పాక్‌పై మనకు నైతిక ఆధిక్యం ఉన్నదా?
ABN, First Publish Date - 2023-05-10T01:08:03+05:30
గతవారం గోవాలో జరిగిన షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఓ) సమావేశ స్థలిలో భారత్, పాకిస్థాన్ విదేశాంగ మంత్రులు కరచాలనాలు చేసుకున్నారు. చిరునవ్వుతో పలకరించుకున్నారు...
గతవారం గోవాలో జరిగిన షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఓ) సమావేశ స్థలిలో భారత్, పాకిస్థాన్ విదేశాంగ మంత్రులు కరచాలనాలు చేసుకున్నారు. చిరునవ్వుతో పలకరించుకున్నారు. తీరా సమావేశంలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. ఆ తరువాత విలేఖరుల సమావేశాల్లో ఒకరిపై మరొకరు నిప్పుల వర్షం కురిపించుకున్నారు. గత పన్నేండేళ్లలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఒకరు మన దేశానికి రావడం ఇదే మొదటిసారి. ఇలా వచ్చిన పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ఇరు దేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నించే బదులు మరింత ఆజ్యం పోసి వెళ్లారనడంలో సందేహం లేదు. జమ్మూ–కశ్మీర్‌లో 370 అధికరణ ఎత్తివేత, గుజరాత్ అల్లర్లు, బీబీసీ వీడియో మొదలైన అంశాలపై బిలావల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఆయన పరోక్షంగా సమర్థించుకున్నారు. పాకిస్థాన్ గడ్డపై ఉగ్రవాదులకు శిక్షణను ఇవ్వడం గురించి కానీ, ముంబైపై ఉగ్రవాద దాడులకు పాల్పడ్డ దావూద్ ఇబ్రహీంను భారత్‌కు అప్పజెప్పడం గురించి కానీ బిలావల్ మాట్లాడలేదు. మోదీ హయాంలో ముస్లింలు అభద్రతకు గురికావడాన్ని ఆయన ప్రశ్నించారు. పైగా దౌత్య ప్రయోజనాలకు ఉగ్రవాద ఘటనలను ఉపయోగించుకోకూడదని హితవు చెప్పారు. బిలావల్ వాదనల్ని మన విదేశాంగ మంత్రి జైశంకర్ బలంగా తిప్పికొట్టాల్సి వచ్చింది. ఉగ్రవాద పరిశ్రమకు అధికార ప్రతినిధిగా బిలావల్ మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఎస్‌సిఓలో పాకిస్థాన్ ఒక సభ్య దేశంగా ఉండడం వల్ల బిలావల్ భారత్‌కు రాగలిగారు కాని ఆయన పర్యటనకు అంతకంటే ఎక్కువ ప్రాధాన్యం లేదని జైశంకర్ స్పష్టం చేశారు. పాకిస్థాన్ విశ్వసనీయత ఆ దేశ విదేశీమారక ద్రవ్య నిల్వల కంటే వేగంగా క్షీణిస్తున్నదని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఉగ్రవాద బాధితులు ఉగ్రవాదాన్ని ప్రేరేపించే వారితో ఎలా చర్చిస్తారు? అని జైశంకర్ ప్రశ్నించారు. జైశంకర్ మాటల్లో వాస్తవం లేకపోలేదు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలైనప్పటికీ, జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు ఆగడం లేదు.
పాకిస్థాన్ ఏర్పడి 75 సంవత్సరాలు అయినప్పటికీ, అంతర్జాతీయంగా భారత్‌పై ఎలాంటి ఒత్తిడి లేనప్పటికీ ఇంకా ఆ దేశం కశ్మీర్ అంశాన్ని పట్టుకుని వ్రేళ్లాడడం, ఇంకా పాతవాదనలనే కొనసాగించడం అత్యంత విషాదకరం. కశ్మీర్ ప్రజల మనసులను చూరగొనేందుకు ఏమి చేయాలి, స్థానిక ముస్లింలను ఎలా విశ్వాసంలోకి తీసుకోవాలన్నది భారత ప్రభుత్వానికి సంబంధించిన విషయం. ఈ విషయంపై చర్చించేందుకు భారత ప్రజలకు పూర్తి హక్కు ఉన్నది. అలాంటి నైతిక అర్హత పాకిస్థాన్‌కు ఏ మాత్రం లేదు. మొదటి నుంచీ పాకిస్థాన్ ప్రభుత్వాధినేతలు, సైనికాధికారులు తమ దేశ ప్రయోజనాల కంటే ఎక్కువగా కశ్మీర్‌కు ప్రాధాన్యత నిచ్చారన్న విషయంలో సందేహం లేదు. పాకిస్థాన్ ఆరు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇటీవల రంజాన్ సందర్భంగా ధరలు ఆకాశాన్ని అంటడంతో పేద ప్రజలు పిండి కొనేందుకు కూడా ఒకరినొకరు త్రోసుకున్నారు. పెట్రోల్, డీజిల్ స్టేషన్ల వద్ద ఇప్పటికీ పాకిస్థాన్ పొడవాటి క్యూలు కొనసాగుతున్నాయి. పాక్‌లో ఇప్పుడు ఒక నెల దిగుమతులకు మించి విదేశీ మారక ద్రవ్య నిల్వలులేవు. జీతాలు, పింఛన్లతో సహా బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. షరతులు సరిగా అమలు చేయకపోవడంతో ఐఎంఎఫ్‌తో