ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దక్షిణాదికి బీజేపీ అవసరమున్నదా?

ABN, First Publish Date - 2023-06-07T01:40:57+05:30

‘భారతీయ జనతా పార్టీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ మాత్రమే కాని ప్రాంతీయ పార్టీలు కాదు. పునరుత్థానం చెందేందుకు కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అవకాశం ఇస్తే మాకే ప్రమాదం. ప్రాంతీయ పార్టీలు ఏనాడూ బిజెపికి జాతీయ స్థాయిలో ప్రమాదకారి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘భారతీయ జనతా పార్టీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ మాత్రమే కాని ప్రాంతీయ పార్టీలు కాదు. పునరుత్థానం చెందేందుకు కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అవకాశం ఇస్తే మాకే ప్రమాదం. ప్రాంతీయ పార్టీలు ఏనాడూ బిజెపికి జాతీయ స్థాయిలో ప్రమాదకారి కాలేవు’ అని ఇటీవల బిజెపి జాతీయ నాయకుడు ఒకరు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ అన్నారు బహుశా 2024 ఎన్నికల్లో బిజెపికి ఎదురయ్యే పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం తర్వాత దేశ వ్యాప్తంగా ఆ పార్టీ మళ్లీ బలం పుంజుకునే అవకాశం ఉన్నదనే చర్చ జరుగుతోంది. ‘లెక్కలు వేసుకోండి.. ప్రతిపక్షాలన్నీ సంఘటితంగా బిజెపిని 2024 ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తాయి’ అని ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అత్యంత ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు. ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని బట్టి చూస్తే మెజారిటీ ప్రతిపక్షాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కాంగ్రెస్ పట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్నాయి. ఈ లెక్కలు వేసుకునే రాహుల్, బహుశా, ఆ ఆత్మ విశ్వాస ప్రకటన చేసి ఉంటారనడంలో సందేహం లేదు.

కేంద్రంలో పేరుకు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఆ సంకీర్ణ కూటమికి రాజకీయ అస్తిత్వం అంటూ ఏమీ లేదు. భాగస్వామ్య పక్షాల్లో జనతాదళ్ (యు), శివసేన, అకాలీదళ్‌లు ఇప్పటికే బిజెపికి దూరమయ్యాయి. శివసేన, లోక్‌జనశక్తి రెండుగా చీలిపోయాయి. కేంద్రంలో గత 9 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బిజెపి ఏనాడూ ప్రభుత్వపాలనలో తన మిత్రపక్షాలకు సరైన మన్నన ఇవ్వలేదు. లోక్ సభలో సొంతంగా సంపూర్ణ మెజారిటీ ఉండడమే అందుకు కారణమని మరి చెప్పనవసరం లేదు. 2014 లోనూ, 2019 లోనూ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు ఏ పార్టీ మద్దతు అవసరం లేదనే ధీమా బిజెపిలో పెరిగింది. ఆ ధీమాతోనే తన అధికార బలాన్ని ఉపయోగించుకుని కాంగ్రెస్‌తో పాటు ప్రాంతీయ పార్టీలను పూర్తిగా బలహీనపరిచేందుకు బిజెపి అనేక దూకుడు చర్యలు తీసుకుంది. నిజానికి 1998లో ఎన్డీఏ ఆవిర్భావం వెనుక ప్రధాన లక్ష్యం కాంగ్రెస్ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడమే. తమ తమ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తున్న అనేక ప్రాంతీయ పార్టీలు బిజెపి నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధపడ్డాయి. ఆ నాటి బిజెపి జాతీయ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు ‘ఏక్ హాత్ మే బిజెపి జెండా, దూస్రా హాత్ మే ఎన్డీఏ ఎజెండా’ (ఒక చేతిలో బిజెపి జెండా, మరో చేతిలో బిజెపి ఎజెండా) అనే నినాదాన్ని రూపొందించారు.

1990వ దశకంలోనే పలు రాష్ట్రాల్లో బిజెపి గణనీయ విజయాలను సాధించి దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌కు బలమైన ప్రత్యామ్నాయంగా ప్రభవించింది. 1996లో 11వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో భారత రాజకీయాల్లో రెండు బలమైన వేర్వేరు శక్తులు అవతరించాయి. బిజెపికి 161 సీట్లు, కాంగ్రెస్‌కు 136 సీట్లు లభించాయి. స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారి కాంగ్రెస్ తన ప్రాధాన్యాన్ని కోల్పోగా బిజెపి ప్రప్రథమంగా ఏకైక మెజారిటీ పార్టీగా అవతరించింది. ఆ తరుణంలో బిజెపిని కేంద్రంలో అధికారంలోకి తీసుకురావడంలో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించాయి. 1998, 1999 లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌తో పాటు 20కి పైగా ప్రాంతీయ పార్టీలు ఎన్నికల ముందే బిజెపితో పొత్తులు కుదుర్చుకున్నాయి. 2014 సార్వత్రక ఎన్నికల్లో కూడా తెలుగుదేశంతో సహా 24 పార్టీలు బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏతో పొత్తు కుదుర్చుకున్నాయి. అనేక రాష్ట్రాల్లో బిజెపి ప్రాంతీయ పార్టీల భుజాలపై ఎక్కి ప్రాబల్యం సంపాదించుకున్న విషయం చరిత్ర పుటల్లో నమోదైంది. ఈ వాస్తవాన్ని విస్మరించకుండా బిజెపి ప్రజాస్వామిక స్ఫూర్తితో తనతో వచ్చే ఇతర పార్టీలతో కలిసి పనిచేసి ఉంటే దేశమంతటికీ ప్రాతినిధ్యం వహించగలిగిన పార్టీగా పరిణమించి ఉండేది. స్వంతంగా మెజారిటీ లభించినప్పటికీ కీలక వ్యవహారాలలో తమకు అనుకూలంగా ఉన్న పార్టీలతో సంప్రదించి నిర్ణయాలు తీసుకుని ఉండవల్సింది. అలా సమష్టి బాధ్యతతో కేంద్ర ప్రభుత్వాన్ని నడిపి ఉంటే బిజెపికి ఇవాళ దేశ వ్యాప్తంగా ఆమోదం లభించి ఉండేది. కానీ అలా జరగలేదు. ఎందుకని? గతంలో కాంగ్రెస్ వ్యవహరించినట్లుగానే వ్యవహరించడం వల్లేకాదూ? అధికారబలంతో విచ్చలవిడిగా, విశృంఖలంగా వ్యవహరించి తనతో చేతులు కలిపేందుకు సిద్ధమైన పార్టీలను కూడా బిజెపి అవమానపరిచింది. ఆ పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించింది. మిత్రపక్షాలను కూడా రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రయత్నించింది. ఫలితంగానే ఎన్డీఏతో చేతులు కలిపిన పార్టీలన్నీ క్రమంగా ఒక్కోటీ దూరమయ్యాయి. కేవలం నాలుగైదు అనామక పార్టీలు మాత్రమే బిజెపితో మిగిలాయి. ఇవాళ బిజెపి దక్షిణాదిన ఉనికికోసం పోరాడవలసిన పరిస్థితి ఏర్పడేది కాదు.

ఇవాళ కొన్ని ప్రాంతీయ పార్టీలు బిజెపితో అంటకాగుతున్నాయంటే అవి ఇష్టపూర్వకంగా, మోదీ పట్ల ప్రేమతో స్నేహం చేస్తున్నట్లు అర్థం చేసుకోవలసిన అవసరం లేదు. అది సైద్ధాంతిక అవగాహనతో ఏర్పడిన స్నేహం కానే కాదు. ఆయా పార్టీల నేతల బలహీనతలను గ్రహించి అవి తన పట్ల బలవంతమైన ప్రేమ ప్రదర్శించేలా నరేంద్ర మోదీ చేస్తున్నారు. ఈడీ, సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా, ఇప్పటికే ఆ నేతలపై ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేస్తామని బెదిరించడం ద్వారా ఆయన వారిని భయభ్రాంతుల్ని చేసి లొంగదీసుకుంటున్నారు. నీతీ ఆయోగ్ ద్వారా సమాఖ్య స్ఫూర్తిని అవలంబిస్తున్నామని మోదీ చెప్పుకుంటున్న మాటల్ని నమ్మేందుకు ఎవరూ సిద్ధంగా లేరు.

మరి 2024లో పరిస్థితి ఎలా ఉంటుందన్న భయాందోళనలు బిజెపిలో నెలకొనడంలో ఆశ్చర్యం లేదు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో బిజెపి మూడో స్థానంలోకి దిగజారిందని, ఇతర పార్టీలనుంచి చేరే వారు వెనక్కి తగ్గారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. నిజానికి ఇతర పార్టీలనుంచి చేరడం వల్లనే బిజెపికి తెలంగాణలో కొంత వాపు వచ్చింది కాని అది ఆ పార్టీ బలం కానే కాదు. ఈటల రాజేందర్, రఘునందన రావు, కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి తదితరుల మూలంగా పెరిగిన బలమది. బిజెపిలో ఆ ఊపు సహజంగా వచ్చిందనుకోవడానికి వీలు లేదు. రెండవది, బిజెపిలో మోదీయే సర్వాంతర్యామిగా మారి, ఆయనే ప్రచారానికి ప్రధానాకర్షణగా మారిన పరిస్థితిపై ఆ పార్టీలో తీవ్రంగా చర్చనీయాంశమవుతోంది. పార్లమెంట్‌ను తన స్వంత ఆస్తి అన్నట్లుగా ఆయనే సర్వస్వమై ప్రారంభించిన తీరుపై రణగొణ ధ్వనులు వినిపిస్తున్నాయి. పార్టీలో ప్రతీ నిర్ణయానికీ ఆయనపై విధిగా ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలోనే కాక, ఆయా రాష్ట్రాల్లో తమకు ఏ విధానం అనుసరించాలో తమకే తెలియడం లేదని అక్కడి పార్టీ నేతలే అంటున్నారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పట్ల ఏ విధంగా వ్యవహరించాలో తమకు ఇంతవరకూ ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు లేవని అందుకే తాము మెతక ధోరణిలో వ్యవహరిస్తున్నామని ఆ పార్టీ నేతలు అనేకమంది చెప్పారు. ఇతర రాష్ట్రాలలో కూడా నేతలు నిమిత్తమాత్రంగా మారారు. ఈ పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో నరేంద్ర మోదీ మరోసారి పూర్తి మెజారిటీ తేలేకపోతే ఎలా అన్న చర్చలు కూడా బిజెపిలో అంతర్గతంగా సాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఇటీవల తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీకి వచ్చి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డాలతో చర్చలు జరపడం కీలక ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. జాతీయ రాజకీయాల్లో చంద్రబాబునాయుడు గతంలో చాలా కాలం కీలక పాత్ర పోషించారు. యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో ఆయన పాత్ర గణనీయమైనది. అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైన మద్దతును బయటి నుంచి అందించారు. గుజరాత్ అల్లర్ల విషయంలో ఆయన తన వైఖరిని స్పష్టంగా ప్రకటించారు. 2014లో ఎన్డీఏతో చేతులు కలిపినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ దూకుడు పెరిగి రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని తెలిసినప్పుడు ఆయన ఆ అధికార కూటమి నుంచి తప్పుకున్నారు. మోదీపై కీలక విమర్శలు కూడా సంధించారు. బహుశా చాలా మంది అనుకున్నట్లే మోదీ తిరిగి అధికారంలోకి రారేమో అని ఆయన అనుకుని ఉంటారు. అందువల్ల మోదీ స్వభావం, వైఖరి గురించి చంద్రబాబుకు ఎవరూ కొత్తగా చెప్పనవసరం లేదు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆలోచిస్తారో బిజెపి నేతలకు వేరుగా చెప్పనక్కర్లేదు.

అయినప్పటికీ బిజెపి అగ్రనేతలు చంద్రబాబుతో ఎందుకు చర్చలు జరిపారు? గడచిన నాలుగేళ్లలో చంద్రబాబునాయుడు రాష్ట్రంలో విభిన్న సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాత తనకు జాతీయ రాజకీయాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని భావించడం ఇందుకు ఒక కారణం కావచ్చు. అదే సమయంలో దక్షిణాదిలో ఉనికి కోల్పోతున్న బిజెపికి ఆ ప్రాంతానికి చెందిన ఒక ముఖ్యమైన నాయకుడు తమతో చర్చలకు సిద్ధం కావడం ఒక నైతిక బలాన్ని కూడా అందించి ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో తమకు ఒక రాజకీయ పునాది అంటూ ఏర్పడాలన్నా, తెలంగాణలో కొంత బలం చేకూరాలన్నా తెలుగుదేశానికి స్నేహహస్తం అందించడం అవసరమని బిజెపి నేతలు భావిస్తుండవచ్చు. బిజెపి స్నేహహస్తాన్ని అందుకుంటే తెలుగుదేశం పార్టీకి లభించే ప్రయోజనాలేమిటి, వచ్చే నష్టాలేమిటి అని రాజకీయ వర్గాల్లో చర్చలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అదే సమయంలో బిజెపికి దక్షిణాదిలో ఊపిరి ఇవ్వడం అవసరమా అన్న ప్రశ్న కూడా ప్రధాన చర్చనీయాంశంగా ఉన్నది.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2023-06-07T01:40:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising