ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

దళితులపై దాడులకు అవ్యక్త సమ్మతి !

ABN, First Publish Date - 2023-09-20T01:37:19+05:30

హైదరాబాద్ నగరానికి కూత వేటు దూరంలో ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి. బడాబడా సాఫ్ట్‌వేర్ కంపెనీలన్నీ అక్కడే ఉన్నాయి. అలాంటి గచ్చిబౌలిని ఆనుకొని ఉన్న...

హైదరాబాద్ నగరానికి కూత వేటు దూరంలో ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి. బడాబడా సాఫ్ట్‌వేర్ కంపెనీలన్నీ అక్కడే ఉన్నాయి. అలాంటి గచ్చిబౌలిని ఆనుకొని ఉన్న వట్టినాగులపల్లి గ్రామంలో మాత్రం కులపిచ్చి ముదిరి పాకానపడ్డది. దళితులు కూడా బొడ్రాయి పండుగలో పాల్గొనాలి అనుకోవడం అగ్రవర్ణాలకు ఆగ్రహం తెప్పించింది. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందితేనేమి, ఎకరం కోటి పలికితేనేమి, మేం మాత్రం మారమనే కొన్ని గొంతులు దళితులపై విషం చిమ్మాయి. ‘మీరెంత మీ బతుకెంత?’ అంటూ దళితులపై విరుచుకుపడ్డాయి. దీంతో చిలికి చిలికి గాలివాన తుఫానైనట్టు గొడవ పెరిగి పెద్దదైంది. ప్రస్తుతం గచ్చిబౌలి పోలీస్ స్టేషనుకు చేరింది. దళితులపై రాళ్లు, కర్రలతో దాడి చేసిన అగ్రవర్ణాలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతారా అన్నది ఇప్పుడు సందేహాత్మకంగా మారింది.

చట్టాలు బాధితులనే కాపాడాలనే రూలేం లేదు. అవి కొన్నిసార్లు దోషులకు కూడా వరమవుతుంటాయి. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా ఈ ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టానికి 41సీఆర్పీసీ అనేది అడ్డంకిగా మారుతోంది. అది అగ్రవర్ణాలకు వరంగా తయారైంది. ఎస్సీఎస్టీ అట్రాసిటీలో భాగంగా ఏడేళ్ల్ల లోపు శిక్షపడితే వారికి కోర్టుల ప్రమేయమే అవసరం లేకుండా స్టేషనే బెయిల్ ఇవ్వొచ్చని చట్టంలో ఉంది. దీంతో అగ్రవర్ణాలు హాయిగా ఏ ఎమ్మెల్యే చేతనో, మినిస్టర్ చేతనో ఫోన్ చేయించుకొని ఏ కేసూ లేకుండా ‘స్టేషన్ బెయిల్’ మీద బయటికి రావచ్చు. మరింతమంది దళితుల మీద దాడులు చేయొచ్చు! ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నది ఇదే. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఎక్కడైనా పని చేయవచ్చేమోగాని, తెలంగాణలో కాదన్నట్టుగా మారింది పరిస్థితి. అంటే ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టం వర్తించాలంటే దళితులపై హత్యన్నా జరగాలి, లేదా హత్యాప్రయత్నమన్నా జరగాలి. లేకుంటే దోషులపై ఎలాంటి కేసులూ ఉండవు.

దేశంలో ఏదో ఒక మూల ప్రతీ మూడు నిముషాలకు ఒక దళితుని మీద దాడి జరుగుతోందని, ప్రతీరోజు ఒక దళితుని ఇల్లు తగులపెట్టబడుతోందని, ప్రతీ వారం రోజులకు ఒక దళిత మహిళ అత్యాచారానికి గురవుతోందని నేషనల్ ఎస్సీ కమీషన్ వెల్లడించింది. తాజాగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న సందర్భాల్ని కూడా పై జాబితాలో చేర్చాల్సి ఉంది. దళితులకు రక్షణను కల్పించాల్సిన ఈ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నది పాలకులే. ఏడేండ్ల లోపు శిక్షపడితే స్టేషన్ బెయిల్ ఇవ్వడమే అడ్డంకిగా మారుతున్నది. తాజాగా వట్టినాగులపల్లిలో దళితుల మీద దాడిలో కూడా దోషులకు ఇదే వరం కానుంది.

దేశవ్యాప్తంగా దళితులకు కనీస రక్షణ కరువవుతున్నది. మోదీ ప్రధాని అయ్యాక సుమారు రెండు లక్షల దాడులు జరిగినట్టు కేంద్ర సామాజిక న్యాయ శాఖే ప్రకటించింది. ప్రతీ చిన్న విషయంలోను దళితులనే టార్గెట్ చేయడం బీజేపీ పాలనలో పరిపాటిగా మారింది. దేశాన్ని విస్మయానికి గురిచేసిన గిరిజనుడిపై మూత్ర విసర్జన, మణిపూర్‌లో ఇద్దరు గిరిజన యువతులను వివస్త్రలుగా చేసి ఊరేగించిన ఘటన వంటివన్నీ ఇందులో భాగమే. అయినా సరే వీటి మీద మన మోదీగారు నోరు విప్పరుగాక విప్పరు. అదే సనాతన ధర్మం అంశంలో మాత్రం దాడులు తిప్పి కొట్టాలంటూ దేశ ప్రజలను రెచ్చగొట్టడంలో ముందుంటారు.


