ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ ఆటవిక న్యాయం దేశానికి మేలు చేసేనా?

ABN, First Publish Date - 2023-04-19T03:09:48+05:30

భారతదేశంలో చట్టాలు, రాజ్యాంగం, న్యాయపాలన, ప్రజాస్వామ్యం అన్న పదాల గురించిన ప్రస్తావన న్యాయమూర్తుల తీర్పుల్లోనూ, మేధావుల ఉపన్యాసాల్లోనూ, అంబేడ్కర్ లాంటి మహానుభావుల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారతదేశంలో చట్టాలు, రాజ్యాంగం, న్యాయపాలన, ప్రజాస్వామ్యం అన్న పదాల గురించిన ప్రస్తావన న్యాయమూర్తుల తీర్పుల్లోనూ, మేధావుల ఉపన్యాసాల్లోనూ, అంబేడ్కర్ లాంటి మహానుభావుల జయంతి సందర్భంగానూ అధికంగా వస్తుంది. ‘దేశంలో ప్రజాస్వామ్యమే లేదు’ అని రాహుల్ గాంధీ లండన్‌కు వెళ్లి ఉపన్యాసం ఇస్తే కాని మనకు అర్థం కాని పరిస్థితుల్లో లేము. నిత్యజీవితంలో, మన చుట్టూ ఉన్న నేరపూరిత వాతావరణంలో, మన నేతల చర్యల్లో, మన పోలీసుల కార్యాచరణలో చట్టాలు, రాజ్యాంగం అన్న పదాలను వెతికితే కాని కనపడని పరిస్థితుల్లో మనం ఉన్నాము. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరైంది కాదు అని ఇవాళ సామాన్య మానవులకు చెప్పడం కంటే ప్రభుత్వాలకు, పోలీసులకు చెప్పాల్సిన అవసరం ఎక్కువ కనపడుతున్నది. చట్టాల్ని పాటించేవారు ప్రజల్లో అత్యధిక శాతం ఉండగా, చట్టాల్ని ఉల్లంఘించేవారు, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేవారు అధికార వ్యవస్థలోనే ఎక్కువగా ఉన్నారు. నేరచరితుల్ని అధికారంలో ఉన్న వారే ఎక్కువగా పెంచి పోషించే పద్ధతి చాలా కాలం నుంచి ఉండగా నేరచరితులే అధికారంలో కొనసాగే పరిస్థితులు ఇప్పుడు నెలకొని ఉన్నాయి.

ఆశ్చర్యకరమయిన విషయం ఏమంటే చట్టాలు, రాజ్యాంగం పట్ల ప్రజలకు గౌరవం పెరిగేలా చూడాల్సిన ప్రభుత్వాలే నేరస్థుల్ని, దుర్మార్గుల్ని నిర్మూలించే ఆటవిక సంస్కృతిని హర్షించేలా ప్రజలను ప్రేరేపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో గత వారం జరిగిన ఎన్‌కౌంటర్‌లను. ఆ తర్వాత ఇద్దరు నేరచరితుల్ని బహిరంగంగా కాల్చి వేయడంపై అధికార పార్టీ వారే హర్షం వ్యక్తం చేస్తూ ప్రజలు ఈ దారుణాలను సమర్థించేందుకు దోహదం చేస్తున్నారు. అధికారంలో ఉన్న వారు ఈ వాతావరణం కల్పించిన రీత్యా ప్రజలు ఈ మాఫియా ముఠాల నిర్మూలనను సమర్థిస్తున్నారని ప్రయాగ్ రాజ్ ప్రాంతంలో పనిచేస్తున్న విలేఖరులు చెబుతున్నారు. మాఫియా బీభత్సాలను ఎదుర్కొన్న స్థానిక ప్రజలు ఈ హత్యల తర్వాత సంతోషంగా ఉన్నారని, మెజారిటీ జనానికి ఈ హత్యల వెనుక ప్రభుత్వం లేదా పోలీసుల హస్తం ఉన్నదన్న అనుమానాలు ఉన్నప్పటికీ ఈ విషయానికి వారు అంత ప్రాధాన్యమివ్వడం లేదని వారు తమ వార్తల్లో రాయడం గమనార్హం. రాత్రి పదిగంటల ప్రాంతంలో అవసరం లేకున్నా అంతటి కరడుగట్టిన నేరచరితులను వైద్య పరీక్షలకు నడిపిస్తూ తీసుకువెళ్లడం, విలేఖరులు ప్రశ్నించేందుకు వీలు కల్పించడం, అత్యాధునిక ఆయుధాలతో దుండగులు కాల్పులు జరుపుతున్నా పోలీసులు చేష్టలుడిగిపోయి ఉండడం ఇవన్నీ మేధావులు, రాజకీయ నాయకులు ప్రశ్నిస్తున్నప్పటికీ ప్రజలు పెద్దగా ప్రశ్నించడం లేదని దైనిక్ భాస్కర్, దైనిక్ జాగరణ్‌తో పాటు పలు పత్రికల ప్రతినిధులు చెబుతున్నారు.