కుదుర్చుకున్న రుణ ఒప్పందం గత నవంబర్ నుంచీ నిలిచిపోయింది. విచిత్రమేమంటే భారత్‌తో మూడు యుద్ధాలు చేసీ గుణపాఠాలు నేర్చుకున్నామని చెప్పిన పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. నిజానికి పాకిస్థాన్ మూలంగానే దక్షిణాసియా దేశాల సంఘం (సార్క్) కార్యకలాపాలు నిలిచిపోయాయి. భారతదేశంతో సత్సంబంధాలు పెట్టుకుంటే పాకిస్థాన్ కెన్యా నుంచి టీ పొడి, ఉజ్బెకిస్తాన్ నుంచి ఉల్లిగడ్డలు, చైనా, థాయిలాండ్, సింగపూర్‌ల నుంచి చక్కెర దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. పాలు, టమాటాలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశానికి అంటేవి కావు. పాకిస్థాన్‌ను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చొరవ తీసుకోవచ్చని రీసర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) మాజీ ఛీఫ్ ఎఎస్ దులత్ అన్నారు. కాని పాక్ ప్రధాన పరిశ్రమ ఉగ్రవాదం అయితే ఆ దేశ రాజకీయ, సామాజిక ఆర్థిక సమస్యలు ఎలా పరిష్కారమవుతాయి అని విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రశ్నించారు. ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకున్న 34 సంవత్సరాల యువకుడు బిలావల్ కూడా పాక్ ప్రాధాన్యాలను మరిచి ఇప్పుడు మతం ప్రాతిపదికగా మాట్లాడడాన్ని బట్టి చూస్తే పాకిస్థాన్‌ను ఎవరూ కాపాడలేరన్న విషయం స్పష్టమవుతోంది.
పాకిస్థాన్ విషాదమేమిటి? మతానికీ పాలనకూ మధ్య విభజన రేఖ గీసుకోలేకపోవడమే. ‘మీరు ఏ మతానికీ, కులానికీ జాతికీ చెందినవారైనా కావచ్చు కాని ఒక దేశం పౌరులుగా మీ అందరికీ సమాన హక్కులున్నాయి’ అని పాకిస్థాన్ సంస్థాపక అధ్యక్షుడు మహమ్మదాలీ జిన్నా అన్నారు. కాని ఆ మాటలను ఆయనే విస్మరించారు. ఇస్లాం రిపబ్లిక్ ఆఫ్ పాకిస్థాన్ పేరుతో తొలి ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలని స్వప్నించిన జిన్నా, ఆయన అనంతర పాక్ ప్రభుత్వాధినేతలు తమ దేశాన్ని మధ్య యుగాల్లోకి తీసుకువెళ్లారు. ఇస్లాంలోని ఆధ్యాత్మిక స్వభావాన్ని విస్మరించి ఇతర మతస్థుల పట్ల ద్వేష భావాన్ని పెంచి పోషించారు. ఆధునిక పాకిస్థాన్ నిర్మాతల్లో ఒకరు, అంబేడ్కర్‌తో పోల్చదగ్గ పాక్ తొలి న్యాయమంత్రి జోగేంద్రనాథ్ మండల్ దళితులపై ముస్లింల అత్యాచారాలను నిరసించినందుకు ఆయనపైనే అరెస్టు వారెంట్ జారీ అయింది. దీనితో ఆయన అప్పటి ప్రధాని లియాఖత్ అలీఖాన్‌కు తన రాజీనామా సమర్పించి భారతదేశానికి తిరిగివచ్చారు. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రాంతంలో సిక్కులతో పాటు అనేకమంది మైనారిటీల ఊచకోత, వామపక్షాల అణిచివేత, హిందూ దేవాలయాల్లో ప్రతిమల విధ్వంసం అనేవి చారిత్రక వాస్తవాలు. ‘కశ్మీర్‌ను పళ్లెంలో పెట్టి పాకిస్థాన్‌కు ఇచ్చినప్పటికీ భారతదేశంతో సంఘర్షించేందుకు మరో మార్గాన్ని పాక్ వెతికి ఉండేది. ఎందుకంటే కశ్మీర్ ఒక రోగానికి సంకేతం మాత్రమే. అసలు రోగం భారతదేశాన్ని ద్వేషించడం’ అని జవహర్‌లాల్ నెహ్రూ లాంటి లౌకికవాది సైతం అన్నారు. నిజానికి పాకిస్థాన్‌లో జియాఉల్ హక్ హయాంలో మదర్సాలను జిహాదీ కేంద్రాలుగా మార్చినప్పటికీ అనేక మంది యువతీ యువకులు, ఆధునిక తరం మతాన్ని రాజకీయాలకు ఉపయోగించుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు. పాక్‌లో ఇస్లామిక్ రాజ్యం తీరుతెన్నులను విమర్శిస్తూ కెనడాలో స్థిరపడ్డ పాకిస్థానీ దేశీయుడు తారెక్ ఫతే రాసిన పుస్తకాన్ని నాకు ఇస్లామాబాద్‌లో ఒక పాక్ జర్నలిస్టు బహూకరించారు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే కశ్మీర్ సమస్య పరిష్కారమైనా, న్యూఢిల్లీ– ఇస్లామాబాద్ సంబంధాలు మెరుగుపడ్డా, ప్రభుత్వ వ్యవస్థపై తమ పట్టు కోల్పోవడాన్ని పాక్ సైనికాధికారులు సహించలేరు. వంశపారంపర్య రాజకీయాలు సాగిస్తున్న భుట్టో, షరీఫ్ తదితరుల ఆధునిక భూస్వామ్య కుటుంబాలు ఈ సైనిక నియంత్రణకు భిన్నంగా వ్యవహరించలేవు.
ఒక మతరాజ్యంగా విఫలమైన పాకిస్థాన్ అనుభవం చూసిన తర్వాత రాజకీయాలు, పాలన, మతంతో ప్రభావితమయితే ఎటువంటి దుష్పరిణామాలు ఏర్పడతాయో స్పష్టంగా కనిపిస్తోంది. మత రాజ్యంగా ఏర్పడడం వల్లనే పాకిస్థాన్‌లో పౌరసమాజం క్షీణించిపోయింది. రాజ్యాంగం, ఇతర వ్యవస్థలు హాస్యాస్పదమయ్యాయి. పేదరికం, నిరుద్యోగం, అసమానతలు పెరిగిపోయాయి, శాంతి భద్రతల పరిస్థితి మరింత క్షీణించింది. భారతదేశం ఆ మార్గంలో పయనించకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ముస్లింల ఓట్లకోసం కాంగ్రెస్ చేసిన బుజ్జగింపు రాజకీయాలను తీవ్రంగా విమర్శించిన భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యలను ప్రస్తావించడం కంటే మతాన్ని రాజకీయాల్లోకి ఉపయోగించుకోవడాన్ని తీవ్రతరం చేసింది. రామజన్మభూమి ఉద్యమం, గుజరాత్ అల్లర్లు ఒక దశ మాత్రమేనని, ఎవరు అధికారంలోకి వచ్చినా దేశాన్ని ప్రజాస్వామిక పంథాలో నడిపించడం తప్పదని భావించేవారు ఇవాళ నిరాశానిస్పృహలకు గురవుతున్నారు. బిజెపి ఆత్మరక్షణలో పడ్డప్పుడల్లా ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేనప్పుడల్లా మతాన్ని ఆయుధంగా వాడుకుంటోంది. బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడాన్ని ప్రశ్నించవచ్చు కాని అందుకోసం బిజెపి ఎన్నికల సభల్లో హనుమాన్ చాలీసాలు పఠించాల్సిన, జై శ్రీరాం నినాదాలు చేయాల్సిన, ఆలయాల సందర్శనను రాజకీయం చేయవలసిన అవసరం లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం తన ఎన్నికల ప్రసంగాలను ‘జై బజరంగ్ బలీ’ నినాదంతో ప్రారంభించాల్సిన అగత్యంలేదు. ‘కేరళ పైల్స్’ సినిమా ప్రచారాన్ని కర్ణాటకలో చేయడం జరగాల్సిన పని లేదు. బిజెపి నేతల సోషల్ మీడియా అంతా రాజకీయ సందేశాలకంటే మతపరమైన సందేశాలు, మతాన్ని, జాతీయవాదాన్ని, దేశ భక్తితో ముడిపెట్టడం, ముస్లిం వ్యతిరేక ప్రచారాలతో నిండిపోవడం యాదృచ్ఛికం కాదు. మైనారిటీలను అణిచివేసిన ఒక మత రాజ్యం నుంచి వచ్చిన బిలావల్ కూడా ఇవాళ మోదీ మంత్రివర్గంలో కాని, బిజెపి ఎంపీల్లో కాని ఒక్క ముస్లిం కూడా ఎందుకు లేరని ప్రశ్నించగలుగుతున్నారు. ఆయన ప్రశ్నకు సమాధానం చెప్పనవసరం లేదుకాని భారతదేశం మతరాజ్యంగా మారకుండా, మధ్యయుగాల్లోకి జారకుండా, పాకిస్థాన్‌ను అనుకరించకుండా ఉండడం మాత్రం చారిత్రక అవసరం అని చెప్పక తప్పదు. అభివృద్ధి చెందిన ఆధునిక భారతదేశంగా పాకిస్థాన్‌ను సరైన పంథాలోకి నడిపించేలా చూడడం, తద్వారా ఉపఖండం సామ్రాజ్యవాద ఉచ్చులోంచి బయటపడేలా చేయడం కూడా ఇవాళ ఒక చారిత్రక ఆవశ్యకత.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
Updated Date - 2023-05-10T01:08:03+05:30 IST