యూదులే రక్తచరిత్రను మరిస్తే?
ABN, First Publish Date - 2023-10-20T03:43:21+05:30
ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగని దారుణాలకు, ఊచకోతలకు గురైన బాధితులు ఎవరైనా ఉన్నారంటే యూదులనే అనుకోవాలి. యూరప్‌లో 1933 నాటికి 95 లక్షల మంది యూదులు ఉంటే 1945 వచ్చే సరికి...
ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగని దారుణాలకు, ఊచకోతలకు గురైన బాధితులు ఎవరైనా ఉన్నారంటే యూదులనే అనుకోవాలి. యూరప్‌లో 1933 నాటికి 95 లక్షల మంది యూదులు ఉంటే 1945 వచ్చే సరికి అందులో 60 లక్షల మంది నాజీల అకృత్యాలకు బలైపోయారు. ఎందరో మహామహా మేధావులకు, ఆలోచనా పరులకు నిలయమై యూరోపియన్ నాగరికతలో అగ్రభాగాన నిలిచిన జర్మనీలో తమను వెంటాడి, వేటాడి చంపుతారని హిట్లర్ అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లో యూదులే నమ్మలేదు. కించిత్తు కనికరం లేకుండా 10 లక్షలకు పైగా పిల్లలనూ చంపేశారు. మట్టి కందకాల అంచున వరసగా నిలబెట్టి 14 లక్షల మందిని పిట్టల్లా కాల్చేశారు. ప్రాణాంతక విషవాయువులను గదుల్లోకి పంపి లక్షల మంది ఉసురుతీశారు. వేల ఏళ్ల చరిత్ర కలిగి, ప్రపంచంలో తొలి ఏకేశ్వర మతాన్ని సృష్టించుకుని, ఏ దేశం వెళ్లినా తమ విశిష్టతను కాపాడుకోటానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చిన యూదు జాతిని సమూలంగా పెకలించటానికి నాజీలు నిర్ణయించటం ఒక మహా దారుణంగా మనమందరం భావిస్తాం. ఇక మేధావులు, శాస్త్రవేత్తలు, తత్వవేత్తల విషయంలో యూదులకు సాటివచ్చే వారి సంఖ్య చాలా తక్కువని చెప్పాలి. అందరికీ సుపరిచితులైన కాల్ మాక్స్, సిగ్మండ్ ఫ్రాయిడ్, అల్బట్ ఐన్‌స్టెయిన్, నోమ్ చామ్‌స్కీ, ఎరిక్‌ఫ్రాం, ట్రాట్క్సీ, స్టీవన్ స్పీల్‌బర్గ్, మాక్స్‌బోన్, నీల్స్ బో, అపన్‌హైమర్ (ఫిజిక్స్), గ్రెగర్ మెండల్, స్పినోజా... ఇట్లా ఎందరి గురించో చెప్పుకుంటూ పోవచ్చు. ఒక శాతం ప్రపంచ జనాభాలో వందో వంతు కూడా లేని యూదులకు కిందటి శతాబ్దపు నోబెల్ బహుమతుల్లో 18 శాతం లభించాయి. మానవ జ్ఞానాన్ని ఎన్నో మెట్లు ఎక్కించిన యూదు మేధావులు నాజీల యుగంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికారు. వెళ్లగలిగిన వారు ఇతర దేశాలకు తరలిపోయారు. వెళ్లలేని అత్యుత్తమ ప్రతిభావంతులు బలైపోయారు. ఒక జన సమూహంగా యూదులను దారుణ విద్వేష బాధితులుగా చరిత్రకారులు వర్ణించారు. అలాంటి బాధిత జాతి... మరో జాతిని ఘోర బాధిత జాతిగా మార్చే చర్యలకు పాల్పడదని సహజంగా భావిస్తాం. అనుభవించిన అకృత్యాలనూ, దారుణాలను నిత్యమననం చేసుకునే జాతి.. చాలా మానవతతో వ్యవహరిస్తుందని ఆశిస్తాం. కానీ పాలస్తీనా విషయంలో ఇజ్రాయెల్ దశాబ్దాలుగా అనుసరిస్తున్న ధోరణి చూస్తుంటే బాధిత జాతి ప్రదర్శించాల్సిన మానవతా లక్షణాలేవి మనకు కనపడవు. తమంత దీటుగా సుదీర్ఘ చరిత్ర కలిగిన మరో జాతిని.. సొంత భూభాగం నుంచి అన్ని విధాలుగా పెకలించి వేస్తున్న బీభత్స దృశ్యమే మనకు కనపడుతుంది. తమకు ప్రమేయంలేని చారిత్రక దారుణాలకు, అగ్ర రాజ్యాల రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలకు పాలస్తీనా పౌరులు భారీ మూల్యం చెల్లిస్తున్నారు. హమాస్ ఉగ్రవాదులు పేల్చిన రాకెట్లతో ఇజ్రాయెల్‌లో జరిగిన దారుణ ప్రాణనష్టం, దానికి ప్రతిగా గాజాపై సాగుతున్న దాడులతో చరిత్ర పునరావృతం అవుతోంది తప్ప సమస్య పరిష్కారం కోసం అడుగులు పడటం లేదు.
