కర్ణాటకంలో మోదీ విశ్వరూపం
ABN, First Publish Date - 2023-05-03T01:01:42+05:30
ప్రభుత్వాధికారం, పార్టీ యంత్రాంగం, సంఘ్ పరివార్ సంస్థల మద్దతు, పకడ్బందీ వ్యూహరచనతో పాటు వ్యక్తిగత ఆకర్షణను కనీవినీ ఎరుగని స్థాయిలో ఉపయోగించగలిగిన శక్తి ఉంటే ఎదురేముంది...
ప్రభుత్వాధికారం, పార్టీ యంత్రాంగం, సంఘ్ పరివార్ సంస్థల మద్దతు, పకడ్బందీ వ్యూహరచనతో పాటు వ్యక్తిగత ఆకర్షణను కనీవినీ ఎరుగని స్థాయిలో ఉపయోగించగలిగిన శక్తి ఉంటే ఎదురేముంది? అవును, ఎటువంటి ప్రతికూల పవనాలనైనా ఢీకొనవచ్చునని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిరూపించారు. కర్ణాటకలో సంభవిస్తున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. ఏప్రిల్ నెలాఖరులో రెండు రోజుల పాటు బెంగళూరు, మైసూరులలో మోదీ రోడ్ షోలకు లభించిన అపూర్వ ప్రజా స్పందనతో భారతీయ జనతా పార్టీ శ్రేణులు హాయిగా ఊపిరి పీల్చుకున్నాయి. జీవన్మరణ సమస్యగా పరిణమించిన కర్ణాటక శాసనసభ ఎన్నికల పోరులో నిలదొక్కుకోగలమన్న ఆశ వారిలో ఏర్పడింది.
దేశ రాజధాని ఢిల్లీలో పరిపాలనను ఇప్పుడు అధికారులే కొనసాగిస్తున్నారు. బిజెపి జాతీయ కార్యాలయం నిర్మానుష్యంగా కనిపిస్తోంది. మొత్తం కేంద్రమంత్రులు, జాతీయ స్థాయి పార్టీ నేతలు ఢిల్లీ వదిలి ఇప్పుడు కర్ణాటకలోనే నలుమూలలా మకాం వేశారు. బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, ఇతర సీనియర్ నేతలు కూడా కర్ణాటకలోనే వేర్వేరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇది చాలదన్నట్లు ఆర్ఎస్ఎస్ పూర్తి స్థాయి కార్యకర్తలు చాప క్రింద నీరు లాగా కర్ణాటక అంతటా ప్రాకి బిజెపి అనుకూల వాతావరణం కల్పించేందుకు తీవ్ర కృషి చేస్తున్నారు. అయినప్పటికీ కర్ణాటకలో ప్రజల మనసులను బిజెపి వైపుకు తిప్పుకోవడం అంత సులభం కాదని వారికి అర్థమవుతోంది. పార్టీ హేమాహేమీలంతా కాడి పడేసిన నేపథ్యంలో నరేంద్రమోదీ రంగ ప్రవేశం చేశారు.
బెంగళూరు, మైసూర్‌లలో జరిపిన మోదీ రోడ్ షోలు, ఇంకా వివిధ ప్రాంతాలలో పాల్గొంటున్న బహిరంగ సభలకు వచ్చిన, వస్తున్న ప్రతిస్పందన గురించి మీడియాలోనూ, ఇతరత్రా వస్తున్న ప్రచారం చూస్తుంటే మోదీ అనే ఏకైక వ్యక్తి కర్ణాటకలో బిజెపి తరఫున అరివీర భయంకరుడులా పోరాడుతున్నారా అనిపిస్తోంది. ఏ నేతకూ చేయలేని ప్రజా సమీకరణను మోదీ రాక సందర్భంగా బిజెపి, ఆర్ఎస్ఎస్ యంత్రాంగం పకడ్బందీగా చేయగలిగారు. మోదీ అనే వ్యక్తిని చూసేందుకు జనంలో ఉన్న ఆసక్తిని వారు తమ ఏర్పాట్ల ద్వారా పూర్తిగా ఉపయోగించుకున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాలను ప్రభావితం చేసేలా మోదీ సభలను, ర్యాలీలను వారు నిర్ణయించారు. బిజెపిలో మోదీ పట్ల తప్ప మరెవరికీ ఆకర్షణ లేదన్న విషయం కర్ణాటకలో ఆయన పర్యటనల ద్వారా సర్వ విదితమైంది. కాంగ్రెస్‌లో సిద్దరామయ్య లాంటి వారికి స్థానికంగా జనం పోగయినా జాతీయ స్థాయిలో కూడా అలా మోదీ ఆకర్షణను ఎదుర్కోగల నేత ఇంకా ఆవిర్భవించాల్సి ఉన్నది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పార్టీ టికెట్ నిరాకరించిన సీనియర్ నేత ఈశ్వరప్ప, స్థానిక ఎమ్మెల్యే రామదాస్‌లను మైసూరులో జరిగిన రోడ్ షోలో మోదీ వ్యూహాత్మకంగా తన ప్రక్కన ఉంచుకుని అసమ్మతి నేతలు కూడా తన వెంటే ఉన్నారని నిరూపించుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి, లింగాయత్ నేత, అనేక సంవత్సరాలు బిజెపిలో ఉన్న జగదీష్ షెట్టార్, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సావడేతో పాటు అనేకమందికి టికెట్ నిరాకరించడంతో వారు అధిష్టానాన్ని తీవ్రంగా విమర్శించి కాంగ్రెస్‌లో చేరిన తర్వాత దిగ్భ్రమలో ఉన్న బిజెపికి మోదీ స్వయంగా రంగంలోకి దిగడం వేసవి కాలంలో చల్లటి గాడ్పులా ఊరట కలిగించింది. అన్ని ఎన్నికల సర్వేలూ బిజెపి ఓటమి ఖాయమని ప్రకటించడంతో నీరుగారిపోతున్న పార్టీ నేతలకు మోదీ ఎక్కడలేని ఆత్మవిశ్వాసం కల్పించారనడంలో సందేహం లేదు.
