మోదీని ప్రశ్నించే ‘స్వదేశీ’ యోధులేరీ?
ABN, First Publish Date - 2023-08-02T01:34:32+05:30
సిద్ధాంతాలు ఏవైనా ఒక సంస్థలో పనిచేస్తూ తాము అనుకున్న విలువలకు కట్టుబడి ఉంటూ, జీవితంలో రాజీపడని వారు అనేకమంది ఉంటారు. గత వారం బెంగళూరులో మరణించిన...
సిద్ధాంతాలు ఏవైనా ఒక సంస్థలో పనిచేస్తూ తాము అనుకున్న విలువలకు కట్టుబడి ఉంటూ, జీవితంలో రాజీపడని వారు అనేకమంది ఉంటారు. గత వారం బెంగళూరులో మరణించిన ఆర్ఎస్ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి మదన్‌దాస్ దేవి అలాంటి వారిలో ఒకరు. ఆయనను స్మరించుకునేందుకు ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్డేడియంలో సోమవారం సభను ఏర్పాటు చేసినప్పుడు స్టేడియం వేలాది మందితో కిక్కిరిసిపోయి కనిపించింది. దేశ వ్యాప్తంగా నలుమూలలనుంచి సంఘ్, బీజేపీ నేతలు, కార్యకర్తలు ఈ సభకు హాజరయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా, పలువురు కేంద్రమంత్రులు, సీనియర్ ఆర్ఎస్ఎస్ నేతలు దత్తాత్రేయ హోసబలే, సురేశ్ సోని, కృష్ణ గోపాల్‌తో పాటు పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మొదలైన వారెందరో ఈ సమావేశంలో కనపడ్డారు. ఇంతకీ ఈ మదన్‌దాస్ దేవి ఎవరు? గత కొద్ది సంవత్సరాలుగా చురుకుగా లేనప్పటికీ ఆయనను అనేకమంది ఎందుకు తలచుకుంటున్నారు? షోలాపూర్‌కు చెందిన మదన్‌దాస్ దేవి వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్. అయితే వృత్తిని పక్కన బెట్టి పూర్తి కాలం సంఘ్ కార్యకలాపాల్లో తలమునకలయిన దేశభక్తుడు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా దేశం నలుమూలలా అఖిల భారత విద్యార్థి పరిషత్‌ను నిర్మించారు. అంతేకాదు, దత్తోపంత్ థేంగడి, ఎంజి బొకారే ఇతర నేతలతో కలిసి 1991లో స్వదేశీ జాగరణ్ మంచ్‌ను నిర్మించారు. ఏబీవీపీలో అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, రవిశంకర్ ప్రసాద్, నడ్డా వంటి నేతలను రూపొందించడంలో ఆయన పాత్ర ఉన్నది.
అన్నిటికన్నా మించి అటల్ బిహారీ వాజపేయి హయాంలో బీజేపీకి, ఆర్ఎస్ఎస్‌కు మధ్య సంబంధాలను ఏర్పర్చడంలో మదన్‌దాస్ దేవి కీలకపాత్ర చరిత్ర పుటల్లో నమోదైంది. స్వదేశీ జాగరణ్ మంచ్‌ను ఒక శక్తిగా రూపొందించి భారత దేశ ఆర్థిక విధానాలపై దాని ప్రభావం చూపేలా చేయగలిగిన మదన్‌దాస్ దేవి భారతదేశాన్ని పాశ్చాత్య దేశాలు కేవలం ఒక మార్కెట్‌గా భావించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రపంచీకరణకు వ్యతిరేకంగా పోరాడారు. ప్రపంచ వర్తక సంస్థ ఏర్పాటుకు ముందు డంకెల్ డ్రాఫ్ట్ రూపొందించినప్పడు మేధో సంపత్తి హక్కులు, కార్మిక ప్రమాణాల విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు వ్యతిరేకంగా రూపొందించిన అంశాలపై ఆయన బలంగా విమర్శలను సంధించారు. మహారాష్ట్రలో ఎన్రాన్ ప్రాజెక్టు, మల్టీబాండ్ రిటైల్, బీమా రంగంలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ వంటి విషయంలో ఆయనకు విస్పష్టమైన అభిప్రాయాలున్నాయి. ఆయన ఆధ్వర్యంలో స్వదేశీ జాగరణ్ మంచ్ నిర్వహించిన మహాధర్నా మూలంగానే బీమారంగంలో విదేశీ పెట్టుబడిని 26 శాతానికి పరిమితం చేశారు. ప్రముఖ సోషలిస్టు, కార్మిక నేత, జార్జి ఫెర్నాండెజ్ బీజేపీ వైపు ఆకర్షితులు కావడానికి స్వదేశీ జాగరణ్ మంచ్ ఒకరకంగా తోడ్పడింది. నిజానికి జార్జి ఫెర్నాండెజ్ మొరార్జీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పరిశ్రమల మంత్రిగా ఐబీఎం, కోకాకోలా వంటి బహుళ జాతి సంస్థలు ఫెరా నిబంధనలను అమలు చేసేలా ఒత్తిడి చేసి దేశం విడిచి వెళ్లేలా చేశారు. 2001లో జార్జి ఫెర్నాండెజ్ వాజపేయి హయాంలో కార్మిక సంస్కరణలను తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పుడు ఆర్ఎస్ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి మదన్ దాస్ దేవి ఆహ్వానం మేరకు దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జాగరణ్ మంచ్ సెమినార్‌లో పాల్గొన్నారు. బీజేపీ కురువృద్ధ నేత మురళీ మనోహర్ జోషితో ఆయనకు ఏకాభిప్రాయం ఉండేది.