యూదులను అంతం చేయటానికి హిట్లర్ పూనుకోవటం నిజం. దానికో నేపథ్యమూ ఉంది. క్రైస్తవ సంస్కృతిలోనే యూదు వ్యతిరేకత వందల ఏళ్ల నుంచి ఉంది. అందుకే యూరప్‌లో యూదులపై జరిగిన అకృత్యాలు ఆసియా, ఆఫ్రికాల్లో అంతగా కనపడవు. 1850ల తర్వాత తూర్పు, మధ్య యూరప్‌లో యూదులపై దాడులు, హత్యాకాండలు బాగా మొదలయ్యాయి. మధ్యయుగం నాటి ముస్లిం రాజ్యాల్లో యూదుల భద్రత విషయంలో సమస్యలు ఎక్కువగా ఉండేవి కావు. అనేక వృత్తుల్లో స్వేచ్ఛగా ప్రవేశించేవారు. వ్యాపారాలు చేసేవారు. కొన్నిచోట్ల ఉన్నత పదవులను సైతం చేపట్టారు. యూరప్‌లో వీటన్నిటిపై వివిధ స్థాయిల్లో నిషేధాలు ఉండేవి. యూదులపై విద్వేషానికి 1492 సంవత్సరాన్ని కొండగుర్తుగా చెప్పుకోవచ్చు. స్పెయిన్ దక్షిణ ప్రాంతం ఆనాడు ముస్లిం పాలన కింద ఉండేది. 1492లో అక్కడి ముస్లిం రాజ్యాన్ని ఓడించిన తర్వాత దాదాపు లక్షమంది యూదులను యూరప్ నుంచి బహిష్కరించారు. మరో రెండు లక్షల మందిని బలవంతంగా క్రైస్తవంలోకి మార్చారు.
వందల ఏళ్లుగా సాగుతున్న ఈ విద్వేషాల నేపథ్యంలో తమకు సొంత దేశం కావాలనే భావన యూదు మేధావుల్లో ఊపిరి పోసుకుంది. అదే ప్రధాన లక్ష్యంగా జైయనిజం అనేది పుట్టుకొచ్చింది. మొదటి జైయనిస్టు మహాసభ (1897) నాటి నుంచి పాలస్తీనాలో తమకు ప్రత్యేక దేశం ఏర్పాటు డిమాండుతో ప్రయత్నాలు మొదలు పెట్టారు. వందల ఏళ్ల నాడు అనేక దేశాలకు వలస పోయినా తాము ప్రస్తుత ఇజ్రాయెల్–పాలస్తీనా ప్రాంతం నుంచి వచ్చామన్న చారిత్రక స్పృహ యూదుల్లో ఎక్కువగా ఉండేది. యూరప్ అనుభవాలతో తమ చరిత్రను గట్టిగానే గుర్తు ఉంచుకున్నారు. ఎక్కడైనా చరిత్ర అవసరం బాధితులకే ఎక్కువగా ఉంటుంది. పాలస్తీనా అరబ్బులది ఆ పరిస్థితి కాదు. వారు పెద్దగా వలసలు పోలేదు. వ్యవసాయం, వృత్తులతో స్థానికంగా జీవనాన్ని సాగించారు. పాలస్తీనాతో పాటు చుట్టుపక్కలున్న ముస్లిం ప్రాంతాలన్నీ ఆనాడు టర్కీ సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి. వలసలు రావటానికి పరిమితులు ఉండేవి. కానీ జైయనిజం ప్రచారం ఉధృతం అవుతున్న కొద్దీ యూదులు మెల్లగా పాలస్తీనాకు చేరుకోవటం మొదలుపెట్టారు. 