మోదీ కంటే మేమేమి తక్కువ తినలేదన్నట్టుగా వ్యవహరిస్తోంది తెలంగాణ సర్కార్. అందుకే గడిచిన తొమ్మిదేండ్లలో, అంటే 2014 నుంచి నేటి వరకు, అక్షరాలా ఏడు వేలకు పైగానే తెలంగాణలో దళితులపై దాడులు జరిగినట్టు కేసులు తెలియజేస్తున్నాయి. తెలంగాణలో కేసీఆర్ అండ చూసుకొని అగ్రవర్ణపెత్తందారులు రెచ్చిపోతున్నారనడానికి ఇంతకంటే ఏం సాక్ష్యం కావాలి! ఇందులో భాగంగానే వట్టినాగులపల్లి వంటి చోట దాడులు జరుగుతున్నాయి.

ఒక్క హైదరాబాద్ పరిసరాల్లోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఇదే సీన్ రిపీట్ అవుతున్నది. స్వయంగా సీఎం ఇలాకా అయిన మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా దళితులు వండిన అన్నం తినం అని అగ్రవర్ణాలు మొండికేశాయి. ఇదెక్కడి దుర్మార్గమని ప్రశ్నిస్తే దళితులను సామూహిక కుల బహిష్కరణ చేశారు. ఇక రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మల్కాపురం గ్రామంలో దళితులు బోనాల జాతర చూడడానికి పోతే అగ్రవర్ణాలు దాడులు చేసి కొట్టారు. ఇట్లా తెలంగాణలో నిత్యం దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నా, పాలకులుగానీ, పోలీసులుగానీ పట్టించుకోవడం లేదు. నిందితులను కనీసం అరెస్ట్ చేయడం లేదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలో దళితులు, గిరిజనులపై దాడులు జరిగితే బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని, అలాగే వారి ఇండ్లు ధ్వంసానికి గురైతే వారికి పునరావాసం ఏర్పాటు చేయాలని ఉంది. అయినా సరే పాలకులు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.

ముఖ్యంగా తెలంగాణలో ఎస్సీఎస్టీలపై జరిగిన దాడుల్లో నష్టపోయిన బాధితుల కోసం కేంద్ర సామాజిక న్యాయ శాఖ ఇటీవల రూ.150కోట్లు మంజూరు చేసింది. మరి నిధుల దారిమళ్లింపు అలవాటైన మన రాష్ట్ర పాలకులు వాటిని ఎప్పటిలాగే వేరే పనులకు ఉపయోగించే ప్రయత్నం చేశారు. ఇట్లా అయితే ఇక బాధితులకు న్యాయం ఎట్లా జరుగుతుందో పాలకులకే తెలియాలి. దీనిపై సోషల్ జస్టిస్ మినిస్ట్రీ కూడా తెలంగాణ పాలకులను నిలదీసింది. అయినా వారి దగ్గర సమాధానం లేదు. తెలంగాణలో దళిత, గిరిజనుల రక్షణ ఎంతటి అధ్వానంగా ఉందో తెలిపేవి రెండు విషయాలు: 1) హైపవర్ కమిటీ 2) ఎస్సీ ఎస్టీ కమిషన్. ఈ రెండూ కూడా ప్రస్తుతం పనిలో లేవు. హైపవర్ కమిటీకి స్వయంగా ముఖ్యమంత్రే చైర్మన్‌గా ఉండి ప్రతీ ఆరునెలలకు ఒకసారి సమీక్ష నిర్వహించాలి. దానిని పెడచెవిన పెట్టారు. ఇక గత చైర్మన్ పదవీ కాలం ముగిసిన తరువాత ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ కమిషన్‌ను నియమించలేదు. దీంతో తెలంగాణలో కుల వివక్ష తాలూకు కేసులకు విరామం అన్నదే లేదు. దళితులపై తెలంగాణలో ఏదో ఒక గ్రామంలో దాడి జరుగుతూనే ఉన్నది. కొన్ని ఊర్లల్లో ఇప్పటికీ దళితులకు చెట్ల కింద, మిగిలిన కులాలకు సెలూన్లలోను వేరుగా బార్బర్లు కటింగ్ చేస్తున్నారు. అలాగే వీడీసీ కమిటీల పేర దళితులను కుల బహిష్కరణ చేస్తున్నారు. దీనికి కారణం పాలకులకు దళిత, గిరిజనులపై ఉన్న నిర్లక్ష్యమే అన్నది స్పష్టంగా కనిపిస్తున్నది. అందుకే నిత్యం ఎక్కడ చూసిన దళితుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇవి ఇలాగే కొనసాగితే దళితులను ఊచకోత కోసినా సభ్య సమాజం అది సహజమైన పరిణామంగానే భావించే అవకాశం లేకపోలేదు. తక్షణమే పాలకులు మేల్కొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలుచేయాలి. ముఖ్యంగా దళితులపై దాడులకు పాల్పడుతున్న వారిని అరెస్టులు చేసి కేసులుపెట్టాలి. తద్వారా మాత్రమే దళిత సమాజానికి ఒక భరోసా లభిస్తుంది.

డా. పసునూరి రవీందర్

సీనియర్ జర్నలిస్ట్

Updated Date - 2023-09-20T01:37:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising