జీ20: విజయం వెనుక వాస్తవాలు!
ABN, First Publish Date - 2023-09-13T03:56:06+05:30
గతడిసెంబర్‌లో దేశవ్యాప్తంగా ప్రారంభమైన జీ20 సమావేశాలు, నిన్నగాక మొన్న న్యూఢిల్లీ శిఖరాగ్రంతో ముగిసినా వాటి హోరు మరికొంత కాలం ప్రజల చెవుల్లో గింగురుమంటూనే ఉంటుంది...
గతడిసెంబర్‌లో దేశవ్యాప్తంగా ప్రారంభమైన జీ20 సమావేశాలు, నిన్నగాక మొన్న న్యూఢిల్లీ శిఖరాగ్రంతో ముగిసినా వాటి హోరు మరికొంత కాలం ప్రజల చెవుల్లో గింగురుమంటూనే ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో సహా సభ్య దేశాల అధినేతలు విమానాశ్రయాల్లో దిగడం, భారత మండపానికి రావడం, మోదీ వారిని ఆలింగనం చేసుకోవడం, కరచాలనాలు చేయడం, మహాత్మాగాంధీ సమాధి వద్దకు తీసుకువెళ్లడం, ముఖాముఖి సమావేశాలు జరపడం, గ్లోబల్ సౌత్ దేశాలకు, సంపన్న పాశ్చాత్య ప్రపంచానికి మధ్య భారత్ వారధిగా నిలిచిందని అభినందనలు వెల్లువెత్తడం మొదలైన దృశ్యాలు ఇంకా మన కళ్లముందు నిలిచే ఉన్నాయి.
జీ20 సమావేశాల విజయ సంరంభాన్ని పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మాత్రమే కాకుండా రానున్న ఎన్నికల్లో కూడా ఒక ప్రధాన ప్రచార అస్త్రంగా ప్రధాని మోదీ ఉపయోగించుకుంటారనడంలో సందేహం లేదు. భారత దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఒక ముఖ్యమైన అధికార కేంద్రంగా మార్చేందుకు మాత్రమే కాకుండా ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేయగల నాయకుడుగా తనను తాను తీర్చిదిద్దుకునేందుకు జీ20 సమావేశాలను పకడ్బందీగా, ఒక ప్రణాళిక ప్రకారం నిర్వహించడంలో మోదీ సంపూర్ణంగా సఫలమయ్యారు. ప్రతీ ఏడాదీ జీ20కి ఏదో ఒక దేశం అధ్యక్ష బాధ్యతలు వహించడం పరిపాటి. అయినప్పటికీ మన దేశానికి ఆ ప్రతిష్ఠాత్మక స్థానం లభించడం ఒక మహోన్నత అంశంగా ప్రచారం చేయడంలో, దేశమంతటా తన పేరు మారుమ్రోగేలా చేయడంతో మోదీకి మోదీయే సాటి అయ్యారు.
నిజానికి జీ20 కూటమికి భారత్ అధ్యక్షత వహించడానికి అత్యంత కీలక ప్రాధాన్యం ఉన్నది. ప్రపంచ రాజకీయాల్లో రష్యా, చైనాలకు వ్యతిరేకంగా భారత్‌ను ఉపయోగించుకుని తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు పశ్చిమ దేశాలు ఈ జీ20 సమావేశాలను ఉపయోగించుకున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణను ఖండించడం ఒకవైపు, చైనా విస్తరణ వాదాన్ని అడ్డుకోవడం మరో వైపు లక్ష్యంగా ఈ సమావేశాలు జరిగాయి. చైనా, రష్యా దేశాల అధ్యక్షులు న్యూఢిల్లీ శిఖరాగ్రానికి రాకపోవడం మూలంగా ఈ సమావేశాల్లో అమెరికా ప్రాధాన్యం ఎల్లెడలా కనిపించింది. మన విదేశాంగ విధానం ఎటువైపు మొగ్గుతుందో మరింత స్పష్టంగా చెప్పడానికి ఈ సమావేశాలు వీలు కల్పించాయి. అదే సమయంలో ఈ సమావేశాల్లో భారత్ ప్రయోజనాలు దెబ్బతినకుండా, ఉక్రెయిన్ అంశంపై దేశాలు విడిపోకుండా ఉండేందుకు సంపన్న పశ్చిమ రాజ్యాలు వీలు కల్పించాయి. అలీన విధానానికి భారత్ ఎప్పుడో స్వస్తి చెప్పిందని తెలిసినప్పటికీ, రష్యాతో భారత్‌కు ఉన్న పటిష్ఠ ఆర్థిక, దౌత్య సంబంధాల రీత్యా రష్యా విషయంలో సున్నితమైన పదజాలాన్ని ప్రయోగించేందుకు అంగీకరించాయి. తన చమురు ధరలను సుస్థిరంగా ఉంచేందుకు రష్యా నుంచి తక్కువ ధరలకు భారత్ చమురు కొనుగోలు చేస్తున్నదని ఈ దేశాలకు తెలుసు. జీ20 సదస్సు విఫలమైతే చైనాకు నైతిక విజయం లభిస్తుందని భావించినందువల్లే భారత్ ఆలోచనా విధానాన్ని అమెరికా సమర్థించింది. రష్యాకు గుణపాఠం చెప్పడం కన్నా, చైనాకు వ్యతిరేకంగా భారత్‌తో భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడం ముఖ్యమని అమెరికా భావించిందని దౌత్య వ్యవహారాల నిపుణులు భావిస్తున్నారు. జీ20 అనేది పనిచేస్తూ ఉంటేనే చైనాకు వ్యతిరేకంగా భారత్‌ను నిలబెట్టడం సాధ్యమవుతుందని పశ్చిమ దేశాలు భావించినందువల్లే న్యూఢిల్లీ శిఖరాగ్రం విజయవంతమయిందని వారు వ్యాఖ్యానించారు.
నిజానికి పశ్చిమ దేశాలు ఈ విషయంలో ఇచ్చిన వెసులుబాటు మూలంగానే దురాక్రమణకు గురైన ఉక్రెయిన్‌ను ఈ సమావేశాలకు ఆహ్వానించకుండా భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. గత ఏడాది ఇండోనేసియా వంటి చిన్న దేశం రాజధాని బాలిలో ఆమోదించిన ప్రకటనలో ఉక్రెయిన్‌పై రష్యా దాడిని తీవ్రంగా విమర్శిస్తే న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో భారత్ రష్యా పేరును ప్రస్తావించకుండా, దురాక్రమణను తీవ్రంగా విమర్శించకుండా తెలివిగా వ్యవహరించింది. వేలాది పౌరుల, సైనికుల మరణాలకు కారణమైన, ఎంతో విధ్వంసకాండకు గురైన ఒక దేశానికి తన గోడు చెప్పుకోవడానికి అనుమతించకపోతే అంతర్జాతీయ సమావేశాలకు ప్రాధాన్యత ఏమున్నది? అందుకే న్యూఢిల్లీ డిక్లరేషన్ పట్ల గర్వపడడానికి ఏమున్నదని ఉక్రెయిన్ ప్రశ్నించింది. కనీసం తమను పిలిస్తే పరిస్థితి గురించి ఇతర దేశాలకు వివరించి ఉండేవారమని వాపోయింది. ఏమైనా కర్ర విరగకుండా పాము చావకుండా విడుదల చేసిన డిక్లరేషన్‌ను అన్ని దేశాలూ మహాద్భుత దౌత్య విజయంగా అభివర్ణించిన హోరులో ఉక్రెయిన్ బాధ గాలిలో కొట్టుకుపోయింది.
బహుశా రష్యా–ఉక్రెయిన్ ఘర్షణ కంటే ప్రధానమైనది, అమెరికాతో పాటు భారత్‌కు అతి ముఖ్యమైనది చైనా విస్తరణ వాదం కాబట్టి జీ–20 సమావేశాలు చైనా కేంద్రీకృతంగా జరిగాయనడం సత్య దూరం కాదు. అగ్రగామి అంతర్జాతీయ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న చైనా మన సరిహద్దుల్లో విస్తరించే ప్రయత్నం చేయడం మూలంగా భారత్‌ను అమెరికాకు, ఇండో పసిఫిక్ వ్యూహాత్మక కూటమి అయిన క్వాడ్ దేశాలకు సన్నిహితంగా మార్చింది. ఇప్పుడు పాకిస్థాన్ మనకు పెద్ద సమస్య కాదని, అంతకంటే పెద్ద ప్రమాదమైన చైనాను ఎదుర్కొనేందుకు పశ్చిమ దేశాలతో చేతులు కలపక తప్పదని భావించడం వల్లనే మన విదేశాంగ విధానం మోదీ హయాంలో పూర్తిగా చైనా కేంద్రీకృతంగా మారింది.
ఇవాళ ప్రపంచం రెండు ప్రధాన కూటములుగా విడిపోతున్నది. మళ్లీ ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం ఏర్పడుతోంది. భారత్ ఎంత మాత్రమూ ఇందిరాగాంధీ కాలం నాటి అలీన వాదాన్ని అవలంబించే పరిస్థితి లేదు. ఇప్పటి వరకూ బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా మాత్రమే ఉన్న బ్రిక్స్ కూటమిలో సౌదీ అరేబియా, ఇరాన్, ఇథియోపియా, ఈజిప్టు, అర్జెంటీనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు చేరాయి. దాదాపు 40 దేశాలు ఈ కూటమిలో చేరేందుకు తహతహలాడుతున్నాయి. పశ్చిమ దేశాల నాయకత్వంలోని అంతర్జాతీయ వ్యవస్థకు దీటుగా బ్రిక్స్ ద్వారా చైనా, రష్యాలు ప్రత్యామ్నాయ వ్యవస్థను రూపొందించేందుకు సిద్ధపడుతున్నాయి. అంతర్జాతీయ వ్యవహారాల్లో ఇంతకాలం సాగిన అమెరికా, దాని మిత్రదేశాల ఆధిపత్యం ఇక చెల్లదని అవి నిరూపించాలనుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో భారతదేశం తన వైఖరిని నిర్ణయించుకోవాల్సిన అగత్యమేర్పడింది. అందుకు జీ20ని వేదికగా ఉపయోగించుకుని భారత్‌ను నిలబెట్టేందుకు పశ్చిమ దేశాలు ముందుకు వచ్చినట్లు కనపడుతోంది. నిజానికి అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ సమయంలో కూడా జీ20 కూటమి సాధించిన విజయాలు ఏవీ లేవు. గ్లోబల్ సౌత్‌కు నాయకత్వం విషయంలో చైనాతో పోటీ పడేందుకు భారత్ సిద్ధపడుతోంది. మరి చైనాతో సరితూగగలిగిన ఆర్థిక నిధులను పశ్చిమ దేశాల మద్దతుతో భారత్ సమకూర్చగలదా అన్నది ఒక ప్రధాన చర్చ. ఇవాళ చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ కార్యక్రమం (బిఆర్ఐ) ప్రతి దక్షిణాసియా దేశానికీ చేరింది. అది చైనా సైనిక ప్రయోజనాలకూ తోడ్పడుతోంది.
చైనాను దీటుగా ఎదుర్కోవడానికి భారత్‌కు కాని, పశ్చిమ దేశాలకు గానీ జీ20 ఎంత మేరకు ఉపయోగపడుతుందనేది ఇప్పుడే చెప్పలేం. చైనా వన్ రోడ్ వన్ బెల్ట్‌కు పోటీగా ఇండో గల్ఫ్ యూరప్ కనెక్టివిటీ కారిడార్‌ను ఈ సమావేశాల్లో ప్రకటించారు. బహుళ అభివృద్ధి బ్యాంకు ద్వారా పేద, వర్ధమాన దేశాలను ఆదుకోవాలని ప్రతిపాదించారు. కాని ఈ కార్యక్రమాలకు డబ్బులు ఎక్కడి నుంచి సమీకరిస్తారో ప్రకటించలేదు. రుణ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అనేక దేశాలను జీ20 కాపాడగలుగుతుందా? ఈ విషయంలో అభివృద్ధి చెందిన దేశాలు తమ మాటను నిలబెట్టుకుంటాయా? ఢిల్లీ డిక్లరేషన్ ప్రపంచీకరణ తీరుతెన్నులను మార్చి జాతీయవాద, రక్షిత వర్తక అడ్డంకులను అధిగమించి స్వేచ్ఛగా వర్తకం ప్రవహించేందుకు తోడ్పడుతుందా? సంబరాలు సద్దుమణిగిన తర్వాత, హోరు తగ్గిన పిదప అసలు వాస్తవాలు తెలుస్తాయి. నవంబర్‌లో జీ20 నిర్ణయాలను వర్చువల్‌గా మోదీ సమీక్షించేనాటికి కొంత స్పష్టత వచ్చే అవకాశమున్నది.
అంతర్జాతీయ ఆధిపత్యాలకు మాత్రమే వేదిక అయిన జీ20 వంటి కూటములు ప్రజలకోసం ఏమైనా చేయగలుగుతాయా? ప్రజాస్వామ్య హక్కులను కాపాడగలుగుతాయా? సందేహమే. భారత్‌లో మానవ హక్కుల గురించి, పత్రికా స్వేచ్ఛ గురించి మోదీతో చర్చల్లో అడిగానని అమెరికా అధ్యక్షుడు బైడెన్ వియత్నాంలో ప్రకటన చేశారు. భారత్ విడుదల చేసిన ప్రకటనలో ఈ అంశం ప్రస్తావనకు రాలేదు! అట్టహాసంగా అంతర్జాతీయ మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఇరువురి మధ్య జరిగిన చర్చలను మీడియాకు వెల్లడించనేలేదు. న్యూఢిల్లీ సమావేశాల్లో పేదరికం, అసమానతలు, వాతావరణ మార్పు విషయంలో ఎలాంటి చర్యలూ ప్రకటించలేదని ఆక్స్‌ఫామ్ వంటి అంతర్జాతీయ సంస్థలు విమర్శించాయి.
ఈ జీ20 సమావేశాల తర్వాత దేశంలో మోదీకి అసలు రాజకీయ పరీక్ష ప్రారంభం కానున్నది. ఆ పరీక్షలో నెగ్గేందుకు ఆయన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను వాడుకుంటున్నారు. తన భావి విజయానికి అవి తోడ్పడేలా ఆయన వ్యూహరచన చేసినట్లు కనపడుతోంది. విచిత్రమేమంటే గ్లోబల్ సౌత్‌కు నాయకత్వం వహించాలనుకుంటున్న భారత్ వచ్చే వారం హవానాలో జరిగే జీ77 దేశాల సమావేశానికి కనీసం విదేశాంగమంత్రినైనా పంపడం లేదు. జీ20 కంటే జీ77 పెద్దదని ఈ కూటమి తొలుత భారత్ అధ్యక్షతనే ప్రారంభమైందని తెలిసినప్పటికీ హవానా సమావేశాలను విస్మరించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై మోదీ పూర్తిగా దృష్టి కేంద్రీకరించడమే ఇందుకు కారణం. జీ20 మూలంగా వచ్చిన ప్రచారార్భాటం తర్వాత ఇంకే అంతర్జాతీయ సమావేశాలకు వెళ్లే అవసపరం లేదని, రాబోయే ఎన్నికలపైనే దృష్టి కేంద్రీకరించాలని మోదీ భావిస్తున్నారేమో?!
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
Updated Date - 2023-09-13T03:56:06+05:30 IST