1881 నాటికి 24000 మంది యూదులు పాలస్తీనాలో ఉంటే 1914 నాటికి ఆ సంఖ్య 85000కు చేరుకుంది. స్థానిక అరబ్బుల్లో ఆందోళన మొదలైంది. అప్పటికే మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. 1918 కల్లా బ్రిటన్ మిత్ర రాజ్యాల విజయం దాదాపుగా ఖాయమైంది. జర్మనీతో జతకట్టిన టర్కీ సామ్రాజ్యం కుప్పకూలే పరిస్థితి వచ్చింది. సామ్రాజ్యంలో విశిష్టతలు కలిగిన ప్రాంతాలు, జాతులు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకోటానికి సిద్ధంగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో బ్రిటీష్ విదేశాంగ మంత్రి ఎ.జె.బాలఫర్ యూదులకు ప్రత్యేక రాజ్యం ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందని ప్రకటించారు. ఆ తర్వాత మిత్ర రాజ్యాలూ దీనికి సమ్మతించాయి. యుద్ధానంతరం ఏర్పడిన లీగ్ అఫ్ నేషన్స్ పాలస్తీనా పాలనాధికారాన్ని బ్రిటన్‌కు అప్పగించింది. 1948 వరకూ అది కొనసాగింది. ఈ సమయంలోనే యూదులు విపరీతంగా పాలస్తీనాకు వలస వచ్చారు. అవసరానికి మించి వీరికి బ్రిటిష్ యంత్రాంగం భూములను కట్టబెట్టింది. స్థానిక రైతులు భూములు, ఉపాధి కోల్పోయారు. యూదులు స్థాపించిన పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. అరబ్బులతో సహజీవనం చేసి ఆర్థిక కార్యక్రమాల్లో వారు పాలుపంచుకునే విధంగా యూదులు వ్యవహరించలేదు. 1948 మే నెలలో ఇజ్రాయెల్‌ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న నాటికి యూదుల సంఖ్య పాలస్తీనాలో దాదాపు ఏడు లక్షలకు చేరింది. జనాభాలో మూడో వంతు యూదులయ్యారు. అంతకు కొన్నాళ్లకు ముందు బ్రిటన్ ప్రభుత్వం నియమించిన పీల్ కమిషన్ మూడో వంతు భూభాగంలో యూదు రాజ్యం ఏర్పాటు చేస్తే సరిపోతుందని సూచిస్తే యూదులు ససేమిరా అన్నారు. ఇరు పక్షాలకు అధికారం ఉండేలా ఫెడరల్ తరహా ప్రభుత్వం గురించి ప్రతిపాదిస్తే దానికీ అంగీకరించలేదు. చివరికి ఐరాసకు బ్రిటన్ సమస్యను నివేదించింది. 56 శాతం భూభాగంతో ఇజ్రాయెల్ ఏర్పాటు చేయాలని ఐరాస తీర్మానించింది. మూడు మతాలకు పవిత్ర స్థలమైన జెరూసలెంకు ప్రత్యేక ప్రతిపత్తిని నిర్దేశించింది.
