాక ఖాళీగా ఉన్న 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానంటూ, ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానంటూ ఎన్నికలకు ముందు ఊరించి, యువతతో ఓట్లు వేయించుకుని, నాలుగున్నరేళ్లలో జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వనందుకా? కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని హోరెత్తించి, అధికారంలోకి వచ్చాక తన అవినీతి కేసుల నుండి బయటపడేందుకు కేంద్రానికి తలొంచి, ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఊసే లేకుండా చేసి రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసినందుకా?
రాష్ట్రానికి జీవనాడిగా నిలిచే పోలవరం ప్రాజెక్టుకు నాలుగున్నరేళ్ళలో పైసా ఖర్చు చేయలేదు. ప్రాజెక్టు మొత్తాన్ని పాడుబెట్టారు. కేంద్రాన్ని కనీసం నిధుల కోసం గట్టిగా నిలదీయకుండా రాష్ట్రంలోని రైతాంగాన్ని దగా చేసినందుకా జగన్ మళ్ళీ రావాలి? ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే ఉంటానని చెప్పి నమ్మించి అమరావతి రాజధానితో మూడు ముక్కలాట ఆడుతున్నారు. అమరావతిలో వేల కోట్లతో చేపట్టిన ప్రాజెక్టుల్ని నట్టేట వదిలేశారు. అమరావతి రైతులకు కౌలు చెల్లించకుండా కుట్ర చేశారు. రాజధానిలో పేదలకు కట్టించిన వేలాది ఇళ్లు కూడా పంచకుండా పాడుచేస్తున్నందుకా? అధికారంలోకి వస్తే మద్యాన్ని నిషేధించి తీరుతాను అని హోరెత్తించారు. అధికారంలోకి వచ్చాక మద్య నిషేధం ‘హామీ’ని నిషేధించారు. భవిష్యత్ మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి పాతిక వేల కోట్లు అప్పు తెచ్చుకున్నారు. సొంత మద్యం బ్రాండ్లను తీసుకొచ్చి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. మద్యం కాంట్రాక్టుల్లో కమిషన్ల రూపంలో రూ.40వేల కోట్లు దిగమింగినందుకా జగన్‌రెడ్డిని ప్రజలు కోరుకునేది?
అన్నా, సీపీఎస్ గురించి మర్చిపోండి, మనం అధికారంలోకి వచ్చాక వారం రోజుల్లో రద్దు చేసేస్తా... అని ఆ రోజు పాదయాత్రలో హోరెత్తించిన జగన్మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చి 52 నెలలు అయినా ఇంత వరకు రద్దు చేయలేదు. ఉద్యోగుల్ని ఇంకా మోసం చేస్తున్నందుకా ప్రజలు జగన్‌రెడ్డిని కోరుకునేది? 2019 మార్చిలో పెట్రోల్ ధర రూ.76, డీజిల్ ధర రూ.68 ఉండగా, దేశంలో ఏపీలోనే పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయంటూ జగన్మోహన్ రెడ్డి నానా యాగీ చేశాడు. ప్రస్తుతం దేశంలోనే అత్యధికం పెట్రోల్ ధర్ రూ.112, డీజిల్ ధర రూ.103 ఉన్నాయి. వంట గ్యాస్‌పై కూడా వ్యాట్ 14శాతం నుంచి 24శాతానికి పెంచిన జగన్ రెడ్డిని మళ్లీ రావాలని ఎవరైనా కోరుకుంటారా? గతంలో ఎన్నడూ లేని విధంగా చెత్త పన్ను, మరుగుదొడ్డి పన్ను, ఖాళీ స్థలంపై పన్ను, అద్దె ఆధారంగా ఇంటి పన్ను వేశారు. పోల్ ట్యాక్స్, బోర్డు ట్యాక్స్ అంటూ పన్నుల బాదుడుతో ప్రజల్ని జలగలా పీక్కు తింటున్నందుకా?
విద్యుత్ ఛార్జీలు పెంచేదే లేదు అని నాటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. లోటు విద్యుత్‌లో ఉన్న రాష్ట్రంలో మిగులు విద్యుత్ సాధించేలా చేశారు. కానీ అప్పట్లో విద్యుత్ ఛార్జీల బాదుడే బాదుడు అంటూ జగన్‌రెడ్డి హోరెత్తించారు. అప్పట్లో రూ.100 బిల్లు వచ్చే ఇంటికి నేడు రూ.500 వస్తోంది. విద్యుత్ కోతలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. సర్ ఛార్జి, ట్రూ అప్ ఛార్జి అంటూ ప్రజల్ని జలగలా పీలుస్తున్నందుకా?
ఇంటి నిర్మాణానికి పేదలు ఇబ్బంది పడకూడదని చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఇసుక మొత్తాన్ని ఉచితం చేశారు. ఫలితంగా రవాణా ఛార్జీలు భరిస్తే చాలు ట్రాక్టర్ ఇసుక ఇంటికి చేరేది. నేడు రాష్ట్రంలోని ఇసుక మొత్తాన్ని గంపగుత్తగా జగన్‌రెడ్డి దోచుకుంటున్నారు. పర్యావరణ అనుమతులు, న్యాయస్థానాల ఉత్తర్వుల్ని సైతం ధిక్కరిస్తూ ఇసుక దోచేస్తున్నారు. ఉచితంగా అందే ఇసుకను బొక్కేస్తూ పేదలకు అందకుండా చేసినందుకా ప్రజలు జగన్‌రెడ్డిని మళ్లీ కోరుకునేది?