ములాయం సింగ్ యాదవ్ 1989లో ముఖ్యమంత్రి అయిన తర్వాత తన అధికారం నిలబెట్టుకోవడం కోసం అత్యధికంగా నేరచరితులపై ఆధారపడ్డారని, వారికే టిక్కెట్లు ఇచ్చి ప్రోత్సహించారన్న విషయంలో వాస్తవం లేకపోలేదు. అదే సమయంలో ఈ నేరచరితులు కేసుల్లో ఇరుక్కున్నప్పుడల్లా వారిని కాపాడిన ఉదంతాలు కూడా లేకపోలేదు. ఈ నేరచరితులు, మాఫియాల మూలంగా ఉత్తరప్రదేశ్‌లో పరిశ్రమలు రాని పరిస్థితి తలెత్తిందని, నోయిడా నుంచి అనేక పరిశ్రమలు వారి వసూళ్ల ధాటికి తట్టుకోలేక గురుగ్రామ్‌కు తరలి వెళ్లిపోయాయని చేస్తున్న విశ్లేషణలో కూడా వాస్తవాలు ఉన్నాయి. ములాయం సింగ్ సన్నిహితుడైన అతీఖ్ అహ్మద్ అయిదుసార్లు శాసనసభకు, ఒకసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కిడ్నాపింగ్, వసూళ్లు, భూ ఆక్రమణలో ఆరితేరిన అతీఖ్ అహ్మద్‌పై వందకు పైగా క్రిమినల్ కేసులున్నాయి.