ఐరాస సూచించిన విధంగా రెండు రాజ్యాలను ఏర్పాటు చేయకుండా బ్రిటన్ రంగం నుంచి వైదొలగటంతో ఇజ్రాయెల్ స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుంది. చుట్టూ ఉన్న అయిదు అరబ్ రాజ్యాలు (ఈజిప్టు, ఇరాక్, లెబనాన్, సిరియా, జోర్డాన్) యుద్ధం ప్రకటించాయి. ఎప్పటి నుంచో రక్షణ దళాలతో సిద్ధమైన ఇజ్రాయెల్ పటిష్ఠ వ్యూహంతో వాటిని ఓడించింది. ఫలితంగా 78 శాతం భూభాగం ఇజ్రాయెల్ ఆధీనంలోకి వచ్చింది. ఇక వెస్ట్‌బ్యాంక్, గాజాతో పాటు జెరూసలెం తూర్పుభాగం కూడా 1967 నాటి ఆరు రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్ వశమైంది. ఆ తర్వాత కొద్ది కాలానికి జోర్డాన్, ఈజిప్టులు అధికారికంగా వెస్ట్‌బ్యాంక్, గాజాలను వదులుకున్నాయి. యుద్ధాలు, దాడులు, ప్రతిదాడుల కారణంగా స్థానిక పాలస్తీనా వాసుల్లో 60 శాతం మంది నిరాశ్రయులు అయ్యారు. వెస్ట్‌బ్యాంకు, గాజాల్లో కొందరు ఉండిపోగా మిగతా వారు చుట్టుపక్క దేశాలకు వలసలు వెళ్లారు. ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించుకున్న సరిహద్దుల్లో కొందరు అరబ్బులు మిగిలి పోయారు. వారి సంఖ్య ఇజ్రాయెల్ జనాభాలో ఇప్పటికి 21 శాతానికి చేరింది.
1993 నాటి ఓస్లో ఒప్పందానికీ ఆ తర్వాత జరిగిన చర్చలు, ప్రతిపాదనలకూ 22 శాతం భూభాగంలో స్వయం ప్రతిపత్తితో కూడిన పాలనను పాలస్తీనాకు అప్పగించటమే లక్ష్యం. కానీ అది కూడా సరిగ్గా జరగలేదు. ఎన్నో పరిమితులు పెట్టి పాలస్తీనా అథారిటీకి కీలక అంశాల్లో అధికారాలు లేకుండా చేశారు. 22 శాతం భూభాగంలోనైనా పూర్తి సౌర్వభౌమాధికారంతో పాలస్తీనా స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటుచేస్తే సమస్యకు కొంతైనా పరిష్కారం లభించేది. స్వతంత్ర దేశంగా ఇజ్రాయెల్ ఉనికినే గుర్తించటానికి ఒకనాడు నిరాకరించిన పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ 22 శాతం భూభాగానికే పరిమితం అవ్వటానికి అంగీకరించింది. హమాస్, ఇస్లామిక్ జిహాద్ లాంటి తీవ్రవాద సంస్థలు 22 శాతం భూభాగానికి పాలస్తీనా పరిమితం అయ్యే ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. ఇక వెస్ట్‌బ్యాంక్‌లో సైతం సెటిలర్లతో పెద్ద ఎత్తున కాలనీలు ఏర్పాటు చేయటంతో 22 శాతం భూభాగాన్ని సైతం తమకు సంపూర్ణంగా ఇవ్వటానికి ఇజ్రాయెల్ సిద్ధంగా లేదనే భావనకు సాధారణ అరబ్బులు వచ్చేశారు. హమాస్, ఇస్లామిక్ జిహాద్ సంస్థలు దీన్ని ఉపయోగించుకునే తీవ్రవాదంతో చెలరేగుతున్నాయి. పాలస్తీనా సమస్యను పరిష్కరించనంత కాలం ఫినిక్స్ పక్షిలా ఇస్లామిక్ ఉగ్రవాదం అంతమైనట్లే అంతమై తిరిగి ప్రాణం పోసుకుంటూనే ఉంటుంది. ఇజ్రాయెల్‌ను సృష్టించిన అగ్రరాజ్యాలు మిగిలిన అల్ప భూభాగంలోనైనా సార్వభౌమ పాలస్తీనాను ఏర్పాటు చేయాల్సిన నైతిక బాధ్యత నుంచి తప్పించుకోలేవు. తప్పించుకున్నా మిగిలేది దోషులుగానే!
రాహుల్ కుమార్
(ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్)
Updated Date - 2023-10-20T03:43:21+05:30 IST