కియా, ఇసుజు, హీరో, అశోక్ లేల్యాండ్, ఏసియన్ పెయింట్స్, బర్జర్ పెయింట్స్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, లులూ లాంటి ప్రపంచ స్థాయి కంపెనీలను చంద్రబాబు రాష్ట్రానికి తీసుకొచ్చారు. కానీ, జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక కమిషన్ల కోసం కంపెనీలను తరిమేయడం, బెదిరించడం లాంటి చర్యలకు పాల్పడ్డారు. 2018 వరకు పెట్టుబడులకు గమ్య స్థానంగా నిలిచి, దేశంలోనే టాప్ 5 ర్యాంకులో నిలిచిన రాష్ట్రాన్ని ఏకంగా ఆ జాబితాలోనే లేకుండా చేశారు. ఇలా యువతకు ఉపాధిని దూరం చేసినందుకా జగన్‌రెడ్డిని ప్రజలు మళ్లీ కోరుకునేది?
చివరాఖరుకి రేషన్ షాపులలో ఇచ్చే సరుకుల ధరలూ పెంచాడు. కరోనా సమయంలో పేదలకు ఉచితంగా పంచమని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 5.65 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సైతం విదేశాలకు స్మగ్లింగ్ చేసి రూ.7వేల కోట్లు దోచుకున్నాడు. చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ.200 ఉన్న పెన్షన్ మొత్తాన్ని రూ.2000కు పెంచారు. అంటే ఐదేళ్లలో రూ.1800 పెంచారు. కానీ అధికారంలోకి వస్తే రూ.3వేల పెన్షన్ ఇస్తానని పాదయాత్రలో, ఎన్నికల ప్రచారంలో, మేనిఫెస్టోలో హోరెత్తించిన జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక మాట మార్చి ఏటా రూ.250 పెంచుతానని మోసం చేశాడు. ఈ మోసానికా మళ్లీ జగనే కావాలని కోరుకునేది?
దళిత గిరిజనులకు చెందాల్సిన రూ.30 వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు. 27 సంక్షేమ పథకాలు రద్దు చేశారు. విదేశీ విద్యను దళితులకు దూరం చేశారు. మాస్కు అడిగిన పాపానికి దళిత డాక్టర్ సుధాకర్‌ను, మద్యంపై ప్రశ్నించినందుకు ఓం ప్రకాశ్‌ను, మాస్కు పెట్టుకోలేదని చీరాలలో కిరణ్‌లను హత్య చేశారు. రాజకీయ ప్రయోజనం కోసం చేసిన కోడి కత్తి కుట్రలో దళితుడైన జానపల్లి శ్రీనివాస్‌ను నాలుగున్నరేళ్లుగా జైల్లో పెట్టారు. అందుకా దళితులు జగనే మళ్లీ రావాలనుకునేది?
బీసీలకు సబ్ ప్లాన్ నిధులు రూ.75,760 కోట్లు దారి మళ్లించారు. కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారు. గతంలో బడుగు బలహీన వర్గాల వారు ప్రాతినిధ్యం వహించిన టీటీడీ, ఏపీఐఐసీ, ఆర్టీసీ లాంటి రాష్ట్రస్థాయి కీలక పదవులు సొంత వర్గానికి కట్టబెట్టారు. వంద మందికి పైగా బీసీ నేతల్ని హత్య చేశారు. 30కి పైగా సంక్షేమ పథకాలు రద్దు చేశారు. ఈ అన్యాయానికా బీసీలు జగన్‌రెడ్డే మళ్ళీ రావాలనుకునేది?
అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్న జగన్‌రెడ్డి, అధికారంలోకి వచ్చాక రూ.27వేల కోట్ల రుణాలను రూ.25వేల కోట్లకు కుదించారు. మహిళలు పాతికేళ్ళుగా దాచుకున్న పొదుపు నిధి రూ. 8,700 కోట్లు దారి మళ్లించారు. అభయహస్తం సొమ్ము రూ.2100 కోట్లు ఎల్ఐసీ నుంచి లాక్కున్నారు. 45 ఏళ్లు దాటిన మహిళలకు పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక దగా చేశారు. మరి ఏ మహిళైనా జగన్‌రెడ్డే మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటుందా?
విశాఖే రాజధాని అని ప్రకటించి కేవలం నాలుగేళ్లలో 72వేల ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములు కబ్జా చేశారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలివ్వలేని దుస్థితికి తీసుకొచ్చారు. జగన్‌రెడ్డి నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో సాగిస్తున్న అరాచకం, అకృత్యాలు చూసిన ప్రజలు ‘నిన్ను భరించలేం జగనాసురా’ అని నిట్టూరుస్తుంటే మళ్లీ జగనే రావాలనుకుంటున్నారని చెప్పుకోవడం అర్థరహితం. ప్రజలు తనను ఎందుకు కోరుకుంటారో జగన్‌రెడ్డి ఒక్కటంటే ఒక్క కారణమైనా చెప్పగలడా? కానీ, జగన్‌రెడ్డి వద్దు అని ప్రజలు విస్పష్టంగా ప్రకటించడానికి వారివద్ద వందలాది కారణాలున్నాయి!
కింజరాపు అచ్చెన్నాయుడు
టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు
Updated Date - 2023-10-05T02:57:56+05:30 IST