వాజపేయి హయాంలో ప్రభుత్వ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ఇండోర్‌లో మూడు రోజుల సదస్సునొకదాన్ని మదన్‌దాస్ దేవి నిర్వహించారు. నిజానికి అంతకు ముందే ప్రభుత్వానికి స్వదేశీ విధానాల గురించి నచ్చజెప్పేందుకు ఆర్ఎస్‌ఎస్ సర్ సంఘ్ చాలక్ సుదర్శన్, హెచ్‌వి శేషాద్రితో పాటు వాజపేయిని కలుసుకున్నారు. ఈ సమావేశంలో అప్పటి ఉప ప్రధాని ఎల్‌కె అద్వానీ, అప్పటి బీజేపీ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు ఉన్నారు. ప్రభుత్వ విధానాలను రూపొందించే విషయంలో అన్ని జాతీయవాద శక్తులను సంప్రదించడం తమ బాధ్యత అని అప్పుడు వెంకయ్యనాయుడు మీడియాకు చెప్పారు. ‘జాతీయ అంశాలు, ప్రజలు ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలు, మూడేళ్లలో ప్రభుత్వ పనితీరు, ప్రజల ప్రయోజనాలకు సంబంధించి భవిష్యత్ విధానాల గురించి మేము చర్చించా’మని మదన్‌దాస్ దేవి అప్పుడు చెప్పారు. దేశం ఎదుర్కొనే సవాళ్లను ప్రభుత్వం ఏకాభిప్రాయంతోనే పరిష్కరించాలని ఆయన తెలిపారు. వాజపేయి హయాంలో మానవ వనరుల మంత్రిగా ఉన్న మురళీ మనోహర్ జోషి కూడా కేబినెట్‌లో ఆర్ఎస్ఎస్ అభిప్రాయాలను విస్పష్టంగా చెప్పి కొన్ని నిర్ణయాలను వ్యతిరేకించడమో, వాయిదా వేయించడమో చేసేవారు. స్వదేశీ జాగరణ్ మంచ్ మాత్రమే కాదు, భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్ వంటి సంఘ్ పరివార సంస్థలు కూడా అప్పుడు బహిరంగంగా ప్రభుత్వ ఆర్థిక విధానాలను వ్యతిరేకించేవి.
మదన్‌దాస్ దేవి మరణం గతంలో ఆర్ఎస్ఎస్, దాని సంస్థలు నిర్వహించిన నిర్మాణాత్మక పాత్రను మరోసారి గుర్తుకు తెచ్చింది. అంతేకాదు, గతంలో మాదిరి అంత సమర్థంగా ఈ సంస్థలు నిర్మాణాత్మక పాత్రను నిర్వహించగలుగుతున్నాయా? మదన్‌దాస్ దేవి లాంటి ప్రశ్నించే నేతలు ఎంతమంది ఉన్నారు? అన్న ప్రశ్నలూ తలెత్తేందుకు ఆస్కారమిచ్చింది. 2014 ఎన్నికల్లో విజయం తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆర్ఎస్ఎస్ అగ్రనేతలను విందుకు పిలిచి సత్కరించారు కాని, గడచిన 9 సంవత్సరాల్లో నరేంద్రమోదీ హయాంలో ఈ నేతలు ఎన్నిసార్లు ఆయనను కలుసుకుని సుదర్శన్, మదన్‌దాస్ దేవి లాగా విస్పష్టంగా తమ అభిప్రాయాలను ఆయనకు చెప్పగలిగారు? ప్రభుత్వ ఆర్థిక విధానాలను ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఎంతవరకు ప్రభావితం చేయగలుగుతున్నది? రైతులకు కనీస మద్దతు ధర, బీమారంగంలో ఎఫ్‌డిఐ, చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలకు మద్దతు, ప్రభుత్వ రంగ సంస్థలను ఎడా పెడా అమ్మడం, గుత్త పెట్టుబడిదారులకు దేశంలోని ప్రధాన మౌలిక సదుపాయాలను పూర్తిగా అప్పజెప్పడం, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడం, నిరుద్యోగం పెచ్చరిల్లడం కార్మిక చట్టాల విషయంలో సంఘ్ పరివార్ సంస్థలు ప్రభుత్వ విధానాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాయా? ఏకీభవించకపోతే ప్రభుత్వంలో మార్పులు తెచ్చేందుకు గతంలో లాగా ఎందుకు ప్రయత్నించడం లేదు?
నిజానికి అప్పుడప్పుడూ సంఘ్ పరివార్ నేతలు తమ అభిప్రాయాలను బయటకు వెల్లడించిన సందర్భాలు లేకపోలేదు. సాగుచట్టాలపై రైతుల నిరసనలు సుదీర్ఘ కాలం సాగినప్పుడు ఇది సమాజానికి ఆరోగ్యకరం కాదని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి సురేశ్‌భయ్యా జోషి అప్పుడు ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆర్ఎస్ఎస్ మూలంగానే మోదీ సాగు చట్టాలను ఉపసంహరించుకున్నారా అన్నది మాత్రం చెప్పలేము. దేశంలో 20 కోట్ల మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని, కోట్లాది మంది నిరుద్యోగంలో కూరుకుపోయారని, ఆదాయం, సంపదల విషయంలో అసమానతలు రోజురోజుకూ పెరుగుతున్నాయని మరో ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే కూడా ఏడాది క్రితం విమర్శించారు. దేశంలో అత్యధిక ప్రాంతాల్లో ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీరు అందుబాటులో లేదని, పేదరిక నిర్మూలనలో ప్రభుత్వ అసమర్థత కొట్టొచ్చినట్లు కనపడుతున్నదని హోసబలే వ్యాఖ్యానించారు.
ఇలా అప్పుడప్పుడూ కొందరు సంఘ్ పరివార్ నేతలు చేసే విమర్శలు పక్కన పెడితే మొత్తంగా సంఘ్ పరివార్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి కేవలం ఎన్నికల్లో గెలిపించే యంత్రాంగంగా మారినట్లు కనపడుతోంది! ఎన్నికలు జరగడానికి కొద్ది నెలల ముందే సంఘ్ పరివార్ సంస్థలు ఆయా రాష్ట్రాల్లో మోదీకి అనుకూల వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తే, కొందరు సంఘ్ నేతలు పూర్తిగా రాజకీయాల్లో కూరుకుపోయారన్నది వాస్తవం. కశ్మీర్‌లో 370 అధికరణ రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణం, కాశీ కారిడార్ నిర్మాణం. ఉమ్మడి పౌర స్మృతి గురించి మాట్లాడడం వంటి వాటి ద్వారా, బహిరంగంగా పూజా పునస్కారాలకు కూర్చోవడం ద్వారా ఆర్ఎస్ఎస్ నేతలను సంతృప్తి పరిచి వారు తమకు అనుకూలంగా పనిచేసేలా చేసుకోవాలన్నదే మోదీ ధ్యేయంగా మారిందేమో. ఒకప్పుడు మదన్‌దాస్ దేవి నాయకత్వంలో నిర్మాణాత్మకంగా పనిచేసిన స్వదేశీ జాగరణ్ మంచ్ బహుళ జాతి సంస్థలు, విదేశీ పెట్టుబడిదారీ సంస్థలు, భారతీయ బడా వ్యాపారులకు అనుకూలంగా మోదీ ప్రభుత్వం అవలంభించిన విధానాలను వ్యతిరేకిస్తున్నప్పటికీ బలంగా పోరాడలేకపోతున్నదేమో అనిపిస్తోంది.
ఒకప్పుడు నరేంద్ర మోదీకి మద్దతునీయడం సంఘ్ పరివార్‌కు అవసరమైందేమో కాని కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన అన్నిటికీ అతీతంగా మారారు. ఏకవ్యక్తి పాలనను ప్రవేశపెట్టి, వివిధ వ్యవస్థలను నామమాత్రంగా మార్చారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలు, సంప్రదాయాలను నిర్లక్ష్యం చేస్తూ ఎవరూ తనను ప్రశ్నించకూడదన్న విధంగా వ్యవహరిస్తున్నారు. అక్రమ మార్గాల ద్వారా వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పరస్తున్నారు. మణిపూర్ లాంటి ప్రాంతాల్లో నెలల తరబడి హింసాకాండ పెచ్చరిల్లుతున్నా మౌనంగా ఉంటున్నారు. ఈ పరిణామాలను ఎవరైనా హర్షిస్తారా? సంఘ్ పరివార్‌లో మదన్‌దాస్ దేవి లాంటి మేధో విమర్శకుల తరం హరించుకుపోయిందా? అంతర్గత విమర్శకులు లేనందువల్లే మోదీ ధాటి అలవిమీరిపోయిందా?
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
Updated Date - 2023-08-02T01:34:32+05:30 IST