కాని ఒక్క సమాజ్‌వాది పార్టీ మాత్రమే యూపీలో నేరచరితుల్ని ప్రోత్సహించిందా? బహుజన సమాజ్ పార్టీ కానీ బిజెపి కానీ నేరచరితులపై ఆధారపడలేదా? అన్న ప్రశ్నలను చర్చించుకోవాలి. ‘నేరచరితుడు నేరచరితుడే అతడికి కులం కానీ, మతం కానీ ఉండవు’ అని ప్రకటించిన కల్యాణ్ సింగ్ 1997లో ప్రభుత్వం ఏర్పర్చినప్పుడు ఆయన సంకీర్ణ ప్రభుత్వంలో సగానికి పైగా నేరచరితులే ఉన్నారు. మాయావతి కూడా మద్యం, మైనింగ్ మాఫియా డాన్ పాంటీ ఛద్దా లాంటి వారిని ప్రోత్సహించారు. ఇంతెందుకు? ప్రస్తుత యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో సగం మంది మంత్రులు నేరచరితులేనని అసోసియేషన్ ఆఫ్ డెమాక్రటిక్ రిఫార్మ్స్ తెలిపింది, వీరిలో చాలా మందిపై హత్యలు, కిడ్నాపింగ్, ఫోర్జరీ, మహిళలపై అత్యాచారాలు వంటి తీవ్రమైన నేరారోపణలున్నాయి. ఉన్నావ్‌లో ఉపాధి కోసం తన వద్దకు వచ్చిన 16 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడడమే కాకుండా బాధితురాలి బంధువులను హత్య చేసిన కుల్దీప్ సింగ్ సెనెగర్, ఒక డిఎస్‌పి హత్యతో పాటు అనేక నేరాల్లో పాలు పంచుకున్న రఘురాజ్ ప్రతాప్ సింగ్, ఇంకా అనేక మంది నేరచరితులు యూపీ అధికారపక్షంలో ఉన్నారు. హథ్రాస్‌లో 2020 సెప్టెంబర్‌లో 19 ఏళ్ల యువతిని నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసి దారుణంగా హింసించి ఆమె మరణానికి కారకులయ్యారు. ఈ దారుణంపై ఏ మాత్రం స్పందించని పోలీసులు దౌర్జన్యపూరితంగా బంధువులను కూడా రానివ్వకుండా ఆమె భౌతిక కాయానికి అంత్యక్రియలు జరిపారు. చివరకు నిందితులను అరెస్టు చేసినందుకు బిజెపి నేతలతో సహా అగ్రవర్ణానికి చెందిన వారు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. లఖీంపూర్ ఖేరీలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న రైతులపై వాహనాలు నడిపి 8 మంది మరణానికి కారకులైన కేంద్ర మంత్రి కుమారుడు ఆశీష్ మిశ్రా ఇప్పుడు బెయిల్‌పై స్వేచ్ఛగా తిరుగుతున్నారు. యూపీలో గెలిచిన 403 మంది ఎమ్మెల్యేల్లో 205 మంది నేరచరితులే. 5 ఏళ్ల కంటే ఎక్కువగా పెండింగ్‌లో ఉన్న కేసుల్లో 52 శాతం యూపీలోనే ఉన్నాయని సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా గత ఏడాది సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ముజఫర్‌నగర్‌లో జరిగిన మత కల్లోలాల్లో ప్రత్యక్షంగా పాలు పంచుకున్నవారిపై 77 కేసులను యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉపసంహరించుకున్నదని ఈ నివేదిక స్పష్టం చేసింది.

యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్‌లో మాఫియా సంస్కృతికి తెరవేయడానికి అనుసరిస్తున్న పద్ధతులు, బుల్‌డోజర్లతో వారి ఇళ్లు కూలగొట్టడాలు, బిజెపిలో నేరచరితులను విస్మరించి ఇతర పార్టీలకు చెందిన నేరచరితులను, ముఖ్యంగా మైనారిటీ వర్గానికి చెందిన మాఫియా నేతల్ని నిర్మూలించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అత్యంత వివాదాస్పదమైనవి. రాజ్యాంగం, చట్టాలు అన్నవాటికి యూపీలో స్థానం లేదని, అక్కడ ఆటవిక న్యాయం నడుస్తోందని తాజాగా జరుగుతున్న సంఘటనలు నిరూపిస్తున్నాయి. గడచిన రెండేళ్లలో 4,484 మంది కస్టడీలో మరణించారని, 233 మంది పోలీసు ఎన్‌కౌంటర్లలో మరణించారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ గత ఏడాది పార్లమెంట్‌లో అధికారికంగా చెప్పారు. వీటిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లోనే 952 కస్టడీ మరణాలు జరిగాయని ఆయన ప్రకటించారు. ఇక కస్టడీల్లో జరిగే హింసాకాండ గురించి ఆరా తీస్తే అనేక దారుణమైన ఘటనలు మనకు కనిపిస్తాయి, సామాన్యులపై, చిన్న చిన్న నేరస్థులపై ప్రతాపం చూపే పోలీసులు కరడుగట్టిన నేరచరితుల పట్ల నిజాయితీగా వ్యవహరిస్తారని ఎలా నమ్ముతాం?

ఉత్తరప్రదేశ్ మాఫియా ముఠాకు చెందిన వారిని నిర్మూలించే ఘటన స్థానికంగా తీసుకున్న నిర్ణయం కాదని విశ్లేషించేవారు కూడా ఉన్నారు. ప్రజల్లో సాధారణంగా నేర చరితుల పట్ల ఉన్న వ్యతిరేకత వల్ల స్థానికంగా ఆదిత్యనాథ్ ప్రభుత్వం పట్ల ఎలాంటి నిరసన వెల్లువెత్తదనే నిర్ధారణకు వచ్చి ఉండవచ్చు. దేశ వ్యాప్తంగా కూడా మోదీ హయాంలో ఒక వర్గానికి చెందిన నేరచరితుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నదనే అభిప్రాయం వ్యాపించడం కూడా బిజెపి పట్ల మెజారిటీ ప్రజలు సానుకూలంగా వ్యవహరించే అవకాశాలు లేకపోలేదని కూడా ఆ పార్టీ నేతలు భావిస్తుండవచ్చు. ప్రజల మూక మనస్తత్వం గురించి మోదీకి, బిజెపి నేతలకు తెలిసినంతగా దేశంలో మరెవరికీ తెలియదనడంలో అతిశయోక్తి లేదు. అంతేగాక గత జనవరిలో అదానీ వ్యవహారం బయటకు పొక్కిన తర్వాత పార్లమెంట్‌లో గందరగోళం జరగడం, ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తడం, సంఘటితం అయ్యే ప్రయత్నాలు ముమ్మరం చేయడం, కర్ణాటక ఎన్నికల్లో బిజెపి గట్టి పోటీని ఎదుర్కోవడం వంటి పరిణామాల నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జనం దృష్టిని మళ్లించడమే కాక తమకు అనుకూలంగా మారతాయని ఆ పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నట్లు కనపడుతోంది. జాతీయ స్థాయిలో ప్రతిపక్ష నేతల్ని ఛిన్నాభిన్నం చేసేందుకు ఇప్పటికే ఈడీ, సిబిఐ వంటి ఏజెన్సీల దాడులు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. యూపీలో బిజెపికి చెందిన నేరచరితుల్ని విస్మరించినట్లే జాతీయ స్థాయిలో కూడా బిజెపిలో చేరిన, బిజెపికి మద్దతుగా ఉన్న అవినీతిపరులను, నేరచరితులను ఈడీ, సిబిఐ వంటి సంస్థలు విస్మరించడం కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతోంది. మహారాష్ట్రలో ఈడీ కేసుల మద్దతుతో శివసేనను చీల్చి ప్రభుత్వం ఏర్పాటు చేయడం విజయవంతం అయిన తర్వాత ఇప్పుడు అదే వ్యూహం ఎన్‌సిపిపై ప్రయోగిస్తున్నట్లు కనపడుతోంది. అవినీతిపరుల్ని, నేరచరితుల్ని, మాఫియాలను నిర్మూలించాలన్న లక్ష్యంతో మోదీ ప్రభుత్వం, ఆయన నేతృత్వంలో బిజెపి ప్రభుత్వాలు పనిచేయడం మంచిదే కాని ఈ దేశంలో రాజ్యాంగం, చట్టం, న్యాయపాలన ఉన్నాయన్న విషయం విస్మరించడం, వ్యవస్థలు కేవలం ప్రతిపక్షాల పట్ల కాక అందరి విషయంలో నిష్పాక్షికంగా వ్యవహరించకపోవడం ప్రపంచంలో విశ్వగురు స్థానం కోసం పోటీపడుతున్న దేశం పట్ల తప్పుడు సంకేతాలు వెళ్లేందుకు ఆస్కారం కలుగుతుంది.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2023-04-19T03:09:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising