ఎన్నికల బాండ్లా, రహస్య ముడుపులా?
ABN, First Publish Date - 2023-11-01T01:13:03+05:30
రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) క్రింద రాజకీయ పార్టీలకు ఎవరు నిధులు సమకూరుస్తున్నారనే సమాచారాన్ని తెలుసుకునే హక్కు ప్రజలకు లేదని నరేంద్ర మోదీ ప్రభుత్వం భావిస్తోంది...
రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) క్రింద రాజకీయ పార్టీలకు ఎవరు నిధులు సమకూరుస్తున్నారనే సమాచారాన్ని తెలుసుకునే హక్కు ప్రజలకు లేదని నరేంద్ర మోదీ ప్రభుత్వం భావిస్తోంది. అసలు ప్రతి విషయాన్నీ ప్రజలకు ఎందుకు తెలపాలని కేంద్ర ప్రభుత్వ అటార్నీ జనరల్ వెంకటరమణి ఎన్నికల బాండ్ల కేసులో సుప్రీంకోర్టు ముందు వాదించారు. ఒక ఓటరు ఒక అభ్యర్థికి ఓటు వేసే ముందు ఆ అభ్యర్థి నేపథ్యం గురించి తెలుసుకోవడం ఆ ఓటరు హక్కు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 33ఏ కూడా ఈ మేరకు ఒక అభ్యర్థి నేరచరిత్రను తెలుసుకునేందుకు ఓటరుకు హక్కుందని నిర్దేశించింది. సుప్రీంకోర్టు పలుసార్లు ఈ విషయం స్పష్టం చేసింది. అభ్యర్థి నేరచరిత్రను తెలుసుకునే హక్కు ఓటర్‌కు ఉన్నప్పుడు అభ్యర్థికి ఎన్నికల నిధులు ఎవరు సమకూరుస్తున్నారో తెలుసుకునే హక్కు అతడికి ఎందుకు ఉండకూడదు? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరిస్తోంది. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల విధానాన్ని ప్రశ్నించడం సుప్రీంకోర్టు పని కాదని కూడా ప్రభుత్వం వాదిస్తోంది. పార్లమెంట్‌లో చట్టం ద్వారా చేసిన విధాన నిర్ణయాన్ని న్యాయస్థానాలు ప్రశ్నించకూడదని ప్రభుత్వం భావిస్తోంది.
మోదీ ప్రభుత్వం 2018లో ఎన్నికల బాండ్లను ప్రవేశపెట్టిన తర్వాత సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఎట్టకేలకు మంగళవారం నుంచి ఈ అంశంపై విచారణను చేపట్టింది. అంతకు ముందు ఈ బాండ్లపై కనీసం స్టే ఇవ్వడానికి కూడా సుప్రీం కోర్టు నిరాకరించింది. రాజకీయ పార్టీలకు లభించిన విరాళాల గురించి చెప్పాలని కోర్టు 2019లో మధ్యంతర ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఈ వివరాలను ఎన్నికల కమిషన్ సీల్డు కవర్‌లో సమర్పించడంతో ఈ ఆదేశాల వల్ల ప్రయోజనం లేకపోయింది. ఈ ఐదేళ్లలో పలు కంపెనీలు ప్రధాన రాజకీయ పార్టీలకు భారీ ఎత్తున విరాళాలు ఇచ్చాయి. ఈ మొత్తంలో దాదాపు 75 శాతం భారతీయ జనతా పార్టీకే దక్కింది. పశ్చిమబెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్, ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి కూడా ప్రతిపక్ష పార్టీల కంటే ఎక్కువ సొమ్ము ముట్టింది. ఈ మొత్తంలో 95 శాతం మేరకు కోట్ల రూపాయలలో జరిగింది. ఈ మొత్తం కట్టిన వారికి పన్ను మినహాయింపు కూడా లభించింది.
మోదీ ప్రభుత్వం 2018లో చేసిన చట్టాల సవరణ తర్వాత అసలు రాజకీయ పార్టీలకు ఎవరు నిధులు సమకూర్చారో చెప్పాల్సిన అవసరం లేకుండా పోయింది. గతంలో కంపెనీల చట్టం ప్రకారం మూడేళ్లలో వచ్చిన సగటు లాభాలపై 7.5 శాతం మాత్రమే రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే అవకాశం ఉండేది. అందుకు కంపెనీ బోర్డు అనుమతి పొందాలి. వార్షిక నివేదికల్లో ఏ పార్టీకి నిధులు ఇచ్చారో వెల్లడించాలి. కాని మోదీ ప్రభుత్వం కంపెనీల చట్టానికి చేసిన సవరణల తర్వాత నిన్న మొదలైన కంపెనీ కూడా మరుసటి రోజు నుంచే రాజకీయ పార్టీలకు నిధులు ఇవ్వడం మొదలు పెట్టవచ్చు. బోర్డు అనుమతి తీసుకోవడం కానీ వార్షిక నివేదికల్లో వెల్లడించాల్సిన అవసరం కానీ లేదు. విదేశీ కంపెనీలు కూడా తమ భారతీయ అనుబంధ సంస్థల ద్వారా విరాళాలు ఇవ్వవచ్చు. గతంలో ప్రతి రాజకీయ పార్టీ తమ విరాళాల గురించి లెక్కలు చెప్పాలని, ఎవరిచ్చారో వివరించాలని ఆదాయ పన్ను చట్టం నిర్దేశించేది. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎన్నికల బాండ్ల గురించి రికార్డులు తయారు చేయనక్కర్లేదు. కంపెనీల చట్టం, ఆదాయపన్ను చట్టం, ప్రజా ప్రాతినిధ్యం చట్టం లాంటి చట్టాలనుంచి ఎన్నికల బాండ్లకు మినహాయింపు లభించింది. దీన్ని బట్టి ఇవి ఎన్నికల బాండ్లా లేక కప్పం కట్టేందుకు చెల్లిస్తున్న ముడుపులా అనేది అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వంతో పనులు కావల్సినవారు అధికార పార్టీకి రహస్యంగా నిధులు సమకూర్చేందుకు ఈ ప్రక్రియ అవకాశం కల్పించింది. బహుశా, అందుకే బీజేపీకి ఎక్కువ మొత్తంలో ఎన్నికల బాండ్ల ద్వారా నిధులు సమకూరివుంటాయి. రాజకీయాల్లో ధన ప్రవాహాన్ని అరికడతానని, అవినీతిని నిరోధిస్తానని అనేకసార్లు ప్రకటించిన, మనీలాండరింగ్ చట్టాన్ని నిర్విచక్షణగా ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్న బీజేపీ ప్రభుత్వం, దొడ్డి దారిన ఈ నిధులు స్వీకరించే విధానాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నది?
2019లో ఎన్నికల కమిషన్ కూడా సుప్రీంకోర్టు ముందు ఎన్నికల బాండ్ల వల్ల వచ్చే నష్టాల గురించి ఆందోళన వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీల నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకునేందుకు వీలు లేనందువల్ల ఎన్నికల ప్రక్రియపై తమ నియంత్రణ సడలిపోతోందని కమిషన్ సుప్రీంకోర్టుకు తెలిపింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టాని (ఎఫ్‌సిఆర్ఏ)కి మార్పులు చేయడం వల్ల రాజకీయ పార్టీలకు అడ్డూ ఆపు లేకుండా విదేశీ నిధులు ప్రవహించే అవకాశాలున్నాయని, దీని వల్ల విదేశీ కంపెనీలు భారతీయ విధానాలను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని కమిషన్ స్వయంగా ఆందోళన వ్యక్తం చేసింది. షెల్ కంపెనీల ద్వారా ఎన్నికల బాండ్ల ప్రక్రియను దుర్వినియోగం చేసే అవకాశాలున్నాయని రిజర్వు బ్యాంకుతో పాటు ఎన్నికల కమిషన్ కూడా గతంలో ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఎన్నికల బాండ్లు కొత్త రాజకీయ పార్టీలకు, స్వతంత్ర అభ్యర్థులకు లభించకపోవడం సరైంది కాదని కమిషన్ అభిప్రాయపడింది. ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా అది ప్రగతిశీలంగా కనిపించాలి కాని తిరోగమన చర్య కాకూడదని తెలిపింది. రాజకీయ పార్టీలకు లభించే నిధుల విషయంలో పారదర్శకత లేకపోవడం సరైంది కాదని కమిషన్ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. ప్రజలకు అభ్యర్థి నేపథ్యంతో పాటు రాజకీయ పార్టీ నేపథ్యం తెలుసుకునే హక్కు కూడా ఓటర్‌కు ఉన్నదని కమిషన్ వాదించింది.
విచిత్రమేమంటే 2021లో సుప్రీంకోర్టులో మళ్లీ ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు ఎన్నికల కమిషన్ ఎన్నికల బాండ్ల పథకాన్ని సమర్థించింది. ఎన్నికల కమిషనర్లు తమ తొత్తులుగా వ్యవహరించాలని ప్రభుత్వం ఎందుకు భావిస్తుందో దీన్ని బట్టి అర్థమవుతోంది. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి మోదీ సర్కార్ ప్రతిపాదించిన తాజా బిల్లు ఆమోదం పొందితే ఆర్టీఐ కమిషనర్ల లాగా ఎన్నికల కమిషనర్లు కూడా వెన్నెముక లేని ప్రాణులుగా తయారవుతారనడంలో అతిశయోక్తి లేదు.
కేంద్రంలోనూ, పలు రాష్ట్రాల్లోను ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్నది కనుక పైగా కార్పొరేట్లను బాహాటంగా ప్రేమించే పార్టీ కనుక ఆ పార్టీకి ఎక్కువ నిధులు రావడంలో ఆశ్చర్యం లేదు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా పర్యావరణ నియంత్రణల నుంచి సడలింపులు పొందిన మైనింగ్ కంపెనీలు, అనుమతులు అవసరమైన కంపెనీలు కాంగ్రెస్ పార్టీకి నిధులు సమకూర్చేవి. నీరారాడియా టేపుల్లో యూపీఏ హయాంలో కార్పొరేట్లకు, రాజకీయ నేతలకు మధ్య సంబంధాలు బయటపడ్డాయి. ముంబై హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎంసి చాగ్లా కార్పొరేట్లు ప్రజాస్వామ్య ప్రక్రియల పరిధిలోకి ప్రవేశించరాదని 1958లోనే తీర్పునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి నిధులు ఇచ్చేందుకు టాటా కంపెనీ తమ మెమోరాండంను సవరించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ప్రజాస్వామ్య సంస్థల పనితీరును బడా వ్యాపార సంస్థలు, డబ్బు సంచులు ప్రభావితం చేయకూడదన్నారు. బడా పారిశ్రామిక సంస్థలు తమకు అనుకూలంగా విధానాలు మార్చేందుకే రాజకీయ పార్టీలను పెంచి పోషిస్తాయి కనుక దాన్ని అవినీతి క్రిందే భావించాలని ఆయన చెప్పారు. దీని వల్ల ప్రజాస్వామ్యం బూటకంగా మారుతుందన్నారు.
1958 నాటికి, ఇప్పటికి పరిస్థితులు చాలా మారిపోయాయి. ఆర్థిక సంస్కరణల తర్వాత వ్యాపార సంస్థలే రాజకీయ విధానాలను నిర్దేశించే స్థితికి చేరుకున్నాయి. కార్పొరేట్లకు, ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష సంబంధాలు బాహాటంగా కనపడుతున్నాయి. దేశంలో సంపద పెంచేందుకు కార్పొరేట్లు ఉపయోగపడుతున్నాయన్న పేరుతో కరోనా సమయంలో సామాన్యులను ఆదుకోవడం కన్నా కంపెనీలను ఆదుకోవడానికి ప్యాకేజీల రూపంలో ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత నిచ్చింది. వేదాంత అనే కంపెనీ భారీ అప్పులతో తీవ్ర సంక్షోభంలో ఉన్నా రాజకీయ పార్టీలకు బాండ్ల ద్వారా రూ. 457కోట్లు విరాళాలు సమకూర్చిందని, అసలెందుకు ఈ కంపెనీ ఇంత పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలకు నిధులు సమకూరుస్తున్నదన్న విషయంపై తీవ్ర అనుమానాలు రేకెత్తుతున్నాయని అసోసియేషన్ ఆఫ్ డెమాక్రటిక్ రిఫార్మ్స్ తరపున వాదించిన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ నిర్ణయాలను లేదా విధాన నిర్ణయాలను ప్రభావితం చేసేందుకు ముడుపుల రూపంలో ఈ బాండ్లు కొంటున్నారని ఆయన అన్నారు.
ఎన్నికల బాండ్లు ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాణాలను దెబ్బతీస్తున్నాయనడంలో సందేహం లేదు. అయితే ఎన్నికల బాండ్లు ఉన్నా లేకపోయినా ఎన్నికల్లో ధన ప్రవాహం విపరీతంగా పెరిగిపోయింది. ఓట్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నా, ప్రజలను నానారకాలుగా ప్రలోభపెడుతున్నా ఏ వ్యవస్థా పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రూ. 55వేల కోట్లు ఖర్చయిందని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అధ్యయనంలో తేలింది. ఈ మొత్తం కేవలం ఎన్నికల బాండ్ల వల్లే వచ్చే అవకాశాలు లేవు. ఇందులో నేతలు అవినీతితో సంపాదించిన నల్లధనం ఎక్కువగా ఉన్నది. ఆ మొత్తంలో కూడా అధికంగా కాంట్రాక్టర్లు, కార్పొరేట్ల ద్వారా లభించిందే. ‘భారత ప్రజాస్వామ్యం ఇప్పటికే డబ్బుతో ఆడుతున్న క్రీడగా మారింది. ఎన్నికల బాండ్లు మన ప్రజాస్వామ్యాన్ని మరింత నాశనం చేస్తాయి’ అని ప్రశాంత్ భూషణ్ అనడంలో అర్థం లేకపోలేదు. ఎన్నికల బాండ్లపైనే కాదు, మొత్తం ఎన్నికల వ్యవస్థలోకి అక్రమ ధన ప్రవాహాన్ని అరికట్టేందుకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చర్యలు తీసుకుంటుందని అనుకోవడం అత్యాశ అవుతుందేమో!?
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
Updated Date - 2023-11-01T01:13:03+05:30 IST