స్పీకరే హద్దు మీరితే, సభ గౌరవం దిగజారదా?
ABN, First Publish Date - 2023-09-27T01:47:04+05:30
దేశానికే తలమానికంగా నిలిచిన చట్టసభ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ. మన శాసనసభ ఇతర రాష్ట్రాల సభలకు దిక్సూచిగా గౌరవాన్ని తెచ్చుకుంది...
దేశానికే తలమానికంగా నిలిచిన చట్టసభ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ. మన శాసనసభ ఇతర రాష్ట్రాల సభలకు దిక్సూచిగా గౌరవాన్ని తెచ్చుకుంది. అలాంటి శాసనసభ గత నాలుగున్నరేళ్లుగా అప్రదిష్ట పాలవుతున్నది. సుదీర్ఘకాలం సభలో ప్రాతినిధ్యం వహించడమే గాక, గతంలో సభాపతిగానూ పనిచేసిన నన్ను సభలో జరుగుతున్న పరిణామాలు ఎంతో కలిచివేస్తున్నాయి.
సభ లోపలే కాదు, సభ వెలుపల కూడా సభ్యుల ప్రవర్తన, ప్రసంగాలన్నింటినీ ప్రజలంతా నిశితంగా గమనిస్తారు. ప్రజలపై అవి చూపే ప్రభావం అధికం. అది దుష్ప్రభావమైనా, సత్ ప్రభావమైనా చివరికది ప్రతిఫలించేది మన ఘన జనస్వామ్యం పైనే. సభాపతి సభలో చేసే వ్యాఖ్యలే కాదు, సభ వెలుపల చేసే వ్యాఖ్యలు కూడా వివాదాస్పదం కావడం మున్నెన్నడూ కనీవినీ ఎరుగనిది. మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడి సెక్యూరిటీపై సభాపతి చేసిన వ్యాఖ్యలు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. ఎవరిని ఉద్ధరించడానికి చంద్రబాబుకు బ్లాక్ క్యాట్ కమాండోస్ ఇచ్చారని, ఎన్ఎస్‍జి తొలగించాలని సభాపతిగా తాను కేంద్రానికి సిఫారసు చేస్తానని, బ్లాక్ క్యాట్ కమాండోస్‌ను తొలగిస్తే చంద్రబాబు ఫినిష్ అయిపోతారని, సైకిలును తొలగించి తెలుగుదేశం గుర్తుగా శవాన్ని పెట్టుకోవాలని... ఇవీ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో మన సభాపతి చేసిన వ్యాఖ్యలు! అంతేకాదు జడ్జీలపై గతంలో స్పీకరు చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విఘాతమని, కోర్టులపై దాడిగా పరిగణించాలని సాక్షాత్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టు గతంలో వ్యాఖ్యానించింది. అత్యున్నతమైన సభాపతి స్థానమిలా పతనావస్థకి చేరడం, అత్యున్నతమైన చట్టసభ ఇలా దిగజారిపోవడం ఆందోళన కలిగిస్తున్నది.
చట్టసభలను గౌరవ సభగా, ప్రజాప్రతినిధులను గౌరవ సభ్యులుగా, స్పీకరును గౌరవ సభాపతిగా పిలిచేది, గుర్తించేది వాటి అత్యున్నత స్థాయిపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకే, తద్వారా ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని చాటిచెప్పేందుకే. సభాపతి శాసనసభ తొలి సభ్యుడు. క్రమశిక్షణ, నైతిక వర్తనలో సభ్యులందరికీ మార్గదర్శకుడు. ప్రతి సభ్యుడూ సత్ప్రవర్తనతో సభాగౌరవాన్ని ఇనుమడింప చేసేలా చూడాల్సిన రాజ్యాంగ పరిరక్షకుడు. సభలో సభ్యులందరినీ సమానంగా చూడాలి, పార్టీల పట్ల సమదృష్టి కలిగి వుండాలి. అందుకే సభాపతిగా ప్రమాణానికి ముందే, తాను ప్రాతినిధ్యం వహించే పార్టీకి కూడా రాజీనామా చేసే సత్ సాంప్రదాయం ఉంది. తాను నైతిక విలువలను పాటించడమే కాకుండా సభ్యులంతా పాటించేలా, సత్ ప్రవర్తనకు పట్టంగట్టేలా చూడటం సభాపతి ప్రాథమిక కర్తవ్యం, సభ బాధ్యత కూడా.
అటువంటి స్పీకరే దుర్భాషలాడితే ఇక సభ్యుల గౌరవాన్ని, సభా గౌరవాన్ని కాపాడేదెవరు? మొన్ననే వర్షాకాలం సమావేశాల్లో విన్నాం సభాపతి గారు వాడిన పదజాలాన్ని. గౌరవ సభ్యులను ఉద్దేశించి సభాపతి ‘యూజ్‍లెస్ ఫెలోస్’ అనడం సభాగౌరవానికే కళంకం, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మాయనిమచ్చ. గౌరవ సభ్యుడు ప్రాతినిధ్యం వహించేది ప్రజలకు. అలాంటిది గౌరవ సభ్యుడినే దూషించడం, సదరు ప్రజలనే దూషించడమే అవుతుంది. అప్పుడది ప్రజాస్వామ్యం కాదు, అహంకారస్వామ్యం అవుతుంది. సభాపతే ఈ విధంగా దుర్భాషలాడటం రాష్ట్ర చరిత్రలోనే చూడలేదు! సాధారణంగా ఎవరైనా సభ్యుడు ఎబ్యూజివ్ లాంగ్వేజి వాడితే బాధిత సభ్యుడికి అండగా ఉండాల్సింది సభాపతే. అలాంటిది ఆయనే ఎబ్యూజివ్ లాంగ్వేజి వాడితే ఇక సభను కాపాడేదెవరు?
చట్టసభల ప్రతినిధులకు ఆదర్శప్రాయ నడవడిక, జవాబుదారీతనం, నిబద్ధత వంటి ఏడు లక్షణాలు ఉండాలని నోలన్ కమిటీ పేర్కొంది. చట్టసభలు గాడితప్పడంపై ఎంసి చాగ్లా, కృష్ణకాంత్, జస్టిస్ శ్రీవాత్సవ వంటి ఉద్ధండులు గతంలో ఆందోళన చెందడం ప్రస్తావనార్హం. ప్రజాస్వామ్యానికి దేవాలయాల్లాంటి చట్టసభల్లో ప్రజాస్వామ్యాన్నే బైటకు నెట్టేయడం మూలవిరాట్టునే గిరాటేయడమే కాదు. దైవ సభలో దెయ్యాలాట చందమే అవుతుంది. సభ్యులు ఎప్పుడైనా ఆవేశకావేశాలకు లోనైతే, ప్రవర్తన హద్దు మీరితే ఆటోమేటిక్ సస్పెన్షన్, రెడ్ లైన్ గీసిన దృష్టాంతాలెన్నో ఉన్నాయి. ప్రివిలేజెస్, కన్వెన్షన్స్ ఉన్నాయి. వాటిని కాపాడేందుకే ఎథిక్స్ కమిటీ ఉంది. వాటన్నిటినీ కాలదన్ని సభాపతే దుర్భాషలకు దిగితే గౌరవసభకు గౌరవం ఎక్కడ?
విలక్షణమైన, విశిష్టమైన సభాపతి స్థానాన్ని విశ్లేషించాలంటే మన రాజ్యాంగం, కౌల్ అండ్ షక్దర్ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఇన్ పార్లమెంట్ గ్రంథం, 10వ షెడ్యూల్ మూడింటిని కలిపి విశ్లేషించాలి. "Speaker represents the whole House" అని భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చెప్పారు. సభా గౌరవం ఇనుమడింపు, సభ్యులందరి గౌరవ పరిరక్షణ స్పీకర్ బాధ్యతగా, సభాపతి స్థానం విశిష్టతగా ప్రథమ రాష్ట్రపతి డా. బాబూ రాజేంద్రప్రసాద్, మధు దండావతే తదితరులు పేర్కొన్నారు. చట్టసభల నిర్వహణలో దేశానికే గీటురాయిలా మన శాసనసభ ఉండేది. హైదరాబాద్ అజెండాతో ఏపి సిపిఏ బ్రాంచ్ కామన్వెల్త్ దేశాలకే దిక్సూచిగా ఉండేది. పార్లమెంటరీ బిహేవియర్‌పై సదస్సులు పెట్టాం. జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్, కృష్ణకాంత్, ఎంఎన్ కౌల్, ఎస్.ఎల్. షక్దర్ వంటి ఉద్ధండులు ఇక్కడికొచ్చి మన సింపోజియంలలో పాల్గొన్నారు. మన సభ్యులకు దిశానిర్దేశం చేశారు.
"Politics without ethics is like a body without soul" అని జాతిపిత గాంధీజీ అన్నారు. సభ లోపల, సభ వెలుపల సభ్యుల ప్రవర్తన నీతిమంతంగా, నియమబద్ధంగా, ఆదర్శప్రాయంగా ఉండాలి. దేశంలోనే ప్రప్రథమంగా ఎథిక్స్ కమిటీని నియమించుకున్న తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎథిక్స్ కమిటీ ఏర్పాటు, సభా సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలు, సభ్యుల ఆస్తుల ప్రకటన, పబ్లిక్ డొమైన్‌లో ఉంచడం, తదితర సంస్కరణలెన్నో తెచ్చిన సభ ఆంధ్రప్రదేశ్ శాసనసభ. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడింది, ఇతర సభలకు స్ఫూర్తిదాయకమై నిలిచింది. గతంలో సభాపతి ఇంటిపైనే దాడులు జరిగిన, బాంబు లేసిన దృష్టాంతాలు ఉన్నాయి. కానీ ఏనాడూ ఏ సభాపతీ సంయమనం కోల్పోలేదు, కోల్పోరాదు. సభా ప్రసారాలన్నీ లైవ్ టెలికాస్ట్ అవుతున్నాయి. సభా ప్రసారాలను ప్రజల్లోకి తీసుకెళ్లే సంస్కరణను, సత్సంప్రదాయాన్ని సభాపతిగా నేనున్నప్పుడే తీసుకువచ్చాం. ప్రజల డేగకళ్లు అనుక్షణం చట్టసభలపై ఉన్నాయనే స్పృహ ప్రతి సభ్యుడిలోనే కాదు, సభాపతిలోనూ ఉండాలి.
యనమల రామకృష్ణుడు
మాజీ స్పీకర్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ
Updated Date - 2023-09-27T01:47:04+05:30 IST