మోదీకి కూడా ఈ పరిణామం అమితానందం కలిగించి ఉండవచ్చు. ‘నీవేతప్ప నితఃపరంబెరుగ’ అన్నట్లు పార్టీ యంత్రాంగం తన చుట్టూ తిరగడం, కర్ణాటకలో కూడా ప్రజలు భారీ ఎత్తున నీరాజనాలు పలకడం ఆయన ఛాతీని మరింత విశాలం చేసి ఉండవచ్చు. కర్ణాటకలో వచ్చిన ప్రజాస్పందన ఎన్నికల ఫలితాలను బిజెపికి అనుకూలంగా మారుస్తుందా అన్నది చర్చనీయాంశమే. అయితే మోదీ పర్యటనలను అంత తేలిగ్గా తీసుకోవడానికి వీలు లేదు.
నిజానికి బిజెపి జాతీయ నేతలకు కర్ణాటకలో ప్రజలకు చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ప్రతి పనికీ 40 శాతం కమిషన్లతో కూడిన అవినీతి, అరాచక పాలన గురించి మోదీ గానీ, అమిత్ షా కానీ ప్రజలకు ఏమి వివరించగలరు? ఇతర రాష్ట్రాల్లో ఉచితాలు ఎడాపెడా ఇవ్వడం పట్ల తీవ్రంగా అభ్యంతరం చెప్పే మోదీ కర్ణాటకలో బిజెపి తన ఎన్నికల మానిఫెస్టోలో ఉచితంగా గ్యాసు సిలిండర్లు, పాల ప్యాకెట్లు, 5 కిలోల బియ్యంతో పాటు 103 హామీలను ఎడాపెడా కురిపించినప్పటికీ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. మోదీ ఎన్నికల సభల్లో రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం సాధించిన ఘనకార్యాల గురించి చెప్పకుండా తన గురించి తాను చెప్పుకుని ప్రజల్లో సానుభూతి కలిగించే ప్రయత్నం చేశారు. తనను ప్రతిపక్షాలు 91 సార్లు దుర్భాషలాడాయని చెప్పుకోవడమే కాదు, గతంలో అంబేడ్కర్‌ను కూడా కాంగ్రెస్ ఇదే విధంగా దుర్భాషలాడిందని వివరించారు. అంటే తాను అంబేడ్కర్ అంతటి స్థాయి వ్యక్తినని చెప్పుకోవడం ఆయన ఉద్దేశమా? అయినా కర్ణాటక ఎన్నికల్లో స్థానిక సమస్యలు కాకుండా తన గురించి మోదీ ప్రస్తావించడం అంటే ఈ ఎన్నికలను మోదీ కేంద్రీకృత ఎన్నికలుగా మార్చాలన్నదే ఆయన ఆలోచనగా కనిపిస్తోంది.
ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఒక వైపు కర్ణాటక ఎన్నికల్లో పార్టీ యంత్రాంగమంతా తల మునకలై ఉన్న సమయంలో తన నూరవ రేడియో ప్రసంగం గురించి భారీ ఎత్తున ప్రచారం చేయమని పార్టీ నేతలను, కేంద్ర మంత్రిత్వ శాఖలను, చివరకు రాజ్‌భవన్‌లను కూడా నిర్దేశించడం. ప్రభుత్వాధినేత హోదాలో ప్రధానమంత్రి తన అధికారాన్ని ఉపయోగించుకుని ప్రతి నెలా ఆకాశవాణిలో ప్రసంగం చేయడంపై అభ్యంతర పెట్టాల్సిన పనిలేదు కాని తన వందో ప్రసంగం గురించి అంత ఆర్భాటం చేయాల్సిన అవసరం ఏమున్నది? ప్రతి మంత్రిత్వ శాఖా, ప్రతి విభాగమూ ఇదే కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేయడంలో తలమునకలైపోయింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు మంత్రులు విజ్ఞాన్ భవన్‌లో పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రధాని వందో ప్రసంగం సందర్భంగా తపాలాబిళ్లను, వందరూపాయల నాణాన్ని కూడా విడుదల చేశారు. ప్రసంగాలను కూడా వ్యక్తిగత ప్రచారానికీ, భజనకూ ఉపయోగించుకుని ప్రభుత్వ పెద్దలూ, పార్టీ నేతలూ, గవర్నర్లూ శ్రద్ధగా వినేలా చేయగలిగిన మోదీ పట్టును ఎంతైనా శ్లాఘించకతప్పదు.
అయినప్పటికీ భారతదేశాన్ని తన చుట్టూ కేంద్రీకృతం చేయడంలో మోదీ విజయవంతం అయ్యారనడంలో సందేహం లేదు. మరి కొద్ది రోజుల్లో మోదీ 9 ఏళ్ల పాలనలో సాధించిన అద్భుత, అపూర్వ విజయాల ఢమరుకాలు మోగేందుకు సిద్ధమవుతున్నాయి. గతంలో ‘ఇండియాయే ఇందిర, ఇందిరే ఇండియా’ అన్నది ఒక్క దేవకాంత బారువాయే. మరి ఇప్పుడో? మంత్రివర్గంలోనూ, పార్టీలోనూ అంతటా ‘మోదీయే ఇండియా’ అనే వందిమాగధ బారువాలు కనపడుతున్నారు. మోదీ లేకపోతే ఇండియా లేదనే భావన కల్పించేందుకు అంతా సిద్ధమవుతున్నారు. భారత రాజ్యాంగం పీఠిక ‘వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా’ (భారత ప్రజలైన మేము) అన్న పదాలతో ప్రారంభమవుతోంది. వ్యక్తి కేంద్రీకృత పాలనలో రాజ్యాంగంలోని ఈ పదాలు అర్థరహితమవుతాయి.
కర్ణాటకలో ఇప్పుడు ప్రధాన పోటీ నరేంద్రమోదీ, కాంగ్రెస్‌కు మధ్య జరిగేలా మార్చడంలో మోదీ కృతకృత్యుడయ్యారనడంలో సందేహం లేదు. మోదీ ఆకర్షణకు తోడుగా బిజెపి ఎన్నికల యంత్రాంగానికి కూడా తమ ఓటర్లను, అభిమానులను బూత్ వరకు తీసుకురాగలిగిన సమర్థత ఉన్నది. కాంగ్రెస్ ఈ ధాటికి తట్టుకోగలదా, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఆ పార్టీని సమర్థిస్తారా అన్నది వేచి చూడాల్సి ఉన్నది. ఆధునిక సమాజంలో ఎన్నికలు ఒక మేనేజిమెంట్‌గా మారిన నేపథ్యంలో కర్ణాటక ఫలితాలు ఎలా ఉంటాయా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొన్నది.
ఈ నేపథ్యంలో భారతదేశ రాజకీయ భవిష్యత్‌కు సంబంధించి మోదీ మరింత అప్రతిహత శక్తిగా ఎదిగేందుకు కర్ణాటక ఒక ప్రయోగశాలగా మారుతుందా అన్నది చెప్పలేము. లింగాయత్ నేతలతో సహా అందరు నేతల్ని అడ్డుతొలగించుకుని తాను తప్ప కర్ణాటకలో బిజెపికి దిక్కులేదనే ఆలోచన కలిగించడంలో మోదీ విజయం సాధించగలిగారు. కర్ణాటకలో బిజెపి విజయం సాధిస్తే దేశంలో వ్యక్తి కేంద్రీకృత పాలనను ప్రవేశపెట్టే క్రమంలో మోదీ తీసుకుంటున్న చర్యలు విజయవంతం అవుతాయనడంలో సందేహం లేదు. ఆ తర్వాత మోదీ సార్వత్రక ఎన్నికల వరకు ప్రతీ ఎన్నికల్లో విశ్వరూపం ప్రదర్శించే అవకాశాలున్నాయి. మోదీమయ భారత జగత్తులో మోదీ వాక్కు బ్రహ్మ వాక్కై సర్వత్రా మారుమ్రోగేందుకు, వ్యవస్థలన్నీ మోదీ చుట్టు మరింత తిరిగేందుకు ఎక్కువ సమయం పట్టదు. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలన్నీ కట్టకట్టుకు వచ్చినా ఢీకొనేందుకు మోదీ సర్వసన్నద్ధ మయ్యేందుకు కర్ణాటక ఎన్నికల ఫలితాలు దోహదం చేస్తాయి. అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారతదేశంలో ఈ పరిణామం మంచిదా కాదా అన్నది ఆలోచించాల్సిన విషయమే. ముఖ్యంగా దేశంలో అతి పెద్ద పార్టీగా చెప్పుకుంటున్న భారతీయ జనతా పార్టీ కూడా మోదీ తర్వాత తమ భవిష్యత్ ఏమిటని ఆలోచించాల్సిన సమయమూ ఆసన్నమైంది.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
Updated Date - 2023-05-03T01:01:42+05:30 IST